May 26, 2024

వారాల అబ్బాయి

రచన : తాతా కామేశ్వరి

రామం స్నేహితులు రామం కోసం ఎదురుచూస్తూ ఎప్పుడు రామం కారు ఆగుతుందా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ హాలు ఆ ఊరిలో కల్లా పెద్ద హాలు. అందులో రామం రిటైర్మెంట్ ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరూ నేను ముందు అంటే నేను ముందు అనేటట్టు తమ చేతులలో పూలగుచ్ఛం పట్టుకొని నిలబడ్డారు.
ఆ జిల్లాకే కలెక్టర్ గా చేసి రిటైర్ అయిన రామం అతినిరాడంబరంగా ఉండి, ప్రతి ఒక్కరికి చేతనైన సహాయం చేసి మంచి కలెక్టర్ గా పేరు పొందాడు. కలెక్టర్ అంటే రామం లా ఉండాలని ప్రజలు తలచేవారు. మరి రామంకి అంత మంచి పేరు ఉంది. రామం మా జిల్లా కలెక్టర్ అవ్వాలని అంతా తలచేవారు. అలా వీరు ఎదురు చూస్తూ ఉండగానే గేటు ముందర పెద్ద కారు ఆగడం, అందులోంచి రామం దంపతులు హుందాగా దిగడం జరిగింది. పరుగులతో కారు ముందుకు వచ్చి అంతా కారుని చుట్టి, ఒక్కొక్కరూ పూల గుత్తులు ఇచ్చి, “రామం హ్యాపీ రిటైర్మెంట్ డే” అంటూ చప్పట్లు చరిచి ముందుకు దారి చూపారు.
రామం స్నేహితులు తనకి ఇస్తున్న గౌరవం చూసి ఆనందంతో మైమరచి తను ఎక్కడ ఉన్నాడో కూడా ఆలోచించకుండా ఒక్క నిమిషం గతంలోకి మనసుని జార్చాడు. నలభై అయిదు సంవత్సరాల క్రితం తనకి పదునాలుగు సంవత్సరాల వయసులో తను చదువుకోవడానికి కోటిపల్లి నుంచి విజయనగరంలో కాలు పెట్టాడు. కోటిపల్లి చిన్న గ్రామం. ఆ గ్రామం నుంచి విద్యలకు నిలయం అయిన విజయనగరం వచ్చాడు. రామం పల్లెటూరులో ఉండే తొమ్మిదవ తరగతి పూర్తి చేసి పదవ తరగతిలోకి వచ్చాడు. కోటిపల్లి నుండి విజయనగరం వచ్చి చదువుకోవడం కష్టం, రూములో ఉంచి చదివించే పరిస్థితి తల్లిదండ్రులకు లేదు. ఏం చేయాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంతవరకు క్లాస్ ఫస్ట్ తనదే. ఎలాగైనా బాగా చదివి పెద్దగా ఎదగాలి అనే కోరిక రామంకి చిన్నప్పటినుంచి ఉంది. ఎవరి ఇళ్లల్లోనైనా వారాల భోజనం అడుక్కొని తింటే గొప్ప వారి వీధి అడుగు మీద తనకి ఉన్న చింకి దుప్పటి పెట్టుకొని కాళ్లు ముడుచుకొని పడుకునే అవకాశం దొరుకుతుందని ఆశతో ధైర్యంగా వచ్చాడు. రావడం అయితే వచ్చాడు కానీ, ఎవరిని ఏ విధంగా అడగాలా అని మనసులో గుంజుకొని జేబులో ఉన్న సరస్వతి దేవి ఫోటో తీసి కళ్ళకి అద్దుకొని, దండం పెట్టి అడుగులు మెల్లగా వేస్తూ ప్రతి గుమ్మం వైపు చూస్తున్నాడు.
అప్పుడే తెల్లవారుతోంది ఏ అమ్మా అయినా తలుపు తీస్తుందా? అని చూస్తూ అడుగులు మెల్లిగా వేస్తూ ముందుకు పోతున్నాడు. అతను అనుకున్నట్టే కొద్దిగా ముందరకు వెళ్ళాడో లేదో గడప ముందర ముగ్గు వేస్తున్న లక్ష్మీదేవి లాంటి పెద్దావిడను చూశాడు. ధైర్యంగా ఆవిడ ముందర ఆగి “అమ్మా, మీ ఇంట్లో నాకు ఒక వారం, ఏ వారం అయినా పర్వాలేదు కానీ, కాస్త భోజనం పెట్టి, చదువుకుని పడుకోవడానికి ఆ వీధి అరుగు మీద జాగా ఇస్తే, నేను ఆ వీధి దీపం వెలుగులో చదువుకొని మీకు కాస్త పనిలో సహాయపడతా అమ్మా. వారంలో ఒక్కరోజు గుప్పెడు మెతుకులు పెడితే, మిగతా వారాలు వెతుక్కుంటాను .అమ్మా కాదనకు అమ్మా” అంటూ ప్రాధేయపడ్డాడు. ఆమె నిజంగా దేవతలా ఉన్నారు. లెక్చరర్ రామారావు గారి భార్య రమణమ్మ గారు. ఆవిడ రామం ని చూసి ‘అయ్యో, ఈ అబ్బాయి చదువుకుంటాను అంటున్నాడు, వీడిని కాస్త ఆదుకుంటే జీవితంలో స్థిరపడి పైకి వస్తాడు’ అని మనసులో అనుకుని, “బాబూ, బుధవారం రెండు పూటలా కడుపు నిండా పెడతాను. మా అరుగు మీద పడుకో” అంటూ ఆమె ఒప్పుకున్నారు. వెంటనే ఆమె వెనక్కు తిరిగి “బాబూ నీ పేరు, ఏ ఊరు, ఎక్కడ చదువుతావు?” అని ప్రశ్నించారు.
“అమ్మా, మాది కోటిపల్లి. పదవ తరగతికి వచ్చాను. స్కూల్ ఫైనల్ అయితే కాలేజీ చదువు చదవాలని…” అంటూ నసిగాడు.
“సరేలే, మా ఇంటి వారం నీవు నాకు ప్రొద్దుటే చెప్పాలి సుమీ, సరేనా” అంటూ వెళ్తూ ఉంటే
“అమ్మా సరేనండి, నమస్కారం” అంటూ ఒకరోజు భోజనం బస కుదుర్చుకుని గట్టిగా నిట్టూర్చాడు.
మిగతా వారాల కోసం సాయంత్రం వరకు కూడా ఇంటింటికి తిరిగి మిగతా వారాలు గుప్పెడు అన్నం మెతుకులు కుదుర్చుకొని ఆనందించాడు. మనసులోనే ఆ సరస్వతిని తలుచుకొని, ఫీజు కోసం ఆలోచించాడు. ఫీజు డబ్బు ఎలా అడుక్కోవాలా? అని ఆలోచించి ఎలాగైనా ప్రతి స్కూలుకి తిరిగి అడిగితే చందాలు వేసుకొని అయినా ఫీజుకి ఇస్తారు. మరి చదువుకోవాలి అంటే నామోషీ పడకూడదు అడగాలి, అని నిర్ణయించుకొని మరురోజు ఎక్కడెక్కడికి వెళ్లాలో ఆలోచించి ఆ రాత్రి అలసటగా కునుకు తీసి, ఉదయం లేచి స్కూల్ కి బయలుదేరుతూ ఉండగా ఇంటి యజమాని రామారావు గారు రామం చేతిలో యాభై రూపాయల నోటు పెట్టి, సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాపులో పుస్తకాలు కొనుక్కోమన్నారు. ఆయన డబ్బు చేతిలో పెడుతూ ఉంటే సిగ్గుతో రెండు చేతులతో ఆ నోటు తీసుకొని దండం పెట్టాడు. మరురోజు ఆయన ఇచ్చిన డబ్బులో కొంత ఫీజు కట్టి స్కూలులో చేరి కొద్దిపాటి పుస్తకాలు కొనుకున్నాడు. సాయంత్రం ఇంటి ముఖం పట్టాడు.
ఆ రోజు ఎవరి ఇంటికి భోజనమో చూసుకొని వారింట్లో భోజనం చేసి, రామారావు గారి ఇంటికి వెళ్లి రమణమ్మ గారి అడుగు మీద ఆమె తనకి ఆశ్రయం ఇచ్చిన దేవత, ఆవిడను అడిగి కొన్ని పాత పేపర్లు తీసుకొని పుస్తకాలకు అట్ట వేసుకున్నాడు. అట్ట వేసిన పుస్తకాలు మరోమారు తీసి చూసుకొని చదువుకొని తృప్తిపడ్డాడు.
మరు రోజు ఎవరి ఇంట్లో వారమో చూసుకొని వారి ఇంటికి భోజనం కోసం వెళ్ళాడు. ఈ అబ్బాయిని చూస్తూనే ఆ ఇంటి వాళ్ళ అమ్మాయి పెద్ద గొంతుతో అరిచి “అమ్మా, అమ్మా.. వారాల అబ్బాయి వచ్చాడు కుండలో అన్నం పెట్టు” అంటూ లోపల ఎక్కడో ఉన్న వాళ్ళ అమ్మకి వినపడేటట్టు అరిచి చెప్పింది.
ఆ కేక విని లోపల పని చేసుకుంటున్న ఆ ఇంటి ఆమె బయటకు వచ్చి చూసి “రా బాబూ, భోజనం చేద్దువుగాని” అంటూ లోపలికి పిలిచారు. తను సిగ్గుపడుతూ తనకోసం గోడ వార పెట్టిన సత్తు కంచం కడుక్కొని కంచం కింద పెట్టుకొని కూర్చుంటే, ఆమె కుండలో వేసిన తరువాణి అన్నం బెల్లం ఆవకాయ డోక్కను పెడితే తలదించుకొని తినేసి కంచెం కడిగి గోడ వార పెట్టేసి, ఆమెకి మరలా దండం పెట్టాడు. అప్పుడు ఆమె “అబ్బాయి, మళ్లీ వారం ప్రొద్దుటే నాకు గుర్తు చేయి” అన్నారు. మెల్లిగా తలదించుకొని బుర్ర ఊపాడు.
ఆ విధంగా ఆ రోజులు కష్టం అనుకోకుండా గడిపి, ఎవరి ఇంట్లో ఏది పెడితే అది మారు కూడా లేకుండా తిని, వీధి లాంతర్ వెలుగులో చదువుకొని విజయనగరంలో గడిపి మంచి మార్కులు తెచ్చుకొని డిగ్రీ పూర్తి చేశాడు. ఆ అబ్బాయి ఓర్పు, వినయం, శ్రద్ధ చూసి ఆ ఊరి ఉపాధ్యాయులు అంతా ఉచిత స్కాలర్షిప్ ఇప్పించి, ఆ ఊరి గ్రంథాలయంలో ఉచితంగా పుస్తకాలు లభించే ఏర్పాటు చేసి సివిల్ సర్వీసుకు శిక్షణ ఇప్పించి పెద్దవాడిని చేశారు. విజయనగరం ఉపాధ్యాయులని మరువలేడు. ఈ రోజు ఆ జిల్లాకే కలెక్టర్ గా చేసి రిటైర్ అయ్యి ఇంతమంది చేత గౌరవ మర్యాదలు పొందుతున్నాడు అంటే, ఆ రోజు ఆ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలే కారణం. తను ఆ కోటిపల్లి నుంచి విజయనగరం వచ్చి, మంచి శ్రద్ధ, ఓర్పుతో వారాలు చేసుకుంటూ బ్రతికి, ప్రతిదానికి సిగ్గు విడిచి ఇతరులపై ఆధారపడి నేడు మంచి ఉన్నతిలో ఉండి రిటైర్ అయ్యి తను తనలాంటి వారికి చేయూతనివ్వగలడు. ఆనాడు ‘వారాల అబ్బాయి’ అనే మాట విని సిగ్గుపడినా ‘కష్టే-ఫలి’ అంటూ మనసులో ఆ భగవంతుని తలచుకొని తన ఆలోచన తన భార్యతో చెప్పి, తనలాగా కష్టపడి చదువుకునే పిల్లలకు చేయూతనివ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇలా ఆలోచిస్తూ ఉండగా భుజం మీద రామం అంటూ చరుపుపడి చటుక్కున “హా” అంటూ తేరుకున్నాడు. “ఏమిటి రామం, పార్టీ ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మీ కోసమే మేము ఎదురు చూస్తూ ఉంటే నువ్వు పక్కన ఉన్న మమ్మల్ని కూడా మరిచి ఆలోచనలో పడ్డావు” అంటూ ఉంటే, “అయ్యో, అలాంటిది ఏమీ లేదు. ఏదో పాత జ్ఞాపకాలు” అంటూ తప్పించుకొని ఆనందంగా పార్టీలో జానకితో గడిపి ఇంటికి వచ్చారు.
రామం భార్యకు తను తనకు వచ్చిన రిటైర్మెంట్ మొత్తంలోంచి పేద పిల్లలకు నాలుగవ వంతు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పాడు. విజయనగరంలో తను చదివిన స్కూలులోనే డబ్బు జమ చేసి తెలివైన పదిమందికి స్కాలర్షిప్ ఏర్పాటు చేస్తాను అని భార్యతో చెప్పగానే, ఆమెకు వారాలబ్బాయి కష్టాలు తెలుసు కనుక “మీరు చేసిన నిర్ణయం చాలా మంచిది, మన పిల్లలు విదేశాలలో వారికి సరిపడా సంపాదించుకుంటున్నారు. కనుక వారికి మన ధనం అవసరం లేదు, మనకి చాలినంత ఉంది మిగతా మొత్తం డొనేట్ చేయండి” అంటూ రామంని ప్రోత్సాహ పరిచింది.
విజయనగరం కాలేజీ వారికి తన నిర్ణయం తెలియజేయడానికి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు ఆనాటి వారాల అబ్బాయి.

* * * * *

1 thought on “వారాల అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *