March 19, 2024

కాన్ఫిడెన్స్

రచన: మంజుల దేశ్ పాండే

మా అమెరికా ప్రయాణం ఇంకా వారం రోజులే ఉంది. ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి. బిడ్డ అయితే.. అమ్మా నువ్వు అనవసరంగా అలసట చేసుకోకు. ఇక్కడ ఇండియన్ స్టోర్స్ చాలా ఉన్నాయి వాటిలో ప్రతి వస్తువు దొరుకుతుంది నువ్వేం హైరాణా పడకు, నీకు కావలసిన మెడిసిన్స్ మాత్రం మరిచి పోకుండా జాగ్రత్తగా తెచ్చుకో అంటూ పాఠాలు మొదలుపెట్టింది ! నా బిడ్డ ఎంత వద్దన్నా.. తల్లిని కదా, నా మనసు ఊరుకోదు కదా! దానికి రెండు చీరలు ఒకటి బెనారస్, ఇంకోటి గద్వాల్ పట్టు చీరలు కొన్నాను. అమెరికాలో వాళ్ళకు ఫంక్షన్ లు ఎక్కువే. నా కోడలు వెళ్లి జాకెట్లు కుట్టించి తెచ్చింది. నా పెద్ద కొడుకుతో చెప్పి అల్లుడుగారికి, ఇద్దరు మనవలకి డ్రెస్సులు తెప్పించిన. చిన్న కొడుకుకు చెప్పి స్నాక్స్, స్వీట్స్, అప్పడాలు, వడియాలు తెప్పించిన.
ప్రయాణం దగ్గర పడింది. తీసుకుపోవాల్సిన బట్టలు, తినుబండారాలు అన్ని రెడీగా ఉన్నాయి.
నా కొడుకలు, కోడళ్ళు కలిసి సూట్ కేస్ లు సర్దేసారు. వాటికి గుర్తుగా ఆరెంజ్ కలర్ రిబ్బన్ కట్టారు.
రేపు రాత్రి అంటే ఎల్లుండి తెల్లవారుజామున మా ఫ్లైట్. ఎన్నిసార్లు వెళ్లినా ప్రతీసారీ మొదటిసారి ప్రయాణం చేస్తున్నట్లు ఏదో గాబరా!
తెల్లారింది. మధ్యాహ్నం భోజనాలు కాగానే, మా చిన్న కొడుకు అమ్మా అన్నీ రెడీ కదా.. మనం మూడు గంటల ముందుగా ఏర్ పోర్ట్ లో ఉండాలి. పదకొండు గంటలకు ఇంటి నుంచి బయలు దేరాలి అని హుకుం జారీ చేశాడు! సరే నాన్నా అని ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఆలోచించి..ఆ..ఓ రెండు లక్షలు తీసుకెళ్ళి, డాలర్లు గా మార్చి తీసుకొనిరా అన్నాను. నావైపు ఓ చూపు చూసి, నా దగ్గర డబ్బులు తీసుకోకుండానే వెళ్లి ఓ గంటలో డాలర్లు తెచ్చి నా హాండ్ బాగ్ లో పెట్టి జాగ్రత్తలు చెప్పాడు.
రాత్రి భోజనాలు తొందరగా కానిచ్చి.. సూట్ కేస్ లు అన్నీ రెడీగా ఒక దగ్గర పెట్టాడు మా పెద్ద కొడుకు. పాస్ పోర్ట్, కోవిడ్ సర్టిఫికెట్, ఇంకా కొన్ని అవసరమైన పేపర్స్, పెన్ అన్నీ ఒక హాంగింగ్ బాగ్ లో పెట్టి, ఇది భుజానికే ఉంచుకో అని జాగ్రత్తలు చెప్పాడు.
పదిన్నర కాగానే హడావిడి పెట్టారు. నేను కొంచెం ఫ్రెష్ అయి, హాండ్ బాగ్ , పాస్ పోర్ట్ ఉన్న బాగ్ తీసుకుని మా కోడళ్ళకు జాగ్రత్తలు చెప్పి, సూట్ కేస్ లు కార్లో పెట్టగానే మా ఇద్దరు కొడుకులు, నేను బయలుదేరి నలభై నిమిషాల్లో ఏర్ పోర్ట్ చేరాం. లోపలి వరకు పిల్లలు రాలేకపోయారు. వాళ్ళు హాప్పీ జర్నీ మమ్మీ, దుబాయ్ చేరగానే మెసేజ్ చెయ్యి అంటుంటే..అక్కడే వాళ్ళకు బాయ్ చెప్పి సామాన్లు తీసుకుని వచ్చాను.
సూట్ కేస్ లు చెకిన్ చేసి, బోర్డింగ్ పాస్ తీసుకుని, సెక్యూరిటీ చెకింగ్ కాగానే, వెయిటింగ్ లాంజ్ లో కూర్చున్నాను. టైం తొందరగా గడిచిన ట్టుంది! ఎమిరేట్స్ ఫ్లైట్ గురించి అనౌన్స్ మెంట్ వినిపించింది. హడావిడిగా హ్యాండ్ లగేజ్ తీసుకుని, పాస్ పోర్ట్ చేతిలో పట్టుకుని లైన్ లో నిలుచున్నాను. త్వరత్వరగానే పంపేస్తున్నారు. చిన్న వీల్స్ ఉన్న సూట్ కేస్ ఈడ్చుకుంటూ వెళ్లి, ఫ్లైట్ దగ్గరకు రాగానే “శుక్లాంబరధరం” చదువుకుంటూ కుడీకాలు ముందుపెట్టి, విష్ చేస్తున్న ఏర్ హోస్టెస్ లకు తిరిగి నవ్వుతూ విష్ చేసి.. నా సీట్ దగ్గరకు వెళ్ళి, సూట్ కేస్ పైన పెట్టి, నా సీట్ లో కూర్చున్న….నాది విండో సీట్.
ఫ్లైట్ నాలుగు గంటల్లో దుబాయ్ చేరింది. పిల్లలకు మెసేజ్ చేసి ఒక గంట వెయిట్ చేసి, అమెరికా ఫ్లైట్ ఎక్కాను. అది డైరెక్ట్ హ్యూస్టన్ వరకు. లాంగ్ జర్నీ. ఫ్లైట్ లో ఇచ్చినవి తింటూ, తాగుతూ, కొంచెం టీవీ చూస్తూ, కొంచెంసేపు పుస్తకం చదువుతూ…. నిద్ర గోళీ వేసుకున్నా, అస్సలు పడుకోకుండా.. మొత్తానికి అమెరికా చేరుకున్న ! చెవులు గడలు పడిపోయాయి.. కాళ్ళు లాగుతున్నాయి.
మెల్లగా లగేజ్ తీసుకుని ఫ్లైట్ దిగి, సెక్యూరిటీ వాళ్ళ ప్రశ్నలు, చెకింగ్ అన్నీ పూర్తి చేసుకుని, సూట్ కేస్ లు కలెక్ట్ చేసుకుని, ట్రాలీలో పెట్టుకుని, అటు ఇటు చూస్తూ బయటకు వస్తుంటే.. దూరం నుంచి చూసి నా బిడ్డ, అల్లుడు, మనవలు చేతులూపుతూ కనిపించారు. చాలా సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నా బిడ్డ ఉరుక్కుంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకొని ఏడ్చింది! ఇక మా అల్లుడు ట్రాలీ తీసుకుని ప్రయాణం బాగా జరిగిందా అత్తయ్యగారూ అంటూ నవ్వుతూ పలకరించాడు. నా పెద్ద మనవడు శౌర్య చిరునవ్వు నవ్వుతూ వాడి చేతిలో ఉన్న బొకే నాకిచ్చి,వెల్ కమ్ టు అమెరికా.. అమ్మమ్మా అంటూ హగ్ చేసుకున్నాడు. చిన్న మనవడు నవ్వుతూ నిల్చుంటే వాణ్ణి ఎత్తుకొని ముద్దు పెట్టాను.
సామాన్లు కారులో పెట్టుకుని, అందరం కూర్చుని ఒక అరగంటలో ఇల్లు చేరాము.
నాలుగు రోజులు ఫుల్ రెస్ట్ నాకు. నా బిడ్డ వర్క్ ఫ్రం హోం పర్మిషన్ తీసుకుని, నన్ను ఏ పనీ చేయనీయకుండా, అన్నీ తానే చేసింది. నాలుగు రోజుల తరువాత నా బిడ్డను ఆఫీస్ కు వెళ్ళమని కిచెన్ నా చేతిలోకి తీసుకున్నాను.
శనివారం భోజనాలు చేసి అందరం మీడియా రూమ్ లో కూర్చుని సినిమా చూస్తున్నాము. కాలింగ్ బెల్ మోగింది. మా మనవడు శౌర్య తలుపు తీసి చూస్తే, వాడి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు “కామెరిన్”, పక్క ఇంటి అమెరికన్ కుటుంబం వాళ్ళది. అమ్మాయి ప్రియ, ముంబై వాళ్ళు. నా మనవడి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. వాళ్ళను చూస్తే బలే ముచ్చట వేసింది నాకు. ముందు హాల్ లో కూర్చుని, ఏవేవో డిస్కస్ చేసుకుని, రేపు కలుద్దాం అని వెళ్ళిపోయారు.
ఆదివారం మధ్యాహ్నం శౌర్య ఫ్రెండ్స్ కామెరిన్, ప్రియా ఇద్దరూ వచ్చారు. వాళ్ళను నాకు పరిచయం చేశాడు. వాళ్ళకు నన్ను మా అమ్మమ్మ అని చెబితే కామెరిన్ హాయ్ ఆమ్మమ్మా… అని, ప్రియ హలో అమ్మమ్మ అని ముద్దుగా విష్ చేశారు.
వాళ్ళు మీడియా రూమ్ లో కూర్చుని ఏవో విషయాలు డిస్కస్ చేస్తున్నారు. శౌర్య నాదగ్గరకు వచ్చి అమ్మమ్మా తినడానికి ఏమైనా ఇవ్వమంటే, వేడి వేడిగా పాస్తా, నేను తెచ్చిన స్వీట్స్, స్నాక్స్, ఆపిల్ జూస్ అన్నీ వాళ్ళకిచ్చాను. బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. కామెరిన్ అయితే సో కైండ్ అఫ్ యూ ఆమ్మమ్మా… అంటూ తెగ మెచ్చుకున్నాడు!
శౌర్య వీకెండ్స్ లో కొంతమంది పిల్లలకు తెలుగు పాఠాలు నేర్పుతున్నాడు!.
కామెరిన్ వైయంసీలో బాస్కెట్బాల్ కోచ్ గా ఉన్నాడు!
ప్రియా ఆర్ట్ క్లాసలు తీసుకుంటుంది!
వీళ్ళు ఈ వయసులోనే వేరే వాళ్ళకు పాఠాలు నేర్పుతున్నారు.
వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళే సంపాదించుకుంటూ.. ఇంకా కొన్ని సంస్థలకు డొనేట్ చేస్తున్నారట. వాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది… వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే చాలా ముచ్చటేసింది.
తల్లి తండ్రుల కు బర్డెన్ కాకుండా, చదువుకుంటూ, మళ్ళీ వేరే వాళ్ళకు పాఠాలు చెబుతూ.. వొచ్చిన డాలర్లలో కొన్ని, కొన్ని సంస్థలకు డొనేట్ చేస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇక్కడి పిల్లలు చాలా మంది ఇంతేనట! ఇక్కడి వాతావరణం అలాంటిది మరి.
అందుకే అమెరికా అగ్ర రాజ్యం అయ్యిందేమో!
ఇంకో శనివారం సాయంత్రం కాగానే చాలా మంది పిల్లలు సైకిళ్ళ మీద వచ్చారు.వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళే కాక పక్క కమ్యూనిటీ వాళ్ళు కూడా శౌర్య చెప్పే”తెలుగుపాఠాలు”నేర్చుకోవడానికి వచ్చారు. వాళ్ళందరినీ గేమ్ రూమ్ లో కూర్చోపెట్టి , వాళ్ళందరికీ చక్కగా తెలుగు నేర్పిస్తున్నాడు. భగవద్గీత శ్లోకాలు కూడా నేర్పిస్తాడు. శౌర్యకు చిన్నప్పుడే మా అల్లుడు తెలుగు పద్యాలు, భగవద్గీత శ్లోకాలు నేర్పించిండు.‌‌
ఆదివారం ప్రొద్దున్నే మళ్ళీ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళు పాఠాలు చెప్పగా వచ్చిన డాలర్ల నుండి కొన్ని “ఫుడ్ బాంక్” కు, కొన్ని “చిల్డ్రన్ హాస్పిటల్” కు వెళ్ళి డొనేట్ చేసి వచ్చారు!
మదర్స్ డే రోజున మధ్యాహ్నం కామెరిన్, ప్రియా ఇద్దరూ చేతిలో రెండు రెండు గిఫ్ట్ బాక్స్ లు పట్టుకొని వచ్చి , శౌర్య కు సైగ చేసి ఏమో చెప్పారు. శౌర్య వాడి రూమ్ లోకి వెళ్ళి రెండు గిఫ్ట్ లతో వచ్చాడు. ముందు కామెరిన్ నాకు హాప్పీ మదర్స్ డే ఆమ్మమ్మా.. అంటూ విష్ చేసి గిఫ్ట్ చేతిలో పెట్టి హగ్ చేసుకున్నాడు.
తరువాత ప్రియా కూడా హాప్పీ మదర్స్ డే అమ్మమ్మ అంటూ హగ్ చేసుకొని, నా కాళ్ళకి నమస్కారం కూడా చేసింది!
తరువాత నా బిడ్డకు ఇద్దరు హాప్పీ మదర్స్ డే ఆంటీ అంటూ హగ్ చేసుకొని గిఫ్ట్ ఇచ్చారు.
ఇక మా అందగాడు…. శౌర్య నాకు, నా బిడ్డకు ఒకే సారి గిఫ్ట్ ఇచ్చి ఇద్దరికీ విష్ చేసి ఇద్దరినీ హగ్ చేసుకోగానే..‌ వెయిట్ శౌర్య అంటూ కామెరిన్ ఫోటో క్లిక్ మనిపించాడు. నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నేను, నా బిడ్డ ఇద్దరం శౌర్య,కామెరిన్ ప్రియాను దగ్గరకు తీసుకొని కిస్ చేస్తుంటే… చిన్న మనవడు అభిమన్యు కూడా మిమ్మల్ని గట్టిగా పట్టుకుని నిలుచున్నాడు. అప్పుడే మా అల్లుడు ఫోటో తీసి.. సూపర్ క్లిక్ అంటూ చూపించారు.
రెండు నెలల తరువాత “పిల్లలు నేర్పిన పాఠాలు”మదిలో నింపుకొని, వాళ్ళ”కాన్ఫిడెన్స్”ను అభినందిస్తూ….. ఎన్నో మధురానుభూతులతో హైదరాబాదుకి ప్రయాణమయ్యాను.

1 thought on “కాన్ఫిడెన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *