April 25, 2024

విరించినై విరచించితిని – మంజుల ఘట్టమనేని

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి

“నటించాలనే తపన చిన్నప్పటి నుండి వుంది” -‘షో’ మంజులతో ఇంటర్వూ

చెవులు హోరెత్తే సంగీతం తోటి, అర్థం చేసుకున్నా వినిపించని సాహిత్యంతో వుండే పాటలతోటి, హింసాయుతమైన ఫైటింగ్లు, వెకిలిచేష్టలు, ద్వంద్వార్థాల హాస్యం, అర్ధనగ్న దృశ్యాలు, కలిగించే ప్రేమ సన్నివేశాలు – ఇవీ ఇప్పటి సగటు సినిమా ప్రాథమిక సూత్రాలు. వెర్రితలలు వేసే ప్రేమ సినిమాలతో విసిగెత్తిన తరుణంలో పన్నీటి జల్లులా ఇంటిల్లిపాది వెళ్ళి చూసేందుకు అనువుగా, పాటలు, ఫైట్లు లేకుండా అవసరమైనంత వరకే అవసరమైనచోటే నేపథ్య సంగీతంతో సాగే ఆహ్లాదకరమైన, సినిమా ‘షో’. సినిమా ఆద్యం తెరమీద రెండే పాత్రలతో సాగుతుంది. అయినప్పటికీ, ఒక అతి ముఖ్యమైన అదృశ్యపాత్ర (సూర్య భార్య సంధ్య పాత్ర అంతా కథతోపాటు సాగుతుంది. పాత్రల చిత్రణ, డైరెక్షన్, సన్నివేశాల కనుగుణమైన సెట్టింగ్ లు చిత్రానికి ఎంతో నప్పాయి. కానీ, సంధ్య పాత్రను గయ్యాళిగా కాక ఒక మధ్యతరగతి, సాధారణ పాత్రగా చిత్రీకరించి ఆమె తీరని కోరికలు, అసహనాలను కూడా ఆమె వేపుగా ఆలోచింపజేసినట్లైతే ఇంకా బాగుండేది. ఏమయినప్పటికీ, ఈ విధమైన కథ నూత్న ప్రయోగమే! బెస్ట్ స్క్రీన్ ప్లే తో సహా జాతీయ అవార్డును గెలిచిపెట్టిన ‘షో’ సినిమా నిర్మాత మంజులను ఇంటర్వ్యూ చేయాలని పద్మాలయా స్టూడియోలో ఆమెను కలిశాము.
మేము సినిమాలో చూసిన దానికంటే కూడా మంజుల అందంగా, వయస్సు తక్కువగా కనిపించారు. కబుర్ల కలబోతలోనే ఇంటర్వ్యూ కూడా జరిగింది.

ప్ర. ఇంత మంచి థీమ్ మీకు ఎలా దొరికింది?
జ. డైరెక్టర్ ‘నీలకంఠం’గారు ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. నేనెప్పటినుంచో ఫ్యామిలీ సభ్యులందరూ కూర్చొని కలిసి చూసే వీలున్న సినిమా తీద్దామని అనుకున్నాను. పాత్ర డీసెంట్ గా వుంది. అందువల్ల ఆ పాత్ర నేనే చేద్దామని అనుకున్నాను. నాకూ నటించాలనే కోరిక తీరుతుంది అనుకున్నాను.
ప్ర. చిన్నప్పుడు సినిమాల్లో వేశారు కదా? యాక్టింగ్ చేయాలనే అభిలాష అప్పటినుండి వుండేదా?
జ. నాకు చిన్నప్పటినుండీ, సబ్కాన్షస్ లో యాక్టింగ్ చేయాలని వుండేది. మాది సంప్రదాయ కుటుంబం అవటంతో చిత్రం డైరెక్ట్ చేయాలని, చిత్రాలు నిర్మిస్తానని మాత్రమే అంటూ వుండేదాన్ని. కానీ, నా కాలేజీ చదువు అయ్యాక ధైర్యం వచ్చి నాన్నగారి దగ్గరకు వెళ్ళి యాక్ట్ చేస్తానని అడిగాను. ఆయన షాక్ అయ్యారు. ‘ఎందుకమ్మా మంజులా! మన కుటుంబాల్లో ఆడవాళ్ళు నటించరు గదా!’ హాయిగా ఇంట్లో వుండు. నీకేం తక్కువ వుంది? అని అన్నారు. అదేంటి నాన్నా! మిమ్మల్ని బుర్రిపాలెం నుంచి తాతగారు పంపించకపోతే మీరు పైకి వచ్చేవాళ్ళా? ఇన్ని లక్షలమంది అభిమానులు వుండేవాళ్ళా ఏమో నేను కూడా అంత పేరు తెచ్చుకుంటానేమో! నన్నెందుకు ఆపుతారు? అని నాన్నగార్ని కన్విన్స్ చేశాక ఆయన 100 శాతం సపోర్టు ఇచ్చారు. ఏ సహాయం కావాలన్నా చేస్తానని అన్నారు. అప్పుడే బాలకృష్ణగారితో సినిమా ఎనౌన్స్ అయ్యింది. కానీ, నాన్నగారి ఫ్యాన్స్ నుంచి ఒకటే ఫోన్ కాల్స్. నేను యాక్ట్ చేయకూడదని. ఇంట్లోవాళ్ళని ఒప్పించాను, కానీ అంతమందిని ఎలా ఒప్పించగలను? నాన్నగారు, కుటుంబ స్నేహితులు నన్ను యాక్ట్ చేయవద్దని ఒప్పించారు. కానీ నా ఆలోచన మానలేదు. రెండవసారి జగపతిబాబుగారితో నేను వద్దంటే కూడా ప్రొడ్యూసర్స్ బయటకి ఎనౌన్స్ చేశారు. అప్పుడు ఫ్యాన్స్ నుండి తీవ్రమైన అభ్యంతరం, గొడవలు. నల్లబట్టలు వేసుకొని నిరసన తెలిపారు. మళ్ళీ నాన్నగారు నేను నటించనని పేపర్లో ప్రకటన ఇచ్చిందాకా అభిమానులు ఊరుకోలేదు. నేను పూర్తిగా నిస్పృహ చెందాను. అయినా నా ఆలోచన మానలేదు. మూడురోజులు బాగా ఆలోచించాను. వాళ్ళమీద ముందు బాగా కోపం వచ్చింది. కానీ తర్వాత వాళ్ళంతా నాకోసం, నా మీద అభిమానంతో నువ్వు మా ‘కూతురి’ లాంటి దానివి ‘చెల్లి’ లాంటి దానివి నిన్ను ఎవరైనా ఏమైనా అంటే మేము భరించలేమని అన్నారు.
అందరూ ఎందుకు వద్దంటున్నారు! అందరికీ నచ్చే పాత్ర చెయ్యాలి అనుకున్నా. ఆ సమయంలోనే ఈ పాత్ర వచ్చింది. ఎవరికీ ఫస్ట్ కాపీ వచ్చేదాక, ఆఖరికి నాన్నగారికి కూడా తెలియకుండా భర్త సహకారంతో మాత్రమే నా పాకెట్ మనీతో నేను ఈ సినిమా తీశాను.
అవార్డు వచ్చాక, ఫస్ట్ కాపీ చూశాక నాన్నగారితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఎంతో మెచ్చుకున్నారు. ఆ రోజు అందరూ అభ్యంతరం పెట్టటం వల్లే నేను పట్టుదలగా ఇంత క్లీన్ గా, మంచి సినిమా తీయగలిగాను. ఆరోజు ఎవరైతే వద్దన్నారో, వాళ్ళే ఇప్పుడు బాగా మెచ్చుకుంటున్నారు. నేను వాళ్ళందరికీ ఎన్ని దణ్ణాలు పెట్టినా, ఋణపడే వుంటాను. అయినా అభిమానుల్లో ఎంత నెగిటివ్ ఫోర్స్ ఉందో అంతే పాజిటివ్ ఫోర్స్ ఉందని, మొన్న సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది. వాళ్ళ మూలంగానే నాలో పట్టుదల పెరిగి మంచి సినిమా తీయగలిగాను.
ప్ర. విజయం సాధించటంలో ప్రతి పురుషుడి వెనకా స్త్రీ ఉన్నట్లే ప్రతి స్త్రీ వెనక కూడా పురుషుడు వుంటాడని
మీరు నమ్ముతారా?
జ. (ఈ ప్రశ్నకి మంజుల ఎంతో సంతోషంగా జవాబిచ్చింది) ‘సంజయ్’ భాగస్వామిగా దొరకటం ఎన్నో జన్మల పుణ్యం. ఆయన నాకు ఒక గిఫ్ట్. నాకు ఈ పని చేసేందుకు కావాల్సిన స్వతంత్రం, ధైర్యం, ప్రేమ, నమ్మకం సంజయ్ ఇచ్చారు. ‘సరియైన భాగస్వామి’ దొరకటం ఏ స్త్రీకైనా ఎంతో అవసరం.
ప్ర. మీకు ఇంత పరిపక్వత ఎలా వచ్చింది?
జ. నా చిన్నతనం అంతా ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా ఎంతో సంతోషంగా గడిచింది. బెస్ట్
కాలేజీలు, సెలవులు వస్తే విదేశాలకు వెళ్ళటం, అంతా బాగుండేది. కానీ నాకు నటించాలనే కోరికతో కొన్ని అవరోధాల వల్ల ఎంతో అప్సెట్ అయ్యి ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు ఆ టైములో చదివాను. వాటివల్ల నాకు నేను ఎన్నో ప్రశ్నలు వేసుకునేదాన్ని. ఆ ప్రశ్నలకు సమాధానాలు నాకు పుస్తకాల రూపంలో దొరికాయి. ఆలోచన స్థాయి ఎంతో పెరిగింది. “మనం గొప్ప వాళ్ళమని మనకు మనం అనుకోగలిగితే ప్రపంచానికి కూడా మన గొప్పతనం నిరూపించుకోగలుగుతాము” అని తెలుసుకున్నాను. పరిస్థితులను నా చేతిలోకి తీసుకోగలిగాను. నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రకృతిలోని అద్భుతశక్తిని అర్థం చేసుకోగలిగాను. ఈ ‘షో’ సినిమా పని మొదలు పెట్టినప్పటి నుంచీ, అయ్యిందాకా ప్రతిదాని వెనుక ఒక అద్భుతశక్తి నడిపించింది. చిన్నచిన్న అవరోధాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, తట్టుకొనే శక్తిని ఇచ్చింది. అందుకే అప్పుడు అనిపించింది, ఈ సినిమా ఏదో ఒక సత్ఫలితాన్ని తప్పక ఇస్తుంది అని. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయ్యాను. ఒక మనిషిగా ఖ్యాతి పొందటం వల్ల ఆ కీర్తితో సంఘానికి ఎంతో మేలు చేయవచ్చు అని.
ప్ర. ఇందిరా ప్రొడక్షన్స్ అని మీ అమ్మపేరు పెట్టారు గదా?
జ. అది నా చిన్ననాటి కల. మా అమ్మకి నేను విజయం సాధించి ఇచ్చేదానికన్నా బహుమతి ఏం వుంటుంది? అమ్మకన్నా ప్రపంచంలో ఎవరు మనల్ని మంచి కోరగలరు? అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మే నన్ను రక్షిస్తుంది అనే ఉద్దేశ్యంతో ఆ పేరు పెట్టాను. మా అమ్మ చాలా సింపుల్ మనిషి. ఆమెకి కోరికలే లేవు. నా విజయం ఆమెని ఎంతో సంతోషపర్చింది. “ఎందుకమ్మా అంత శ్రమపడతావు? హాయిగా నీ భర్తను చూసుకుంటూ ఇంట్లో వుండొచ్చుగదా?” అంటారు.
ప్ర. ప్రస్తుత స్త్రీల పరిస్థితిపై మీరు ఏం ఆలోచిస్తున్నారు?
జ. ఎక్కువమంది ఆడవాళ్ళ ఎవరిమీదో ఒకరిమీద ఆధారపడుతున్నారు. అలా కాకుండా స్వతంత్రంగా ఆలోచించగలిగితే ఆడవారిలో చాలా నిబిడీకృతమై వున్నాయి. వారు తమలో శక్తిని తెలుసుకొని బయటకు తీసి వుపయోగించుకోగలిగినప్పుడే అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు స్త్రీలపై జరిగే హత్యలు, అత్యాచారాలు చాలా బాధాకరమైనవి. కానీ, ఆడపిల్లలకు, మగపిల్లలకు స్వతఃసిద్ధంగా ప్రకృతిపరంగానే కాక అలవాట్లు, మొదలైన వాటిలో తేడాలున్నాయి. కొంత సంప్రదాయతను పాటిస్తూ స్వతంత్రాన్ని ఇస్తూ ఆడపిల్లలను పెంచాలి. నేను ఆడవారికోసం తప్పక కొన్ని సినిమాలు తీయాలని అనుకుంటున్నాను.
ప్ర. సినిమాలో ‘సూర్య’ బాగా నటించారు గదా? ఆయన్నే తీసుకోవాలని మీరు ఎందుకనుకున్నారు?
జ. అసలు నేను ప్రకాశజ్ను తీసుకోవాలని మా డైరెక్టర్తో అన్నాను. ఆ కథ చదివాక ఆ పాత్రకి ఒక ఇమేజ్వున్న నటుడు వుండకూడదు. ఏ ప్రత్యేక ఇమేజ్ లేని నటుడు అయితేనే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని డైరెక్టర్ గారు నన్ను ఒప్పించారు. తర్వాత డైరెక్టరుగారే కరెక్టు అనిపించింది. ఆ పాత్రకి సూర్య బాగా సరిపోయారు.
ప్ర. నేపథ్య సంగీతం చాలా బాగుంది. అందులో మీ ప్రమేయం ఎంతవరకు ఉంది?
జ. ఆ క్రెడిట్ అంతా ఆ, ఆ డైరెక్టర్స్ కే వెళుతుంది. నేను ఎవ్వరిపనిలోను తలదూర్చను. ఎవరిపనిలో వారికి స్వతంత్రం వుండాలి. అప్పుడే బాగా పని చేయగల్గుతారని నేను నమ్ముతాను.
ప్ర. షూటింగ్ జరిగిన ప్రాంతాలు చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడ చేశారు?
జ. అందులో కూడా నేను అదృష్టవంతురాలినే! ఎవరో అమర్చినట్టు నాకు కథలో కావాల్సిన విధంగా అన్నీ దొరికాయి. నా ఉద్దేశ్యంలో అది ఒక అద్భుత స్టూడియో. ఇ మదనపల్లి ప్రాంతంలో, కొలను అంతా ‘డ’ ప్రాంతంలో దొరికాయి. ఇవన్నీ ఇప్పుడు తల్చుకుంటే సంతోషంతో జుట్టు పైకి లేస్తుంది. ఇంట్లో లోపలగా వుంటే బాగుంటుంది అనుకున్నాను. మేము షూటింగ్ చేయాల్సిన ఇంటికి వెళ్ళి చూశాక ఆశ్చర్యపోయాను. మాకోసమే అమర్చినట్లుగా ఆ ఇల్లు వుంది.
ప్ర. మీ మ్యారేజ్ గురించి ఏమన్నా చెపుతారా?
జ. మాది ప్రేమ వివాహం. కులాంతర వివాహం. ముందు మా వాళ్ళు ఒప్పుకోలేదు. 7 సంవత్సరాలు వేచి వుండి అందరినీ ఒప్పించాము. మా తల్లిదండ్రుల అనుమతితో నా వివాహం తిరుపతిలో చాలా సింపుల్గా జరిగింది. ఇప్పుడు సంజయ్ తన ఉద్యోగం వదిలి నా ప్రొడక్షన్ ఆఫీసుకు వచ్చి చేరారు. ఇద్దరం కలిసి పనిచేస్తున్నాము. మార్కెటింగ్, పబ్లిసిటీ, ఫైనాన్స్ సంజయ్ చూస్తారు. క్రియేటివ్ పార్ట్ నేను చూస్తాను.
ప్ర. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు ఇంకా మీ దగ్గరి నుంచి ఆశించవచ్చా?
జ. తప్పకుండా. ఇంకా మంచి సినిమాలు తీయాలని వుంది. ప్రస్తుతం ఒక కమర్షియల్ సినిమా తీస్తున్నా. అందులో హీరో మహేష్ బాబు. డైరెక్టర్ ఎస్. జె. సూర్య, నేను నిర్మాత మరియు అసిస్టెంట్ డైరెక్టర్ని. ఎ. ఆర్. రెహమాన్ సంగీత నిర్దేశకులు. నవంబరులో మొదలయ్యింది.
ప్ర. చివరగా ఏమన్నా మెసేజ్?
జ. నవ్వుతూ. . . నాకు మెసేజిలు ఇవ్వటంపై నమ్మకం లేదు. కానీ నాకు వచ్చిన పేరుతో సంఘానికి ఏదో ఒక మేలు చేయాలని వుంది.
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *