March 19, 2024

పరివర్తన

రచన: వీణ మునిపల్లె

“రేపట్నించీ ఉద్యోగానికి వెళుతున్నాను రాజ్యం”
“ఏవిఁటండీ ఏమంటున్నారూ…. మీరు ఉద్యోగానికి వెళతానంటున్నారా?” నమ్మలేనట్టుగా, ఆశ్చర్యంగా అడిగింది. రాజ్యం.
“ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడేంటి కొత్తగా? అయినా ఈ వయసులో మీకుద్యోగమెవరిచ్చారు? వంట్లో ఓపికుండి, చెయ్యాల్సిన అవసరంమున్నప్పుడు ఏమీ చెయ్యకుండా పెద్దలిచ్చిన ఆస్తులున్నాయని….జీవితం గడిచిపోతుందిలే అని జల్సాగా గడిపేశారు…ఇన్నాళ్ళు గడిచిపోయాక ఇప్పుడర్థమైందా మీకు ఉద్యోగం అవసరమని? ఏదైనా ఉద్యోగం చూసుకోండి అంటే…ఒకరి కింద పని చెయ్యను’ అనేవారు …మరిప్పుడు ఈ నిర్ణయమేంటీ?”
‘కుటుంబ అవసరాలు నడవడానికి, ఆత్మాభిమానం చంపుకుని అయినవారిముందు చేయి చాచడం ఎంత దుర్భరమో తనకన్నా బాగాఎవరికి తెలుసు? అనుకుంటూ భర్తనడిగింది రాజ్యం.
“ఇన్నాళ్ళూ అర్థం కానిది ఇప్పుడర్థమైంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను”స్థిరంగా అన్నాడు.
“సగం జీవితం గడిచిపోయింది…. మరో సగం గడవకపోతుందా…ఎలాగోలా గడుస్తుందిలెండి” భర్తలో వచ్చి మార్పుకి మనసులో సంతోషంగా ఉన్నా…పైకి కనిపించనీయకుండా నిర్వేదంగా అంది
” లేదు రాజ్యం! నువ్వే అంటున్నావుగా… .
ఇంకా సగం జీవితం ఉంది అని!!ఆ సగం జీవితమూ ఇంకొకరిమీద ఆధారపడి గడపడం వద్దు అనుకునే చిన్న ఉద్యోగం చూసుకున్నాను. మన అవసరాలకోసం ఇక పిల్లల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు…. వాళ్ళకూ బాధ్యతలు పెరుగుతున్నాయిగా ”
“ఈ బుద్ధి ముందే ఉంటే తమ బతుకులు బాగుండేవి” అని మనసులో అనుకుని
“పోనీలేండి ఇప్పటికైనా తెలుసుకున్నారు…ఇకనుంచైనా మన అవసరాలకోసం ఒకరిముందు చేయి చాపక్కర్లేదు” ఆలస్యంగానైనా భర్తలో వచ్చిన మార్పుకు సంతోషిస్తు…. కళ్ళనీళ్ళు తుడుచుకుంది రాజ్యం.
*****
రామారావు, రాజ్యంలది పెద్దలు కుదిర్చిన పెళ్ళి.
ఇద్దరిదీ ఒకే ఊరు. రాజ్యం తండ్రి ఆ ఊరి కరణం. కలిగిన కుటుంబం. రామారావు తండ్రిది పొగాకు కంపెనీలో పెద్ద ఉద్యోగం. బాగానే సంపాదించి ఆస్తిపాస్తులు కూడబెట్టాడు. రామారావు పెళ్ళయ్యేనాటికి తండ్రి చనిపోయాడు. కుటుంబ భారంమంతా తల్లి ఒంటిచేత్తో మోసింది. డిగ్రీ చదువుతుండగానే ఇరువైపుల పెద్దలు వాళ్ళ పెళ్ళి జరిపించేశారు. ‘వివాహం విద్యనాశాయ’ అన్నట్టు పెళ్ళి తరువాత చదువు అటకెక్కింది. ఆస్తులున్నాయన్న ధీమాతో అసలు ఉద్యోగం చెయ్యాలన్న ఆలోచనే ఉండేదికాదు రామారావుకు. తెలిసినవారు ఉద్యోగమిప్పించే ప్రయత్నం చేసినా ఒకటిరెండురోజులు చేసి తనవల్ల కాదంటూ తిరిగొచ్చేసేవాడు.
కాలక్రమంలో ముగ్గురు పిల్లలు కలిగారు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. అవసరాలు పెరిగాయి. ఇటు రామారావు తల్లి, అటు రాజ్యం తండ్రి బతికునన్నాళ్ళూ ఇంటి అవసరాలు తీర్చడానికి వస్తురూపేణా, డబ్బు రూపేణా సాయం చేసేవారు. రామారావు ఏవో చిన్నా చితకా వ్యాపారాలు చేసి నష్టపోయి ఉన్న ఆస్తి కరిగించేశాడు. రాను రాను పరిస్థితి దారుణంగా మారిపోయింది. కుటుంబం గడవడం కోసం రాజ్యం అభిమానం చంపుకుని అయిన వారికి వారి పనుల్లో సాయం చేస్తూ..వారిచ్చిన డబ్బు, బట్టలు, ఇతర వస్తువులు తెచ్చి పిల్లలకు ఇస్తుండేది. తండ్రి మీద కోపం ఉన్నా…. తమ కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకునేవారు పిల్లలు.
ఉన్నంతలో సర్దుకుని ఇది కావాలి అని ఏమీ అడగని పిల్లల్నిచూసి…తాను చిన్నతనంలో తండ్రిని, తల్లిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టిన సంఘటనలు గుర్తొచ్చినా … ఏదన్నా పని చెయ్యాలని కానీ, పిల్లల్ని చూసి నేర్చుకోవాలనికానీ అనుకునేవాడు కాదు. రాను రానూ రోజువారీ అవసరాలు తీరడం కూడా కష్టమైపోయింది. అదృష్టవశాత్తు రాజ్యం తోబుట్టువులు, ఇటు రామారావు తోబుట్టువుల అంతో ఇంతో సాయం చేయడంతో పిల్లల చదువులు సాగాయి. పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా డిగ్రీల వరకూ చదువుకుని స్వశక్తితో ఏవో ఉద్యోగాలు సంపాదించుకుని, పెళ్ళిళ్ళు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు.
*****
రెక్కలొచ్చి పిల్లలు వెళ్ళిపోయాక ….ఒకరికి ఒకరుగా భార్యాభర్తలు ఇద్దరూ మిగిలారు. వయసులో ఉన్నప్పుడు ఉన్న పొగరు, అహం తగ్గాయి.
తన కడుపున పుట్టిన పిల్లలు వాళ్ళ వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం కోసం పడుతున్న తాపత్రయం చూసి..మెల్లిగా రామారావులో పశ్చాత్తాపం,అంతర్మథనం మొదలయ్యాయి. ఇన్నేళ్ళూ విలువైన కాలాన్ని తానెంత వృధా చేశాడో అర్థమయింది. ‘తానే కనుక ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించివుంటే…తన కుటుంబం కాస్త మంచి స్థితిలో ఉండేది, పిల్లల చిన్న చిన్న కోరికలు తీర్చివుండేవాడిని కదా’ అనే ఆలోచన పదే పదే తొలిచేస్తోంది. తండ్రిగా తానేమో సంతానానికి ఇచ్చింది ఏమీ లేదు…
తన పిల్లలే తనకు గురువులై జీవిత పాఠాలు చెప్తున్నట్టుగా అనిపిస్తోంది
అందుకే …..తమ అవసరాలకోసం పిల్లలను ఇబ్బంది పెట్టకూడదని, ‘రామారావు ఏ పనీ చెయ్యడు, పెళ్ళాం, పిల్లలు కష్టపడి సంపాదించి తెస్తే కూచుని తింటాడు’అనే మాటలు ఇకపై వినిపించకూడదు అని నిర్ణయించుకున్నాడు.
ఆస్తులున్నాయని ఏ పనీ చెయ్యకుండా తిని కూర్చుంటే కొండలైనా కరుగుతాయి. స్వశక్తిని నమ్ముకుని, కష్టపడి పనిచేసి సంపాదించింది చిన్న మొత్తమే అయినా…ఎంతో తృప్తిగా ఉంటుంది. కుటుంబం గడవడం కోసం ఒకరి దగ్గర పని చెయ్యడం చిన్నతనమేం కాదని….. తన పిల్లలే తనకు గుణపాఠం నేర్పారు అనుకున్నాడు రామారావు.

* * * * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *