April 25, 2024

లోపలి ఖాళీ – భరిణె

రచన: రామా చంద్రమౌళి

 

ఫిబ్రవరి 17, 2016 : బుధవారం. ప్రాతః సమయం 4.50 నిముషాలు.
ఒక సందర్భాన్నీ, ఒక వస్తువునూ ఒక వ్యక్తి తన నేపథ్యంతో, తన దృష్టికోణంలో, తనకున్న జ్ఞానస్థాయిని బట్టి చూచినప్పుడు ఆ వస్తువు అతనికి కనబడినట్టే ఇంకొక వేరే ఎవరికైనా ఆ వస్తువు సరిగ్గా అదేవిధంగా కనబడుతుందా. ఉహూ.. అస్సలే కనబడదు.
చూపూ, దృష్టీ.. రెండూ ఒకటేనా.
చూచుట, దర్శించుట.. రెండూ ఒకటేనా.
ఒక వస్తువు మనకు ఎలా కనబడ్తే అలా దాన్ని ఉన్నదున్నట్టుగా చూడడం చూపైతే, ఒక వస్తువునుగానీ, సందర్భాన్నిగానీ మనకు కావలసిన ప్రత్యేక కోణంలో చూడ్డం దర్శనమౌతుందా.
కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు నలభై రెండేళ్ళ యోగి.
ఇన్నోవా వ్యాన్‌ దూసుకుపోతోంది మెత్తగా తాడ్వాయి అడవిగుండా. తాడ్వాయి అడవి దాటితే పస్రా.. తర్వాత మేడారం.
అతని చేతిలో ఒక పుస్తకముంది. దానిపేరు ‘ జ్ఞాన సిద్ధాంతం ’. ఆంగ్ల మూలం : మారిస్‌ కారన్‌ ఫోర్త్‌. తెలుగు అనుసరణ : పాములపర్తి సదాశివరావు.
అనేక లోతైన తాత్విక, ఆధ్యాత్మిక, జిజ్ఞాసాత్మక విషయాలతో ‘జ్ఞానసిద్ధాంతం’ ఒకపరిపుష్టమైన గ్రంథమది. అసలు జ్ఞానమంటే ఏమిటి. అనుభూతి జ్ఞానం, తార్కిక జ్ఞానం, రూఢ జ్ఞానం.. ఇవన్నీ ఏమిటి. దేహం, ఆత్మ.. ఆత్మ వాయుపదార్థమా, తేజో విశేషమా, శక్తి విశేషమా.. దేహం జడమైతే, దేహాంతర్గతమైన ఆత్మ చేతనమైనదా.. అంతా హయ్యర్‌ మాథమేటిక్స్‌ వలె.. అతిలోతైన చర్చ. అసలు తత్వశాస్త్రమే జటిలం. అందులో జ్ఞాన సిద్ధాంతం మరీ జటిలం.
మామూలప్పుడు ఎక్కువ జనసంచారమే ఉండని కీకారణ్యం అది. కాని ఇప్పుడు అడవికి అడవి మొత్తం మనుషులుగానే మారిపోయింది. ఎటు చూచినా మనుషులే. దేశం నలుమూలలనుండి మానవప్రవాహమై ముంచుకొస్తున్న జనకెరటాలు. కార్లు, బస్సులు, వ్యాన్లు, మోటార్‌ సైకిళ్ళు, అటోలు, ఎట్ల వీలుంటే అట్ల.. దారులన్నీ మేడారం దిక్కే. ఒక కోటి మంది ఈసారి వస్తారని ప్రభుత్వ అంచనా. కాని ప్రత్యక్ష పరిశీలకుల లెక్క ప్రకారం ఇప్పటికే ఒక కోటీ ఇరవై లక్షలమంది అరణ్యప్రవేశం చేసారు. జనవిస్ఫోటనతో చుట్టూ ఇరవై కిలోమీటర్ల వైశాల్యం దద్ధరిల్లిపోతోంది.
తూర్పున సూర్యుడు అగ్గి మొలకవలె పొటమరిస్తున్నాడు. లేత కాంతి జలతారు వరదలా ముంచుకొస్తున్నది.
యోగి తన చేతిలోని జ్ఞాన సిద్ధాంత గ్రంథాన్ని మూసి ప్రక్కనున్న తోలు సంచీలో పెట్టి.. ఒక్కసారి ఈ భౌతిక లోకంలోకి వచ్చి చుట్టూ పరికించాడు. డ్రైవర్‌ బాలు చాలా దీక్షగా ఏకాగ్రతతో నడుపుతున్నాడు బండిని. వెనుక సీట్లో శాలిని ప్రశాంతంగా కూర్చుని బ్లూ టూత్‌ హెడ్‌ సెట్‌ ను చెవిలో పెట్టుకుని ఏదో మ్యూజిక్‌ వింటూ అడవిలోకి చూస్తూ కరిగిపోతోంది. బహుశా ఆమె ఏ హరిప్రసాద్‌ చౌరాసియా వేణువునో, ఈమని శంకరశాస్త్రి వీణనో, ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి కీర్తనలనో వింటూంటుంది. ఇన్నోవా వెనుక సీట్లనిండా తమకు పది నిముషాల్లో సకల సౌకర్యాలతో నూటాఇరవై చదరపు అడుగుల్లో ఒక అత్యాధునిక టెంట్‌ ను బాలు నిర్మించి ఇవ్వగల సామాన్లన్నీ కట్టలుకట్టి పడేసి ఉన్నై.
ఒక ఆర్కియాలజిస్ట్‌గా యోగి పర్యటించిన దేశాలు ఏ ఇరవై ముప్పయో ఉంటై. ఈజిప్ట్‌, రోమ్‌, ఇండోనీసియా, వియత్నాం, హరప్పా, సిల్క్‌ రూట్‌, చైనా, మానస సరోవరం, నేపాల్‌, అంకూర్‌ వాట్‌.
ఎన్ని నాగరికతలు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని జీవన విధానాలు, ఎన్ని సంప్రదాయాల పరిరక్షణలు, ఎన్ని అస్తిత్వ పోరాటాలు.
ఎందరు మనుషులను కలిశాడో. ఎందరి అంతరంగాల లోలోతులను తడిమి శోధించాడో. ఎన్ని గ్రంథాలను రాసి ప్రపంచ నాగరికతల పురారహస్యాలను విప్పి చెప్పి విశ్లేషించాడో. ఒక పురావస్తుశాస్త్ర నిపుణునిగా కేవలం శిథిలావశేషాలనూ, వస్తువులనూ, ప్రాంతాలనూ, మనుషులను మాత్రమే కాక నిర్జీవ వస్తువుల్లో, స్మ ృతుల్లో, శిలల్లో,శిల్పాల్లో, మనుషుల్లో ఆనవాల్లుగా మిగిలిన హృదయాలను స్పర్శించి ఆ రసస్పర్శను అనుభవించి, ఆనందించి, ఆ మహానుభూతులను అక్షరాలుగా అనువదించి ప్రపంచవ్యాప్త మానవ పురావైభవ మననశీలురకు అందించి గణనీయమైన ఖ్యాతిని సముపార్జించాడు అతను.
అది ఒక నిరంతర అనంత శోధన. పురా మానవుని ఔన్నత్యాన్నీ, వ్యక్తిత్వ వైభవాన్ని పరిశోధిస్తూ పరిశోధిస్తూ.. ఒంటరిగా ఒక తీరని తృష్ణతో చేస్తున్న ప్రయాణంలో తారసపడ్ద ఒక సహపరిశోధకురాలు శాలిని. ఆమెది వారణాసి. పురాతన 1916 నాటి బనారస్‌ హిందూ యూనివర్సిటీ నుండి ‘పురావస్తు శాస్త్రం’ లో ‘ శిథిల మూలాలు ’ అన్న అంశం మీద డాక్టరేట్‌ చేసిన స్వర్ణ పతక గ్రహీత. ఆమే తనూ కలిసి సంయుక్తంగా పురాపరిశోధనలపై రాసిన ఎన్నో గ్రంథాలను ప్రఖ్యాత ప్రపంచప్రసిద్ధ ప్రచురణ కర్తలు సగర్వంగా వెలువరించారు. వాటిమీద వచ్చే రాయల్టే ఎన్నో లక్షలుంటుంది తమకు.
శాలిని అంటుంది.. శోధన.. పరిశోధన చాలా భిన్నమైనవి. సర్చ్‌.. రీసర్చ్‌. కొత్తదాన్ని కొత్తగా కనుక్కోవడం.. ఉన్నదాన్నీ, మరుగున పడిపోయినదాన్నీ మళ్ళీ కనుక్కోవడం పూర్తిగా విభిన్నమైన కార్యాలుగదా. మనం ఇదివరకు ఎవరూ కనుక్కోనిదాన్ని, ఇతరులెవ్వరూ ఇంతవరకు స్పృశించనిదాన్నీ శోధించి తెలియజేయాలి వినూత్నంగా ఈ మానవాళికి.. అని. శాలిని ఈ గత ఎనిమిది సంవత్సరాలుగా తనవెంటే పురాపరిశోధనల్లో సహగమిస్తున్న సహచరిణి. భార్య కాదు.
ఒక వైవిధ్యభరిత గుర్తింపు ఉన్న తామిద్దరూ ఇంత విస్తృతంగా ప్రపంచాన్ని పర్యటించిన తర్వాత చాలా సార్లు జరుపుకునే ఆత్మసమీక్షల్లో నిర్దారించుకున్నదేమిటంటే.. భారతదేశమంత విస్తృతమైన, విలక్షణమైన, గాఢ తాత్విక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, జ్ఞానమయ పునాదులున్న అతిపురాతన వారసత్వం ఏ దేశానికీ లేదని. ఆ కోణం లో చూచినప్పుడు ఈ ‘ సమ్మక్క తీర్థం ’ ది ఒక విలక్షణమైన ఏ తాత్విక శోధనకూ, అన్వయింపుకూ అందని విచిత్ర చరిత్ర. అందుకే తామిద్దరూ పదే పదే ఈ ప్రాంతానికి ఇట్లా రావడం ఇది ఏ ఎనిమిదవసారో. జాతర జరుగుతున్నప్పుడు. జాతర లేనప్పుడు మామూలు సమయాల్లో.. మేడారం ఒట్టి అతి సాధారణ కుగ్రామంగా కొండల మధ్య గంపకింద కోడిపిల్లలా ఒదిగి ఉన్నపుడు వచ్చి.. ఈ గిరిజనులతో అడుతూ పాడుతూ.. వాళ్ళలో కలిసిపోయి.. నీళ్ళలో నీళ్ళయి.. ప్రవహిస్తూ.. ఆ అనుభవం వేరు. వ్యక్తీకరించరానిది.
ఐతే.. ఈ మేడారంకు ప్రతి రాకా ఎప్పటికప్పుడు కొత్తే. ఎప్పటికప్పుడు భాషకందని మహానుభూతే. పులకింతే.
ఎందుకు. ?
అదే అర్థంకాదు. ఏముందీ ఇక్కడ.. అంటే జవాబు ‘ ఏమీ లేదు ’.. అని.
ఏమీ లేకపోవడమే మహత్తా. ? అన్నది ప్రశ్న.
ఈ ఆదివాసీలు జరుపుకునే ఈ పండుగ నేటికీ పూర్తిగా సంకేతాత్మకంగా జరుగుతోంది. శాస్త్రీయమైన పరిభాషలో చెప్పాలంటే ఈ అడవిబిడ్డల పూజ నిర్గుణోపాసనగానే భావించాలి. లేదా ఒక అమూర్తారాధనగా పరిగణించాలి.
వీళ్ళ మూల భావన చాలా సరశమైంది. హృదయసంబంధి కూడా. వీళ్ళ ప్రచలిత సామెత ‘ తొక్కితే రాయి. మొక్కితే దేవత’.
మేడారం జాతరలో ఒక ఆత్మను సంకేతాత్మకంగా ఒక వస్తువులోకి గానీ, చెట్టులోకి గానీ, మరే ఇతర దేనిలోకైనా పిలిచి, ప్రతిష్టించి స్థాపించడమనే ఒక విద్య ఉంది. ఇట్లా చనిపోయిన తమ పూర్వీకులెవరి ఆత్మనైనా ఆవాహన చేసి పూజించడాన్ని aఅఱఎఱంఎ అంటారు. పురాతన ప్రపంచవ్యాప్త ఆదివాసీ సంస్కృతుల్లో, తెగల్లో ఉన్న ఈ పితృ, మాతృ ఆత్మల aఅషవర్‌తీaశ్రీ షశీతీంష్ట్రఱజూ ఆరాధన అనేది ఇక్కడకూడా దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలనుండి ఉంది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ల ఆత్మలను ఆవాహన చేసి ఇక్కడి కోయతెగలు దేవతలుగా ఆరాధించడంలో ఈ శాస్త్రీయ అంశాలే ఇమిడి ఉన్నాయని తమ విశ్లేషణలో స్పష్టమైనాయి. ఇక్కడ సార్వత్రిక ప్రధాన స్రవంతి ఆరాధనా సంప్రదాయాలూ, అటు గిరిజన ఆరాధనా విధానాలూ కలగలిసిన మేళవింపునును aంంఱఎఱశ్రీa్‌ఱశీఅ గా చూడవచ్చు నాగరికులు.
వెరసి ఈ ‘ సమ్మక తీర్థం ’ స్థూలంగా ఆదివాసీ తెగల పితృదేవతల సంకేతారాధన మాత్రమే. తొలి రోజుల్లో సమ్మక్క దేవతని ఒక జువ్వి చెట్టు.. అంటే శమీ వృక్షం మీదికి ఆవాహన చేసి శతాబ్దాలుగా పూజిస్తూ వస్తున్నారు. అక్కడికి వచ్చిన ప్రజలు ఈ చెట్టు బెరడును పవిత్రమైనదిగా భావించి ఒలుచుకుని ఒలుచుకుని చివరికి శిథిలపర్చారు. నేటికీ చాలా పాతదైన ఆ చెట్టు కొద్దిపాటి చిరు చిగురుతో కనిపిస్తుంది. ఆదివాసీలకు చెట్టు పూజించదగిన ఒక దేవత. అందుకే వాళ్ళు అవసరమైతే తప్ప చెట్లను నరకరు. చెట్లనూ, మట్టినీ, నేలనూ, పూలనూ పూజించే మహత్తర ఆచారం ఆదివాసీలలో పండుగలై విరాజిల్లడం ఒక విశేషమైన విషయం. పోను పోను శుభ్రతకోసం అమ్మవార్ల జువ్వి చెట్టు చుట్టూ గద్దెలను నిర్మించి ఆధునీకీకరించడం అనివార్యమైంది. ప్రభుత్వాలు భక్తుల సౌకర్యార్థం ఎన్ని వసతులు చేసినా అసలు మూల సంప్రదాయం మాసిపోకుండా కాపాడుతూండడం సంస్కృతీ పరిరక్షణే.
‘‘బాలూ. మనం డైరెక్ట్‌గా కన్నెపల్లి పోదాం.. అంతేనా శాలినీ ’’ అన్నాడు యోగి లోపలికి వెళ్తున్నకొద్దీ ఇంకా ఇంకా కిక్కిరిసిపోయి దట్టంగా కనిపిస్తున్న జనం దిక్కు ఆశ్చర్యంగా చూస్తూ.
‘‘ఔను. అక్కడకే పోవాలి మనం.. మన రాకకోసం బహుశా కాక లక్ష్మీపతి ఎదురు చూస్తూంటాడు. వాళ్ళ పెదనాన్న కాక సారయ్యే సారలమ్మ ప్రధాన వడ్డె కదా. మధ్యలో ఒక్క నిముషం జంపన్న వాగులో నేనుకూడా స్నానం చేస్తా యోగీ.’’ అంది శాలిని. లక్ష్మీపతి వరంగల్లులో ఎమ్మే చేసి ఇప్పుడు ఎం. ఫిల్‌ చేసేందుకు తమ వద్ద పరిశోధకుడుగా చేరిండు మొన్ననే. తాము ఇక్కడికి వస్తున్న నాటినుండి.. అప్పుడు పదవతరగతి చదువుతున్న లక్ష్మీపతిని యోగే చదువు గురించిన ప్రాముఖ్యతను గట్టిగా చెప్పి, ఎంతో కొంత సహాయం కూడా చేసి జీవితంలో ఎట్లా పైకి రావాల్నో దారి చూపించిండు. లక్ష్మీపతి దాదాపు శిష్యుడు యోగికి.
అప్పటికి పూర్తిగా తెల్లవారింది. అప్పటిదాకా లేత చీకటితో చిరుత వెలుగులు సాగించిన అరణ్య సరససల్లాపం ఒళ్ళు దులుపుకుని లేచిన సూర్యుని నులివెచ్చని కిరణ సందోహంతో మెరిసి విరిసింది.
ఎటు చూచినా జనమే. మనుషులు కనబడకుండా ఒక చారెడు దృశ్యంకూడా ఖాళీగా లేదు. ఎక్కువమంది ఆడవాళ్ళు.. పిల్లలు, గుండ్లు గీయించుకుని మగవాళ్ళు.. కుటుంబాలు కుటుంబాలుగా.. అందరూ కలెగలిసిన మనుషుల కలపోత.. పల్లెటూరు వాళ్ళు, నగరవాసులు, పట్టణ జనం, అధికారులు, పోలీసులు, వ్యాపారులు, వాలంటీర్లు, ఎన్‌ సి సి విద్యార్థులు, ఒకటే సందడి.. తోసుకుంటూ, నెట్టుకుంటూ.. ఉధృతి.
బాలు చాలా నేర్పుగా బండిని ఒక మూలకు మలిపి చెట్టుకింద ఆపాడు. చూస్తే ప్రక్కన శాలిని స్నానం చేయడానికి చాలా అనుకూలంగా ఉంది వాగు ఒర్రె.
ఇంతకూ ఇన్నిసార్లు వస్తే ఏ ఒక్కసారీ శాలిని ఇలా జంపన్న వాగులో స్నానం చేస్తానని అన్నట్టుగానీ, చేసినట్టుగానీ జ్ఞాపకంలేదు. ఇప్పుడెందుకు ప్రత్యేకంగా.. ఇలా.
ఈ మధ్య ధారాళంగా తెలుగు మాట్లాడ్డం నేర్చుకోవడమే కాకుండా తెలుగు పురాణాలనూ, ప్రాచీన సాహిత్యాన్నీ, మహాభారత, రామాయణాదులను విపరీతంగా చదువుతోందామె. క్షణకాలంలో డోర్‌ తెరుచుకుని ఒక్క అంగలో బ్యాగుతో సహా వాగులోకి వెళ్లిపోయి.. నీళ్లలో మునిగింది శాలిని.
జంపన్న వాగు అసలుపేరు సంపెంగ వాగు. చుట్టూ ఊరట్టం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, నార్లాపూర్‌, బయ్యక్కపేట ఊర్లతో పరివేష్టితమై మధ్యలోనుండి పాపటలా ప్రవహిస్తూ పోతుంది సంపెంగ వాగు. అసలది చారిత్రాత్మకమైన కాకతీయులనాటి లక్నావరం చెరువు మత్తడి కాలువ. పస్రాలో దయ్యాలవాగు, అటుపైన గౌరారం వాగు, కన్నాయ్‌ గూడెం దగ్గర గుండ్లవాగు, కలగలిసి పెనవేసుకుపోయి.. సంపెంగ వాగై.. తూముల వాగు తో సంగమిస్తూ బూటారం దగ్గర గోదావరిలో అంతర్ధానమౌతుంది.
స్థల కథల ప్రకారం కాకతీయ ప్రతాపరుద్రుడు తన సామంతుడైన మేడారం పరగణాధీశుడు పగిడిద్ద రాజు కప్పం కట్టకపోయినప్పుడు సైన్యాన్ని పంపి దాడి చేస్తే.. వరుస కరువులతో బతకడమే కష్టంగా ఉన్న తాము కప్పం కట్టలేమని సవినయంగా విన్నవించుకుని.. నిరాకరించబడి, అనివార్యమై ప్రతిఘటనకు దిగినప్పుడు.. యుద్ధంలో ఒక్కొక్కరే వీరోచిత మరణాన్ని పొందుతున్న క్రమంలో.. బెబ్బులిలా పోరాడి తీవ్రంగా గాయపడ్ద సమ్మక్క ఒక్కగానొక్క పుత్రుడు జంపన్న.. రక్తసిక్త దేహంతో వచ్చీ వచ్చీ సంపెంగవాగులో తన రక్తాన్ని ఆర్ఘ్యంగా సమర్పించి ప్రాణార్పన చేసి లీనమైపోయిన క్షణం సంపెంగ వాగే తన పేరును ‘ జంపన్న వాగు’ గా మార్చుకుంది. అదే వరుసలో భర్త పగిడిద్ద రాజూ, మరిది గోవిందరాజూ, కూతుళ్ళు సారలమ్మ, నాగులమ్మ లు కూడా అరివీర భయంకరంగా యుద్ధం చేసి.. చివరికి నిహతులై.. నిశ్శేషమౌతున్న అంతిమ దశలో సమ్మక్క వందలమంది సైనికులను దునుమాడుతూ చివరికి ఒక పిరికి సైనికుడు వెనుకనుండి వీపులోకి బళ్ళేన్ని విసరగా.. దాంతో గాయపడి రక్తాలోడుతూ.. చిలుకల గుట్టపైకి నిష్క్రమించిన తల్లి నారచెట్టువద్ద అంతర్ధానమై పోయింది. తర్వాత గ్రామస్తులు వెదుక్కుంటూ వెళ్ళి గుట్టనంతా గాలిస్తే.. ఒక చెట్టునీడలో కనబడిరదొక మహిమాన్విత ‘ భరిణె ’. వెదురు కర్రతో చేసిన నిండు కుంకుమ భరిణె. అడవిబిడ్దల ఆత్మగౌరవ ప్రతీక ఆ ‘ కుంకుమ భరిణె ’. పరమ మహత్తుగల వన మూలికలతో నిండిన ఆ చిలుకల గుట్ట.. దాని చుట్టూ ఉన్న పద్నాలుగు ఊళ్ళు మాఘశుద్ధ పౌర్ణమికి అటూ ఇటూ రెండు రోజులు సంపూర్ణంగా సమ్మక్క తల్లి రక్షణ కవచం నీడలో అలరారుతాయి. చరిత్ర చెక్కిన సామాన్యుల శ్రావ్యగాథలవలె అనిపించే ఈ వీరకుటుంబ శతాబ్దాలనాటి జానపద పురాగాథ.. అస్తిత్వ అరుణ బావుటా ఐ.. శౌర్య ప్రతీకై వర్థిల్లుతూనే ఉంది నేటికీ.
ఐతే అది స్థలపురాణమా.. కట్టుకథా.. వాస్తవ గాథా.. ఏదైనా మనిషి పట్ల మనిషికి గల విశ్వాసం, గౌరవం, నమ్మకం, అనుభవమే శాస్త్రమై శాసించే ఒక అపూర్వ వాస్తవమై.. ఇన్ని కోట్లమంది విశ్వాసులను ఈ అరణ్యగర్భంలోకి తల్లిలా చేతులు చాచి పిలుస్తూనే ఉంది శతాబ్దాలుగా. విద్యావంతులు, నిరక్షరాస్యులు, మేధావులు, కళాకారులు, గాయకులు, నాయకులు, విశ్వాసులు, విద్వాంసులు.. అందరూ.. చేతులు జోడిరచి ఒకే వరుసలో ప్రణమిల్లే ఆ క్షణాలు మాత్రం అద్భుతాలు. అంతే.
వచ్చేసింది శాలిని ఒంటినిండా తడి బట్టలతో. బట్టలు మార్చుకుని రాలేదామె ‘ చైంజ్‌ రూం ’ లో. తలారా తడితో నీళ్లు కారుతూ, కొత్తగా కనిపిస్తోంది. అనిపిస్తోంది.
సరిగ్గా అప్పుడే యోగి మొబైల్‌ మ్రోగింది. చూస్తే లక్ష్మీపతి.
‘‘సర్‌. నేను మీకోసమే ఎదురుచూస్తున్నాను. ఇక తల్లి బైలెల్లబోతాంది.. మీరు తొందరగా రావాలె. నేను రెడీగా మద్దిచెట్టుకింద నిలబడ్డా. ’’ అన్నాడు మొసపోసుకుంటూ.
‘‘లక్ష్మీపతీ. వచ్చినం..ఒక్క నిముషంలో నీ ముందు ఉంటం’’
బాలు అర్థం చేసుకుని బండిని తీసి.. స్టార్ట్‌ చేసి.. ఉరుకుతూనే ఉంది జనాన్ని తోసుకుంటూ.
శాలిని స్థితే చిత్రంగా ఉండి ఏమీ అర్థం కావడం లేదు యోగికి.
ఐదు నిముషాల్లో.. కారు.. కన్నెపల్లి ఊరి చిన్న గిరిజన గుడి మూలన ఉన్న మద్ది చెట్టు దగ్గర ఆగింది.
లక్ష్మీపతి వచ్చి శాలినినీ, యోగినీ చేతులు పట్టుకుని వెంట లాక్కుపోయాడు వేగంగా.
అప్పటికే కాక వంశీయులు, కోరం గోత్రనామధేయులు ఐదుగురు.. గుడిలో గత మూడు గంటలుగా నెత్తిని తాకే ఎత్తులో ఉన్న గర్భగుడిలో పూజలు నిర్వహిస్తూ, ఇక ఏ క్షణమైనా బయటికి తుఫానులా చొచ్చుకొచ్చే వాతావరణం ఉంది. ‘‘ సర్‌.. మేడం ప్రత్యేకంగా ఈ సమయం గురించే ఎప్పటినుండో అడుగుతాంది నన్ను. ఈ ఘడియ తప్పిపోద్దేమో నని నా భయం ’’ అంటున్నాడు లక్ష్మీపతి.
ఔనా.. ఎందుకు. శాలిని అడుగుతోందా ఈ క్షణంకోసం నిజంగా.
యోగి అప్రయత్నంగానే శాలిని దిక్కు చూశాడు.
అప్పటికే గుడి ముందట దాదాపు రెండు వందలమంది కంటే ఎక్కువే ఆడవాళ్లు.. పెళ్లి కానివాళ్ళు, పెళ్ళై తల్లులు కానివాళ్లు, త్వరగా తల్లి కావాలనుకునే వాళ్లు తడిబట్టలతో నేలమీద బోర్లా పడుకుని ‘ వరం ’ పట్టుకుని సాష్టంగపడి.,
చదువుకున్న ఆడవాళ్ళు, చదువు రానివాళ్లు, అధికారులు, పోలీసులు.. తరతమ భేదం లేకుండా, ఒకటే తొక్కిసలాట. నెట్టుకునుడు. ఊగిపోవుడు.. ఏదో అదృశ్య శక్తి అందరినీ ఆవహించినట్టు.. ముఖాల్లో దైవత్వ ఛాయలు. భక్తి మత్తు.
ఇటువేపు శివసత్తులు పూనకాలొచ్చి ఊగిపోతున్నారు ‘‘ నాది దయ్యాల మడుగే అబ్బియా.. దండొక్క పొద్దే అబ్బియా.. హఁ.. హఁ’’ అంటూ. చేతుల్లో వేప మండలు. నెత్తులపై చేపలు పట్టే వలలు. వాటికి పంచలోహ పూసలు. కాళ్ళకు రాగి అందెలు, వెండి కడియాలు.
ఆ బయటికి వచ్చే వడ్డెలు ఆ క్షణాల్లో దైవ స్వరూపులనీ, సారలమ్మ తల్లి ప్రతిరూపాలనీ విశ్వాసం ప్రజలకు. ఒక్కసారి ఎట్లైనా వాళ్ళను తాకితే ఇక ఈ జన్మ ధన్యమన్నంత సంబరం. ముఖ్యంగా ఆ వడ్డెలు గనుక తమను తొక్కుకుంటూ పోతే తప్పక సంతానం కలుగుతుందని సంతానాన్నాపేక్షించే స్త్రీల నమ్మకం.
ఒక్క మెరుపు కాల తృటిలో ఐదుగురు వడ్దెల సమూహం ఒక వరదలా చొచ్చుకొచ్చింది బయటికి ఆ గుడిసె గుడిలోనుండి.
యోగి తన పురాతత్వ జ్ఞానంతో వీక్షిస్తున్నాడు.. ఎనిమిదవసారి ఆ దృశ్యాన్ని.
అందరూ యువకులే. నెత్తులపై ఎర్రని గుడ్దను చుట్టుకుని.. అందులో ఒకడు నూనూగు మీసాలవాడు. తెల్లని బనీనువంటి వస్త్రంపై ఒళ్ళంతా కుంకుమ, పసుపు, చేతుల్లో ఆనపకాయ బుర్ర, ఒకరిదగ్గర చాట.. కొన్ని సన్నని కంక కట్టెలు, ముఖాలనిండా బాగా తాగి ఉన్నట్టు మత్తు. ఏదో అవ్యక్త దైవత్వ నిషా. వాళ్ళు తూములోనుండి ఉధృతంగా చొచ్చుకొస్తున్న వరదలా.. వరం పట్టి బొక్కబోర్లా పడుకున్న భక్తుల వీపులపై మెరుపు వేగంతో అడుగులు వేస్తూ.. తొక్కుకుంటూ పరుగెత్తుకుంటూ వస్తున్నారు.
అప్పుడు.. యోగి ఊహించనే లేదసలు.. చటుక్కున తృటిలో అతని నుండి ఉరికి అతని నుండి ఉరికి శాలిని నేలపై బోర్లా పడుకుంది ఒంటినిండా తడి బట్టలతో.. విరబోసుకున్న తడి జుట్టుతో. చూస్తూ చూస్తూండగానే వడ్డెల పాదాలు వరుసగా అందరివీ శాలిని వీపుపైబడి.. చకచకా రైలు చక్రాల్లా వెళ్లిపోయాయి. చేతులను నిలువెత్తు చాచి బోర్లా పడుకున్న శాలిని ధిగ్గుమని జలదరించి.. ఉల్టా తిరిగింది. ఆ లొల్లిలో కూడా యోగికి ఆమె ముఖంలో ఏదో ఒక ‘ తళుక్కు ’ కనిపించింది.
‘అసలు ఎందుకిలా చేసిందీమె అకస్మాత్తుగా. ఏమి కావాలీమెకు. నిజంగానే సంతానం కావాలా. ’
‘‘సర్‌. మేడం అదృష్టవంతురాలు. వడ్డెలందరూ తొక్కుకుంట పోయిండ్లు వరుసగా. ఈ సారి సంతానం గ్యారంటీ మేడంకు ’’ అంటున్నాడు లక్ష్మీపతి ఉక్కిరిబిక్కిరైపోతూ.
ఖతం. ఐపోయింది.
వడ్డెల వెంటనే లక్షలమంది జనం తరలిపోయారు క్షణాల్లో.. గద్దెలదిక్కు. పది నిముషాల్లో చాలా వరకు ఆ ప్రాంతం ఖాళీ ఐపోయింది.
* * * * *
కన్నెపల్లిలోనే ఉన్న కాక లక్ష్మీపతి ఇంటి ఆవరణలోని వాళ్ళ పెరట్లో ఇచ్చిన స్థలంలో బాలు వేసిన టెంట్‌ లో విశ్రాంతి తీసుకుంటూన్న యోగి.. శాలిని ఆ రోజంతా నిద్రపోయారు.
అలసట. శరీరంకంటే మనసు ఎక్కువగా అలసిపోయిన అనుభూతి. యుగయుగాలుగా ఏదో తన శాశ్వత స్థావరాన్ని వెదుక్కుంటూన్న ఆత్మ అనిశ్చిత పరిభ్రమణంలో ఒక్కోసారి అడవై, మరోసారి ఆకాశమై, ఇంకోసారి ఎడారై.. సముద్రమై.. ఒక చిన్న చిరు పిచ్చుకై, చిలుకల గుట్టమీద చిరు మూలికా పత్రమై.. ఉనికి.. ఉనికి.. ఉనికికోసం అన్వేషణ.
‘అసలు మనిషికి ఏమి కావాలి’ అని అన్వేషణ. అసలు మనిషికి ఏమి వద్దో తెలుసుకోవాలని అన్వేషణ. మనిషి యొక్క అవసరాలు కేవలం భౌతికమైనవేనా.. అభౌతికమైన.. భౌతికేతరమైన.. భౌతికాతీతమైన ఇంకేవో అనిశ్చిత అవ్యక్త స్థితుల సంగతి ఏమిటి. అసలు మనిషి ఎవరికైనా ఎప్పుడైనా ఇతరులకు తనను తాను విప్పి చెప్పుకున్న దానికంటే.. విప్పకుండా తనను తాను కప్పుకుని దాచుకున్న వ్యక్తిత్వమే ఎక్కువకదా. అసలు ఈ వ్యక్తావ్యక్తాలు ఏమిటి.?
రెండు పుస్తకాలున్నై వాళ్ళ ప్రక్కలపై. యోగి అప్పటిదాకా చదివి పూర్తి చేసింది.. ‘జ్ఞాన సిద్ధాంతం’.. మారిస్‌ కారన్‌ ఫోర్త్‌.. పాములపర్తి సదాశివరావు. జీవితపు చిక్కు ముడులను విప్పుకుంటూ విప్పుకుంటూ.. చిటికెన వ్రేలును అందించి చిన్నపిల్లవాణ్ణి వెంట నడిపించుకుపోయినట్టు.. అనుభూతి.
ఇంకా నిద్రపోతున్న శాలిని ఎదపై పుటలు తెరిచి పెట్టి అలాగే ఉండిపోయిన పుస్తకం. ‘ పక్షుల సభ ’. ఫరీద్‌-ఉద్‌-దిన్‌-అత్తర్‌. పర్షియన్‌ కవి, సూఫీ వేదాంతి రాసిన సంపూర్ణ ప్రతీకాత్మక జీవన గీత. లోలోతుల ఆత్మాంతర ప్రతిఫలన. డాక్టర్‌ లంకా శివరామప్రసాద్‌ తెలుగులోకి అనువదించిన అసాధారణ గ్రంథం. పుస్తకం మన చుట్టూ మనకు మనమే గీసుకున్న సరిహద్దులనూ, రేఖలనూ చెరిపేస్తూ చెరిపేస్తూ విస్తృతపరుస్తూ.. ముడి మానవుణ్ణి శుద్ధమానవునిగా పరివర్తిస్తూ.. ట్రాన్స్‌ఫార్మేషన్‌. నిజానికి ఏ మనిషైనా జీవితకాలమంతా మార్పు చెందుతూ, పరివర్తిస్తూ నిరంతరం లోనయ్యేది ఈ ‘ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ’ అనబడే అవస్థాంతర స్థితికే.
అంతిమంగా మార్పే, పరివర్తనే, వివర్తనే, జ్ఞాన వ్యతికరణే జీవితమని తెలుసుకోవడంతోనే.. ప్రయాణం ముగుస్తుందన్న
‘ఎరుక’ తో. స్వస్తి.. అంతేనా.
ఇంతకూ నిన్న కన్నెపల్లిలో సారలమ్మను గద్దెదగ్గరికి తీసుకుపోడానికి వడ్దెలు తీసుకొస్తునప్పుడు చటుక్కున శాలిని అనూహ్యంగా తడిబట్టల్తో ‘వరం’ పట్టడం.. వడ్డెలు ఆమెను తొక్కుకుంటూ పైనుండి పరుగెత్తుకుంటూ వెళ్ళడం.. క్షణాల్లో.,
ఏమిటది.. ఎందుకు.
చెట్టుకొమ్మ చిగురించాలనీ, ఫలించాలనీ, వికసించాలనీ ఆశించడం అతిసహజ కాంక్షేకదా.?
నిద్రపోతున్న ఆమె వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు యోగి. అప్పుడా క్షణం అతనిలో ఏమీలేని ఒట్టి ఖాళీతనముంది.
మనిషి ఖాళీగా ఉండగలగడం చాలా కష్టం.
మరునాడు ఉదయం.,
ఉదయం ఎనిమిది గంటలకే.. సమ్మక్క తల్లి ఆగమనం.. మళ్ళీ ఇద్దరూ కాక లక్ష్మీపతితో చిలుకల గుట్ట మొగలోకి.. వెళ్ళి.. అంతా జనమహాసముద్రమే. హోరు. మనుషులు అంత భీకరమైన ప్రజ్వలిత దైవత్వ మహదావేశంతో ఉన్మత్త కెరటాలై ఎగెసెగిసి పడడం ఎవ్వరూ, ఎక్కడా, ఎన్నడూ చూడలేని ఒక మహాద్భుత ఘట్టం.
అద్భుతాలు జరిగి గడచిపోతాయి. శాశ్వతమై నిలబడవు.
భరిణెగా మారి చిటికెడు కుంకుమై తల్లి వచ్చింది.. ఒక ప్రతీకాత్మక శక్తి స్వరూపిణై.. కిలోమీటర్ల పర్యంతం వర్తులమై పరిభ్రమిస్తున్న అదృశ్య శక్తిచక్రమై వ్యాపింఛి, ఆచ్ఛాదించి, ఆవహించి అందరి అనుభవంలోకొచ్చి.. అనుభూతింపజేసి.. మరునాడు మళ్ళీ చిలుకల గుట్ట పైకి నిష్క్రమించింది.
‘వచ్చినవాడు తప్పనిసరిగా వెళ్ళక తప్పదు’ అన్న పరమ సత్యమొకటి అక్కడున్న వాళ్ళందరికీ ఒక ‘గ్రహింపు’ గా బోధపడి.,
‘ జీవితమంటే. రావడం.. పోవడమేనా ’.. అన్న పరమ మీమాంసలో విచికిత్సుండగా.. ఒక మెరుపు మెరిసింది తటిల్లుమని.
ఒకటే వర్షం.. వేసవి వర్షం. కుండపోత వర్షం. కోట్లమంది జనం అడవిలో అనాచ్ఛాదిత బహిర్‌ ప్రపంచంలో తడుస్తూ.. వర్షపు చినుకుల్లో పరవశిస్తూ, పులకిస్తూ, పల్లవిస్తూ శరీరాలను ఆత్మలుగా అనువదించుకుంటున్న వేళ,
యోగికి దగ్గరగా.. అతి దగ్గరగా.. ఆత్మకు అతి చేరువగా.. ఒక శమీ వృక్షం కింద నిలబడ్డ శాలిని యోగి ఎద దగ్గరగా నిలబడి.. అతను చూస్తూండగానే ఆమె గుప్పిటిని తెరిచింది.
ఆమె చేతిలో ఆకుపచ్చని పచ్చి వెదురు భరిణె. దాని నిండా ఎర్రగా కుంకుమ. ధగధగా మెరుస్తూ రక్తవర్ణ కుంకుమ.
అప్పుడా క్షణం ఆమె అతనివైపు చూచిన చూపు అతణ్ణి ఆదేశించింది. అర్థించింది. విన్నవించింది.
యోగి చాలా స్థిరచిత్తంతో, అసంకల్పితంగా.. కుంకుమ భరిణెలో నుండి చిటికెడు ఎర్రని కుంకుమను రెండు వ్రేళ్ళతో తీసుకుని శాలిని తెల్లని నుదుటిపై పెట్టి అలంకరించాడు.
ఆమె నుదుటిపై ఎర్రని కుంకుమ బొట్టు.. అప్పుడే ఉదయిస్తున్న సూర్యునివలె.. మెరిసిపోతూ.
అప్పుడే చటుక్కున ఒక ఉరుము ఉరిమి ఎక్కడో పిడుగు పడింది. ఉలిక్కిపడి చూస్తే.. ఎదుట చిలుకల గుట్టపై.. ఒక కళ్ళు మిరుమిట్లుగిలిపే మెరుపు.. విద్యుల్లత.
‘‘ఈ అడవి.. ఈ మహత్తు.. ఈ చెట్లు, ఈ గుట్టలు, ఈ అరణ్యం నన్ను అల్లుకుపోతూ అవహిస్తున్నాయి యోగీ.. నా స్థావరమిక ఇక్కడే. జీవితమంతా మానవ మహా పురావశేషాల మూలాలను కనుక్కోవాలని అన్వేషిస్తూ, అన్వేషిస్తూ వచ్చిన నేను ఇక అంతిమ సత్యాన్ని దర్శిస్తున్నాను. ఇక మన నివాసమూ, జీవితమూ, భవిష్యత్తూ, శోధనా.. అన్నీ ఇక్కడే ’’ అంది శాలిని సన్నగా.. స్పష్టంగా.. స్థిరంగా.
యోగి అప్రతిభుడై.. శాలిని కళ్ళలోకి చూస్తున్నాడు.
ఆమె ముఖం.. నిర్మలంగా.. ప్రశాంతంగా.. నిశ్చలంగా.. నిండుగా ఉంది.
శాలిని నుదుట వెలిగిపోతూ కుంకుమ బొట్టు ఎర్రగా.
కోటి ముప్ఫై లక్షలమందిలో.. తామిద్దరై.. ఆ మహారణ్యంలో.. ఆ శమీవృక్షంకింద.. ఆ క్షణం తడుస్తూ పులకించిపోతున్నారు ఇద్దరూ.. శాలిని, యోగి.

1 thought on “లోపలి ఖాళీ – భరిణె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *