March 19, 2024

పరవశానికి పాత(ర) కథలు – రైలు తప్పిన దేవుడు

రచన: డా. వివేకానందమూర్తి

 

వాన్ వానలో తడుస్తోంది.  వానపాములా నడుస్తోంది.  సెలైన్ డ్రిప్ జ్ఞాపకానికొస్తోంది.

ఎదురుగా అద్దం ఏడుస్తోంది.  వైపర్లు కన్నీటి చినుకుల్ని తుడుస్తూ ఓదారుస్తున్నాయ్.

చీకటి గుయ్యారంగా వుంది.  చీల్చే ప్రయత్నం వొయ్యారంగా వుంది.

అందంగా తూలుతోంది అటూ ఇటూ – తాగిన అప్సరసలా,  టాంకులో పెట్రోల్లో స్కాచి కల్తీ అయిందేమో అనుకొన్నాను.  కాలే సిగరెట్టు వెలుగుతో వాచీ చూసుకున్నాను.  కాలానికి మొహం వాచినట్టుంది.  సెకన్ల ముల్లు అర్జంటు పనున్నట్టు గబగబా తిరుగుతోంది.

చీకటి ఎంత బలిసిందో హెడ్ లైట్స్ వెలుగు చెబుతోంది.  చినుకులు కిరణాల్ని కడిగి మెరుగు పెడుతున్నాయి.  స్టీరింగ్ మీది అరచేతుల్లో వేడి వొంటికి చాలకుండా వుంది.  ఏదో చలి రహస్యం చెబుతున్నట్టు చలిగాలి చెవులు పక్కనుంచి రివ్వున వీస్తోంది.  బురదలో చక్రాల రొద – భూతాల్లా దారిపక్క చెట్టు – గతుకుల మీంచి గమ్యానికి ప్రయాణం – నిద్రపోతున్న రాక్షసి పలవరింతలా రాత్రి నాకు చిరాకనిపించేయి.  డాక్టర్నయినా నేనూ మనిషిని.  కానీ తప్పనిసరి మరి.  ఒంటరిగా వొక్కట్స్ – వానలో వాన్లో ఈ ప్రయాణం నా కోరికల కల మీద పగతీర్చుకొంటుంది.  పక్కన పడుచుపిల్ల వుంటే ఈ అనుభవం ఎంత తేడాగా,  తియ్యగా వుండేదో అని అంచనా వేసుకున్నాను.

చీకటి ముదిరేక పక్క వూరినించి కబురొచ్చింది ప్రాణాల మీది కొచ్చిందిట.  వచ్చేదాకా ప్రాణాలు తీసేడు.  డ్రైవరుకి ఫీవరు.  ఒంటిగానే బయల్దేరాను.  అక్కడ రాత్రి అర్ధరాత్రయింది.  మబ్బులు కమ్మడం చూసి దబ్బున బయల్దేరాను.  కానీ యిబ్బంది రాసి పెట్టినట్టుంది – వర్షం దారి కాసింది.

చీకటి చిక్కగా వుందని వుబలాటపడి ఆకాశం కళ్లు తెరిచింది.  ఆ మెరుపులో చీకటి సిగ్గుపడింది.  మళ్ళా ఆకాశం నిద్రోయింది.  ఆకలి కవిత్వంలా నాలో చీకటి కవిత్వం పుట్టుకొస్తోంది.  ధారలశబ్దం,  వందలాది జనం నీటి కొరడాలతో కొడుతున్నట్టుంది.

ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టరుగా అడుగుపెట్టేముందు,  స్నేహితులు చెప్పేరు నాకు – కరణం,  మునసబుల మధ్య శాండ్ విచ్ అయిపోతే తోచనప్పుడల్లా సమితి ప్రసిడెంటు టెస్ట్ చేస్తుంటాడని.  కానీ యీ పల్లెటూళ్ళో అడుగు పెట్టేక నేను విని నమ్మిన వూహని కాదనే వింత నిజాన్ని చూసేను.  నాకీ ప్రపంచం పచ్చని సంసారంలా అనిపించింది.  ఈ ఊరికి,  ఈ చుట్టు పక్కల మరికొన్ని పల్లెలకి కలసి నాయకుడినై రోజూ రోగులతో కత్తియుద్ధం చేస్తూ వీళ్ళకి ఆరోగ్యరక్షకుడినయ్యాను.  వూరంతా కలిసి సుమారు వెయ్యి గడప వుంటుంది.  వూరి మధ్య వేణుగోపాలస్వామి ఆలయం వూరంతటికీ వుజ్వలంగా కనబడుతుంది.  ఆయన ఆ వెయ్యిళ్లకీ వెలలేని దేవుడు.  యిక్కడికి వచ్చేక నేను వెయ్యిళ్ళ పూజారి నయ్యేను.  ఈ మనుషుల మాంసం లోనూ,  మనసులలోనూ ఆరోగ్యాన్ని చూసేను.  ఐకమత్యం చూసాను,  పరమార్థిక చింతన చూసేను.  వీరి చూపుల్లో భక్తినీ,  అనురక్తినీ కూడా చూసాను.  వీళ్ళంతా నన్ను ఒక అశ్వనీదేవతలా చూస్తున్నాను.  వీళ్ళు నాకు నచ్చారు.

వాన బాగా పెరిగింది.

వాన్ మొరాయిస్తోంది.

ఉన్నట్టుండి కుడివేపు ముందుచక్రం గుంటలో దిగపడింది.  ముందుకి కదలనివ్వడం లేదు.  తిక్క పేషంటులా తిప్పలు పెడుతోంది.  చివరి దమ్ములాగి సిగరెట్టు పారేసి ట్రై చేశాను.  గేరు మార్చినా దాని వుద్దేశం మార్చుకోలేదు.  నాకు తప్ప లేదు.  ఇంజను ఆపివేశాను.  దిగే ప్రయత్నంలో తలుపు తీశాను.  చలీ,  వర్షం చెంపమీద సాచికొట్టేయి.  దిగీ దిగడంతోనే కాలవలో మునిగినట్టు తల నుంచి కాళ్ళదాకా తడిసిపోయేను.  వాన్ మీద చేతులు మోపి ముందు తోసే ప్రయత్నం చేశాను.  కదల్లేదు.  చేతులు జారాయి అలసిపోయాను.  బోర్నవిటా తాగుతున్నా బలం చాల్లేదు నాకు.  నా పరిస్థితికి నా మీద నాకే జాలేసింది.  వర్షాన్ని భరించలేక లోపలికి ఎక్కి కూర్చున్నాను.  మళ్ళా స్టార్ట్ చేశాను.  కదల్లేదు.  చిరాగ్గా మరో సిగరెట్లు వెలిగించుకోబోతూంటే హఠాత్తుగా వెనకనుంచి ఎవరో తోసినట్టయింది.  వాన్ ముందుకి కదిలింది.  తలవని తలంపుగా జరిగిన వుపకారానికి చకితుణ్ణయి తల తిప్పేను.  అనుకోకుండా అవతలివేపు ఫ్రెంట్ డోరు తెరిచుంది.  తటాలున లోపలికి ఎక్కి కూర్చుని డోర్ మూసింది.  ‘హమ్మయ్య’ అనుకొంది పైకి.  ‘ఆమె’ ఎవరు? కారు చీకటిలో కారు తోసిన ఈ కాంత ఎవరు? ‘వో కౌన్ థీ’ సినిమా క్షణం గుర్తుకొచ్చి మనోజ్ కళ్లు చిట్లించేను.  కానీ నేను భయపడలేదు.  నాకు దయ్యాలంటే నమ్మకం లేదు.

‘ఊఁ కదలండి!’ అంది.  కాజువల్ గా.  నేను ఆమె వైపు అలాగే అల్లల్లాడని ఆకులా చూస్తున్నాను.  చదువులేని కుటుంబంలో పుట్టి చదువుకోడం మానేసి,  సంస్కారాన్ని చదువుకున్నట్టుంది ఆమె కళ.  తడిసిన జుట్టునీ,  ముఖాన్ని చేతులు వైపర్సులా చెరుపుతున్నాయి.  ఆమె ముఖం అద్దంలా వుంది.  ఆమె చాలా ఏపుగా,  బలంగా రష్యన్ స్పోర్ట్సు వుమన్ లావుంది.  చీరెలో,  జాకెట్టులో చెదిరిన ముంగురుల్లో,  చెవి రింగుల్లో,  చెక్కిన అజంతా శిల్పంలా కూడా వుంది.  అందంలోంచి సౌకుమార్యాన్ని వేరు చేసి సౌష్టవాన్ని పొదిగినట్టుంది.  ఈ చిత్రమైన కాంబినేషన్ నేనెక్కడా చూళ్ళేదు.  ఆ చొరవ,  ఆ కూర్చొన్న తీరు,  ఆ ఠీవి – యింతకాలం యింతుల్లో అంత బాగుండుననుకునేవాణ్ణి.  కానీ యిదో కొత్త అందం.  ఆమె నా కష్టాన్ని గుర్తించిన దేవతలా వచ్చినా,  మగాణ్ణి కాబట్టి వాతావరణాన్ని బట్టి నాలో కోరిక చెలరేగింది.  ఆమె అలా వర్షంలో తడిసినందుకు నేనెంతో హర్షంలో తడిశాను.  సామాజిక విలువలని సమయాన్ని బట్టి మరిచాను.  అరిచేతుల్లో వేడి ఒళ్ళంత పాకింది.  కోరిక యింత వేడిగా వుంటుందని నాకిప్పుడే తెలిసింది.  కానీ అంతలోనే వెనుకనుంచి వాన్ తోసిన వీరవనిత ఈమే అని తెలియగానే నా కోరికని వురి తీసేను.  యింతలో ఆమె చీరకొంగుతో కళ్లు తుడుచుకోవడం పూర్తిచేస్తూ తలతిప్పి నన్ను చూసింది.  ఏదో మాట్లాడ బోతుంటే నేనే అన్నాను- ‘థ్యాంక్స్ – ఎక్కడిదాకా’.

ఆమె చెప్పింది. నే వెళ్ళే వూరే.  ఆసక్తిగా అడిగేను.  ‘నీ పేరూ?’ ‘అలివేలు’ – ఆమెకా పేరెందుకో నప్పలేదనిపించింది నాకు. అడక్కముందు ఆమె పేరు సుబ్బలక్ష్మి,  కౌసల్యో అయితే బాగుణ్ణనుకున్నాను.  అవి ఆ మనిషికి తగ్గట్టు హెవీగా వుండి సరిపోతాయనుకున్నాను.  కానీ అలివేలు మెత్తగా వుంది.  ఆ పేరులో ఏదో భావబంధం వుందనిపించింది.  అలా అనిపించగానే అంతవరకూ కరినశిలని చెక్కి దిద్దినట్టున్న ఆమె యిప్పుడు కమనీయమైన పాలరాతి బొమ్మలా కనిపించింది.

వాన్ స్టార్ట్ చేశాను.  ముందుకి చూస్తూనే సగం సగం పక్కకి చూస్తున్నాను.  ఆమె పెదాల బిగింపులో ఏదో పట్టుదల పచార్లు చేస్తున్నట్టుంది.  కళ్ళల్లో తొందరపాటు చూసి కుతూహలంగా అడిగాను –

‘యింత రాత్రి మా వూళ్ళో నీకేం పని!’

‘వేణుగోపాలస్వామిని తీసుకు వెళ్ళాలి. ’

‘భర్తా?’

‘నాకింకా పెళ్ళి కాలేదు’ -మనసులో ‘హమ్మయ్య’ అనుకున్నాను.  ఎందుకో నాకే తెలియదు.  మనకి దక్కకపోయినా పెళ్ళికాని అందమైన అమ్మాయి,  పెళ్ళయిన అమ్మాయికంటే ఎందుకో దగ్గరగా అనిపిస్తుంది.  మళ్ళా నేనే ముందు మాట్లాడేను – ‘అన్నగారా?

‘ఎవరూ కాదు – నా కెవరు లేరు – నాన్న తప్ప. ’

‘మరి?’

‘దేవుడు’

‘అంటే?’

‘భగవంతుడు’

‘నా కర్థం కావటం లేదు. ”

‘అవును.  భగవంతుడంటే-’ ఆమె అద్దం వేపు చూస్తూ కన్యాశుల్కంలో మధురవాణిలా నవ్వింది.  కాంతిలాగ మెరిసి ఆ నవ్వు నా మీదకి పరావర్తనం చెంది నాలో ఏదో పరివర్తన కలిగించింది.  ఆ నవ్వుతో దెబ్బతిన్నట్లు ఫీలయి నన్ను నేను పెంచుకోవాలనుకుని అలివేలు మీద వాత్సల్యభావాన్ని పెంచుకున్నాను.  క్లచ్ నొక్కుతూ అడిగేను.

‘వివరంగా చెప్పు’

‘చెప్పానుగా – నేను దేవుణ్ణి తీసుకువెళ్ళడానికి వస్తున్నాను’

‘తీసుకు వెళ్లే వస్తాడా దేవుడు?’

‘నేను తీసుకు వెళ్ళగలను’

యింతవరకూ అలివేలు స్త్రీలో చిత్రమయిన కలబోతల్ని చూసేను.  యిప్పుడు వ్యక్తిత్వం మరింత చిత్రంగా కనిపిస్తోంది.  మానవ లక్షణాల పొందిక ఆమెలో విలక్షణంగా వుంది.  అర్ధరాత్రి వానలో దేవుణ్ణి తీసుకువెళ్తానంటూ

వస్తోంది! దేవుణ్ణి తీసుకువెళ్ళడం ఏమిటి? అందరిలో అన్ని చోట్లా వ్యాపించిన భగవంతుణ్ణి

పట్టుకోడం సాధ్యమా! అయినా వేణుగోపాలస్వామిలోనే అలివేలు తన దేవుణెందుకు చూసింది? – ఒక వేళ పారవశ్యంలో అలా అంటుందేమో! అయితే అర్ధరాత్రి వర్షంలో దైవదర్శనమా? అలివేలుకి పిచ్చేమో అని అనుమానం వేసింది నాకు.  అయినా యిన్ని విలక్షణాలు మూర్తీభవించిన స్త్రీలో ఈ వుద్దేశం వుదయించడంలో వింత ఏ మాత్రం లేదు.

వాన తెరిపిస్తోంది.  వాన్ దీపాల వెలుగులో వూరు కనిపిస్తోంది.  యిక దిగిపోతుందిలా వుంది.  నా అజంతా కన్య,  మళ్ళా మనిషిని పూర్తిగా చూశాను.  ముఖ్యంగా తడిసి కనిపించాలనుకునే భాగాలు.  ఏదో అందమైన మగతనం అలివేలు కూర్చున్న తీరులో అగుపడింది.  అడిగేను.

‘నీలో మగతనం ఎందుక్కనిపిస్తోంది?’ అని కాదు.  ‘వాన్ కనబడకపోతే ఏం చేసేదానివి?’

‘నేను ముందుకి తొయ్యకపోతే మీరేం చేసేవారు?”

నవ్వుకున్నాం.

‘ఆపండి”

‘నవ్వా?”

‘ఉహూ వాన్’

‘ఏం?”

‘దిగిపోతాను. ”

‘తడిసిపోతావు’ స్లో చేశాను.

‘తడిశాకే ఎక్కాను.  అయినా యీ చినుకులు ఫర్వాలేదులెండి.”

‘మా యింటికి వస్తే వొళ్ళారబెట్టుకుని వేడి టీ తాగి వెళ్లిచ్చు’ ఆపుతూ అన్నాను.

‘రాను. ”

‘నాకు పెళ్ళి కాలేదు.  ఒక్కళ్లే.  యింటి దగ్గర యిబ్బంది వుండదు నువ్వొస్తే. ’

‘నాకు వుంటుంది.  త్వరగా చేసుకోండి.  వస్తా. ’ తలుపు సగం తెరిచింది.

‘నీకు ఫ్లూ వస్తే బాగుణ్ణు’

“మీరు డాక్టరా?”

తల పంకించేను.

‘నాకు జ్వరాలు రావు.  నేనే వీలైనప్పుడు వస్తాను.  నమస్తే!’ దిగబోతోంది.

‘చూడు-నీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి కానీ – యింతకీ నీ రాక నాకింకా బోధపడలేదు. ’

‘తెల్లారేక తెలుస్తుంది లెండి’ ఏమిటి? తెలివా? – ఆమె పెదాలు విరిగేయి.  ఆ నవ్వు నాకు నచ్చింది.  ఆ అనుభూతి అనుభవిస్తూంటే ఆమె చీకట్లో కలిసిపోయింది.  అరకులోయ,  కులూవ్యాలీ లోతుల్లోకి జారిపోతున్నట్లుగా డ్రైవ్ చేస్తూ మెల్లగా గూటికి చేరాను.  నా ఆలోచనల్లో అలివేలు నిద్రపోయింది.  అలివేలు ఆలోచనలో నాకు నిద్రపోయింది.

* * *

హఠాత్తుగా మెలుకువొచ్చింది.  ఎవరో దబదబా గబగబా తలుపు తడుతున్నారు.  నిద్రిప్పుడు పట్టిందో తెలియలేదు.  గానీ పాడయినందుకు తీవ్రంగా కోపం వచ్చింది.  కానీ,  వృత్తి,  సహనాన్ని గుర్తు చేస్తే,  లేచి లైటు వేస్తూ “ఆఁ’ అన్నాను.  నా అలికిడికి తలుపు చప్పుడు ఆగింది.  యిది మరో అర్జంటు కేసై వుంటుంది.  ఎందుకో ఈ రోజు రోజూలా లేదు.  తలుపు తీస్తూ అనుకున్నాను – ఒక వేళ అలివేలు కాదు కదా! అయినా యిప్పుడు ఎందుకు వస్తుంది? తీసి చూస్తే నే చూసిన దృశ్యం నన్ను విగ్రహాన్ని చేసింది.  నే చూసింది నేనూహించిన అలివేలుకాదు.  వొంటినిండా దెబ్బల్తో,  రక్తంతో,  గుండెచెదిరేలా కనిపించే అలివేలు.  ఆమె చీరె బాగా నలిగి,  జారిపోయింది.  కవచంలాంటి జాకెట్లో కానిచోట చిరిగింది.  కళ్ళల్లో కనిపించిన ఠీవి చెరిగింది.  గాజులు పగిలితే – చేతుల్లోంచి రక్తంలా వుంది.  గాలి వీస్తూంటే రింగులూ,  ముంగురులూ చిరాకు పడుతున్నాయిలా వుంది.  దీపం వెలుగులో దీనంగా,  దిగులుగా,  భయంతో,  బెంగతో నా వేపు చూస్తూ నిలబడింది.  అలా వూహించని వుపద్రవం చూచి రెపరెపలాడేను నేను.  పొడి పెదవుల్తో రమ్మన్నాను.  ఆమె శరణుకోరిన లేడిలా తొందరగా లోపలికి ప్రవేశించింది.  గోడవార కూర్చీలో కూలబడి చేతుల్లో యిమడని రొమ్ముల్ని పొదివి పట్టుకుంటూ మాట్లాడింది.  ‘ముందా తలుపు గడియ వేసేయండి. ’

ఇప్పుడామెలో భయం బాగులేదు.  ఆమె చెప్పినట్టే చేశాను.  ఆమె కూర్చోలేక పోవడం చూశాను.  కంగారుగా తీసుకువెళ్లి ఆమెని బెడ్ మీద పడుకోబెట్టాను.  ఆ కళ్ళల్లో ఆవేదన నన్ను కదిలించింది.

‘నన్ను రక్షించండి?’ జాలిగా ఆర్ధిస్తూ అడిగింది.  అలివేలుని ఆ స్థితిలో చూడగానే ‘ఆల్బర్ట్ మొరేవియో టు వుమెన్’లో ఎక్కడో పేజీలు నా మనసులో చిరిగేయి.  ఈ అత్యాచారానికి కారకులైన రాక్షసులెవరా అనిపించింది.  నాకు అంతుపట్టలేదు.  యిక్కడి మనుష్యులందరికి పువ్వులాంటి మనసులున్నాయి.  వీళ్ళల్లో కనీసం ఒక్కడేనా పాపాత్ముడుంటాడని నే నూహించ లేకపోతున్నాను.

బెడ్ మీద అలివేలు బాధగా మూలిగింది.  త్వరగా చికిత్స చేసే ప్రయత్నంలో ప్రవేశించబోయేను.  ఇంతలో యింటి బైట జనం కోలాహలం వినబడుతూంది.  కిటికీ తెరిచి చూశాను.  ఆశ్చర్యం! నేను దేవతలనుకునే మనుషులు దయ్యాల్లా భయంకరంగా హా హా కారాలు చేస్తున్నారు.  చేతుల్లో కర్రలూ,  కళ్లల్లో క్రౌర్యం కనబడుతున్నాయి.  ఇంటి దగ్గరగా వచ్చేశారు.  కల్లో కూడా వూహించని కల్లోలం చూడాలని కంగారుపడ్డాను.  ‘ఇప్పుడు శరణుకోరిన అలివేలుని

నేనెలా రక్షించగలను?’ అని భయపడ్డాను.  జనం యింటికి బాగా దగ్గరికి వచ్చేశారు.

ఇంటి ముందు చెట్ల క్రిందికి వచ్చేక ఆగారు.  అరిచేరు – ‘బాబూ! డాట్రు బాబూ! దాన్నొదిలేయండి! అది మంచిది కాదు.  మా చెడ్డది. ’ వాళ్ల అరుపుల్లో యింకా నా మీద గౌరవం అలాగే వుంది.  యింతవరకూ అలివేలుని రేప్ చేశారనుకుంటున్నాను.  కానీ యిప్పుడసలు జరిగిందేవిటో బోధపడలేదు.  అలివేలు తప్పు చేసిందా? పాపం చేసిందా? ఛా! అలివేలు అలాంటి మనిషి కావడానికి వీల్లేదు.  ఏదో అపార్థం ప్రబలి ప్రమాదానికి దారితీసి వుంటుంది.  అనుకొంటూ నా నిశ్చయానికి నేను వచ్చేశాను.

మెల్లగా వీధివేపు తలుపు తెరిచి గుమ్మంలోకి వచ్చాను.  గుమిగూడిన జనంలోంచి యిద్దరు పెద్దమనుషుల్లాంటి వాళ్లు నా దగ్గరగా వచ్చేరు.  అలివేలు గాయపడ్డంకంటే నాచుట్టూ దేవతల్లా బ్రతికే ఆ మనుషులు దానవులయి పోవడం నేను చూళ్ళేకపోయాను.  నా మనస్సు వుడికిపోయింది.  నేను వాళ్ళవేపు కర్కశంగా చూశాను.  వాళ్ళకి నా మీద వున్న గౌరవాన్ని వాడుకుంటూ అన్నాను – “ఏం జరిగింది? మీరిలా రాక్షసులై పోయారేం?’

“అంతమాటనకండి బాబూ! అదెవరో మీకు తెలియదు.  దొంగరాక్షసి! కూడని పని చేసింది బాబూ! దాన్ని ప్రాణాలతో వదిలితే పాపం బాబూ! కీడు.  తమరేనా ఏ మందో మాకో యిచ్చి హతం చేయండి!”

నేను కోపంగా వణికేను.  అరిచేను – “వెళ్ళండి!” అని కసిరాను – “దేవుడైనా,  రాక్షసుడైనా అనారోగ్యంతో నా దగ్గరికి వస్తే ఒకేలాగ ఆదరించడం నేర్చుకున్నవాణ్ణి నేను.  ఆమెను విడిచిపెట్టడానికి వీల్లేదు.  మీరు లోపలికి అడుగుపెట్టడానికి అంతకన్నా వీల్లేదు. ’

“లోపలికి రాం బాబూ! మేమూ మనుషులమే కానీ యిది మా వూరి సమస్య.  పరిష్కరించుకోకపోతే మా వూరు పాడైపోతుంది బాబూ. ”

“అయితే,  నేను మీకు పరాయివాడినా!” నాలో బాధ కలగడం వాళ్ళు చూసేరు – “బాబూ! లేదు బాబూ! కానీ యిక్కడ పుట్టిన వాళ్లం.  యిక్కడ పెరుగుతున్న వాళ్లం బాబూ! యీ నేలకి మేం ఋణపడ్డాం.  దీన్ని పవిత్రంగా చూసుకోవాలి బాబూ! దాన్ని విడిచి పెట్టండి. ”

“వీల్లేదు! నా దగ్గర పేషెంటుగా వున్నంత వరకు నాకూ మీకూ కూడా ఆ అధికారం లేదు వెళ్ళండి!”

మేము “వెళ్ళం బాబూ! యిక్కడే వుంటాం.  ఎన్నాళ్ళయినా వుంటాం.  అయితే దానికి ఆరోగ్యం చిక్కాకే దాన్ని మా చేతికి చిక్కనివ్వండి.  అప్పుడే తేల్చుకుంటాం. ” ఖండితంగా చెప్పేరు.  “అసలు జరిగిందేమిటో మీకు తెలియదు బాబూ!”

“మీరు మనుషుల్లా ప్రవర్తించలేదని తెలుస్తూనే వుంది.  ఏం జరిగిందో నేను తెలుసుకోగలను.  మీరు చెప్పక్కర్లేదు. ” తలుపు వేసి లోపలికి వచ్చేను.

అలివేలు మూలుగుతోంది.  తొందరగా గాయాలకి చికిత్స చేస్తూ అడిగేను –

“యిల్లు ఎలా కనుక్కొన్నావ్?”

“వెతికాను.  బోర్డు కనబడింది.  కాస్త తడువుకున్నాను. ”

కొన్ని గంటల క్రితం గుంటలో దిగబడ్డ వ్యాన్ని ముందుకి తొయ్యగలిగిన అలివేలు,  ఇప్పుడు కేవలం మాట్లాడ్డానికి భరించలేని బాధ చూపిస్తూంటే నా గుండె నీరయింది.  కాస్సేపటికి వెయ్యవలసిన మందులు వేసి,  కట్టవలసిన కట్టు కట్టి,  యియ్యవలసిన ఇంజక్షన్లు యిచ్చి,  స్టోవ్ మీద బ్లాక్ కాఫీ చేసి ఇచ్చాను.  బెడ్ పక్కనే నిశ్చలంగా కూర్చొని నిద్రని దూరం చేసుకొన్నాను.  అలివేలుని దూరం చేసుకోకూడదనే ఆలోచన నాలో ఆకాశమంత పెరుగుతోంది.  అక్కడికి అలివేలు నాదైనట్లు.  ఆమెలో సత్తువ కాస్త చేరినట్టయింది.  కళ్ళు తెరిచి కృతజ్ఞత చూపిస్తోంది.

యిప్పుడు మాట్లాడించేను – ‘నిన్ను వాళ్ళు కొట్టారా?” అవునన్నట్లు కంటి రెప్పల కదలికతో చెప్పింది.  అడిగేను – “ఎందుకు?’

“దేవుణ్ణి తీసుకు వెళ్లామనుకున్నాను. ”

“అసలేం జరిగిందో వివరంగా చెప్పు. ”

“ఇందాక వేణుగోపాలస్వామి దగ్గరికి వెళ్లాను.  గుళ్లో దేవుడు కోసమేగా యింత రాత్రి యింత దూరం వచ్చింది.  గర్భగుళ్లోకి వెళ్ళి విగ్రహాన్ని గునపంతో తవ్వుతూంటే చప్పుడైంది.  వూరంతా లేచి వచ్చారు.  నన్ను చూశారు.  మా దేవుణ్ణి దొంగిలిస్తావా – అన్నారు.  అసలే దొంగతనం,  అందులో అపచారం అన్నారు.  పాపం చేశావన్నారు.  వాళ్లూ,  నేనూ ఘర్షణ పడ్డాం.  వాళ్లు నన్ను తిట్టారు.  నాకు కోపం వచ్చింది.  ఇద్దర్ని నేను కొట్టాను.  వాళ్లకి రక్తం వచ్చింది.  అంతే,  అంతా నా మీద తిరగబడ్డారు.  నా పాపానికి చావే శిక్షన్నారు.  యిదుగో – చూస్తున్నారుగా ఏం చేశారో! ఎలాగో తప్పించుకుని మీ యింటి ముందు డాక్టరు బోర్డు వెతుక్కున్నాను.  నా శిక్షింకా పూర్తికాలేదు.  నేనొచ్చిన పనీ పూర్తికాలేదు. ”

“ఎంతపని చేశావ్ అలివేలూ! యీ వూళ్ళో దేవుడే వీళ్ళ ప్రాణం.  అయన్ని గునపంతో పొడిస్తే,  అది వీళ్ళ గుండెల్లో తగుల్తుంది.  మంచివాడి కోపం దేవుడుకంటె బలంగా వుంటుంది.  ఏమైనా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావ్ అయినా యిందులో అసలు నీ వుద్దేశం ఏమిటి?”

“నాన్నకి జబ్బుగా వుంది.  తొందరగా చచ్చిపోతాడు.  డాక్టర్లే చెప్పారు. ”

“ఈ దేవుడు వచ్చి బతికిస్తాడనుకున్నావా?”

“కాదు. నాన్నగారు గొప్ప శిల్పి, వేణుగోపాలస్వామి అంటే ఆయనకెంతో భక్తి,  యీ దేవుణ్ణి కొన్ని సంవత్సరాలు కష్టపడి నాన్నే చెక్కారు.  ఈ విగ్రహంలో దేవుడంటే ఆయనకి ఎంత పారవశ్యమో నేను చెప్పలేను.  ఆయన కడుపున పుట్టిన ఆడదాన్ని,  నాకే తెలుసు. ” ఆమె క్షణం ఆగి మాట్లాడింది.  – “చివరికి యీ తుది ఘడియల్లో చచ్చిపోయేముందు చివరిసారిగా నా దేవుణి చూసి ప్రాణాలు విడిస్తే బాగుణ్ణు,  భగవంతుడా! అంటూ పలవరిస్తూంటే నా కనిపించింది.  నాన్న ఎలాగూ కదల్లేడు.  యింత దూరం యిప్పుడు ఆయన్ని నేనెలాగూ తీసుకువచ్చి దైవదర్శనం చేయించలేను.  ఒకవేళ అలా తీసుకువచ్చినా,  దారిలో నాన్న కడసారి కోరిక తీరకుండా నికృష్టపు చావు చావడం నేను సహించలేను.  తల్లీ,  తోబుట్టువులూ లేనిదాన్ని.  నాన్నే నన్ను యింతమనిషిని చేశాడు.  రక్తబంధం కంటే కృతజ్ఞత మీద నాకు నమ్మకం వుంది.  అంచేత దేవుణ్ణి నేనే తీసుకువెళ్ళి ఆయనకి చూపిద్దామనుకున్నాను.  మీకు నా వుద్దేశం పిచ్చిగా వుండొచ్చు.  మరి మీరే చెప్పండి! నాన్నని దేవుడు పుట్టిస్తే,  నాన్న దేవుణ్ణి సృష్టించాడు.  యీ రోజు యీ మనుషుల్లో యింత శక్తినీ,  నమ్మకాన్ని పెంచిన దేవుణ్ణి నాన్నే తీర్చిదిద్దాడు.  నాన్నకి మరి ఆ మాత్రం హక్కులేదా డాక్టరు గారూ! యిప్పుడు నేను చేసింది తప్పంటారా? పాపం అంటారా? దొంగతనమంటారా?’ ఆమె గొంతు బొంగురు పోలేదు – చూడండి డాక్టరుగారూ! నాకు నేనేమైపోయినా బాధ లేదు – ఎవరేమనుకున్నా భయం లేదు.  జన్నిచ్చిన నాన్న ఋణం నేను తీర్చుకో గలిగితేచాలు.  దయచేసి మీరైనా నాకీ సహాయం చేసి పెట్టండి.  దేవుణ్ణి తీసుకువెళ్ళి నాన్నకి చూపించండి.  ఆయన తృప్తిగా కళ్ళు మూస్తే నా బ్రతుకంతా పండగవుతుంది.  చెయ్యరూ! – నాకోసం’ అలివేలు కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

వింటున్నదీ,  జరుగుతున్నదీ నాకు అయోమయంగా వుంది.  యిన్నేళ్ళ జీవితంలో యింత చిత్రమైన సంఘటన నాకెప్పుడూ తటస్థపడలేదు.  మౌనంగా లేచాను.  కిటికివేపు నడిచాను.  నా మనుషులు చెట్ల క్రింద నిమిషాలు లెక్కపెడుతున్నారు.  నా మనసులో అలివేలు రక్తమై ప్రవహిస్తోంది.  చివరికి ఒక నిశ్చయానికి రాగలిగాను.  అలివేలు దగ్గరగా వచ్చి కూర్చొని అదే చెప్పేను –

“నువ్వు చేసింది చెయ్యరానిపని.  నేను నీకు సహాయం చేయలేను.  నీ పరిస్థితికి జాలిపడగలను.  నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలను.  అంతే.  కానీ నీకోసం భగవంతుడి విగ్రహాన్ని తవ్వలేను.  యీ మనుషుల నమ్మకాలన్నీ యిక్కడి దేవుడిగా వెలిశాయి.  అలివేలు! నా మాట విను,  దేవుణ్ణి చెక్కి నీ తండ్రి ఏనాడో దేవుడయ్యాడు.  దేవుణ్ణి కొట్టి తెస్తే ఏనాటికీ నీ తండ్రి నిన్ను క్షమించడు.  తృప్తిగానూ మరణించడు.  కాబట్టి నే చేయగలిగిందల్లా ఒక్కటే.  నీకు ఆరోగ్యం చేకూరేదాకా యిక్కడ రక్షణ యివ్వడం.  నాకు నీతో పెద్ద పరిచయం లేదు.  నీ గురించెంతో తెలియదు – అయినా నీ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తాను.  అంతకంటే నేను చెయ్యగలిగిందేమీ లేదు. ”

అలివేలు నా మాటలు విని,  అంత మనిషీ ఆకులా వణికింది.  నిస్సహాయత,  దైన్యం కలిసి ఆమెని దుఃఖసముద్రంగా చేశాయి.  ఆమె పరిస్థితి అసలే బాగుండలేదు.  గాయాల బలానికీ,  భావాల తాకిడికీ ప్రాణాలు వదిలేస్తుందేమోనని,  భయం వేసింది నాకు.  వెంటనే నిద్రకి మందిచ్చేను.  కాస్సేపటికి అలివేలు అంతులేని నిద్రలోకి జారింది.  నేను ఆలోచనా ముద్రలోకి జారేను.

అలివేలు చేసిన పనిలో నాకేమీ అర్థం కనిపించలేదు.  వూహించని విపత్తు నెత్తి మీదికి తీసుకొచ్చింది.  ముందు పరిస్థితి వూహించుకుంటే ఏం చెయ్యడానికి ఆలోచన తెగటం లేదు.  ఏమైనా అలివేలుని రక్షించడం నా ధర్మంగా భావించాను.

అయితే రక్షించడం ఎలాగన్నదే ప్రశ్న అయి కూర్చుంది.  రక్షించడమంటే తప్పించడమన్న మాట.  ఎందుకంటే

వూరి వాళ్ళని ఎవరూ వూరుకోబెట్టలేరు.  అలివేలుని అగ్నిగుండంలోకి తొయ్యలేను.

ఆ రోజు ఎలాగో గడిపేశాను.  వూరివాళ్ళంతా ఏకమైపోయారు.  వాళ్ళ చూపుల్లో క్రమంగా నా మీద గౌరవం తగ్గిపోవడం గమనించాను.  నాకు వాళ్ళల్లో మిగిలివున్న మంచితనపు ఛాయ ఒక్కటే కనబడింది.  నా మాట జవదాటి నా యింట్లోకి రాకపోవడం.  వాళ్లు యింటిముందే షిఫ్ట్ బేసిస్ మీద కాపు వేస్తున్నారు.  రాత్రీ,  పగలూ.  బోనులో సింహం పిల్లలా అలివేలు నా యింట్లోనే బందీ అయిపోయింది.

ఆ మర్నాడు కూడా గడిచింది.  ప్రజలు పట్టుదలని అలాగే పట్టుక్కూర్చున్నారు.  రకరకాలుగా నచ్చచెప్పారు.  నేను ససేమిరా అన్నాను.  క్రమంగా నాకు యింట్లో అలివేలు కంట్లో నలుసులా తయారైంది.  రెండు రోజుల క్రితం ఆమె దగ్గిరతనం కోసం పిచ్చెక్కిన నేను – యిప్పుడు ఆమె దగ్గిరయితే పిచ్చివాణ్ణవుతున్నాను.

ఈ రెండ్రోజుల్లోనూ అలివేలు ఆరోగ్యంలో ఏమంత మంచి మార్పేమీ రాలేదు.  కాకపోతే.  మాటల్లో మరింత దగ్గిరయి ఆమె నా గుండెల్లో జాలి మేడలు కట్టింది.  అంచేత అలివేలు నాకు సమస్య అయిపోయింది.

మూడో రోజు మూడ్ నాదేం మారలేదు.  ఏదో ఒకటి తేల్చేసి తలబరువు దింపుకోవాలనుకుంటున్నాను.

రాత్రయింది.  వర్షం నిన్నే మానేసింది.

చీకటి చింతలా పెరిగింది.  నేను నిద్రపోలేదు.  కిటికీలోంచి చూస్తే వాళ్ళు అలాగే కాపువేసి,  లాంతరు వెలుగులో కునికిపాట్లు పడుతున్నారు.  మూడు రోజులుగా వాళ్ళు పనులన్నీ మానేసారు.  ఏకదీక్షగా,  భక్తిని రక్షించుకోడానికి నిరంతరం కృషి చేయాలని నాయింటి ముందలా నిఘావేసేరు.  జరిగేదంతా నాకు చాలా డ్రమెటిక్ గా అనిపిస్తోంది.  నిజంలో కొత్తదనాన్ని యీ సంఘటనతో యిప్పుడు చూస్తున్నాను.

అలివేలు నిద్రపోతోంది.

మెల్లగా యింటికి పెరటివేపు నడిచాను.  గుమ్మం తెరిస్తే చిమ్మచీకటి.  నెమ్మదిగా తలుపు జారేసి నిశ్శబ్దంగా వెనుక చెట్ల నీడల్లోకి చీమలా పాకి కాస్పేపట్లో వూరు వదలి ఆత్రంగా రోడ్డెక్కేను.  బ్యాటరీ లైటు వెలుగులో దోవ గుర్తుపడుతూ తొందరగా దగ్గరలో వున్న టౌన్ కి నడిచేను.

* * *

పోలీస్ వాన్ నాయింటి ముందాగింది.  ముందు నేను దిగి యింట్లోకి నడిచేను.  హఠాత్తుగా బెడ్ మీది దృశ్యం చూసి తట్టుకోలేకపోయాను.  వూహించని వుపద్రవం జరిగిపోయిందనుకున్నాను.

మంచం మీద అలివేలు మాయమైందని తెలియగానే హడావుడిగా యిల్లంతా గాలించేను.  పెరటిగుమ్మం బార్లా తీసి వుంది.  కంగారుగా వెనక్కివస్తే – వూరి మనుషులు నేను లేకపోవడం పసిగట్టి,  సహనాన్ని కోల్పోయి,  అలివేలుని హతం చేశారేమోనని అనుమానం వేసింది.  భయంగా బైటికి వచ్చేను.

పోలీసులు పోలీసుల్లాగే నిలబడ్డారు.  ప్రజలు నన్ను మింగెయ్యాలన్నంత కోపంగా చూస్తున్నారు.  ‘అలివేలు నేం చేసేర’ని దీనంగానే అడిగేను.  వాళ్ళు తెల్లమొహాలేశారు.  ఆశ్చర్యపోయేరు.  గబగబా నా యింట్లోకి పరిగెట్టి,  వెదికి నిర్ధారించుకున్నారు.  ఆ ప్రదేశం నాలుగు మూలలా లాంతర్లతో చెట్ల నీడల్ని చెండాడుతూ వెదికేరు.  ఆమె జాడ తెలియలేదు.  సాణువులా నిలబడితే మళ్ళా నన్ను మరో ఆలోచన కదిలించింది.  జనమంతా నా వెనకాల పరిగెట్టి రాగా నేను వేణుగోపాలస్వామి ఆలయంవైపు సాగాను.

ఆశ్చర్యం! – అక్కడ అలివేలు లేదు.

అంతకంటే ఆశ్చర్యం! – అక్కడ భగవంతుడి విగ్రహం కూడా లేదు.  ఆ ప్రదేశం ఖాళీగా – పెచ్చులు రేగి పగిలిన గుండెలా వుంది.  పక్కనే పాత గునపం పని పూర్తి చేసుకుని,  కాటేసిన పాము చచ్చినట్టుగా పడివుంది.  ఆ ప్రదేశమంతా చిమ్మిన రక్తంతో చిందరవందరగా వుంది.  నేను తొందర తొందరగా ఆలోచించాను.  నా వెనకాల జనం హాహాకారాలు చేశారు.  రోజూ వాళ్ళ గుళ్ళో నమస్కారాలు చేసేవారు.

విసురుగా వీచే తెల్లవారుఝాము గాలికి గంటలు కదిలి మ్రోగితే ప్రజలు కీడు శంకిస్తూ భయపడ్డారు.  నేను వాళ్ళని వారిస్తూ,  చేతిలో దీపంతో జాడలు వెదికాను.  రక్తం చిమ్మిన గుర్తుల్ని పట్టుకుని ఆత్రంగా కదిలే ఆ దారి మమ్మల్ని వూరు దాటించేసింది.  సమయం చల్లగా వున్నా,  చెమటలు వొళ్ళంతా పట్టేయి నాకు.  నా శరీరంలో ఒక భాగం ఎక్కడో జారి పడిపోయినట్లు,  అలివేలు కోసం దిగులు పడిపోయి దిక్కులు వెదుక్కుంటూ వడివడిగా నడిచాను.  సుమారు మైలున్నర నడిచాక మార్గం బోధపడింది.  వెంటనే దగ్గరలో వున్న చిన్న రైల్వేస్టేషన్ దగ్గరికి వెళ్ళాం.

రైలు అందక హతాశురాలయిన ఓ అమ్మాయి ప్లాట్‌ఫారమ్ మీద వున్నదని స్టేషన్‌ మాస్టరు ద్వారా తెలుసుకున్నప్పుడు,  నేనున్న ఊళ్ళో గుడిలాగే,  నా కున్న వొంట్లో మనస్సు కూడా ఖాళీగా వెలితిగా అయిపోయింది.

నేను ప్లాట్‌ఫారమ్ మీదికి పరిగెట్టాను.  అదంతా నిర్మానుష్యంగా వుంది.  అక్కడా అక్కడా దీపాలు వెలిగించుకున్న రెండు మూడు స్తంభాలు తప్ప తక్కిందంతా ఎడారిలా వుంది.  అలివేలుని చూడాలనే దాహంతో అలాగే వెర్రి వాడిలా నడిచాను.  అంతలో దీపం వెలిగే ఓ స్తంభానికి దగ్గరగా నీడ పొగుచేసినట్టు నా దృష్టి ఏదో నాకర్షించింది.  దగ్గరకెళ్ళి చూశాను.

నా గుండెలు జారాయి.  నా మనస్సులో మహారణ్యాలు తగులబడ్డాయి.  నా ఎదుటి దృశ్యం నన్ను నాలోంచి వేరుచేసి,  వేరే చోటికి విసిరేసింది.

రక్తంలో అలివేలు తెంపేసిన గులాబీ దండలా పడివుంది.  ఆమె రొమ్ముల మీద వేణుగోపాలస్వామి నిగ్రహించుకోలేక విగ్రహమై పోయినట్టున్నాడు.  అలివేలు రొమ్ముల మధ్య అందమైన దేముడు ఇంకా నిద్ర లేవలేదు.  గుడికంటె గుండె పదిలం కాబోలు! అలివేలు రక్తం దేవుడికళ్ళకి అంటుకుంది.  భక్తిని భరించలేక రక్తం కారుస్తూ ఏడిచినట్టు.  రక్తాన్ని పంచుకున్నందుకు ప్రతిఫలంగా చూపే అచంచలమైన కృతజ్ఞత నాకు అలివేలు శవంలో కనబడుతోంది.  నా రెప్పల క్రింద కళ్ళు చెమర్చాయి.

భక్తి శిఖరంలాంటిది.  అది పర్వతాల్లోనే సాధ్యం.  అలివేలు తండ్రిలో దేవుణ్ణి చూసింది.  అంచేత తనువులో దేవతైంది.

నేను అలాగే నిలబడిపోయేను.

 

* * *

1 thought on “పరవశానికి పాత(ర) కథలు – రైలు తప్పిన దేవుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *