March 19, 2024

దైవేచ్చ

రచన: సి. హెచ్. ప్రతాప్

నారాయణపురంలో రామయ్య అనే రైతు నివసిస్తుండేవాడు. తనకు వున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, దానిపై వచ్చిన రాబడితో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంతో సంతృప్తితో జీవిస్తుండేవాడు. రామయ్యకు దైవ భక్తి ఎక్కువ. తన జీవితంలో ఏం జరిగినా అది భగవంతుని ప్రసాదమేనని భావిస్తుండేవాడు. ఒకరోజు ఇంటిల్లిపాదీ పక్క ఊళ్ళొ జరుగుతున్న అమ్మవారి జాతరకు వెళ్ళారు. అక్కడ ఎవరూ లేని సమయంలో కొందరు దొంగలు అతని ఇంట్లో వున్న పాడి ఆవును తోలుకొని వెళ్ళిపోయారు.
జాతర నుండి తిరిగి వచ్చాక జరిగిన సంగతి తెలుసుకొని రామయ్య కుటుంబం ఎంతో బాధపడ్డారు. సమృద్ధిగా పాలిచ్చే ఆవును దొంగలించుకుపోవడం నిజంగా నీ దురదృష్టం అని ఇరుగుపొరుగు వారు రామయ్యతో అన్నారు. అయితే రామయ్య మాత్రం” అదృష్టం ఏమిటి, దురదృష్టం ఏమిటి ? అంతా దైవేచ్చ ప్రకారమే జరుగుతుంది. ” అని వాళ్ళతో అంటే వాళ్ళంతా రామయ్యను ఒక పిచ్చివాడిగా జమ కట్టారు.
కొద్ది రోజులకు ఆ ఆవు ఇంకొక ఆవుతో కలిసి తిరిగి వచ్చింది. అసలు జరిగిందేమిటంటే దొంగలు ఆ ఆవును పక్క ఊరిలో ఒక రైతుకు అమ్మేసారు. ఆ రైతు కొడుకు ఆవులను మేపడానికి పచ్చిక బయళ్ళ ప్రాంతానికి తీసుకువెళ్ళగా ఆ ఆవు ఇంకొక ఆవుతో కలిసి తప్పించుకొని తిరిగి తన అసలు యజమాని వద్దకు తిరిగి వచ్చేసింది.
ఇప్పుడు రామయ్య వద్ద రెండు ఆవులను చూసి ఇరుగుపొరుగు రామయ్య అదృష్టానికి పొగిడారు. అయితే రామయ్య మాత్రం “అదృష్టం ఏమిటి, దురదృష్టం ఏమిటి ? అంతా దైవేచ్చ ప్రకారమే జరుగుతుంది. ” అని వాళ్ళతో అన్నాడు. ఇదేం తీరురా బాబు విచిత్రంగా వుందని ఇరుగుపొరుగు రామయ్య వైపు విచిత్రంగా చూసి వెళ్ళిపోయారు.
కొన్నాళ తర్వాత ఆవులను మేపడానికి తీసుకు వెళ్తుంటే రామయ్య కొడుకు కింద పడి ఎడమకాలు విరగొట్టుకున్నాడు. ఎముక విరగడంతో గ్రామ వైద్యుడు ఆ కాలుకి కట్టు కట్టి కనీసం మూడు నెలల పాటు మంచం దిగవద్దని సలహా ఇచ్చాడు.
ఆడుతూ పాడుతూ సరదాగా తిరిగే కుర్రాడికి ఎంత కష్టం వచ్చింది. అంతా నీ దురదృష్టం అని ఇరుగుపొరుగు అన్నారు. అయితే రామయ్య మాత్రం ఎప్పటి లాగే “అదృష్టం ఏమిటి, దురదృష్టం ఏమిటి ? అంతా దైవేచ్చ ప్రకారమే జరుగుతుంది. ” అని వాళ్ళతో అన్నాడు. ఆతని మాటలు విన్న ఇరుగుపొరుగు రామయ్యకు మతి భ్రమించిందనుకున్నారు.
ఒక పక్షం రోజుల తర్వాత ఆ దేశపు రాజు తన సైన్యంలో భర్తీ కోసం దేశం నలుమూలల వున్న యువకులను బలవంతంగా తీసుకురమ్మని ఆదేశాలు జారీ చేసాడు. సైనికులు ఊరూరు తిరిగి యువకులను సమీకరించి బలవంతంగా రాజధానికి తీసుకుపోతున్నారు.
నారాయణపురానికి కూడా సైనికులు వచ్చి ఊళ్ళో వున్న యువకులందరినీ తీసుకుపోసాగారు. కాలు విరిగి మంచంపై పడి వున్న రామయ్య కొడుకును చూసి వీడు ఇప్పుడు సైన్యానికి పనికిరాడని వదిలేసి వెళ్ళిపోయారు.
తిరిగి ఇరుగుపొరుగు రామయ్య అదృష్టాన్ని పొగిడారు. రామయ్య మాత్రం యధాప్రకారంగా అంతా దైవేచ్చ అన్నాడు. అప్పుడు అతని అంతరంగాన్ని అర్ధమయ్యేలా చెప్పమని ఇరుగు పొరుగు రామయ్యను అడిగారు.
జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకు నచ్చితే మంచి జరిగిందని, మనకు అనుకూలంగా లేకపోతే చెడు జరిగిందని అనుకుంటూ దానిని మనకు అదృష్టం , దురదృష్టం కింద ఆపాదించుకుంటాము. అదృష్టం, దురదృష్టం అన్న మాటలను తరచూ వాడేస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న జీవితంలో ఏది అదృష్టమో, ఏది కాదో ఎలా చెప్పగలం. అందుకే మన పని మనం చేసుకుపోవడం, దాని ఫలితం తలకిందులైనప్పుడు కుంగిపోకుండా సాగిపోవడం విచక్షణ ఉన్న మనిషి లక్షణం. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. జీవితంలో ఏం జరిగినా అది ఆ దేవుని సంకల్పం బట్టే జరిగిందన్న విషయం మనం బలంగా గుర్తుంచుకోవాలి. అప్పుడు ఈ అదృష్తం, దురదృష్టం అనే భావనలు మనల్ని ఏమీ చెయ్యలేవు ” అని వివరించి చెప్పాడు రామయ్య.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *