May 26, 2024

పిల్లలు నేర్పిన పాఠాలు

రచన: అపర్ణ క్రోవి

పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని, నా బిడ్డలు నిజంగా ఏ జన్మలోనో నేను చేసిన దానాలకి ప్రతిఫలమే.

19 ఏళ్లకి డిగ్రీ పరీక్షలు రాసిన వెంటనే, ఫారెన్ సంబంధం వచ్చిందని పెళ్లి చేసేశారు అమ్మ నాన్న. పెళ్లి అయిన రెండు నెలలకే, అందరినీ వదిలి, ఆ భగవంతుడి మీద భారం వేసి, ప్రపంచ పటంలో ఏ మూలన వుందో కూడా ఐడియా లేని దేశానికి (బ్రెజిల్) వెళ్లాను మావారితో. పెళ్లి అయిన 6 నెలలకే ఒక బిడ్డకి తల్లిని అవుతున్నా అని తెలిసినప్పుడు ఎగిరి గంతేశాను. ఆ లేత వయసులో అప్పటికి ఇంకా తల్లిగా వుండే బాధ్యతలు, పిల్లలని పెంచటంలో వుండే కష్టనష్టాలు ఏంటో నాకు ఏవీ తెలియవు. సహజంగా చిన్నపిల్లలు అంటే ప్రేమ వుండటం, చదువుకునే రోజుల్లో మా ఇంటి ప్రక్కన ఆంటీల పిల్లల్ని, మనవళ్లు, మనుమరాళ్లనీ కూడా ఆడిస్తూ పాడిస్తూ పెంచటంతో, నా పిల్లల్ని పసితనంలో పెంచటం ఎప్పుడూ కష్టం అనిపించలేదు. చాలా సరదాగా అనిపించేది అప్పుడు. కానీ తరువాత వాళ్లు ఎదుగుతున్నకొద్దీ అర్ధం అయింది పేరెంటింగ్ అంటే ఏంటో. పిల్లల్ని పెంచాలి అంటే ఎంత ‘ఓర్పు ‘ కావాలో. బాబాగారు చెప్పినట్టు ‘శ్రద్ధా ఔర్ సబర్ ‘. Patience and Perseverance are the keys of successful parenting.
‘పేరెంట్ హుడ్ ‘ అన్నది ఒక ప్రోసెస్. ఆ ప్రొసెస్ ని అలా ఎంజాయ్ చేయాలే తప్ప, అదర్శ తల్లితండ్రులుగా వుండాలి అని ఆరాట పడి, ఆ ఆరాటంలో మనం మనల్ని బాధ పెట్టుకుంటూ, క్రమశిక్షణ పేరుతో వాళ్లని బాధ పెడుతూ వుండకూడదు అన్నది నా అభిప్రాయం. 25 ఏళ్లకే, ముగ్గురు బిడ్డల తల్లిని అయిన నేను ఈ గత 22 సంవత్సరాల్లో వాళ్లని పెంచుతూ, వాళ్లకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ, వాళ్లతో పాటు రోజూ నేను కూడా ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వుంటాను. ఎప్పుడూ వాళ్లని జాగ్రత్రగా చూసుకోవాలి అన్న తపనే. కానీ ఆ ప్రయత్నంలో నాకు తెలిసీ, తెలియక ఎన్నో తప్పులు చేశాను.
నేను ‘బెస్ట్ మమ్మీ ‘ అని ఎప్పుడూ ఫీల్ అవ్వను. అలా అవ్వాలని కూడా ఆశపడను. ఎందుకంటే, నేనూ మనిషినే కదా. అంతా పర్ఫెక్ట్ గా వుండటం ఎవరి వల్లా కాదు. కానీ, మన తప్పుని ఒప్పుకునే నిజాయితీ మనలో వుండాలి. తల్లితండ్రులుగా మనం చేసే తప్పులని కూడా అర్థం చేసుకుని, మనల్ని సరిదిద్ది, మనస్ఫూర్తిగా మనల్ని ప్రేమించే బిడ్డలు మనకి వుంటే మాత్రం ఆ తల్లి తండ్రులు అదృష్టవంతులే. నేనైతే ఆ విషయంలో అదృష్టవంతురాలినే.
మన పిల్లలు మనకి ప్రతిరూపాలు. మనం వాళ్లని ఎలా పెంచితే వాళ్లు అలాగే అదే విధంగా తయారవుతారు. మనం ప్రేమ పంచితే తిరిగి మనకి అదే ప్రేమ ఇస్తారు. మా అమ్మ నన్ను మధ్య మధ్యలో సాధిస్తూ వుంటుంది “ఆ…. నా పిల్లల మీదట నీ పిల్లలే బంగారాలు. చక్కగా చూసుకుంటారు నిన్ను. పనుల్లో సాయం చేస్తారు. మీరు నాకు ఏమీ సాయం చేసేవారు కాదు” అని. చెప్పే పద్ధతిలో చెప్పి, అడిగే పద్ధతిలో అడిగితే చేసి వుండేవారిమేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అందరూ ఒకేలా వుండరు. వాళ్ల మనసుని అర్ధం చేసుకుని, వాళ్లని వాళ్లగా పెంచాలే తప్ప అక్కతోనో, చెల్లెలితోనో పోల్చి వాళ్ల మనసుని బాధ పెట్టకూడదు.
పిల్లల పెంపకం రోజూ మనకు ఒక పాఠం… గుణపాఠం. కొన్ని పాఠాలు మనల్ని మనం ఇంకా ఉన్నతంగా మార్చుకోడానికి ఉపయోగ పడితే, కొన్ని గుణపాఠాలు మనం ఎంత ఉన్నతంగా ఆలోచించి మోసపోయామా అని అనిపిస్తాయి. కొన్ని విషయాలు మన మనసుకి చాలా బాధ కలిగిస్తాయి. ఆ బాధ నించీ కోలుకోటానికి చాలానే సమయం పట్టవచ్చు. కానీ మనం వాటిని అంగీకరించాలి. అంతే కాని మన ఆలోచనల్ని, మన నిర్ణయాల్ని వాళ్ల మీద రుద్దకూడదు ఎప్పుడూ. అలా చేసినా ఆ ప్రయత్నంలో గాయపడేది మన మనసే. వాళ్ల నించీ కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మార్పు మనిషికి అవసరం. మనల్ని మనం ఇంకా మంచిగా మార్చుకోడానికి ఎప్పుడూ ఆరాట పడుతూనే వుండాలి. ఎప్పుడూ నేర్చుకుంటూనే వుండాలి.
7 సంవత్సరాల క్రితం, ఒక ఫైర్ ఆక్సిడెంట్ లో మా కుటుంబం బాగా గాయపడి, నేను హాస్పిటల్ లో ఐ. సి.యూ బెడ్ లో చావు బ్రతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నప్పుడు కూడా నా మొహం మీద చిరునవ్వు తెప్పించారు నా బిడ్డలు. మన చేతలతోనే కాదు, మన మాటలతో కూడా ఒక మనిషికి ప్రాణం పోసి బ్రతికించుకోవచ్చు అని నాకు తెలియచేశారు. పాజిటివ్ థింకింగ్ వుంటే, లైఫ్ లో ఎన్ని కష్టాలు అయినా ధైర్యంగా అధిగమించవచ్చు అని నాకు ఋజువు చేశారు. వాళ్లు ప్రక్క రూములో గాయాలతో బాధపడుతూ కూడా, ప్రతి రోజూ నర్సుని “అమ్మని ఒకసారి చూడాలి సిస్టర్” అని ప్రాధేయపడి మరీ, అదే స్ట్రెచెర్ మీద నా రూంలోకి వచ్చి, వాళ్లకి కష్టం అయినా లేచి కుర్చొని అమ్మ మొహం చూడాలి అని తాపత్రయ పడేవాళ్లు. వంటి నిండా కాలిన గాయాలతో, బాండేజీ లతో ఒక్క మొహం తప్ప ఇంకేమీ చూడలేని పరిస్థితిలో వున్న నన్ను చూస్తూ కూడా “అమ్మా! నువ్వు ఎంత అందంగా వుంటావో తెలుసా అసలు? నీ కళ్లు చాలా బావుంటాయి “అని రోజూ నన్ను పొగుడుతూ, నేను ఇంకా అందంగానే వున్నాను అన్న ధైర్యం నాలో నూరి పోశారు నా పిల్లలు. “సిస్టర్! అమ్మకి ఫేస్ క్లీన్ చేయి. అమ్మకి పౌడర్ రాసి బొట్టు పెట్టు. తల దువ్వు” అని నర్సుకి చెప్పి మరీ చేయించేవాళ్లు. అప్పుడు నాకు అర్ధం అయింది, మన బిడ్డలు మన కష్టకాలంలో మనకి తల్లితండ్రులు కూడా అవుతారు అని. ఆ రోజు వాళ్లు చూపించిన ప్రేమ వల్ల మాత్రమే నేను ఈరోజు ఇంకా ఇలా బ్రతికి వున్నాను. జీవితం ఇంక అయిపోయింది, బ్రతకాలి అన్న కోరిక ఇంక లేదు అనుకున్నపుడు “లేదు అమ్మా, నీకు మేము వున్నాము. మాకు నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి. నీ ప్రెజెన్స్ కావాలి. మా కోసం నువ్వు బ్రతకాల్సిందే” అని నాకు ప్రతిక్షణం గుర్తు చేశారు. ఆ ప్రమాదం వల్ల, ఇంక నా బిడ్డల జీవితం ఏమి అయిపొతుందో అని నేను బాధ పడుతున్నప్పుడు “అమ్మా! నువ్వు బాధపడకు. మేము బాగా కష్టపడి చదువుకుని పైకి వస్తాము. నువ్వు గర్వపడేలా చేస్తాము అమ్మా” అని నా బిడ్డలు అన్నప్పుడు, ఆ చిన్ని ప్రాణాలకి అంత తెలివి, ధైర్యం ఎక్కడి నించి వచ్చిందా అని ఆశ్చర్యం వేసేది. ఒక ఆక్సిడెంట్ మా జీవితాలని తల్లక్రిందులు చేసినా, రోజూ మమ్మల్ని ఎన్నో రకాలుగా శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టినా, ఎన్నో సందర్భాల్లో మాలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచినా మేము ధైర్యంగా ముందుకు వెళ్తున్నాము అంటే అందుకు నేను నా పిల్లలకీ, నా పిల్లలు నాకూ పంచే ప్రేమ, నూరిపోసే ధైర్యమే కారణం”మన జీవితం చాలా విలువయినది. లైఫ్ ఈజ్ బియాండ్ స్కార్స్” అని నాకు తెలిసేలా చేశారు నా పిల్లలు.
నా పెద్ద కూతురు నాకు జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించింది. డ్రెస్సింగ్ స్టయిలుగా వేసుకోటం నించీ, మేకప్, హెయిర్ స్టయిలింగ్ వరకూ అన్నీ. నన్ను నేను బాహ్యంగానే కాదు అంతర్గతంగా కూడా ఇంకా అందంగా, మంచి వ్యక్తిగా మారేలా నాకు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే వుంటుంది. “అమ్మా! నువ్వు చేయగలవు. నీకు ఆ పొటెన్షీల్ వుంది” అని నన్ను ముందుకు ప్రోత్సహిస్తుంది. నేను తప్పు చేస్తుంటే, “అమ్మా! నువ్వు చేసేది కరెక్ట్ కాదు. తప్పుగా ఆలోచిస్తున్నావు” అని నన్ను నేను విమర్శించుకుని నా తప్పుని సరిదిద్దుకునేలా చేస్తుంది. “కొట్టకుండా చెప్పు మమ్మీ. కూల్ గా చెప్పు వాళ్లకి అర్ధం అయ్యేలాగా. వాళ్లు వింటారు” అని నాకు నచ్చజెప్పి నేను తన తమ్ముడితో, చెల్లెలితో ‘కూల్ మమ్మీ’ గా వుండేలా మార్చింది. వాళ్ల నాన్నతో గొడవపడి నేను వొంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు, నన్ను ఒక స్నేహితురాలిగా పలకరించి నేను చెప్పేది అంతా ప్రశాంతంగా విని నా బాధని పంచుకుంటుంది. నిజం చెప్పాలి అంటే నా స్నేహితులు కూడా నన్ను అంత బాగా అర్ధం చేసుకోలేరు. నాకు ఒక ‘కౌంసెలెర్ ‘ ఒక ‘థెరపిస్ట్ ‘ నా పెద్ద కూతురు.
ఇంక నా చిన్నమ్మ. నాకు జూనియర్ అంటారు చూడటానికి. దాని మనసు వెన్న. లైఫ్ లో ఎలా అడ్జస్ట్ అయిపోవాలో దాన్ని చూసి నేర్చుకున్నా. నేను ఏది అయినా దానికి సరిగా చేయలేకపోయానే అని బాధపడితే “అయ్యో, పర్లేదు మమ్మీ. నువ్వు ఫీల్ అవ్వకు. ఇట్స్ ఓ. కె. ” అంటుంది. మనసుకి అనిపించినవి అన్నీ బయటకు కక్కి, ఎదుటివారిని బాధ పెట్టకూడదు అని నేర్చు కున్నా దానిని చూసి. అది చాల మంచి శ్రోత. She is a good listener. అందుకే దాని ఫ్రెండ్స్ అందరూ దానికి వాళ్ల కష్టాలు చెప్పుకుంటారు. తను చాలా ఓర్పుగా వింటుంది. ఇంకో గొప్ప విషయం తనలో ఏంటంటే మనిషిని మనిషిగా గౌరవిస్తుంది. జండర్ డిస్క్రిమినేషన్, కలర్ డిస్క్రిమినేషన్ చేయదు. చేయనివ్వదు. she empathizes with everyone. ఆ విషయం నేను కూడా తనని చూసి నేర్చుకున్నాను.
ఇక నా బాబు. వాడు నేను పిలిచినట్టుగా నిజంగా “బంగారు బాబే”. ఎక్కువగా చెప్పలేను. దిష్టి తగులుతుందేమో అని భయం. వాడి పలకరింపులు, వాడి చిరునవ్వు, వాడి కౌగిలింతలు, వాడి ముద్దులే నాకు ఊపిరి. “మాం! నీకు ఏం కావాలంటే అది చేయి. నువ్వు ఈ ఇంటికి క్వీన్ వి. నీకు ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. ” అంటాడు. “నీకు లైఫ్ వుంది. నీ లైఫ్ కూడా నువ్వు ఏంజాయ్ చేయి. మేము మా పనులు చేసుకోగలము” అని నాకు ఏ రకంగా ఇబ్బంది కలిగించకుండా ఈ రోజు నేను నా బిజినెస్ పనులు చూసుకోడానికి నాకు వీలు కల్పించారు నా పిల్లలు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే నేను ఈ వయసులోఎదగడానికి కారణం నా పిల్లలే. ఏ జన్మలో చేసిన పూజల ఫలమో నా పిల్లలు. తెలిస్తే బావుండు, మళ్లీ మళ్లీ చేసుకుంటాను. ప్రతి జన్మలో ఈ బిడ్డలే కావాలి మరి నాకు.

1 thought on “పిల్లలు నేర్పిన పాఠాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *