March 19, 2024

ఆత్మీయత

రచన: రాజ్యలక్ష్మి బి

కూలీనాలీ చేసుకునేవారి రోజువారీ పనులకు అడ్డుగా వారం రోజులనించి కుంభవృష్టి. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకుల్లో ఆకలి బాధ వర్ణనాతీతం. ఆకలితో అలమటిస్తూ కుక్కిమంచం మీద రొచ్చుకంపులో సగం చిరిగిన గోనెసంచిలో కాళ్లు ముడుచుకుని పడుకున్న రంగమ్మ కుంభవృష్టిని చూస్తూ తమ చితికిన బ్రతుకులను తల్చుకుని కుమిలిపోతున్నది. బయట వర్షం, గుడిసెలోపల చిమ్మచీకటి, వూరిబయట వాడలోని గుడిసెలు. ఆ మట్టినేలంతా తడిసిముద్దయింది. కోడలు నీలమ్మ ఆ తడినేలలోనే ఒదిగిఒదిగి ముడుచుకుని చెక్కపీట మీద కూర్చుని మట్టినేల మీద పడుతున్న వాన చుక్కల్ని చూస్తున్నది. చీకటి పడిపోయింది. దూరంగా పిడుగు పడ్డట్టు పెద్ద శబ్దం. మెరుపులు గుడిసెలోకి తొంగిచూసి మాయం అయ్యాయి. వాననీళ్లు బాగా కారుతున్న స్థలాల్లో, సత్తుగెన్నెలు, చిన్న బకెట్లు పెట్టింది నీలమ్మ. గుడిసె మునిగి పోతుందేమో అన్నంత భయంకరంగా వర్షం కురుస్తున్నది. ఈదురుగాలికి సగం చెక్కవిరిగిన గుడిసె తలుపు రెక్క అటూయిటూ కొట్టుకుంటూ యింకాస్త వానజల్లు ముఖాలకు మంచులాగా కొడ్తున్నది. అవి నీలమ్మకు గతం. చెంప దెబ్బల్లాగా అనిపిస్తున్నాయి.
నీలమ్మ పెళ్లి మేనరికం బావ చిన్నయ్యతో జరిగింది. మేనత్త రంగమ్మకు ఒక్కడే కొడుకు. అన్నకు కూడా నీలమ్మ ఒక్కతే ఆడపిల్ల. చిన్నయ్యకు పదేళ్ల వయసులో తండ్రి పోయాడు. అప్పటినించి రంగమ్మ అన్న ప్రక్కనే చిన్న గుడిసెవేసుకుని చిన్నయ్యను పెంచుకుంది. రెండు కుటుంబాలూ రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులే. చిన్నయ్య కూడా కూలీనాలీ పనులు చేసుకుంటూ. అప్పుడప్పుడు రిక్షా తోలుతూ. అమ్మకు అండగా వుండేవాడు. నీలమ్మ పన్నెండేళ్లు వున్నప్పుడు పదిహేడేళ్ల చిన్నయ్యతో పెళ్లయ్యింది. మేనత్త అంటే మహాయిష్టం. అలాగే రంగమ్మ కూడా కూతురిలాగా చూసుకునేది. నాలుగేళ్ల కాపురం హాయిగా వున్నంతలో సుఖంగా సాగింది. ఒక వర్షాకాలంలో భీకర తుఫానులో పొలం పనులనించి వస్తున్న చిన్నయ్య చెట్టుకూలి అక్కడికక్కడే చనిపోయాడు. నీలమ్మ తల్లితండ్రులు ఆ తుఫానులోనే విపరీత జ్వరంతో చనిపోయారు. ఇప్పుడు ఆ అత్తాకోడళ్ళే ఒకరికొకరు. నీలమ్మ కూలిపనులు చేసుకుంటూ అప్పుడప్పుడు రిక్షా లాగుతూ గడుపుతున్నది. రంగమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. నీలమ్మే అన్నింటికీ ఆధారం.
“నీలి, గుడిసె మునిగిపోతే యెట్టాగే “అంటూ భయం భయంగా చూరు చూస్తున్నది రంగమ్మ.
“అత్తా వాన తగ్గుమొగం పడ్తుందిలే, ఏం బయపడకు, కూచో గంజి కాస్తాను” అంటూ. అత్తకు. ధైర్యం చెప్పింది నీలమ్మ
“నీలమ్మా ఆకలవుతోందే, యీ పూట తినడానికేముందే “అంటూ ఆకలి కళ్లతో కోడల్ని చూసింది రంగమ్మ. ఆ చూపులకు నీలమ్మ గుండె కరిగింది. తనను ప్రేమగా చూసుకుని గోరుముద్దలు పెట్టిన అత్త, యిప్పుడు గుంటలు పడ్డ కళ్లు, యెండి పోయిన చెంపలు. ముడుచుకుపోయిన పొట్ట,, చిరిగిన చీర !! అత్తను చూస్తుంటే కన్నీళ్లాగలేదు నీలమ్మకు..
“అత్తా యీ పూటకు నూకలఙావుంది వుల్లికారం వుంది, రేపటికి వాన తగ్గుతుంది. రిక్షా లాగితే నాలుగు డబ్బులొత్తయిలే “అంటూ అత్తను చూసింది నీలమ్మ.
“అంతా ఆ దేవుని మాయ, మనం చూస్తా వుండాలి “అన్నది రంగమ్మ.
నీలమ్మ కిరసనాయిలు బుడ్డి తీసి వొత్తి పైకి లాగింది. బుడ్డి. అటూయిటూ వూపింది. బుడ్డిలో కిరసనాయిలు లేదు. మూలున్న సీసా తీసి అడుగున వున్న కాస్త కిరసనాయిలు బుడ్డిలో పోసి రెండే రెండు అగ్గిపుల్లలున్న అగ్గిపెట్టెతో జాగ్రత్తగా దీపం వెలిగించి చురుకు వేళ్లాడేసింది. ఆ గుడ్డి వెలుతురే గుడిసెంతా పరుచుకుంది. నీలమ్మ చేతులు కడుక్కుని ఆ గుడ్డి వెలుగులో వుట్టి మీది జావ గిన్నె క్రిందికి దించింది. రెండు డొక్కు సత్తుగిన్నెల్లో పోసింది. ఉల్లికారం రెండు గిన్నెల్లో కాస్త కాస్త వేసింది. అత్త చేతికి ఒక గిన్నె యిచ్చి, తను ఒక గిన్నె పట్టుకుని అత్త మంచం మీద మూలగా సర్దుకు కూర్చుంది. ఉట్టిమీద వున్న కుండ దించి రెండు ప్లాస్టిక్ గ్లాసుల్లో నీళ్లునింపి మంచం ప్రక్కన పెట్టింది. రంగమ్మ ఆవురావురుమంటూ తినడం చూసి బాధపడింది నీలమ్మ.
“అత్తా యింకొంచెం జావ పొయ్యనా “అడిగింది నీలమ్మ.
రంగమ్మ కోడలి సత్తుబొచ్చెలోకి తొంగిచూసి “నాకు చాలు నువ్వేసుకో “అంది రంగమ్మ గిన్నెలో చెయ్యి కడుక్కుని చిరిగిన కొంగుతో మూతి తుడుచుకుని గోనెసంచి కప్పుకుని పడుకుంది. నీలమ్మ తింటూ తింటూ యేదో గుర్తుకొచ్చినట్టయ్యి లేచి గుడిసె రెక్క దగ్గరకొచ్చి బయటకు తొంగి చూస్తూ “రావుడూ”అని పిలిచింది. తోకాడించుకుంటూ మూలెక్కడో పడుకున్న రావుడు వచ్చింది. మిగిలిన కాస్త జావ బండరాయి మీద పోసింది. తినడం అయ్యాక నీలమ్మ ప్రేమగా దాన్ని నిమిరింది. అది తోకాడించుకుంటూ వెళ్లింది. నీలమ్మ యింకో కుక్కిమంచం నడుం వాల్చింది కానీ నిద్రపట్టలేదు. తెల్లారితే తిండిగింజ లెట్టా ఆలోచిస్తూ పడుకుంది.
తెల్లారింది వాన తగ్గుమొగం పట్టింది. కానీ చేలల్లో పనుండదు. నీలమ్మ నిద్రలేచి ముఖం కడుక్కుని మిగిలిన కాసిని నూకలు వుడికించి జావ కాచింది. అత్తకు చెప్పింది. వున్నంతలో మంచి చీరె కట్టుకుని గుడిసె రెక్కలు దగ్గరగా వేసి బయటకొచ్చిది. వాన తగ్గింది కానీ నేలంతా చితచితగా వుంది. జనం సందడి లేదు. రిక్షా సోమయ్య దగ్గర రిక్షా అద్దెకు తీసుకుని అంగడివీధిలోకి వెళ్లింది. అదృష్టం బాగుండి మధ్యాహ్నం దాకా బాగానే గిట్టుబాటయ్యింది. యాభయి రూపాయలు వచ్చాయి. నీలమ్మ కళ్లల్లో ఆనందం. అత్తకు మంచి చీరె కొనాలి, అరటిపళ్లు కొనాలి, యెన్నో యెన్నో ఆలోచనలు. నీలమ్మ దోవలో నూకలు, అరటిపళ్ళు, రెండు కూరలు, నూనె కొనుక్కుని రిక్షా బాడుగ యిచ్చేసి గుడిసెకు వచ్చింది. రంగమ్మ జావ అందుకోబోతు అంతా ఒలకబోసుకున్నట్టుంది పైగా మంచం మీదినించి క్రిందపడి మూలుగు తున్నది. నీలమ్మ గుండె గుభేలుమంది. ”అత్తా అత్తా” అంటూ తన కొంగుతో మొహం తుడిచి గబా గబా కాసిని నీళ్లు పట్టింది. రంగమ్మ కళ్లు తెరిచి నేలమీద పడ్డ జావ చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది పైగా నీలమ్మకు దణ్డం పెట్టింది. నీలమ్మ అత్తను అక్కున చేర్చుకుని “అత్తా నీకేం భయం లేదు. ఐదు నిమిషాల్లో నీకు వేడి వేడి బువ్వపెడతాను ముందు అరటి పండు తిను” అంటూ నీలమ్మ అత్త ముఖం తుడిచి చీరె మార్చి మంచం మీద కుర్చోపెట్టింది.
“నీలమ్మా నా బిడ్డవేనే నువ్వు “అంటూ నీలమ్మను దగ్గరగా తీసుకుంది.
సిరిసంపదలెన్నున్నా ఆప్యాయత ప్రేమ లేనినాడు బంధాలకు విలువే లేదు. అనుబంధం ఆత్మీయత వున్న చోట భగవంతుడే దోవ చూపిస్తాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *