June 24, 2024

అమ్మమ్మ – 44

రచన: గిరిజ పీసపాటి

 

కానీ, ఆరోజు మధ్యాహ్నం అవుతున్న కొద్దీ విపరీతమైన తలనొప్పితో పాటు వాంతులు కూడా అవసాగాయి గిరిజకి. ఇదివరకు తండ్రి ఉన్నప్పుడు కూడా అలా తరచూ జరుగుతూండడంతో డాక్టర్ కి చూపిస్తే, అది మైగ్రేన్ తలనొప్పి అని, తలనొప్పి వచ్చినప్పుడల్లా వాడమని టాబ్లెట్స్ ఇచ్చారు.

కొద్దిగా మజ్జిగ అన్నం తిని టాబ్లెట్ వేసుకొని అరగంట ఆగి, తలనొప్పి ఇంకా తగ్గక ముందే గబగబా ఇంటర్వ్యూ కి వెళ్లడం కోసం తయారవసాగింది. ఇంతలో అమ్మమ్మ “దుప్పట్లు, బొంతలు నిర్మా పౌడర్ వేసి నానబెట్టాను. వాటిని ఉతికి వెళ్ళ”మంటూ పట్టు పట్టింది.

“వచ్చాక ఉతుకుతాను అమ్మమ్మా! అప్పటికి తలనొప్పి కూడా కాస్త తగ్గుతుంది” అని గిరిజ ఎంత బతిమిలాడినా ఆవిడ వినిపించు కోలేదు.

భోజనానికి ఇంటికి వచ్చిన నాగ కూడా తల్లి మొండిపట్టుకి చికాకుపడి, వారించే ప్రయత్నం చేసి, లాభం లేక తల పట్టుకుని కూర్చుండిపోయింది.

పోనీ వసంతను ఉతకమందామంటే భోజనం అయ్యాక కనీసం రెండు గంటలైనా పడుకుంటుంది. ఏ పనైనా ఆ తరువాత మాత్రమే చేస్తుంది. తను లేచే సమయానికి ఎండ తీవ్రత తగ్గిపోవడంతో బొంతలు, దుప్పట్లు రాత్రి పడుకునే సమయానికి ఆరవు.

రెండవది వసంతకి లేచాక తుడుపులు, వంట, అమ్మమ్మకి ఫలహారం చెయ్యడం వంటి పనులు ఉండనే ఉంటాయి. ఇక చేసేది లేక దుప్పట్లు, బొంతలు శుభ్రంగా ఉతికి మేడమీద ఆరేసి వచ్చింది గిరిజ.

అప్పటికి సరిగ్గా ఇంటర్వూకి అక్కడ ఉండాల్సిన సమయం అయింది. గబగబా రెడీ అయి ఇంటర్వ్యూకి పరుగులాంటి నడకతో వెళ్ళినా సమయం  నాలుగు గంటలు అయింది. సమయం మించిపోవడంతో బిక్కు బిక్కుమంటూనే షాప్ ఓనర్ ని కలిసింది.

ఆయన నామమాత్రంగా రెండు మూడు ప్రశ్నలు అడిగి, ఆలస్యంగా ఇంటర్వ్యూకి వచ్చిన కారణాన్ని ఎత్తిచూపుతూ, పంక్చువాలిటీ లేని కారణంగా సెలెక్ట్ చేయలేకపోతున్నామని చెప్పి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించడంతో, బలవంతంగా వస్తున్న కన్నీటిని దిగమింగుకుంటూ ఇంటికి చేరింది.

“గిరిజ కోసమే షాప్ కి కూడా వెళ్ళకుండా ఎదురుచూస్తున్న నాగ “ఏమన్నారు గిరీ!?” అనడిగింది ఆతృతగా.

“ఆలస్యంగా వచ్చానని చేర్చుకోమన్నారమ్మా!” అంది బేలగా తల్లిని చూస్తూ.

నాగ కోపంగా తల్లి వంక ‘ఇదంతా నీ నిర్వాకమే’ అన్నట్లు చూసినా ఆవిడ తనని కాదన్నట్లు తల తిప్పేసుకుంది.

“తల విపరీతంగా నొప్పెడుతోందమ్మా! ఇంటర్వ్యూకి వెళ్ళాలని తలకి నూనె రాసుకోకుండా ఇంతసేపు ఆగాను. కాస్త నూనె పెట్టవూ!” అడిగింది గిరిజ. తల్లి కన్నా ముందే వసంత కొబ్బరి నూనె తెచ్చి, చెల్లి మాడు మీద వేసి, మర్దనా చేసింది.

ఇంతలో షాప్ లో పని చేస్తున్న మూర్తికి స్నేహితుడైన మరో అబ్బాయి (ఈ అబ్బాయి పేరు కూడా మూర్తే) వచ్చాడు. ఇదివరకు మూర్తితో మాత్రమే కలిసి వచ్చేవాడు. అలాటిది ఈసారి ఒక్కడూ రావడం చూసి కాస్త ఆశ్చర్యపోయినా “రా! మూర్తీ” అంటూ  ఆహ్వానించింది నాగ.

కుశలప్రశ్నలు అయాక “షాప్ కి వెళ్ళాను మేడమ్. మీరు రాలేదని మూర్తి చెప్పడంతో, ఒకసారి మామ్మగారిని కూడా చూసినట్లు ఉంటుందని ఇలా వచ్చాను. గిరిజగారేంటి డల్ గా ఉన్నారు?” అనడిగాడు.

“ఇప్పుడే ఇన్నోవేషన్స్ కి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చింది. పైగా తలనొప్పిగా ఉందట” అంది నాగ.

“ఏమన్నారు?” అడిగాడా అబ్బాయి. నాగ జరిగినదంతా వివరించి, ఎన్నో ఉద్యోగాలకి అప్లికేషన్ పంపిస్తోంది. పోస్టల్ ఛార్జీలు వదులుతున్నాయి గానీ, ఎవరూ ఇంటర్వ్యూకి రమ్మని పిలిచిన పాపాన పోలేదు. వీళ్ళు పిలిచారంటే ఇదిగో… ఇలా అయింది” అంటూ నిట్టూర్చింది నాగ.

“ఇన్నోవేషన్స్ ఆయన నాకు బాగా తెలుసు. మీకు అభ్యంతరం లేకపోతే నాతో వస్తారా? నేను మాట్లాడతాను అతనితో” అన్నాడు మూర్తి గిరిజతో.

“వద్దు మూర్తీ! ఫస్ట్ ఇంప్రెషన్ సరిగా లేకపోతే కష్టం. గిరిజ మనసు చాలా సున్నితం. జాయిన్ అయాక వాళ్ళు ఎప్పుడైనా ఈ విషయం దృష్టిలో ఉంచుకుని ఒక మాట అన్నా ఇది తట్టుకోలేదు” అంది నాగ.

“సరే! వదిలేయండి. మీరు ఏఏ ఉద్యోగాలకి అప్లై చేసారో చెప్తారా!” గిరిజను అడిగాడతను.

తను అప్లై లిస్ట్ అంతా చెప్పి, ఆ గోఠిసన్స్ వాళ్ళు ఈ రోజు కూడా మళ్ళీ ఏడ్ ఇచ్చారు. వాళ్ళు ఎవరికీ ఉద్యోగం ఇవ్వకుండా ఏడ్ ఎందుకిస్తున్నారో నాకర్ధం కావట్లేదు” అంది గిరిజ.

“గోఠిసన్స్ ఆయన, నేను కూడా లయన్స్ క్లబ్ మెంబర్స్ మి. తరచూ కలుస్తూ ఉండడం వల్ల మంచి పరిచయమే ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి నాతో రండి. నేను అసలు విషయం కనుక్కుంటాను. కనీసం విషయం తెలుసుకోవడం మంచిది కదా!” అన్న మూర్తి మాటలకు తల్లి వంక చూసింది గిరిజ.

తల్లి సరేనని తల ఊపడంతో మాడు మీద నూనె మర్దనా చేయడం వల్ల జిడ్డు కారుతున్న ముఖాన్ని కాస్త సబ్బుతో పామి, జుట్టు పైపైన సరిచేసుకుని వచ్చింది. అతను వెంటనే బయలుదేరడానికి లేవడంతో ఇంట్లో వాళ్ళకు “వెళ్ళొస్తాన”ని చెప్పి అతనితో పాటు షాప్ కి వెళ్ళింది.

షాప్ లో జనం పలుచగా ఉన్నారు. షాప్ ఓనర్ గారు కేష్ కౌంటర్ లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నారు. మూర్తిని చూడగానే చిరునవ్వుతో విష్ చేసిన ఆయన, మూర్తి వెనుకనే ఉన్న గిరిజను చూడగానే ‘మళ్ళీ వచ్చిందేమిటి?’ అన్నట్లు ఆయన కనుబొమలు వేసారు.

అది గమనించగానే గిరిజ మరి కదలడానికి శక్తి సరిపోనట్లు ఉన్నచోటనే నిలబడిపోయింది. మూర్తి ఆయన దగ్గరకు వెళ్ళి ఏం మాట్లాడాడో, ఆయన ఏం అన్నారో కూడా వినబడనంతగా అతని ముఖంలో కనబడిన తిరస్కారభావానికి మెదడు స్తంభించిపోయింది. అక్కడి నుండి పారిపోవాలనిపిస్తోంది కానీ అవసరం ఆపింది.

ఇంతలో కేష్ కౌంటర్ నుండి ఆయన బయటకు వచ్చి “ఇలా రండి మేడమ్” అనగానే మెల్లగా వాళ్ళ దగ్గరకు నడిచింది. “మాకు సేల్స్ గరల్స్ అవసరం లేదు కానీ, బిల్లింగ్ మిషన్ ఆపరేట్ చేసే ఆవిడ ప్రస్తుతం లీవ్ మీద వెళ్ళారు. ఆవిడ వచ్చేవరకు మీరు ఆ పని చేస్తారా?” అని అడిగారు.

చేస్తాను అన్నట్లు బుర్ర ఊపి, తన అంగీకారాన్ని తెలియజేసింది గిరిజ. ఆయన ఎలక్ట్రానిక్ బిల్లింగ్ మిషన్ వైపు దారి తీసి “ఇదే మీ సీట్” అంటూ ఒక స్టూల్ చూపించి, కూర్చోమన్నారు. గిరిజ కూర్చోగానే బిల్లింగ్ మిషన్ పని తీరు ఓ పది నిముషాలు వివరించి, కొంతమంది కష్టమర్స్ తాలూకా బిల్స్ ఎలా టైప్ చెయ్యాలో స్వయంగా టైప్ చేసి చూపించారు.

“మొదట్లో కొంచెం ఇబ్బంది పడతారు కానీ వారం రోజుల్లో అలవాటు అయిపోతుంది” అన్నారు మళ్ళీ ఆయనే.

“అయితే తనని ఎప్పుడు జాయిన్ అవమంటారు” అడిగాడు మూర్తి.

“ఆవిడకి అభ్యంతరం లేకపోతే ఇప్పుడే జాయిన్ అయిపోవచ్చు. ఏమ్మా! మీకు ముహూర్తాల నమ్మకం ఏమైనా ఉందా?” అడిగారు గిరిజను.

‘ఉద్యోగం వస్తే చాలు’ అనుకుంటున్న గిరిజ “అదేమీ లేదు సర్. నేను ఇప్పుడే జాయిన్ అయిపోతాను” అనడంతో “గుడ్” అని ప్రశంశిస్తున్నట్లు చూసారు.

గిరిజ సందిగ్ధంగా మూర్తి వైపు చూడగానే “నేను మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారితో జాయిన్ అయిపోయారని చెప్తాను. మీరు వర్క్ చూసుకోండి” అన్నాడు గిరిజ భావం అర్ధమైనట్లుగా. “థాంక్యూ” అంది గిరిజ.

రాత్రి ఎనిమిదిన్నర దాటాక “మీరిక ఇంటికి వెళ్ళొచ్చు మేడమ్. రేపు ఉదయాన్నే తొమ్మిది గంటలకల్లా వచ్చేయండి” అన్న బాస్ మాటలకు సీట్ లోంచి లేచి “థాంక్యూ అండ్ గుడ్ నైట్ సర్” అని మర్యాదపూర్వకంగా చెప్పి ఇంటికి చేరుకుంది గిరిజ.

 

 

****** సశేషం ******

 

1 thought on “అమ్మమ్మ – 44

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *