March 19, 2024

అతులిత బలధామం

రచన: పద్మజ ముడుంబై

ఆరేళ్ళ అతులిత్ కొచ్చిన్ లో సముద్రం దగ్గర గల చక్కటి కుటీరం లాంటి క్వార్టర్స్ లో తన తండ్రి బలరాం, తల్లి మానసలతో కలిసి ఉంటున్నాడు. బలరాం ఇండియన్ నేవీలో ఆఫీసర్. మానస పెద్ద కార్పోరేట్ కంపెనీలో మేనేజర్. బలరాం తండ్రి పరంధామం, తల్లి అరుందతి. హైదరాబాద్లో వారికి సొంతిల్లు ఉంది.
తల్లిదండ్రులు లేని తన క్లాస్మేట్ మానసను ప్రేమించానని చెప్పగానే కొడుకు ఇష్టాన్ని కాదనలేక మానసతో పెళ్లి జరిపించారు. ఎవ్వరూ లేని మానసకు పురుడు పోసింది, చిన్నారి అతులిత్ ను పెంచి పెద్దచేసింది పరంధామం, అరుంధతులే. అందుకనే అతులిత్ కు నానమ్మ తాతయ్యలతో అనుబంధం ఎక్కువ. అతులిత్ కు ‘అతులిత బలధామం’ అనే హనుమాన్ స్తోత్రం అంటే చాలా ఇష్టం. అస్తమానూ ఆ శ్లోకాన్ని చదవమని తాతయ్యని, తండ్రిని అడుగుతూ ఉంటాడు. కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్ళిపోతే మనవడు ఒక్కడే ఉంటాడని పెద్దవాళ్ళు ఇద్దరూ కొచ్చిన్ లోనే ఉంటున్నారు. పైగా మానస రెండో సారి తల్లి కాబోతోంది కూడా….
మానస తన అత్తామామలతో చాలా ప్రేమగానే ఉండేది కానీ రానురానూ తన ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. బహుశా ఇంట్లో తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఉన్న పనిమనిషి, బయట పనులన్నీ పూర్తిగా చూసుకునే బలరాం కార్ డ్రైవర్ ఇద్దరూ ఒకేసారి పని మానేసి వెళ్ళిపోవడం వెనుక తన అత్తామామల హస్తం ఉందని భావించింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అంటే వీళ్ళిద్దరికీ పడదు. అందుకే వీళ్ళు రాగానే వాళ్ళను పంపించేసారేమోనని అనుమానం. అదే మాటను బలరాం చెవిన వేసి తన మనసులో కూడా అనుమానాన్ని రేకెత్తించింది. అసలే చిన్నప్పటి నుంచి తండ్రి క్రమశిక్షణను చాదస్తంగా భావించే బలరాం నిజమేనేమో అనుకున్నాడు. కానీ ఆ క్రమశిక్షణ వల్లనే తాను ఇంతమంచి హోదాలో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయాడు. తన తండ్రి డిసిప్లిన్ వలనే చక్కగా పనిచేసే పనివారు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారే అని అసహనం వ్యక్తం చేసాడు. ఈ విషయంలో బలరాం మానసలు ఏమీ అనకపోయినా, మాట్లాడకపోయినా, తమ మధ్య దూరం పెరుగుతోందని గ్రహించారు పరంధామం, అరుంధతులు.
హైదరాబాద్ లో తమ ఇంట్లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉండగా చిన్నారి అతులిత్ యథాలాపంగా విన్నాడు. తమ బాల్కనీలో పక్షులు వచ్చెస్తున్నాయని బాల్కనీకి నెట్ పెట్టించాడు పరంధామం. కానీ అప్పటికే ఆ పక్షి అక్కడ గూడు పెట్టేసిన విషయం ఆయనకు తెలియదు. రోజూ ఆ నెట్ దగ్గరే ఆ పక్షి తిరుగుతూ ఉండడంతో అనుమానం వచ్చిన పరంధామం బాల్కనీ అంతా చూడగా పక్షి గూడు, అందులో చిన్న చిన్న పిల్లలు కనపడ్డాయి. తన వల్ల ఒక పక్షి తన పిల్లలకు దూరమైందని, అందువల్లనే తన కొడుకు కూడా తనకు దూరం అవుతున్నాడని భావించాడు.
ఒకరోజు మానస బలరాం కు ఫోన్ చేసి అత్తామామలు గుడికి వెళ్ళారని, అతులిత్ చాలా సేపటి నుండి కనపడడం లేదని చెప్పింది. దాంతో కంగారు పడిన బలరాం వెంటనే ఇంటికి వచ్చాడు. చిన్నవాడి కోసం వారిద్దరూ వెతకడం మొదలుపెట్టారు. ఇల్లు, తోట, ఇంకా చుట్టుపక్కల మొత్తం వెతికారు. కానీ ఎక్కడా అతులిత్ కనపడకపోయేసరికి చాలా ఆందోళన పడ్డారు. మానసైతే ఏడుస్తూ కూర్చుంది. అంతలో మేడ మీద అలికిడి వినిపించింది. వెంటనే పరుగుపరుగున పైకి వెళ్ళి చూడగా అక్కడ బాల్కనీలో తన స్పోర్ట్స్ స్కూటీని సపోర్ట్ గా పెట్టి, గొడుగు వేసుకుని, పాత ఖాళీ అట్టపెట్టెల మీద అతులిత్ కూర్చుని ఉండడం చూసి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని, వాడిని గట్టిగా పట్టేసుకుని ఎందుకు ఇక్కడ ఉన్నావని అడిగారు. పక్షుల కోసం ఎదురుచూస్తున్నానని, తాతయ్య పొరబాటున ఒక పక్షిని, తన పిల్లల నుండి విడదీసారని, అందుకనే మీకు తాతగారికి మధ్యలో గ్యాప్ వచ్చిందని, నేను ఇక్కడ ఒక గూడు కట్టి ఆ పక్షిని తన పిల్లల్ని కలుపుదామని అనుకుంటున్నానని, అప్పుడు మీరు, తాతయ్య కలిసిపోతారు కదా అని అన్నాడు. ఒక్క క్షణం ఇద్దరూ నివ్వెరపోయారు. అంతేకాకుండా మన పనిమనిషి అమ్మ గోల్డ్ఉంగరం తీసెస్తుండగా నానమ్మ చూసిందని, మన కార్ డ్రైవర్ నాన్న వాలెట్ లోంచి డబ్బులు తీస్తుండగా తాతయ్య చూసారని, వాళ్ళ గురించి మీకు చెప్తారేమోనని వాళ్ళిద్దరూ పనిమానేసారని తాతయ్య నానమ్మ మాట్లాడుకుంటోంటే విన్నానన్నాడు. పాపం వాళ్ళు హైదరాబాద్ కు వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే నాతో ఎవరు ఆడతారు, నాకు మంచి మంచి కథలు ఎవరు చెప్తారు, మీ ఇద్దరూ మీమీ ఆఫీసు పనుల్లో ఉంటే నన్నెవరు చూస్తారు. రేపు చిన్నబేబీ కూడా వచ్చెస్తుందిగా మరి తననెవరు చూస్తారు అని అమాయకంగా అడుగుతోంటే సమాధానం చెప్పలేకపోయారు. ‘మీకు నేనంటే ఎంత ఇష్టమో, తాతయ్య నానమ్మలకు మీరంటే అంతే ఇష్టం కదా నాన్నా’ అన్నాడు. ‘అతులిత బల ధామం అనే శ్లోకం అంటే నాకు చాలా ఇష్టం కదా.. ఎందుకో తెలుసా నాన్నా… అందులో నా పేరు, మీ పేరులో బల, తాతయ్య పేరైన పరంధామంలో ధామం ఉండడంవల్లనే’ అని చెప్పాడు. ఒకవేళ వాళ్ళు హైదరాబాద్ కు వెళ్ళిపోతే తాను కూడా వాళ్ళతోనే వెళ్ళిపోతానని, వాళ్ళతోనే ఉంటానని అన్నాడు.
వాడి మాటలకు ఇద్దరూ శిలల్లా నిల్చుండిపోయారు… ఇంత పసి మనసులో అంత పెద్ద ఆలోచనలు ఉండడం చూసి ఏమని మాట్లాడాలో తెలియక తమ తప్పులను తెలుసుకుని మౌనంగా ఉండిపోయారు.
ఇంతలో తల్లిదండ్రులు గుడి నుండి రాగానే బలరాం ఎదురెళ్లి వారిద్దరినీ మనస్పూర్తిగా హత్తుకుని క్షమించమని మనసులో కోరుకున్నాడు. ఈ వారంలో తమ ఊరు వెళ్ళిపోతామన్న అత్తామామలతో ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు. ఇకనుంచి అందరమూ కలిసి ఒకేచోట ఉందామని మానస ప్రాధేయపడింది. అసలు విషయం తెలియని పరంధామం అరుంధతులు కొడుకు, కోడలు పూర్వంలా మాట్లాడేసరికి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైయ్యారు.
పరిణితి లేని పెద్దరికం కంటే కల్మషం లేని పసిపిల్లల మనసు వేయిరెట్లు గొప్పది. బలరాం మానసలలో మార్పు వచ్చిందంటే నిజంగా ఆ ఘనత చిన్నారి అతులిత్ కే దక్కుతుంది. ఇప్పుడు అతులిత్ తన తల్లిదండ్రులతో, చెల్లెలితో, నానమ్మా తాతయ్యలతో హాయిగా కలిసి ఉంటున్నాడు. ఇప్పుడే కాదు ఎప్పటికీ కలిసే ఉంటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *