March 19, 2024

ఉనికి

రచన: మంథా భానుమతి

సావిత్రికి ఎక్కడ చూసినా అందాలే కనిపిస్తున్నాయి. ఎప్పుడూ తనని విసిగించే ఎదురింటి బుల్లబ్బాయిగారి మనవడి అల్లరి ఆహ్లాదంగా. ఇంటి ముందున్న కాలువలో స్నానం చేసే పంది వరహావతారంలా.. ఆ రోజేం చేసిందో, ఎవరెవరితో తిరిగిందో ఆరా తీసే పక్కింటి అమ్మమ్మగారి ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ కి ఉపయోగపడేలా అనిపించాయి.
ఆనందోత్సాహాలతో గాల్లో తేలిపోతున్నట్లు నడుస్తూ ఇంట్లో అడుగు పెట్టింది. ఎవరి పనులలో వాళ్లున్నారు. అయినా ఫరవాలేదు.. అలవాటే తనకి.
సావిత్రి అక్క, సీత బీరకాయలు సన్నగా తొక్కు తీసి, ముక్కలు చేస్తోంది. తీసిన పొట్టు వేరే గిన్నెలో సర్దుతోంది.
సీత సాయం చెయ్యటం వల్లే అమ్మ అంత పని చేసుకోగలుగుతోందని అనుకుంది సావిత్రి.
ఇంట్లో వాళ్లు ఇద్దరూ, అమ్మ, నాన్న, తాతగారు ఉంటారు.
సీతని యస్సెల్సీ అయాక చదువు మానిపించేశారు, పెళ్లి చేద్దామని. ఎక్కువ చదువుతే ఇంకా ఎక్కు చదివిన మొగుణ్ణి తేవాలి.. కట్నం భారీగా కావాలి. అయినా.. నాలుగేళ్లనుంచీ చూస్తున్నా కుదరటం లేదు. పంతొమ్మిదేళ్లు నిండిపోయాయి.
“సావిత్రీ! ఇంత సేపు ఎక్కడ వేళ్లాడుతున్నావు? కాస్త ఇల్లు పట్టించుకోవడం ఉందా?” అమ్మ కోపంగా అడిగింది.
“ఇవేళ మా రిజల్ట్స్ వచ్చాయమ్మా! నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. అంతే కాదు” వెలిగిపోతున్న మొహంతో ఇంకా చెప్పబోతున్న సావిత్రి, తీక్షణంగా చూస్తున్న అమ్మని చూసి ఆపేసింది.
“అక్క చూడు. నాకు ఎంత సాయం చేస్తుందో..” ఇంకా ఏదో అనబోతున్న అమ్మ మాట వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది సావిత్రి.
“ఎంత పొగరో. మాట వినిపించుకోదు.” అమ్మ పళ్లు నూరటం వినిపిస్తూనే ఉంది సావిత్రికి. ఇటువంటివన్నీ లెక్కపెడ్తూ కూర్చుంటే అనుకున్నది సాధించలేదు.
సావిత్రి ఏదైనా పని అందుకోబోతే వారించి తనే చేస్తుంది సీత. ముఖ్యంగా అమ్మ ఆ చుట్టుపక్కల ఉన్నప్పుడు, ఇంట్లోనే ఉంటుంది కదా అని ఊరుకుంటుంది సావిత్రి. పైగా తనకి చదువుకోవలసినది చాలా ఉంటుంది. బి.కామ్ చదువుతున్న సావిత్రికి ఎలాగైనా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలని పట్టుదల. ఆ పాఠ్యాంశాలలో అంత సులభం కాదు మార్కులు తెచ్చుకోవటం. అకౌంటెన్సీలో తప్ప. పైగా సీతకున్న లౌక్యం సావిత్రికి లేదు. అమ్మానాన్నలకి అనుకూలంగా ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో, ఏ విధంగా మాట్లాడితే వాళ్లకి నచ్చుతుందో బాగా తెలుసు. సావిత్రి అనవసరంగా రెండో మాట మాట్లాడదు. ఏ పనైనా త్వరగా చేసేసి తన పుస్తకాలు తీస్తుంది.
సావిత్రీ వాళ్ల నాన్న ఏదో ప్రైవేట్ కంపనీలో చిన్న ఉద్యోగం చేస్తాడు. పిత్రార్జితంగా చిన్న పెంకుటిల్లు ఉంది. దాంతో కాస్త వెసులు బాటయింది. ఇంక ఇంటి ఖర్చంతా అమ్మే చూసుకుంటుంది. పండగలకీ బట్టలు కొనేప్పుడు సీత కాస్త మెరుగైన బట్టలే తీసుకుంటుంది. అమ్మ ఏమనదు.. పెళ్లి కావలసిన పిల్ల, ఆ మాత్రం ఉండాలంటుంది. సావిత్రికి అదేం పట్టదు.. అక్క వాడిన బట్టలేసుకోమన్నా ఏమనుకోదు.
సావిత్రి ధ్యేయం ఒక్కటే. ఫస్ట్ క్లాస్, మంచి ఉద్యోగం. తన ఆనందానికి అదే కారణం.. బి.కామ్ లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. అప్పుడెప్పుడో రాసిన బాంక్ పరీక్షలో పాసయి, ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వచ్చింది. ఉద్యోగం వచ్చేసినట్లే. తన సంబరాన్ని పంచుకునే వాళ్లే కనిపించలేదు. తండ్రి రాకకు ఎదురు చూడ సాగింది.
సావిత్రి ఇద్దరిలోనూ చక్కనిది. పచ్చని పసిమిరంగు, తీర్చి దిద్దినట్లున్న కనుముక్కు తీరు. తెలివంతా కళ్లలో కనిపిస్తూ, తళతళ లాడుతుంటాయి. చూడగానే ఆకర్షణీయంగా ఉంటుంది. రెండు సంబంధాల వాళ్లు సావిత్రినిస్తే కట్నం లేకుండా చేసుకుంటామన్నారు. సీతకి ఆత్మన్యూనత పెరిగి అమ్మ చేత చీవాట్లు పెట్టించటం ఎక్కువయింది. తన ధ్యేయం ముందు అవేం కనిపించలేదు సావిత్రికి.
దూరం నుంచే నాన్నని చూసి, రోడ్డు మీదికి పరిగెత్తి, తన రిజల్ట్ గురించి, ఉద్యోగం సంగతీ చెప్పింది.

…………………

కాష్ కౌంటర్లో ఊపిరి సలపనంత పనిలో ఉంది సావిత్రి. ఆంధ్రాబాంక్ లో చేరి రెండు సంవత్సరాలు అవుతోంది. సావిత్రి తండ్రి, యూనివర్సిటీ ఫస్ట్ వార్త కంటే ఉద్యోగం వచ్చినందుకు ఎక్కువ సంతోషించాడు.
సీతకి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి కాలేజ్ లెక్చరర్. సావిత్రితో పోల్చకుండా ఉంటే సీత బాగానే ఉంటుంది. బాంక్ లోన్ తీసుకుని అక్క పెళ్లి చేసింది సావిత్రి. తండ్రి మీద భారం పడకుండా. అమ్మకూడా ఆనందించింది.. ఈ మధ్యని సావిత్రి మీద విరుచుకు పడటం లేదు. తాత పోయారు. ఆర్ధిక ఇబ్బందులు లేవు. అంతా సాఫీగా నడిచిపోతోంది..
కానీ, ఏదో అనుకోని సంఘటన జరగకపోతే అది జీవితం ఎందుకవుతుంది?
“హలో. మేడమ్! కొంచెం నా సంగతి చూస్తారా? తొందరగా వెళ్లాలి..” కాస్త రష్ తగ్గిందని కాష్ సర్దుకుంటుంటే వినిపించిందొక గంభీరమైన గొంతు. కళ్లెత్తి చూసి, అతని చెక్ అందుకుని చూసి డబ్బు ఇచ్చింది.
“నా పేరు ఆనంద్. పక్కనే ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీలో మానేజర్ గా ఉంన్నాను.” పరిచయం చేసుకున్నాడు. సావిత్రి మొహమాటంగా నవ్వి తరువాతి కస్టమర్ ని పిలిచింది. ఆనంద్, పేరు, మనిషి కూడా బాగున్నారు.. ఒక్క క్షణం మనసులో అనుకుంది.
అప్పటి నుంచీ, వారానికి రెండుసార్లు రావటం మొదలెట్టాడు ఆనంద్. ఇదివరకు ఎప్పుడూ చూడలేదనుకుంది సావిత్రి. అసిస్టెంట్ ని పంపేవాడేమో!
అవసరం ఉన్నా లేక పోయినా ఏవో ప్రశ్నలడిగేవాడు. రెండునెలలయేసరికి, లంచ్ సమయానికి కొద్దిగా ముందు వచ్చి పక్కనే ఉన్న హోటల్ లో లంచ్ కి పిలిచాడు. సావిత్రికి కూడా కుతూహలంగానే ఉంది.. ఈ పరిచయం ఎంతవరకూ వెళ్తుందో అని. మానేజర్ పర్మిషన్ తీసుకుని వెళ్లింది.. ఒక అరగంటం లేట్ గా రావటానికి.
ఏ ఉపోద్ఘాతమూ లేకుండా.. సూప్ తాగుతుండగానే అడిగేశాడు ఆనంద్. ఊహించిందే అయినా, ఇంత త్వరగా అనుకోలేదు సావిత్రి. తన కుటుంబం గురించి చెప్పింది. అమ్మా, నాన్నలని చూసుకోవలసిన బాధ్యత చెప్పింది.
“అవన్నీ చిన్న విషయాలు. మనకి డబ్బు సమస్యలేం లేవు. నీ ఇష్టం.” ఎంతో సౌమ్యంగా మాట ఇచ్చేశాడు ఆనంద్.
ప్రపంచం ఇంద్ర ధనుస్సులా కనిపించింది సావిత్రికి.
ఇంద్ర ధనుస్సు కనిపించేది తాత్కాలికంగానే అని మర్చిపోయింది.

………………..

కొత్త జీవితం పాతబడి పోవటానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఉన్నంతలో బాగానే చేశారు సావిత్రి పెళ్లి.
తృప్తిగా ‘తన’ ఇల్లు చూసుకుంది సావిత్రి, కుడికాలు ముందుగా పెడుతూ. చిన్నదే.. రెండు పడక గదులు, ముందు వెనుక కాస్త పెద్ద వరండాలు, సదుపాయంగా ఉన్న వంటిల్లు. తామిద్దరూ కాక, అత్త, మామ, ఒక ఆడపడుచు ఆ ఇంటి సభ్యులు.
పెళ్లికని పెట్టిన సెలవు అయాక, బాంక్ కి వెళ్లటం మొదలుపెట్టిన రెండు మూడు నెలలకి సావిత్రికి అందరి నిజరూపాలు కనిపించ సాగాయి.
అతని సౌమ్య ప్రవర్తనకి మాటలకి పడిపోయిన సావిత్రికి, ఆనంద్ ముక్కోపి తత్వం అర్ధంకావటానికి ఎన్నో రోజులు పట్టలేదు. చిన్న చిన్న విషయాలకే మొహం ఎర్రగా చేసుకుని అరుస్తుంటాడు.. అది అమ్మయినా, చెల్లెలయినా భార్యైనా ఒకటే. భోజనాల దగ్గర, పదార్ధాలు వేడి తక్కువైనా, నెయ్యి కరిగించి లేకపోయినా. గిన్నెలు ఎత్తేసి. దగ్గరగా ఉన్న సావిత్రి మీద చెయ్యెత్తాడొకసారి. ఆ తరువాత చెయ్యెత్తడం సర్వ సాధారణమైపోయింది.
బాంక్ లో చేరాక, జీతం అందుకున్నాక ఇంకా ఇబ్బందైపోయింది. ఆనంద్ చెల్లెలికి తప్ప అందరికీ సావిత్రి అంటే తేలిక భావం, చులకనే.. అమ్మ దగ్గరున్నప్పుడు, ఎప్పుడూ ఇంటి పనుల గురించి పట్టించుకోని సావిత్రి, ఎప్పటికీ తరగని అత్తింటి పనులతో అలసి పోతోంది. ఏం చేసినా, చెయ్యకపోయినా అత్తగారు సాధించక మానదు.
“ఆనంద్ తన సంపాదనలో ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇవ్వడమ్మా. నువ్వే మీ ఇద్దరి ఖర్చుకీ, మీరు వేరే ఉంటే ఎంతవుతుందో అంతే నాకివ్వాలి ప్రతీ నెలా!” ఇంటి నిర్వహణ చూసే మామగారు, సావిత్రి జీతం అందుకోగానే చెప్పాడు.
సావిత్రి ఆనంద్ కి చెప్పబోయింది..
“నీదైతేనేం, నాదైతేనేం. నువ్వే ఇచ్చెయ్యి సావీ..” ప్రేమగా ముంగురులు సవరిస్తూ అన్నాడు ఆనంద్.
“మరి మా అమ్మ వాళ్లకీ.”
“ఇవ్వచ్చులే.. జీతాలు పెరుగుతాయిగా.. అప్పుడు” మారుతున్న గొంతు విని ఇంకేం అనలేక పోయింది.
జీతాలు పెరిగే సమయానికి సావిత్రికి కొడుకు పుట్టాడు. ఖర్చులు పెరిగాయి. ఆర్ధిక సమస్యలే లేవన్న ఆనంద్ ఏదన్నా చెప్పబోతే కోపం తెచ్చేసుకుంటాడు.
వారానికి రెండు మూడు సార్లు దెబ్బలు తప్పటం లేదు.
నాలుగేళ్లు గడిచాయి.
……………….

“ఇంక నా వల్ల కావట్లేదు నాన్నగారూ. విడాకులు తీసుకుందామనుకుంటున్నా” జరిగిందంతా తండ్రికి చెప్పింది సావిత్రి. అమ్మానాన్నలిద్దరికీ, తను తిన్న దెబ్బల మచ్చలన్నీ చూపించింది. అప్పడు కూడా మూతి వాచిపోయే ఉంది. ఆ రోజు పెద్ద గొడవ చేశాడు ఆనంద్, సావిత్రి స్కూటర్ కొనుక్కుంటానంటే. రెండు బస్ లు మారి వెళ్లాలి బాంక్ కి. ఆనంద్ పొద్దున్న ఎనిమిదికల్లా వెళ్లి పోతాడు. అతను దింపే అవకాశమే లేదు..
ఆ దెబ్బలు చూసి ఏ కన్న హృదయం తల్లడిల్లకుండా ఉంటుంది? నీ ఇష్టమనేశారు తల్లిదండ్రులు.
అనుకున్నంత సాఫీగా ఏదీ జరగదు..
విడాకుల నోటీసు రాగానే, కొడుకుని తీసుకుని అడ్రస్ చెప్పకుండా వేరే కనస్ట్రక్షన్ సైట్ కి వెళ్లిపోయాడు ఆనంద్. కొడుకు కోసం విడాకుల ఆలోచన మానుకుంటుందని.
విడాకుల ప్రయత్నం మానేసి తన ఉద్యోగం తను చేసుకుంటూ, బదిలీల మీద ఊర్లు తిరుగుతూ. రిటైరయి తన ఊర్లోనే సెటిలయింది సావిత్రి. ఆనంద్ చెల్లెలు వదిన గారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోంది. కొడుకు రుద్ర ఇంజనీరింగ్ అయి అమెరికాలో యమ్మెస్ చేసి మంచి ఉద్యోగంలో చేరాడని చెప్పింది.
“ఇంక నువ్వు రావని తెలిసి పోయాక, రుద్ర ఇంజనీరింగ్ లో చేరాక మాతో మాట్లాట్టం మొదలపెట్టాడు వదినా, అన్నయ్య. రుద్ర అచ్చు నీ పోలికే. ఎంత చక్కగా ఉంటాడనుకున్నావు?”
“నా గురించి అడుగుతాడా?” ఆడపడుచు ఒకసారి సూపర్ మార్కెట్ లో కనిపించి చెప్తే, ఆతృతగా అడిగింది సావిత్రి.
“నువ్వు చచ్చి పోయావని చెప్పాడు వదినా!”
కన్నీళ్లు ఆపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది సావిత్రి.

……………

“మా అమ్మాయి పెళ్లి. నువ్వు తప్పకుండా రావాలి వదినా. రుద్ర వస్తున్నాడు. నువ్వు చూడచ్చు. నీ కోడలు, ఇద్దరు మనుమలు కూడా వస్తున్నారు.” ఆడపడుచు ఇంటికొచ్చి పిలిచింది.
“మీ అన్నయ్య.”
“ఏం ఫరవాలేదొదినా! ఇప్పుడు ఆ కోపం అదీ పోయింది. నిన్ను పలుకరిస్తే మాట్లాడు. లేకపోతే లేదు.”
ఎంతో బిడియంగా బెరుకుగా పెళ్లి పందిట్లో అడుగు పెట్టింది సావిత్రి. ఆడపడుచు గబగబా వచ్చి, లోపలికి తీసుకెళ్లి, కూర్చోపెట్టింది.
సరిగ్గా అప్పుడే..
పెళ్ళి జరుగుతున్న హాలులోకి అడుగుపెట్టిన రుద్ర, తన స్నేహితుల కోసం అటూ ఇటూ చూస్తూ ముందుకు కదులుతున్నాడు.
ఎవరో భుజం పట్టి ఆపటంతో అటు చూసాడు. అక్కడ దూరపు బంధువు పరమేశ్వరం, రుద్రకు వరుసకు మామయ్య అవుతాడు.
“ఏమోయ్ రుద్రా! చాలా కాలం అయ్యింది నిన్ను చూసి. నేను గుర్తున్నానా? మా చెల్లి, మీ అమ్మ సావిత్రమ్మ ఎలా ఉంది?” అన్నాడు.
“చచ్చిపోయింది” మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి కదిలాడు నలభయ్యేళ్ళ రుద్ర.
అక్కడికి దగ్గరలో మంది మధ్యలో కూర్చున్న “సావిత్రమ్మ”… ఆ మాట వినగానే తలవంచుకుంది.
పచ్చని మేని ఛాయలో, ఆకుపచ్చని పట్టుచీరలో, పెద్ద బొట్టుపెట్టుకొని లక్ష్మీ కళతో చూడగానే… చేతులెత్తి నమస్కరించాలనిపించేలా ఉన్న అరవయ్యేళ్ళ సావిత్రమ్మ మనసు విలవిలలాడింది.
తల వంచి కూర్చొన్న ఆమె కంటి నుండి వెచ్చని కన్నీటి బొట్లు ఆమె ఒడిలో రాలి పడ్డాయి.
అప్పుడు అనిపించింది, ఇంకేదైనా మార్గం ఆలోచించకుండా తను కొడుకునీ, భర్తనీ వదిలి వెళ్లటం తప్పయిందని.

—————

1 thought on “ఉనికి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *