April 18, 2024

చిన్న వయసు – పెద్ద ఆలోచన

రచన: డా. సూర్యకుమారి మానుకొండ

ఒక ‘ పిల్లల స్కూల్ బస్సు’ స్టాప్ దగ్గర ఆగింది. ఒక చిన్న కుఱ్ఱవాడిని అటెండర్ జాగ్రత్తగా కిందికి దింపాడు. బాబు కోసం ఎవరూ వచ్చిన సూచన లేదు. “బాబూ ! ఈ గట్టుమీద కూర్చో మీ వాళ్ళు వచ్చేదాకా. భయపడకుండా కూర్చుంటావా” అని అడిగాడు.
” సరే అంకుల్” అన్నాడు బాబు .అయినా ఒక ఐదు నిమిషాలు చూసాకే డ్రైవర్ బస్సు పోనిచ్చాడు. ఎందుకంటే బస్సులో ఇంకా చాలామందే చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ స్టాపుల దగ్గర వారి సంబంధీకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యం అయితే కంగారుపడతారు కదా !
ఇంతలో ఓ చిన్న బుజ్జి కుక్కపిల్ల బాబు దగ్గరకి వచ్చింది. పట్టుకోబోతే పరిగెత్తింది. వెనకాలే అబ్బాయి. …ఆది రోడ్డు కడ్డంగా పరిగెడితే తనూ అటే పరిగెట్టాడు. స్పీడుగా వస్తున్న లారీని చూసుకోలేదు. డ్రైవర్ సడన్ బ్రేక్ వెయ్యకపోతే లారీకింద పడేవాడే. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. ఇంతలో ఒక 12 ఏళ్ల అమ్మాయి వచ్చి లేవదీసి ప్రక్కకి లాగింది.
“లలితక్కా ” అంటూ అమ్మాయి కాళ్లు పెనవేసుకొని బావురుమన్నాడు .
కళ్ళు తుడిచి బుజ్జగిస్తూ “ఇక్కడున్నావేంటి యశ్వంత్ ” అని అడిగి విషయం తెలుసుకుని నెమ్మదిగా కుర్రవాడిని ఎత్తుకొని తన ఇంటికి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి.
ఆ అబ్బాయితోపాటు చదువుకునే రమేష్ వాళ్ళ అక్క ఈ లలిత.
ఇల్లు చేరగానే అబ్బాయి బేగ్ లోంచి డైరీ తీసి చూసి వాళ్ళ నాన్న నంబర్ కి ఫోన్ చేసి విషయం చెప్పి , తన ఇంటి అడ్రస్ కూడా యిచ్చింది . అపార్ట్మెంట్ పేరు చెప్పి, వాచ్ మేన్ కూతురినని చెప్పింది.
అరగంటలో ఆయన కంగారుపడుతూ వచ్చే సాడు.
ఈ లోగా బాబుకి కాళ్ళూ చేతులూ కడిగి తినడానికి, తాగడానికి ఏదో యిచ్చింది లలిత. తేరుకొని , రమేష్ తో చక్కగా ఆడుకుంటూ వున్నాడు. తండ్రిని చూసి ‘డాడీ’ అంటూ మళ్ళీ బావురుమన్నాడు యశ్వంత్.
విషయం తెలుసుకుని, గండం గడిచినందుకు సంతోషించి, లలిత చేతుల్లో కొంత డబ్బు పెట్టి , అటువంటి తెలివైన పిల్లను కన్నందుకు వాచ్ మేన్ దంపతులను మెచ్చుకుని, థాంక్స్ చెప్పి కొడుకుతో కలిసి వెళ్ళి పోయాడు ఆయన .
యశ్వంత్ తల్లిదండ్రులు నాలుగు రోజుల పాటు మనుషులు కాలేకపోయారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. ఇద్దరు పిల్లలు.
చిన్న పిల్లలతో మహానగరంలో ఉద్యోగులైన దంపతులు పడే కష్టాలు వాళ్ళకీ వున్నాయి. ఇంత కాలం ఆయాలతో, మెయిడ్స్ తో ఎన్నో అవస్థలు పడుతూనే ఉన్నా ఇప్పుడు జరిగిన విషయం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ లలిత రక్షించకపోతే బిడ్డ ఏమయేయేవాడో !
ఆనాటి విషయం ఏమిటంటే..
యశ్వంత్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. రోజూ స్కూల్ బస్ లో
5 గంటలకు వస్తాడు. ఆ సమయానికి తమ అపార్ట్మెంట్ వాచ్మెన్ వెళ్ళి బాబుని తీసుకొచ్చి , తాగడానికి పాలు యిచ్చి తలిదండ్రులు వచ్చేవరకూ తమ దగ్గర పెట్టుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్నారు బాబు తలిదండ్రులు.
ఆ రోజు అనుకోకుండా మధ్యాహ్నం స్కూల్ కి సెలవిచ్చారు. ఆ విషయం తండ్రికి ఫోన్ లో చెప్పి, మధ్యాహ్నం ఒంటిగంటకు బస్ స్టాప్ దగ్గర రిసీవ్ చేసుకోమన్నారు. ఆయన వాచ్ మేన్ కి ఫోన్ చేసి చెప్పినా, అతడు కొంచెం ఆలస్యంగా వెళ్ళడంతో యిదంతా జరిగింది.
ఎంత డబ్బు సంపాదిస్తుంటే మాత్రం ఏం ప్రయోజనం ! ప్రాణాలకు ముప్పు తప్పనప్పుడు !
యశ్వంత్ తల్లి ఆఫీసు చాలా దూరం. ఆమె కోసం తను కూడా రడీ అయ్యి ఉదయం 8 గంటలకు కారులో తీసుకెళ్ళి దించి , అక్కడ నుంచి తన ఆఫీసుకి వెళతాడు తండ్రి. ఇంట్లో రోజూ ఉదయం పూట ఉరుకులు, పరుగులు. ..
పిల్లల పనీ, టిఫిన్లు కాఫీ లు, లంచ్ బాక్స్ లు….
యశ్వంత్ ని 7.30కి స్కూలు బస్సు ఎక్కించడం! బాగా శ్రమ అయిపోతుంది.
భార్యాభర్తలు మనకు మరో రెండేసి చేతులుంటే బావుండుననుకుంటూ వుంటారు.
పెద్దవాడు 8 ఏళ్ళ జస్వంత్ తనే బస్ ఎక్కి స్కూలుకి వెళ్ళిపోతాడు. తండ్రి ఆఫీసు స్కూలుకి దగ్గరే కనుక సాయంత్రం నేరుగా అక్కడికి వెళ్ళి పోతాడు. తండ్రి పని ముగిసాక ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు.
తల్లి ఉద్యోగం మానేసి కొంతకాలం ఇంటినీ, పిల్లలనీ చూసుకోవాలని ఆలోచించింది కానీ… తరువాత అంత మంచి జాబ్ దొరుకుతుందా ! పైగా ఫ్లాట్, కారు లోన్ …ఒక్కరి జీతంతో జరిగేపని కాదు .
ఆ రాత్రి ఆ దంపతులకు నిద్ర కరువైంది .ఇంకా గుండె దడదడలాడుతూనే వుంది తల్లి స్వరూపకి. ఇంత కష్టపడి సంపాదించుకునేది బిడ్డల కోసమే కదా! వాళ్ల ప్రాణాలకే అపాయం సంభవిస్తే ఎందుకు జీవితం! అని తల్లి పదేపదే కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తండ్రికి కూడా మనసు కకావికలమై పోయింది .
మరునాడు ఆదివారం ! యశ్వంత్ ఎలావున్నాడో చూడాలని తమ్ముడు రమేష్ ని వెంటబెట్టుకుని లలిత వచ్చింది .యశ్వంత్ తల్లిదండ్రులు ఎంతో సంతోషించి ఆదరించారు. మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకొని ఆమె విశేషాలు అడిగారు.తండ్రి వాచ్ మేన్ అయినా పగలు కూలిపనులకు కూడా వెళతాడు. తల్లి ఫ్లాట్స్ లో ఇళ్ళ పనులు చేసుకుంటూ ఉంటుంది. తండ్రి కూలిపనికి పోతే వాచ్ మేన్ పనులు కూడా ఆమే సంబాళించుకోవాలి.
అందుకే ఏడో క్లాస్ చదువుతున్న లలిత చదువు మానేసి ఇంట్లో తల్లిదండ్రులకి సాయంగా ఉండిపోవాల్సి వచ్చింది.అదీకాక తమ్ముణ్ణి రోజూ స్కూల్ కి తీసుకెళ్లి దిగబెట్టడం, మధ్యాహ్నం వేడిగా భోజనం తయారుచేసి పట్టుకెళ్ళి తినిపించి రావడం, సాయంకాలం వెళ్ళి ఇంటికి తీసుకు రావడం ఇవన్నీ లలిత పనులే. స్కూల్ లో రమేష్ కి స్నేహితుడు గనుక యశ్వంత్ ఆమెకి బాగా తెలుసు. లలితక్కా అంటూ ప్రేమగా పిలుస్తాడు యశ్వంత్.
లలితకు ఇద్దరు అక్కలు. పెద్దక్కకి పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు. రెండో అక్కకి పెళ్ళి ఖరారు అయినట్లే !
సాయంకాలం మీ తమ్ముడితో పాటు, మా యశ్వంతుని కూడా జాగ్రత్తగా మీ ఇంటికి తీసుకుకెళ్ళి ఏదైనా తినిపించి ఏడుగంటల దాకా చూసుకోగలవా! అప్పుడు నేనొచ్చి తీసుకెళతాను. నువ్వు సరే అంటే మీ నాన్నతో మాట్లాడుతాను అన్నాడు యశ్వంత్ తండ్రి.
లలిత సరే అంది.
పెద్దవాళ్ళతో మాట్లాడాక మరునాటి నుంచి యశ్వంత్ ని స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకుపోసాగింది లలిత.
ఇప్పుడు కొంచెం నిశ్చింతగా వుంది స్వరూప దంపతులకు.
ఒకనాటి రాత్రి వున్నట్టుండి “లలితక్కని మనింటికి తెచ్చేసుకుందాం డాడీ ” అన్నాడు యశ్వంత్. నవ్వాడు డాడీ.
“వాళ్ళు ఎందుకు పంపుతారు?
“మనీ యిస్తాంగా ” … కొడుకు!
“అయినా సరే పంపరులే ” అంది అమ్మ .
” నేను రేపు వాళ్ళకి చెపుతా. పంపిస్తారు” అన్నాడు కొడుకు నమ్మకంగా !
యశ్వంత్ కి లలితంటే చాలా యిష్టం. అందుకే అలా అంటున్నాడు అనుకుంది తల్లి.
అందరూ నిద్రపోయినా తండ్రికి నిద్ర పట్టలేదు.
“మనీ యిస్తాంగా”… కొడుకు మాటలు ఆలోచింపజేస్తున్నాయి.
ఈ ఆలోచన తనకు రానేలేదు.
యశ్వంత్ ని తీసుకుని రావడానికి లలిత ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ల నాన్న కనిపిస్తే, కాస్త మంచి చెడూ మాట్లాడుతూ ఉంటాడు యశ్వంత్ తండ్రి. మాటల సందర్భంలో అతను చెప్పాడు.
వాళ్ళది చాలా పేద కుటుంబం. పల్లెటూర్లో ఉండేవాళ్లు వాళ్ళు. వాళ్ళ కామందు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు వాచ్మెన్ గా ఉండడానికి ఒప్పించి కుటుంబాన్ని అంతటిని హైదరాబాద్ తీసుకొచ్చేశాడు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితి యిప్పుడు కొంచెం పరవాలేదు కానీ కూతుళ్లకు పెళ్లిళ్ళు చేయాలి చిన్నవాడిని చదివించాలి ఇంటి పోషణ కోసం భార్యాభర్తలు వాళ్లతో పాటు లలిత కూడా ఒళ్ళు విరుచుకుని కష్టపడవలసి వస్తోంది. అప్పుచేసి పెద్ద పిల్ల పెళ్ళి చేసారు. ఇప్పుడు రెండో అమ్మాయి పెళ్ళి కూడా కుదిరినట్టే కానీ కాబోయే అల్లుడు హఠాత్తుగా లక్ష కట్నం కోరుతున్నాడు. అతను సొంత ఆటో కొనుక్కోవాలని కొంచెం డబ్బు కూడబెట్టాడు. పిల్ల తండ్రి కట్నంగా ఒక లక్ష యివ్వగలిగితే వెంటనే ఆటో కొనేసుకుంటాడు. లేదంటే సంబంధం వదులుకోవాలి. వేరే వాళ్ళు పిల్లనివ్వడానికి సిద్ధంగా వున్నారట ! ఈ సంభాషణ జరుగు తున్నప్పుడు యశ్వంత్ అక్కడే వున్నాడు. అర్థం అయినా కాకపోయినా పెద్ద వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటాడు యశ్వంత్.
ఏ పదివేలో ఇరవైవేలో అంటే సర్దవచ్చు ! బొత్తిగా లక్ష యివ్వాలంటే తమకీ కష్టమే ! అనుకున్నాడు యశ్వంత్ తండ్రి. తమ బేంక్ బాలెన్స్ రెండులక్షలకు మించి ఎప్పుడూ వుండదు.
అది ఏ అత్యవసర ఖర్చో వచ్చి పడితే ఆదుకుంటుంది అనే ఉద్దేశంతో అలా వుంచుతారు.
భార్యతో సంప్రదించాడు. తర్జనభర్జనలు పడి ఒక నిర్ణయానికి వచ్చారు. లలిత వుంటే తాము చాలా నిశ్చింతగా వుండవచ్చు. పైగా ఆ పిల్లకి యశ్వంత్ అంటే చాలా ప్రేమ. అందుకే ఓ లక్ష వాళ్ళకు యిచ్చేద్దామని అనుకున్నారు.
అయితే వాళ్ళింట్లో ఆ అమ్మాయి లేకపోతే చాలా కష్టమే. పైగా వేరే వాళ్ళ ఇంట్లో పని చెయ్యడానికి వుంచెయ్యడానికి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు.
అయినా అడిగి చూద్దాం అనుకున్నారు . సంశయిస్తూనే అడిగారు.
లలితను తమ ఇంటికి పంపించగలిగితే ఆ లక్ష రూపాయలు తాము సర్దుబాటు చేస్తారు. ఆ అమ్మాయికి నెలనెలా యివ్వవలసిన జీతంతోనే నెమ్మదిగా ఆ అప్పు తీరిపోతుంది.
అమ్మాయికి వేరే బెడ్ రూం యిస్తారు. వయసు వస్తున్న పిల్ల గనుక ఈ ఏర్పాటు.
వాచ్ మేన్ దంపతులు వెంటనే ఒప్పుకున్నారు.
పిల్ల పెళ్ళి జరిగిపోతుందంటే ఎంత కష్టమైనా భరించడానికి వాళ్ళు సిద్ధమే !
ఆ విధంగా లలిత యశ్వంత్ వాళ్ళింటికి వచ్చాక ఆ కుటుంబం తెరిపిన పడింది. ముఖ్యంగా యశ్వంత్ విషయంలో అంతా సవ్యంగా జరిగి పోతోంది. ఉదయం స్కూలుకి దిగబెట్టి, మధ్యాహ్నం భోజనం పట్టుకెళ్ళి యశ్వంత్ తోపాటు రమేష్ కి కూడా తినిపించి వస్తుంది. మధ్యాహ్నం మీ తమ్ముడు రమేష్ కి కూడా భోజనం పట్టుకెళ్ళమని స్వరూప మొదట్లోనే చెప్పింది. మళ్ళీ సాయంత్రం వెళ్ళి యశ్వంత్ ని ఇంటికి తీసుకురావడం అన్నీ లలితే చూసుకుంటుంది.
ఇప్పుడు పెద్దవాడు జశ్వంత్ కూడా సాయంత్రం నేరుగా ఇంటికే వచ్చేస్తున్నాడు. లలిత ఓ తల్లిలా వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటోంది. ఇంటి పనీ, వంట పనీ కూడా అవలీలగా చక్కబెడుతుంది. అంతే కాదు పిల్లల హోం వర్క్ లుచేయించడం, వాళ్ళకి ట్యూషన్ చెప్పడం చేస్తుంది.
స్వరూప దంపతులకు పిల్లల విషయంలో ఎంతో ధైర్యంగా వుంటోంది. లలితను కూతురిలాగే చూసుకుంటున్నారు. ప్రయివేట్గా చదివించే ఆలోచనలో వున్నారు. అటు లలిత తలిదండ్రులు కూడా సంతోషంగా వున్నారు.
ఇన్ని ఆనందాలకి కారణం ఒక చిన్న పిల్లవాడి ఆలోచనే అంటే నమ్మలేం. వాస్తవానికి చిన్న పిల్లల్లో అవగాహన శక్తి బాగానే వుంటుంది. సరిగ్గా మాటల్లో చెప్పలేకపోవచ్చు కానీ చెప్పే ప్రయత్నం చేస్తూనే వుంటారు. పెద్దవాళ్ళు కాస్త శ్రద్ధ పెట్టి వినాలి అంతే !

* * * * *

1 thought on “చిన్న వయసు – పెద్ద ఆలోచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *