March 19, 2024

సుందరము – సుమధురము – వ్రేపల్లియ ఎద జల్లున

రచన:- నండూరి సుందరీ నాగమణి

సుందరము సుమధురము ఈ గీతం:

‘సప్తపది’ చిత్రంలోని ‘వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి’ అనే గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను.
జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై, 1981లో విడుదల అయిన ఈ చిత్రానికి, కళాతపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. శ్రీ భీమవరపు బుచ్చిరెడ్డి గారు ఈ చిత్రనిర్మాత. నృత్యం ప్రధానాంశంగా సాగే ఈ చిత్రంలో కథకులు, దర్శకులు విశ్వనాథ్ గారు కులమత భేదాలను ఎండగట్టారు. మనసులేని మనువు నిరర్థకమని, తన పెళ్ళి అయిన తన మనవరాలిని, ఆమె ప్రేమించిన వ్యక్తితో పంపించివేయటం అనేది ఈ చిత్రంలోని గొప్ప ముగింపు.
నృత్యకళాకారిణి భమిడిపాటి సవిత ఈ చిత్రంలోని కథానాయిక హేమ పాత్రను ధరించింది. ఆమెను ప్రేమించిన కథానాయకుడు హరి గా గిరీష్ ప్రధాన్ అనే నటుడు నటించాడు. కథ ప్రకారం అతను ఒక వేణు విద్వాంసుడు. హేమ తండ్రి గారైన నాట్యాచార్యుల వారి ట్రూప్ లో చేరి, హేమను ప్రేమిస్తాడు. ఆమె నాట్యాన్ని ఆరాధిస్తాడు. హేమ కూడా అతన్ని ప్రేమిస్తుంది. పెద్దవారికి చెప్పాలని అనుకుంటుండ గానే ఆమె మాతామహులు యాజులు గారు ఆమె నృత్యప్రదర్శన తిలకించి ముగ్ధుడై, తన మనవడికి ఇచ్చి వివాహం నిర్ణయం చేసేస్తాడు. పెద్దవారి మాటలకు తలవంచి తాళి కట్టించుకున్నా, హేమ తన భర్తతో కాపురం చేయలేకపోతుంది. నిజం తెలుసుకున్న యాజులు గారు మనవరాలి మనసు గ్రహించి, ఈ కులాలు మతాలు మనం సృష్టించుకున్నవేనన్న నిజాన్ని గ్రహించి, సమాజానికి ఎదురు నిలిచి, తన మనవరాలిని ఆమె కోరుకున్నవాడితో పడవ ఎక్కించటంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో తొమ్మిది పాటలు ఉన్నాయి. వాటిలో ఆరు పాటలు నృత్యాభినయం ప్రధానంగా సాగుతాయి. నటి, నృత్య కళాకారిణి భమిడిపాటి సబిత హేమ పాత్రలో జీవించారు. ఆమె నటించిన ఏకైక చిత్రం ఇది ఒక్కటే. కనులతో ఈమె పలికించే భావాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. ఈ చిత్రంలోని నృత్యాలన్నీ శేషు గారు కంపోజ్ చేసారు.
ఈ ప్రేమగీతం కథాపరంగా హరి, హేమలు దగ్గర అవటాన్ని చూపిస్తుంది. వేటూరి సుందర రామమూర్తిగారి కలం చేసిన విన్యాసాలు చెప్పనలవి కాదు. ఎంతో మధురమైన మాటలు, భావాలతో పాటుగా వృత్త్యనుప్రాసాలంకారంలో పదాలను ఉపయోగిస్తూ అదీ, (ఛేకానుప్రాసలో) అర్థభేదంతో ఒకే పదం వచ్చేలా వ్రాయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. పాట వివరణలో ఆ విశేషాలు కూడా తెలుసుకుందాము.
వేటూరి గారి కలం చిందిన అమృతబిందువులను ఒడిసి పట్టుకుని దానికి అందమైన బాణీని కూర్చిన ఘనత మామ మహదేవన్ ది. అద్భుతంగా గానం చేసిన వారు శ్రీ యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి పి సుశీల గారు.
ఈ అందమైన గీతంలో నాయిక నాయకుని మురళీగానాన్ని ప్రశంసిస్తూ ఉంటే, నాయకుడు కథానాయిక పాదాల మువ్వల నాదాన్ని ప్రశంసిస్తాడు. మరి చూద్దామా ఆ భావమాధుర్యాన్ని?

ఆమె:
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి? మోహన మురళి
ఇదేనా ఆ మురళి?

(కథానాయకుడి మురళీగానాన్ని ఆ కృష్ణభగవానుడి మురళీగానంతో పోల్చుకుంటున్నది నాయిక. వ్రేపల్లియ గుండెనే ఝల్లుమనేలా పొంగించిన ఆ రవళి, నవరసాలను పలికించే మురళి ఆ మోహనుని మురళి ఇదేనా?)

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలమా బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి?

(ఆనాడు కాళింది మడుగులో కాళీయుని మర్దనము చేసినప్పుడు ఆ పడగలపై ఆడినప్పుడు ఆబాలగోపాలమూ ఆ బాలగోపాలుడిని ఆశ్చర్యంతో ఆ చెరువు వైపు విచ్చుకున్న కన్నులతో చూసినప్పుడు తాండవమాడుతూ అక్కడున్న వీక్షకుల గుండెలలో ఊదిన మురళి ఇదేనా?)

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి?

(అనగల రాగమై – పలుకగల రాగమై ముందుగా మన వీనులను ఆనందపరచి, తరువాత అనలేని రాగమై – అనగా అనురాగమై మరల వినిపించి, మరులే కురిపించి, జీవనరాగమై, బృందావనంలో వినిపించిన ప్రేమగీతమై ఆ గోపకాంతల కన్నులనే కలువలలో విరిసిన వెన్నెలను దోచిన మురళి ఇదేనా?)

అతడు:
ఆ…
వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి? మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి?

(వేణుగానలోలుడైన నందనందనుని కూడా మురిపించి అలరించిన ఆ మువ్వల రవళి, నటనల సరళి… ఆ నందన మురళి ఇదేనా?)

మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఇదేనా ఆ మురళి?

(ఆ మధురానగరిలో, యమునాతరంగాలలో ఆ రాధ యొక్క ఆరాధనాగీతిని పలికించి, సంగీతము, నాట్యము కలిసినప్పుడు కలిగిన సుఖమే వేణువు కాగా ఆ రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి… ఆ మురళి ఇదేనా?)

ఆమె:
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి? మోహన మురళి
ఇదేనా ఆ మురళి?
ఈ పాటలో వినిపించే వేణుగానలహరులు అద్భుతం. ముఖ్యంగా పాట మొదలవగానే వినిపించే మురళీగానం మన మనసులకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. చిత్రీకరణలో కథానాయకుని చోసిన నాయిక మనసులోని భావాలు కనులలో ప్రతిఫలింపజేయటం, కాళీయమర్దనాన్ని ఆమె అద్భుతంగా అభినయించటం, కృష్ణానదిలో నీటికోసం వెళ్ళి ఆ ఒడ్డున నాట్యం చేయటం, అక్కడ స్వచ్ఛమైన నీటిలో నది యొక్క అడుగుభాగం ఎంతో స్పష్టంగా కనిపించటం, అతను నదీజలాలతో ఆమె రెండు పాదాలను అభిషేకించటం ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి.
వేటూరి గారి పదప్రయోగాలు ‘ఆబాలగోపాలమా బాలగోపాలుని, అచ్చెరువున అచ్చెరువున, అనగల రాగమై, అనలేని రాగమై, ఆరాధ ఆరాధనాగీతి పలికించి…’ ఎంతో మనోహరంగా అనిపిస్తాయి.
హృదయాన్ని పులకింపజేసే ఈ గీతాన్ని వీక్షించుదామా మరి?

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *