May 26, 2024

అర్చన కనిపించుటలేదు – 4

రచన: కర్లపాలెం హనుమంతరావు

‘ఇప్పుడు నాకు కావాల్సింది కాఫీలు, టీలు కాదురా రఘూ! ఒక చెడ్డ డాక్టర్. ‘ అంది అర్చన కాఫీ తాగుతూ.
‘డాక్టర్ రాంప్రసాద్ అంత చెడ్డ డాక్టర్ ఈ సిటీ మొత్తంలోనే లేడంటారు తోటి డాక్టర్లు. పేషెంట్ల దగ్గర అతను తీసుకొనే ఫీజు ఐదు, పది రూపాయలే! ‘
‘నాకు కావాల్సింది నిజం చెడ్డ డాక్టర్. ప్లీజ్ ! నా కడుపులోని బేబీని నిర్దాక్షిణ్యంగా చంపగలిగే కిరాతక డాక్టర్ !’
రఘు అమాంతం సీరియస్సయిపోయాడు. ‘జన్మనివ్వడం వరకే తల్లిదండ్రుల హక్కు. చంపే హక్కు చట్టం ఇవ్వలేదు’ అన్నాడు కఠినంగా.
‘చెప్పడం తేలికే. అనుభవించేవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఏ తల్లయినా తన బిడ్డ భూమ్మీద గొప్పగా బతకాలని కోరుకొంటుంది. ఇలా ఈసురోమంటూ రోజులు వెళ్ళదీస్తుంటే చూస్తూ తట్టుకోలేదు. అంతకన్నా పుట్టక ముందే చచ్చిపోవాలని కోరుకొంటుంది.’ అంది అర్చన అంతకన్నా సీరియస్ గా.
‘మెర్సీ కిల్లింగ్ ని మనదేశంలో ఇంకా న్యాయస్థానాలు మెర్సీలెస్ కిల్లింగ్ గానే చూస్తున్నాయి. సమాజమూ అమోదించే స్థాయిదాకా ఎదగలేదు. ‘
‘దొంగ కట్టు కట్టించావు గాని. . . దొంగ డాక్టర్ను చూపించలేక పోయావు. నీ సంగతి తెలిసీ ఇంత దూరం రావడం నిజంగా నాదే బుద్ధి తక్కువ’
‘బుద్ధి లేకుండా బుద్ధి తక్కువదానికి ఇంకా హెల్ప్ చేస్తున్నాను చూడు. నాదీ బుద్ధితక్కువ’ అంటూ చివరికి ఒక డాబా ఇంటి ముందు కారాపాడు రఘు.
గేటు తీసుకుని చొరవగా లోపలికి పోయి ‘డాక్టర్ హేమలత’ అంటూ ఒక నడివయసు మనిషిని అర్చనకు పరిచయం చేసాడు రఘు.
అర్చన కేస్ హిస్టరీ అంతా ముందే తెలిసున్నట్లు మాట్లాడింది డాక్టర్. “ఇటీజ్ అల్రెడీ బేబీ గ్రోయిన్ స్టేజిలో ఉంది. అబార్షన్ లాంటిది చేస్తే డెఫినెట్ గా ముందు మీ ప్రాణాలకే ముప్పు. నాటోన్లీ యాజ్ ఏ డాక్టర్ బట్ యాజ్ ఏ మదర్ అల్సో ఐ డోంట్ సబ్జెష్ట్ ఎనీ కాంప్లికేటెడ్ స్టెప్స్ ‘
‘నా సంగతి నేను ఆలోచించుకోవడం ఎప్పుడో మానేసాను డాక్టర్. ఇప్పుడు నా ఆలోచనంతా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డను గురించే. ‘అమ్మా! నాకు హెచ్చైవీ ఎందుకొచ్చిందమ్మా ‘ అని రేపు పాప అడిగితే నేనేమి సమాధానం చెప్పాలి? పిల్ల ఎదిగి పెళ్ళికి తయారయితే ఎన్ని అబద్ధాలాడి తనను ఒకింటి దానిని చేయగలను? అసలు అందాకా నేను బతికి ఉంటానన్న భరోసా కూడా లేదుగదా! అందుకే నేనీ నిర్ణయానికొచ్చింది. హైదరాబాదులో అయితే ఈ విషయం ఎలాగైనా బైటపడుతుంది. మీరు కాదన్నా కావలి పోతే ఏ క్వాక్ చేతనైనా గుట్టుగా అబార్షన్ చేయించుకోగలను. అందుకు సరిపడ్డ సొమ్మతోనే నేను బయలు దేరాను’ అంది అర్జన బింకంగా.
ఎంత క్వాక్ అయినా తెలివున్నవాడు ఒక హెచ్చైవీ పాజిటివ్ కు అబార్షనంటే ముందుకు రాడు. ఈ రోగమే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా ఒకళ్ళ నుండి ఒకళ్ళకి ఈజీగా సంక్రమించేది. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా కటింగ్ చేసేటప్పుడు బ్లడ్ తో టచింగ్ లేకుండా ఎలాగుంటుంది?” అంది డాక్టర్ కాస్త కరకుగానే.
ఇంటి కొచ్చే దారిలో రఘు అర్చన సీరియస్ నెస్ ను చూసి ఏమీ అడగలేదు. ఇంట్లో కొచ్చే ముందు మాత్రం అన్నాడు ‘నాకు చెప్పకుండా ఏ పిచ్చి పనీ చేయద్దు! రేపు ప్రశాంతంగా ఆలోచించుకుందాం ఏం చేయాలో!’
అర్చనది అదే మౌన ముద్ర. . . ఏం మాట్లాడలేదు.

***
రాత్రి నిద్రలో ఎక్కడో గోలగా మాటలు వినిపిస్తుంటే మెలుకువ వచ్చింది అర్చనకు.
రఘు. . శ్యామల ! ఏదో విషయంలో గొడవపడుతున్నట్లున్నారు.
‘నేను డాక్టర్ రాంప్రసాద్ ను అడిగాను. పిల్లలున్న ఇంట్లో ఆ పాడు రోగం ఉన్న మనిషి ఒక్క క్షణం కూడా ఉండటానికి లేదు’ అంటోంది శ్యామల.
‘శ్యామలా! ప్లీజ్. . అసలే తను చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. ఫ్రెండనేగా నా దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చింది! ఇలాంటి కష్టాలొచ్చినప్పుడే నిజమైన స్నేహం బైటపడేది’ అని రఘు బతిమాలే గొంతు.
‘తనూ అందరు ఆడవాళ్ళలాగా ఉండొచ్చు గదా | గుడికని వచ్చింది అమ్మవారి దర్శనం చేసుకుని పోతే చాలదా! రోడ్డు పక్క శిబిరాల్లో పడుకుని రక్తాలు దానం చేయడమేంటి. . అసహ్యంగా!’ శ్యామల గొంతులో చీత్కారం!
‘తనే పరిస్థితుల్లో ఆ పని చేసిందో తెలుసా! నీళ్లలో దూకి ప్రాణాలు తీసుకోబోయే ఓ పాపను సేవ్ చేయడానికి అర్జంటుగా బ్లడ్ కావాల్సివస్తే మంచి మనసుతో ఇచ్చింది. పాప రేర్ బ్లడ్ గ్రూపూ తన గ్రూపుతో మ్యాచవడంతో మరో ఆలోచన లేకుండా బ్లడ్ డొనేట్ చేసింది. అది అర్చన నైజం. ‘
‘ నాకు నా సంసారం, పిల్లలూ ముఖ్యం. తెల్లారి తనకు వేరే ఎక్కడన్నా ఏర్పాటుచేయండి. నేను ప్రోగ్రాం ముగించుకుని ఇంటి కొచ్చే వేళకి తను ఇంట్లో ఉండకూడదు. దేన్నీఈవిడగారు టచ్ చేయకుండా ఇరవైనాలుగ్గంటలూ కాపు కాస్తూ కూర్చోడం నావల్ల కాదు’
‘ఛీ’ అన్నాడు రఘు చివరికి.
కళ్లూ. . చెవులూ మూసుకుని పడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది అర్చన.

***

‘ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. . .
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు’ అన్నమయ్య సంకీర్తన సాధన చేసే పనిలో మునిగి వుంది శ్యామల.
‘శ్యామలా! బైట గది తలుపులు తెరిచి లోపల పాడుకుంటూ కూర్చున్నావా? ఎవరైనా లోపలికి దూరితేనో !’ అంటూ వీధి వాకిలి మళ్ళీ మూయడానికని వెళ్ళిన రఘు అర్చన పడుకొని ఉండాల్సిన గదివైపు చూశాడు.
ఆమె మంచం ఖాళీగా ఉంది!
అనుమానం వచ్చి తలుపు ఒకసారి చిన్నగా తట్టి. . బదులు రాక పోయేసరికి బార్లా తెరిచి లోపలికొచ్చాడు రఘు.
టేబుల్ మీద ఉండాల్సిన ఆమె షోల్డర్ బ్యాగ్. . హ్యండ్ బ్యాగ్ లేవు!
‘శ్యామలా! అర్చన కనిపించడం లేదు. వెళ్ళి పోయిందా ?నీకు చెప్పిందా?’ అనరిచాడు రఘు.
‘ నాకెందుకు చెబుతుంది. చెబితే మీకే చెప్పాలిగాని ‘ అంది శ్యామల.
మంచం మీద కనిపించిన అర్చన ‘ థేంక్యూ రఘూ! ‘ అన్న లెటర్ చూసి పీడా వదిలింది అనుకుంది శ్యామల.

***

రాఘు, శ్యామల మాటలు తన చెవిలో పడటం మంచిదే అయింది. డాక్టర్ ప్రేమలత మాటలు గుర్తుకువచ్చాయి. ఎంత పెద్ద వైద్యుడయినా హెచ్చైవీ వచ్చిన రోగితో డైరెక్ట్ కాంటాక్ట్ కోరుకోడు- అని అర్థమయింది.
ఈ వ్యాధిలోని కొత్త కోణం బయటపడింది. డాక్టర్ రాం ప్రసాద్ అన్న మాటా నిజమే. కౌన్సిలింగ్ కావాల్సింది రోగి కన్నా ముందు సమాజానికి. ఇది చెడు తిరుగుళ్ల వల్ల వచ్చే రోగమని చాలామంది దురభిప్రాయం. ఇంట్లో ఏ మగాడూ తన ఇల్లాలుకు ఈ రోగం అంటించడం లేదని గ్యారంటీగా చెప్పగలరా?
ఎక్కడి దాకానో ఎందుకు ? దేవయాని గారి దగ్గరకు విజిటింగ్ కని వెళ్ళినప్పుడు హెచ్చైవీ ఉందేమోనని డౌట్ ఎక్స్ ప్రెస్ చేసిందామె. అప్పుడు తనకూ ముందు ప్రసాదు మీదే కదా అనుమానం కలిగింది ? ఇద్దరూ మెడికల్ టెస్టులు రెండుసార్లు చేయించుకున్న తరువాత తనే పాజిటివ్ అని తేలింది. పాపం ప్రసాదు నెగెటివ్ అనే వచ్చింది.
‘టికెట్. టికెట్ మేడమ్. . ప్లీజ్! ‘
టి. సి మాటతో ఈ లోకంలోకొచ్చింది అర్చన.
విజయవాడ స్టేషనులో ఆటో దిగంగానే బైలుదేరబోతున్న సింహపురి కనిపించింది. ట్రైన్ కేచ్ చేద్దానున్న కంగారులో టికెట్ కొనే ఆలోచనే పట్టింది కాదు.
కావలి దాకా పెనాల్టీతో సహా టికెట్ తీసుకొని కూపేలోని విండో సీటు ఖాళీగా కనిపిస్తే వెళ్ళి కూర్చుంది అర్చన.
బైట తుఫాను ముందుండే వాతావరణం. నిన్నటి బట్టి టీవీలలో రేడియోల్లో ఆగకుండా సైక్లోన్ ఎలర్ట్ లు వినిపిస్తున్నాయి !
చల్లగాలి చివ్వుమని లోపలికి వస్తుంటే ‘ కాస్త డోర్ వేయండి మేడమ్ ! పిల్లాడున్నాడు’ అన్నాడు ఎదురు సీటాయన.
అతని పక్కన ఉన్నది అతని భార్య అనుకుంటా. ‘ఇందాకటి నుంచి తననే పరీక్షగా చూస్తున్నది’ అనుకుంది అర్చన.
ఎందుకైనా మంచిదని వాషింగ్ రూము కని వెళ్లినట్లే వెళ్లి పక్క కూపేలోకి మారి పోయింది అర్చన.
అక్కడ ఎదురు జంటలోని పెద్దాయన చదివే ప్రకటన చూసిన తరువాత విషయం అర్థమయింది అర్చనకు.
తన ఫోటో. . క్రింద ‘ కనబడుటలేదు ‘ అన్న ప్రకటన. . ప్రసాదు పేరుతో విన్నపం!
‘ ఈ ఫోటోలోని మహిళ కావలి పిన్ని గారింటికని బైలుదేరి ఇంత వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును ‘ అంటూ సంప్రదించడానికి ఇంటి నెంబరు. . తన సెల్ ఫోన్ నెంబరూ ఇచ్చాడు ప్రసాద్ !
ఇందాకటి పక్క కూపే మగ మనిషి ఈ బోగీలోకి కూడా రెండు మూడు సార్లు వచ్చి అదోలా చూసి పోవడం వెనక అంతరార్థం అర్చన ఇప్పుడు గ్రహించింది. తను కావలి దాకా టికెట్ తీసుకోవడం గమనించే ఉంటాడు.
సింగరాయకొండ రాగానే గమ్మున బ్యాగులు రెండూ తీసుకొని దిగిపోయింది అర్చన.
బండి స్టేషనులో ఎక్కువ సేపు ఆగలేదు గనక ఆ పత్తేదారు తనను గమనించే అవకాశం లేదు.
స్టేషను బైటి కొచ్చి ఆటో చేసుకుని కావలికని జైలుదేరింది అర్చన. అంత ఈదురు గాలిలో కూడా త్రిబుల్ ఛార్జీ గిడుతుందంటే వచ్చే ఆటోలూ కొన్నుంటాయి.

***

కాంతమ్మ గారు మూసిన కళ్ళు తెరవకుండా పడి ఉంది. ఆచారి గారు అప్పుడే వచ్చి పోయారు. ‘పెద్దతనం కదా ! గాయం ఒక పట్టాన తగ్గదు. ఈమాత్రలు గంట కోసారి తేనెలో గాని. . పాలలోగాని రంగరించి మింగిస్తూవుండు చిన్నా ! ముందు రక్త స్రావం తగ్గుతుంది’ అన్నారాయన మందిచ్చి పోతూ పోతూ.
కాంతమ్మకి నడుం మీద ఒక గడ్డలాగా లేచింది. చిదిమి చీము తీసేసి పసుపు కట్టు కట్టిపోయారు ఆచారిగారు. ఈ మధ్య. . ఇలా గడ్డలు రావడం. . ఆమె ఇట్లా అడ్డంపడటం మామాలయి పోయింది. ఈసారే ఎందురో తట్టుకో లేకపోతోంది.
అర్చన మీది దిగులుతో మరింత కుంగి పోయిందామె.
‘అక్క వచ్చిందటనా? కబురేమైనా తెలిసిందా? ఒక్క సారి ఆ హైదరాబాదుకు ఫోన్ చేసి అడగరాదుట్రా! ‘ అంటూ ఆ మగత నిద్రలోనే ఏమేమో కలవరిస్తోనే ఉందా పెద్దావిడ.
తల్లికి చెప్పలేదు గాని చిన్నా మూడు రోజుల్నుంచి గంటకోసారి
హైదరాబాదు ఫోన్ చేస్తునే ఉన్నాడు. మొదట్లో మొదట్లో ఏదో బదులొచ్చేది గానీ, నిన్నటి నుంచైతే అసలు ఫోనే ఎత్తడం లేదెవరూ! ఇవన్నీ చెబితే పెద్దావిడ కూలిపోతుంది.
చెడ్డ వార్తలేవీ చెవిన పడనీయద్దు. . మరింత ప్రమాదం’ అని హెచ్చరించున్నారు ఆచారిగారు.
మూడు రోజులయ్యింది. ఇంట్లో సరిగ్గా వండిపెట్టే వాళ్ళు లేక. అన్నం కూడా సరిగ్గా తినడం లేదు చిన్న. ఆకలితో పేగులు కదిలి పోతున్నాయి. మంచినీళ్ళతో ఆ ఆకలి మంటలు ఆర్పుకుంటున్నాడు. నీరసంతో కళ్ళు మూతలు పడిపోతున్నాయి కూడా!
బైట ఏదో బండి ఆగిన అలికిడి ! లేచే ఓపిక లేక అలాగే కూర్చుండి పోయాడు చిన్న.
తలుపు దగ్గర మనుషుల అలకడి ఒకసారికాదు. . రెండుసారు. . ఏదో దబ్బుమని పడిన శబ్దం. తలుపును టక. . టక కొట్టారు రెండు సార్లు. ఆ కొట్టే తీరు చూస్తే అచ్చంగా అర్చనక్క కొట్టినట్లే ఉంది. మూడు నాలుగు నెలల కొకసారి వస్తూనే ఉంటుంది గదా! వచ్చినప్పుడూ ఇంతే. . ఇట్లాగే తలుపు కొడుతుంది. .
‘సింహపురి వచ్చే టైము కూడా కాదే!’ అనుకుంటూ లేని ఓపిక తెచ్చుకుని కర్ర పోటేసుకుంటూ వెళ్ళి తలుపు తోసాడు చిన్న. .
ఎవరూ లేరు! జోరున వర్షం. వర్షంలో తడుస్తూ రోడ్డుమీద ఆటో ! ఆటోలో పరదా మాటున ఎవరో ఉన్నారు! అక్కలాగే అనిపించి, వరండాలో కొచ్చాడు చిన్న.
వాన ధారల మధ్య స్పష్టంగా కనిపించడం లేదుగానీ. . . అక్కే ! ఆటో కదిలింది. పరదా తొలిగింది.
కదిలే ఆటోలో నుంచి అక్క చేతులూపుతూ కనిపిస్తోంది!
అక్కే! ఇంటి దాకా వచ్చి అట్లా దిగకుండా వెళ్లిపోతోంది!
‘ అమ్మా! అక్క వచ్చిందే! వెళ్ళిపోతోంది. అదిగో ఆటోలో! ‘ అంత వర్షంలోనూ తడుస్తూ అక్కడే నిలబడి పెద్దగా అరుస్తున్నాడు ఉద్వేగం పట్టలేని చిన్న.
‘అవును! అక్కే! వెళ్ళూ! వెళ్ళి ముందా బండిని ఆపూ ‘ అంటూ అరుస్తోంది గడపను పట్టుకుని నిలబడిన కాంతమ్మ గారు. . ఎప్పుడొచ్చాందో అంతా వర్షంలోనూ!

***

ఇంకా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *