March 19, 2024

అర్చన. . . కనిపించుటలేదు! – 3

రచన:- కర్లపాలెం హనుమంతరావు

అర్చన మెల్లగా కళ్ళు తెరిచింది. టైము చూస్తే ఇంకా తెల్లవారడానికి రెండు గంటల సమయముంది.
ముందుగదిలో శ్యామల కోకిల కంఠంతో త్యాగరాజస్వామివారి కీర్తనను ఆలపిస్తోంది.
అలాగే ఆలకిస్తూ పడుకుండి పోయింది అర్చన.
అయినా ఆలోచనలు తమ పాటికి తాము వస్తూనే వున్నాయి.
తను ఇక్కడకి వచ్చి ఇవాల్టికి రెండు రోజులు. రఘు కలకత్తాలో ఏదో పనుందని వెళ్ళా డుట. ఇవాళో. . రేపో. . ఎక్స్ పెక్టెడ్.
శ్యామలకు ఇబ్బందయినా తను ఇక్కడే ఉండక తప్పదు. రఘుని కలుసుకొని పోక తప్పదు.
రఘుతన చిన్ననాటి స్నేహితుడు. కావలిలో ఇద్దరూ పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళు. రఘు నాన్నగారు సంపత్కుమారాచార్యులుగారు గొప్ప సంగీత విద్వాంసులు. లోకల్ కళాశాలలో సంగీతం మాస్టారు. రిటైర్ ఆయిపోయిన తరువాత మధురై వెళ్ళిపోయారు. రఘు ‘ లా ‘ చేసి విజయవాడలో ప్రాక్టీసు చేస్తున్నాడు. ఇప్పుడు వామ పక్ష భావజాలానికి అకర్షితుడై మానవ హక్కుల వేదిక తరుపున చురుకైన పాత్ర పోషిస్తున్నాడు కూడా. రఘు పేరు చెబితే వేరే పరిచయం అక్కర్లేదు రాష్ట్రంలో.
శ్యామల వాడి మేనత్త కూతురు. తండ్రి మాట మన్నించి ఆమెను వివాహం చేసుకొన్నాడు. వీళ్ళ వెళ్ళికే తను అప్పట్లో కడలూరు వెళ్ళింది. అప్పుడు తనకీ పెళ్ళయి ఏడాదయింది.
శ్యామల రాకతో ఈ లోకంలోకి వచ్చింది అర్చన.
‘ఇవాళ పోగ్రామ్ ఉంది. రావడం లేటు కావచ్చు. నా కోసం వెయిట్ చేయకుండా నీ పని చూసుకో! నీ మెడికల్ రిపోర్టులు వచ్చాయా? నువ్వు తెచ్చుకుంటావా? నన్ను తెమ్మంటావా? ‘ అనడిగింది శ్యామల. శ్యామలకూ అర్బన బాగా చనువే.
అర్చన సమాధానం చెప్పేలోగానే ఆమె వెళ్ళిపోయింది పిల్లలిద్దర్ని తీసుకొని.
శ్యామల ఆలిండియా రేడియో ‘ ఏ ‘ గ్రేడ్ ఆర్టిస్ట్. ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల చింటూ, ఏడాది పింకీ. హ్యాపీ ఫ్యామిలీ.
బద్ధకంగా అలాగే పడుకుండి పోయింది అర్చన పేపరు చూస్తూ.
పేపర్లోని ఆ వార్త చూసి ఆసక్తి అనిపించి పూర్తిగా చదివింది ‘డబ్బు కోసం రక్తం దానం చేసేవాళ్ళని అడ్డుకోవడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తుందట ప్రభుత్వం! రాష్ట్రంలోని 233 రక్త సేకరణ కేంద్రాలను అనుసంధానించడం అనేది మంచి ఆలోచనే గానీ, దాని ద్వారా నష్టపోయే వ్యాపార వర్గాలు చూస్తూ వూరుకుంటాయా ? పది కోట్ల ప్రాజెక్టు అది. అమలు అయ్యేనాటి సంగతి.
ఏదో ఆ రాజమండ్రిలో రచ్చయి మీడియా గగ్గోలు పెడుతున్నందుకు ఆ వేడి తగ్గించడానికి తూతూ మంత్రంగా కమిటీ వేసింది ప్రభుత్వం. నాలుగు రోజులు గడిస్తే నాటకం మళ్లా మొదలు. ఎన్ని సంస్కరణలం. . ఎన్ని నివేదికలొచ్చినా. . ప్రభుత్వ పెద్దలే భాగస్వాములుగా ఉన్న వ్యవహారాలు అంటే అంత తొందరగా తెములుతాయా!
నాయకుల వర్ధంతులకు, జయంతులకు ఆర్భాటంగా జరిగే రక్తదాన శిబిరాలు ప్రచారానికే.
ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన మినిమమ్ జాగ్రత్తలైనా ఎవరికి పడుతున్నాయి?
రక్త దానం ఇచ్చే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ముందుగా పరీక్షించుకోవాలి. హిమోగ్లోబిన్ శాతం సరిగ్గా ఉంటేనే రక్తం తీసుకోవాలి. అదీ ఒక దఫాకు ఒక యూనిట్ కు మించి తీసుకోరాదు. రక్తంలో మలేరియా, హెచ్చైవీ, కామెర్లు వంటి లక్షణాలుంటే అది పనికి రాదు. డబ్బాశతో లాభాల కోసం బ్లడ్ బ్యాంకులూ చేస్తున్న ఈ రక్తయజ్ఞంలో తనలాంటి వారు ఎందరు సమిధలవుతున్నారో!
లేచి వంటింటి వైపు వెళ్ళింది అర్చన. కిచెన్ రూముకి లాక్ వేసి వుంది!
అర్థమయింది అర్చనకు. అయినా తనకూ ఏమీ తినాలని లేదు కూడా. కళ్ళు మూసుకుని అలా పడుకునుండి పోవాలనుంది. కానీ. కడుపులోని బేబీని పస్తులతో ఉంచే అధికారం ఎంత తల్లయినా తనకూ లేదు.
ముందు మెడికల్ రిపోర్ట్ తెచ్చుకుని డాకర్ని కలిస్తే ఒక పనయిపోతుంది.
డాక్టర్లు చెప్పే దాన్ని బట్టి రఘు హెల్ప్ తీసుకోవడం మంచిది. దానికన్నా ముందు ఆ విజయవాడ పెద్ద మనిషిని కలవాలి.
ఓపిక తెచ్చుకుని ల్యాండ్ లైన్ నుంచి ఓ నెంబరుకు కాల్ చేసింది. నాలుగయిదు సార్లు ట్రయ్ చేసిన తరువాత గాని లైనులోకి రాలేదా ఘనుడు.
అర్చన అంది. ‘ హైదరాబాదొచ్చినప్పుడు మీరు ఒప్పుకున్న విషయాలన్నీ గుర్తున్నాయి గదా! సాయంత్రమో, రేప్పొద్దునో నేనూ రఘుగారు కలసి వస్తాం. స్పాట్ లో సెటిలయిపోవాలి. రేపు నైటుకల్లా నేను వెళ్ళిపోవాలి. ఏదన్నా ట్రిక్ ప్లే చేయాలనకుంటే నష్టపోయేది మీరే. అన్ని అరేంజ్ చేసి వుంచాల్సిన బాధ్యత మీదే !’
‘మీరు రండి. అంతా రడీగా వుంది. రఘుగారిని అడిగానని చెప్పండి’ అన్నాడా పెద్దమనిషి.
అతగాడి పేరు రామలింగేశ్వరరావు. ఆ ఏరియా ఎమ్. ఎల్. ఏ

***

మెడికల్ రిపోర్టులు తీసుకుని డాక్టర్ రాంప్రసాద్ గారిని కలిసింది అర్చన.
‘మన అనుమానం నిజమయింది మేడమ్! మీరు పాజిటివ్ లోనే ఉన్నారు. ‘ అన్నారు డాక్టరు.
‘ ఏ స్టేజీలో ఉంది డాక్టర్?’ అని అడిగింది అర్చన ప్రాణాలు ఉగ్గబట్టుకుని.
‘ ఇన్ క్యూబేషన్ పీరియడ్ దాటి పోయిందమ్మా ! ఈ దశ సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాలే ఉంటుంది. సిమ్ప్ టమ్స్ కనిపించవు. కనక చాలా మందికి తెలీదు. వేరే ఏ చెకప్ కనో వెళ్ళినప్పుడు – ఇదిగో ఇప్పుడు మీకు లాగా. . బైటపడుతుంది. మీ కేసులో అయితే అక్యూట్ ఇన్ఫెక్షన్ దశ కూడా దాటిపోయింది. చివరిలోకి వచ్చేసింది. ఆగకుండా వచ్చే జ్వరం. . వళ్ళు నొప్పులు. . అన్నీ ఆ లక్షణాలే. కొంతమంది కయితే చర్మం కూడా కమిలినట్లయిపోతుంది. ఇంకొంతమందికి గొంతు వాపు, నోట్లో గుల్లలు. . లాగా వస్తుంటాయి ‘
‘ నాకూ వూరికే నోరు ఎండిపోతుంది. కాస్త ఏదన్నా టెన్షన్ లో పెద్దగా అరిస్తే వెంటనే నాలిక అంగిటికి అంటుకుపోతుంది. ఇది వరకు ఇలాగా ఎప్పుడూ లేదు’
‘ ఇవన్నీ ఆ వ్యాధి లక్షణాలే. ఈ వ్యాధి విచిత్రమైంది. . దీనికి ప్రత్యేకంగా ఏ లక్షణాలూ ఉండవమ్మా! ఇమ్యునైజేషన్ సిస్టమ్ దెబ్బ తింటుంది. వాతావరణంలో వచ్చే మార్పులకు రోగి తొందరగా అడ్డంపడతాడు. అడ్జస్టు కాలేడు. క్రమంగా బరువు తగ్గిపోతుంది. ఇవన్నీ మూడోదశ. . ‘ లేటన్సీ దశ ‘
‘ఇదెంత కాలం ఉంటుంది డాక్టర్ ?’
‘ రెండు వారాల నుంచీ ఇరవె ఏళ్ల దాకా వుండవచ్చమ్మా ! ఆరోగ్య స్థితి, అతనికిచ్చే ట్రీట్మెంట్ ను బట్టి ఉంటుంది. ఈ ఫైలు చూస్తూ ఉండండి. ఇప్పుడే ఒక పేషెంట్ ను చూసివస్తాను’ అంటూ ఒక ఫైలు ఆమె ముందుకు జరిపి వెళ్ళి పోయారు డాక్టర్ రాంప్రసాద్.
అది ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ ప్రాజెక్టు రిపోర్టు. డైరక్టరు ఇచ్చిన వివరాలకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ఉన్నాయందులో.
ప్రపంచంలో మొదటి హెచ్చైవీ కేసు వాదాపు ముప్పయిఏళ్ల కిందట మొదలయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి దాదాపు రెండున్నర కోట్ల మంది చనిపోయినట్లు ఒక లెక్క. ప్రతి వేయి మందిలో ఆరుగురు హెచ్చైవీ బాధితులే. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఇంత తవరకూ 3. 5 లక్షల మందిని హెచ్చైవీ పాజిటివ్ గా గుర్తించడం జరిగింది. ఇందులో రెండున్నర లక్షల మంది కనీసం ఏ. ఆర్. టీ సెంటర్లలో పేరు నమోదు చేయించుకోనేలేదు. ‘
‘ ఈ ఏ. ఆర్. టీ అంటే ఏంటి డాక్టర్? ‘
‘ ఏంటీ రెట్రో ట్రీట్ మెంట్ – అదో రకం థెరపీ. హెచ్చైవీ బాధితులకు క్రమం తప్పకుండా వైద్య సాయం అందించే బాధ్యత ఈ కేంద్రాలది ‘
‘హెచ్చైవీ కి మందు లేదని అన్నారు ఇందాక?! ‘
‘నిజమే వచ్చిన తరువాత నివారించే మందు లేదు. కానీ, నిదానించే యాంటీ రెట్రో వైరల్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. క్రమం తప్పకుండా వైద్యం చేయించుకుంటే జీవిత కాలాన్ని పొడగించుకునే అవకాశం ఉంది. ‘
‘ హెచ్చైవీ రోగి ఎంత కాలం బతికే అవకాశం ఉంది?’
‘ హెచ్చైవీ తో ఎవరూ చనిపోరు. అది ఎయిడ్స్ కిందకు మారితేనే ప్రమాదం. ఏ ట్రీట్మెంటూ తీసుకోక పోయినా హెచ్చైవి సెయిలర్స్ గా మారడానికి పదేళ్ళు దాకా పడుతుంది. ఎయిడ్స్ వచ్చిన తరువాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంకో పదేళ్లు ఈజీగా బతికేయచ్చు. ఇది కేన్సర్ లాగా వెంటనే ప్రాణాలు తీసే జబ్బు కాదు. ‘
‘నిజమే కదా డాక్టర్! సమాజం కేన్సర్ వ్యాధి పీడితుని మీద చూపించే జాలి, సానుభాతి, హెచ్చైవీ రోగి మీద చూపించదు. ‘
హెచ్చైవీ అనగానే అదేదో చెడు తిరుగుళ్ళ వల్ల కొని తెచ్చుకునే సుఖవ్యాధి’ గా ఊహించుకుని రోగిని చీదరించుకుంటుంది లోకం ! రోగికి రోగం బాధకు మించి సమాజం చూపించే నిరాదరణ. . అవమానం. . బాధ ఎక్కువగా ఉంటుంది’ అంది అర్చన.
‘అందుకే హెచ్చైవీ బాధితులకి చికిత్స ఎంత అవసరమో కౌన్సిలింగ్ కూడా అంత అవసరం. ఆ అవేర్ నెస్ కలిగించడానికి బదులు మన తుగ్లక్ సర్కార్లు అరకొర చర్యల తో బాధితులను మరింత బెదరగొడుతున్నాయి. ‘ అన్నాడు ఆ మధ్యాహ్నం అనుకోకుండా ఇంటికివచ్చేసిన రఘు అర్చన మెడికల్ రిపోర్టులు చూసి చర్చించే సందర్భంలో.
‘సరే వచ్చిరాగానే ఈ అకడమిక్ చర్చలు ఎందుకు కానీ. . ముందు నువ్వు ఫ్రెష్ అయిరా! అర్జంటుగా మనం సెటిల్ చేసుకోవాల్సిన మేటర్ మరొకటుంది’ అంది అర్చన చనువుగా.
‘ఏంటో అంత అర్జంట్ మేటర్ ? ‘
తినబోతూ రుచి అడగట మెందుకు? ముందు నువు బాత్ రూం లోకి నడూ! ‘ అంటూ బలవంతంగా లేవదీసింది రఘుని అర్చన.

**

జనవరి 12.
జాతీయ యువజన దినోత్సవం.
ఆ సందర్భంగా టౌన్ కొత్తపేట సెంటర్లో రక్తదాన శిబిరం భారీ ఎత్తున నిర్వహిస్తున్నాడు ఎం. ఎల్. ఏ తవ్వా రామలింగేశ్వరావు.
అతగాడు ఆ ఏరియాకి రెండోసారి ఎన్నికైన ఎమ్మల్యే. అధికార పార్టీ సభ్యుడు. అంతకు మించి విస్తరించబోయే మంత్రివర్గంలో అతనికి ఛాన్సు ఉందన్న వార్త ప్రచారంలో ఉంది.
రక్తదాతలను కార్యకర్తలు భారీ ఎత్తునే సమీకరించారు. వాళ్ల హడావుడి మధ్య కూడా రఘుని, రఘుతో పాటు వచ్చిన అర్చనను గుర్తుపట్టి. . శిబిరానికి పక్కన ఉన్న ఒక డాబా ఇంట్లోకి పిలిపించుకొన్న తరువాత పలక రించాడు రామ లింగేశ్వరావు.
‘ కాఫీ, టీ, చల్లగా ఏమైనా. . ‘
‘ మర్యాదలేం వద్దు గానీ. . మా సంగతి ఏం చేశారో ముందు చెప్పండి’ అంది అర్చన సాధ్యమైనంత చిరాగ్గా మొహం పెట్టి.
‘సార్! ఎదో చిన్న పొరపాటై పోయింది. పెద్దమనసుతో మీరు క్షమించాలి’ అన్నాడు ఎం. ఎల్. ఏ.
‘ఎంత ఈజీగా అన్నావయ్యా క్షమించమని! మీ నిర్వాకం మూలకంగా ఒక ప్రాణం కాదు. . రెండు ప్రాణాలు. . రిస్కులో పడ్డాయి. ఈ మేడమ్ కిప్పుడు ఫిఫ్త్ మంత్. ఈ విషయం బైటకు పొక్కితే ఒక ప్రభుత్వోద్యోగం చేసుకునే మహిళకు ఎంత అవమానం? అమె తన భర్తకి, ఇంట్లో వాళ్ళకి ఏమని సమాధానం చెప్పుకోవాలి? ఏదో స్వచ్ఛంద సేవాశిబిరం నిర్వహిస్తున్నారు గదా అని ఇలాంటి మంచివాళ్ళు రక్తదానం చేయాలని ముందుకు వస్తే, నిర్లక్ష్యంగా వ్యవహరించి భయంకరమైన జబ్బులు అంటగడతారా?! ముందు ముందు ఎవరైనా రక్త దానాలు చేయడానికి ఎందుకు ముందుకొస్తారు?’ రెచ్చిపోతున్న రఘును చూసి బిక్క చచ్చిపోయాడు ఎమ్మెల్యే.
‘ఎప్పుడూ ఇలా అవలేదు సార్. . ఏదో ఆ సారి. . ‘
‘ వాడి పారేయాల్సిన సూదుల్ని మళ్ళీ వాడానంటావ్? బ్లడ్ బాంకులో స్టోర్ చేసిన పేకెట్లను కూడా రీ యూజ్ చేస్తున్నారుటగా ? సేంపిల్సును కోల్డ్ స్టోరేజీలో సక్రమంగా పెట్టడం లేదని. . బ్లడ్ టెస్టులు చేయకుండానే రక్తం తీసుకుంటున్నారని రిపోర్టులు గుప్పుమంటున్నాయి. అసల ఎమ్. బి. బి ఎస్ డాక్టర్లు కేంపుల్లో ఉండటంలేదని. . డిసీజ్ ఫ్రీ కాని బ్లడ్ ని సైంటిఫిక్ పద్ధతులో వెంటనే డిస్ట్రాయ్ చెయ్యాలని రూలన్నా పాడు కాసుల కోసం కక్కుర్తి పడి రీ – సైక్లింగ్ చేయిస్తున్నారని రిపోర్ట్చు ఇచ్చిందిగా గవర్నమెంట్ అప్పాయింట్ చేసిన కమిటీ! ‘
‘ సార్ ! మీరు మానవ హక్కుల కమిటి మెంబర్. మీకన్నీ తెలుసు. జరిగింది కరెక్టేనని నేనూ అనటం లేదు. తప్పుల్ని సరిచేసుకోవడానికి సిద్ధపడి మిమ్మల్ని రమ్మన్నాను. మేడమ్ మూడునాలగు సార్లు ఫోన్ చేసి మాట్లాడారు. మీకు కావాల్సింది ఇవ్వడానికి నేను రడీగా ఉన్నాను. ‘
‘ ఆ రోజు మీ బ్లడ్ డోనర్స్ కేంపులో బ్లడ్ ఇచ్చిన వాళ్ల లిస్ట్, వాళ్లను కలక్ట్ చేసుకొచ్చిన వాళ్ల వివరాలు, రక్తం సేకరించిన డాక్టర్ల పేర్లు. . డీటెయిల్డుగా కావాలి’ అన్నాడు రఘు.
‘రఘుగారూ! అవన్నీ అమ్మ గారికి ముందే ఇప్పించాను. మా హైదరబాద్ బ్రాంచికి కూడా డోనర్సును సేకరించి తెచ్చిన బ్రోకర్స్ వివరాలు తెప్పించి ఇచ్చాను. నరసింహరాజని. . మా మనిషినే ఒకడిని నేనే బుక్ చేయించి. . బొక్కలో పెట్టించాను. ఆ వివరాలన్నీ ఇవాళ్టి పేపర్లో కూడావచ్చాయి. చూడండమ్మా ! ‘ అంటూ రామలింగేశ్వరరావు శేషు అలియాస్ సింహరాజు న్యూస్ ఉన్న పేపర్ అర్చన చేతికందించాడు.
అర్చన అది చదివి కొంత తృప్తిగా నిట్టూర్చింది.
‘సరే. మరి మా మరిది రమణమూర్తి పోస్టింగ్ సంగతి ఏం చేశారు?’ అని అడిగింది పేపర్ పక్కన పెట్టి.
రామలింగేశ్వరావు పి. ఏ ని పిలిచి ఏదో చెప్పాడు.
ఐదునిమషాల్లో పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. అన్నీ ముందే సిద్ధం చేసి ఉంచాడన్నమాట! ఎంతైనా రాజకీయ నాయకుడు. పేరు బద్నామయితే కాబినెట్ పదవికి ముప్పొస్తుందని తెలీనంత అమాయకంగా ఉండడు.
ఏమయితే. . ఏం ! బియస్సీ కూడా పూర్తిచేయని రమణమూర్తి దగ్గరకు స్టేట్ గవర్న మెంట్ స్పోర్ట్స్ అథారిటీలో నెలకు పాతిక వేల జీతంతో స్టోర్ రికార్డ్ కీపర్ జాబు క్షణాల్లో నడుచుకొచ్చింది ! అంతకుముందు ఎన్నేళ్లనుండీ తలకిందుల తపస్సు చేసినా ఏ ఉద్యోగం రాలేదు ! అత్తయ్యకు ఈ సంగతి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో!.
పేపర్సన్నీ తీసుకొని థేంక్స్ అయినా చెప్ప కుండా లేచారు అర్చనా, రఘు.
దారిలో కారులో అంది అర్చన ‘ థేంక్స్ రా రఘూ! దీని కోసమే నేను రెండు రోజుల్ముంచి టెన్షన్ పడుతూన్నది. నీ కోసం ఎదురు చూసింది. నువ్వు నాకు చేయాల్సిన హెల్ప్ ఇంకోటుంది మిత్రమా! ‘
‘ అలాంటి బ్లడ్ బ్యాంకుల మీద కోర్టులో కేసు వేయాలి. . అంతేగదా. . రాక్షసీ ! యువరార్డర్ మేడమ్ గారూ ! ‘ అన్నాడు రఘు నాటక ఫక్కీలో.
‘ముందా చేతి క్కట్టుకున్న దొంగ కట్టు తీసి పారేయ్ తల్లీ ! చూడలేక ఛస్తున్నాను’ అన్నాడు ఒక కాఫీ బార్ ముందు కారాపి.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *