March 28, 2024

జీవనవేదం – 7

రచన: స్వాతీ శ్రీపాద

“లాంగ్ వీకెండ్ వస్తోంది కదా, కిరణ్ ఎక్కడికి వెళ్దాం?”
సోఫాలో అతన్ని ఆనుకుని కూచుని అడిగింది సుమ.
“అవును, ఇంకా ఆలోచించనే లేదు.చెప్పు ఎక్కడికి వెళ్దాం.” ఎందుకో కాని అలా అడగ్గానే సిత గుర్తుకు వచ్చింది రవి కిరణ్ కు. చిన్నప్పటినుండీ ప్రతివాళ్ళూ రవి అని పిలవడమే కాని ఎవ్వరూ ఇలా కిరణ్ అని పిలవకపోడం కొత్తగా, బాగుంది అతనికి.
“నువ్వే చెప్పాలి, రెండు మూడు రోజులు ఇద్దరమే ఒక ప్రపంచమై గడపాలి. నాకు నువ్వూ నీకు నేనూ. అంతే”
” స్మోకీ హిల్స్ కి వెళ్దాం రోజంతా కొండలూ కోనలూ తిరగ వచ్చు. ఒక సూట్ బుక్ చేసుకుంటే ఇద్దరమే ఉంటాం. ఈ వెన్ కిచెన్ కూడా ఉంటుంది. ఎలాగూ కారులో వెళ్తాం కనక గ్రాసరీ కొంచం రెడి మేడ్ ఫుడ్స్ తీసుకు వెళ్తే బోర్ కొడితే వండుకోవచ్చుకూడా.”
“బాగుంది అయిడియా, కొత్తగా కాపురం పెట్టినట్టుంటుంది కదూ”
కొత్త కాపురానికి వెయ్యి ఆశలతో వెంట రాడానికి సిద్ధమైన సీతను చదువు పేరుతో ఆపేసాడు. ఇప్పుడిలా.
తల విదిలించి ఆ ఆలోచన వదిలించుకున్నాననుకున్నాడు.
అక్కడో ఇక్కడో కలిసి లంచ్ లూ, డిన్నర్లూ సరదాగా తిరగడాలూ జరుగుతున్నా రవికిరణ్ అపార్ట్మెంట్ అతని మిత్రులతో షేర్ చేస్తున్నాడు గనక ఆమెను ఉండమనలేడు. అలాగే ఇద్దరితో కలిసి ఉండే ఆమె ఇంటికి వెళ్లనూ లేడూ.
ఈ లాంగ్ ట్రిప్ ఆలోచన కొత్త ఉత్సాహాన్ని నింపింది.
మరో రెండు రోజులయాక ఉన్నట్టుండి -“కిరణ్, షాపింగ్ వెళ్దాం సాయంత్రం రెడీ గా ఉండు” అని ఫోన్ చేసింది సుమ.
అలాగే అన్నా కూడా ఇంతలో ఎవరిపుట్టిన రోజులూ లేవు, ప్రత్యేకతలూ లేవు ఎందుకబ్బా షాపింగ్ అనుకున్నా, ఏములో లాంగ్ వీకెండ్ ట్రిప్ కోసం కావచ్చుగా అనిపించింది. తనతో వెళ్ళినప్పుడు ఒక వేళ బిల్స్ పే చ్చెయ్యాల్సి వచ్చినా వెనక్కు తగ్గకూడదు అని కూడా అనుకున్నాడు. క్రెడీట్ కార్డ్ ఎలానూ ఉండనే ఉంది.
గురువారమే తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. లాంగ్ వీకెండ్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాననీ చెప్పాడు.
“ఏమోరా ఈ చదువులేమిటో ఉద్యోగాలేమిటో, నాకేమీ నచ్చడం లేదు. ఆ ఉద్యోగమేదో ఇక్కడే చేసుకోవచ్చువచ్చెయ్యకూడదూ, లేదంటే చదువాపేసి సీతను తీసుకెళ్ళు”
” ఏడాది ఎలాగూ గడిచిపోయింది మరో రెండేళ్ళే కదా,”
” ఏమో నాకేమిటో బెంగబెంగగా ఉంటోంది రా ” కొంచం దిగులు ధ్వనించింది ఆవిడ స్వరంలో.
“అలాగేం లేదమ్మా, ఒక సారి గుడికి వెళ్ళిరా మనసు శాంతంగా ఉంటుంది”అన్నాడు.
ఎందుకో కాని సీతతో మాట్లాడాలనిపించలేదు.
ఆ సాయంత్రం సుమబాలతో షాపింగ్ కి సిద్ధమై వెళ్ళే ముందే అడిగాడు, “ఏం కొనాలి? ఎటు వెళ్దాం?”
“సర్ప్రైజ్ , అలా చెప్తానా? పద” అంటూ బయలు దేరి డౌన్ టౌన్ లో జెవెలరీ షాప్ కి తీసుకు వెళ్ళింది.
ఆమెను అనుసరించడం తప్ప మరో దారి లేదు.
రెండు ఉంగరాలు సెలెక్ట్ చెయ్యడానికి రెండు గంతలు తీసుకుంది. చూడు కిరణ్ ఇది మరీ పెద్దగా వేలును మింగేస్లా ఉంది కదూ ఇంత పెద్దగా ఉండకూడదు, నాజూగ్గా ఆభరణం అంటే అందం ఇచ్చేదిగా ఉండాలి,
అతని వేలికి తగ్గ ఉంగర్రం చూస్తున్నప్పుఏ అతనికి చూచాయగా అర్ధమయింది. అర్ధం కానిదల్లా
ఇంత వరకూ వచ్చి ఇప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో.
” షాప్ నుండి బయటకు వస్తూ,
“వరైటీగా మన ట్రిప్ లో ఎక్కడైనా గుళ్ళో ఉంగరాలు మార్చుకుందాం కిరణ్, నాకు గిల్టీ ఫీలింగ్ ఉండదు, ఎవరితోనో డేటింగ్ కి వెళ్ళానని, పెళ్ళి కుదిరినప్పుడే చేసుకుందాం”
ఎంత ఇండైరెక్ట్ గా విషయం చెప్పేసింది. కాని …
ఆలోచనలో పడ్డాడు రవికిరణ్.
******
” ఒక పెళ్ళి కార్యక్రమం లో సాంప్రదాయ బద్ధంగా ప్రతి అకేషన్ కీ పాటల కార్యక్రమం పెట్టుకుంటున్నారు. నాతో పాటు మరో ఇద్దరు వస్తున్నారు. స్త్రీల పాటలకు మీకేమయినా వీలవుతుందా సీతా?” రవీంద్ర అడిగాడు.
కొంచం తటపటాయించింది సీత.
” అదీ మన క్రిస్మస్ సెలవల్లోనే, పైగా భారీ పారితోషికం కూడా ఇస్తారట, మనకు ఉపయోగంగా ఉంటుందని, మీతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా తీసుకుందాం”
” నిజమే కాని, ఇంతవరకూ అడపాదడపా వినడమే తప్ప నాకంతగా తెలియవు. అందుకే తటపటాయిస్తున్నా ”
“ఇంకా టైమ్ ఉంది కదా, ఏ ఏ పాటలో సేకరించి మీకు ఇస్తాను, ఒకటి రెమ్డు రోజులు ఎక్కడైనా కలిసి ప్రాక్టీస్ చేద్దాం”
కాదనలేకపోయింది సీత.
“ఒక పది పాటలు ఎంచుకుందాము. గణేశ స్తోత్రం తో కార్యక్రమం మొదలు పెట్టి అప్పగింతల్ అపాటతో ముగించాలి.”
“నిజమే, కాని ఈ తరం పిల్లలకు మరీ పాత పాటలు ఆసక్తి కలిగించవు. మన సినిమాల్లోనూ చక్కటి పెళ్ళిపాటలున్నాయి. అవీ తీసుకుంటే అందరూ ఆసక్తిగా వింటారు”
పాటల ఎంపికలో ఇది కాదని అదీ అదికాదని ఇదీ ఇద్దరూ వాదించుకునే వారు.
శ్రీ రస్తూ శుభమస్తూ అంటూ తొలిపాటను ఎంచుకున్నారు. తెలుగు వారి పెళ్ళీ సాంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్నపెళ్ళీ అంటూ పెళ్ళి కార్యక్రమాలను పాటగా వివరించారు.
నిజానికి పాటలన్నీ మనసారా పాడారు.
ఇద్దరికిద్దరూ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు స్థానంలో తమనే ఊహించుకున్నారు.
కార్యక్రమం ఇద్దరికీ ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అడగని ప్రశ్నలకు చెప్పని జవాబులు దొరికినట్టే అనిపించింది.
సీతలో కొత్తగా నెలకొన్న ఆత్మస్థైర్యం కొత్త జీవితాన్ని ఇచ్చినట్టే ఉంది.
నిజానికి రవికిరణ్ తో పెళ్ళి తూ తూ మంత్రంగా జరిగింది తప్ప ఎక్కడా తియ్యని అనుభూతులే మిగల్లేదు.
కార్యక్రమం ముగిసాక పెళ్ళివారు చాలా ఆనందించి ఇద్దరికీ బట్టలు పెట్తినప్పుడు ఇద్దరూ మొహాలు చూసుకున్నారు.
ఇంటికి వచ్చాక మమతను కౌగిలించుకుని తన కృతజ్ఞత వ్యక్తం చేసింది.
” నాదే ముంది సీతా , మన జీవితం మనం బ్రతికె స్థైర్యం అమ్మాయిలకు రావాలి. నీ లో మార్పు మెచ్చుకోవాలి” అంది మమత.
తన గదిలో కూచుని భద్రంగా పెట్తి అదుగున దాచిన మంగళసూత్రాలు చేతిలోకి తీసుకుని సుదీర్ఘంగా వాటినే చూస్తూ ఉందిపోయింది.
చిన్నప్పటినుండి ఏదో బొమ్మ కోసం పేచీ పెట్తినట్టు బావనే చేసుకుంటానని మారము చెయ్యడం గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది.
బావ మాత్రం అత్త మాటకాదనలేక చేసుకున్నాదు గాని….
ఆలోచన అక్కడ ఆగిపోయింది.
****
క్లాస్ మధ్యలో ప్రిన్సిపల్ గారి పిలుపు.
ఏదో మామూలుగా ఏ కార్యక్రమం గురించో అనుకుంది సీత.
“ఇప్పుడే రమ్మన్నారు” అనడంతో లెక్చరర్ గారు అనుమతించాక లేచి వెళ్ళింది.
ప్రిన్సిపల్ గారి గదిలో మామగారిని చూసి అవాక్కయిపోయింది.
ఏం జరిగింది ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చారు? కంగారుపడింది. అందులో మెడలో మంగళ సూత్రం వేసుకోలేదు.
“సీతా , మీ మామయ్య నిన్ను తీసుకు వెళ్తారు, వెళ్ళు, నీ పుస్తకాలు బాగ్ తెప్పిస్తాను” చెప్పారు ప్రిన్సిపల్ గారు.
” ఏంజరిగింది మావయ్యా?” తడబడుతూ అడిగింది.
“ముందు వెళ్దాం పదమ్మా” శొక సంయ్ద్రంలా పలికింది ఆయన స్వరం.
” ముందు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం”
అయిదు నిమిషాల దూరమ్లో ఉన్న ఇల్లు చేరడానికి అయిదు గంటలు పట్టినట్టు అనిపించింది.
ముందు గదిలో ఆయన కూచున్నాక గబ్గబా లోపలికి వెళ్ళి పెట్టెలాగి మంగళ సూత్రం మెడలో వేసుకుంది.
మంచి నీళ్ళు అందుకుంటూ దుఃఖంతో ,
“సీతా ముందుగా మనం అత్యవసరంగా వీసా తీసుకోవాలి?”
“ఎందుకు మావయ్యా?”
ఎందుకో మనసు కీడు శంకించింది.
” మీ బావకు అమెరికాలో రోడ్ ప్రమాదం జరిగిందట. వారం క్రితం. ఎమర్జెన్సీ వార్డ్లో పడి ఉన్నాడు వారం రోజులుగా, మనం వెళ్ళాలి” అంటూనే బోరున ఏడ్చేసాడు.
సీత మనసు మొద్దుబారిపోయింది.
ఏం జరిగిందో జరుగుతోందో అర్ధం కాలేదు. ఎలా పనులు చేసుకున్నారో ఎలా వీసా తీసుకుని విమానం ఎక్కారో అత్తమామలకూ ఆమెకే తెలియాలి.
************
జరిగినదేమిటంటే …
శుక్రవారం రాత్రి డిన్నర్ చేసి కావలసినవన్నీ కారులో అమర్చుకుని ఏడింటికల్లా బయలు దేరారు రవికిరణ్ సుమబాల్. తొమ్మిది గంటల డ్రైవ్.
“కిరణ్ నువ్వో నాలుగు గంటలు నేనో నాలుగు గంటలూ షేర్ చేసుకుందాం, మరీ ఒక్కడివే అయితే కష్టం. ముందు నేను చెయ్యనా ? నువ్వా?”
రవికిరణ్ వెళ్ళి డ్రవింగ్ సీట్లో కూచున్నాడు.
పాత పాటలు వింటూ మూడు గంతలపాటు బాగానే సాగింది ప్రయాణం, దారిలో ఆగి స్టార్ బక్స్ లో కాఫీ తెచ్చుకున్నాడు రవి కిరణ్. సుమబాల కాఫీ తాగదు.
” వేడివేడిగా కాఫీ తాగు, నేను డ్రైవ్ చేస్తాను”అంటూ డ్రైవింగ్ సీట్ లోకి మారింది సుమబాల.
పక్కనే కూర్చున్నాడు.
నెమ్మదిగానే సాగుతూ మాట్లాడుతోంది సుమబాల.
” సరిగ్గా ఓ పదేళ్ళ తరువాత ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకో కిరణ్ , నువ్వూ నేనూ , వెనకాల పాప బాబు, పిల్లల గడబిడ గోల …”
పొలమారింది రవికిరణ్ కి.
“అదిగో చూడూ, మన పిల్లలు మనను తల్చుకుంటున్నారు” సరదాగా అంటూ అతని వైపు తలతిప్పింది సుమబాల.
అంతే. ఏమ్ జరిగిందో తెలియదు, బండి ఎలా అదుపు తప్పి స్లిడ్ అయిందో తెలియదు, జారి జారి రోడ్డు చివరన ధనా మని దేన్నో గుద్దుకోడం మాత్రం తెలుసు.
హైవే మీద పాట్రోలింగ్ పొలీస్ కు ఎవరో సమాచారం ఇచ్చారు.
జరగవలసిన కార్యక్రమాలు చక చకా జరిగిపోయాయి.
హాస్పిటల్ లో అడ్మిట్ చేసాక రవికిరణ్ మిత్రులకు సమాచారం ఇచ్చారు.
స్పృహ లేని స్థితిలో వారం రోజులుగా ఎమర్జెన్సీ లో ఉన్నాడు రవికిరణ్.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *