May 26, 2024

లోపలి ఖాళీ – గాడ్‌ డాగ్‌

రచన: రామా చంద్రమౌళి

బ్రిడ్జిపై ఆ ఇద్దరూ నడుస్తున్నారు. అతను శివుడు. అతనితోపాటు ఒక కుక్క.
అతనివెంట కుక్క నడుస్తోందా. కుక్క వెంట అతను నడుస్తున్నాడా. వ్చ్‌. తెలియదు.
చుట్టూ పొగమంచు. ఇక చీకటి పడ్తుందా. అంతా మసక మసక
భారతీయ పంచమవేదమైన మహాభారతంలో. మహాప్రస్థానిక పర్వంలో. ఐదుగురు పాండవులు. వెంట ఆరవ వ్యక్తి ద్రౌపది. ఏడవ జీవి. ఒక కుక్క.
ఈ కుక్క ఏమిటి.?
ధర్మదేవత కుక్క రూపంలో యుధిష్టరుడైన ధర్మరాజును పరీక్షించుట. పరీక్షలే అన్నీ. జీవితమంతా. చిన్ననాడు బడిలో. పెద్దయ్యాక కాలేజీలో. తర్వాత పెళ్ళి చూపుల్లో. అటు తర్వాత ఉద్యోగ ఇంటర్వ్యూలో. మళ్ళీ ప్రమోషన్లు. మోషన్లు. పెళ్ళాం తనను. తను పెళ్ళాన్నీ. పిల్లలు తండ్రిని. తండ్రి పిల్లలను. స్నేహితులను. చుట్టూ సమాజం తనను. తను సమాజాన్ని. మనిషిని మనిషి. ప్రభుత్వాలను ఓటర్లు. ఓటర్లను కరకర కరెన్సీతో ప్రభుత్వ పెద్దలు. అన్నీ పరీక్షలే. శల్య పరీక్షలు. స్కానర్లు. డెటెక్టర్లు. బయోమెట్రిక్‌ వేలిముద్రలు. లై డిటెక్టర్లు. అబ్బో ఎన్ని పరీక్షలో.
ధర్మజున్ని సశరీరంతో స్వర్గానికి తీసుకుపోడానికొచ్చిన ఇంద్రునితో ‘నావెంట ఈ కుక్క కూడా వస్తుందని’ వాదిస్తే. ‘ ఉహూ ససేమిరా వీల్లేదంటే’,
కుక్క ధర్మదేవతగా ప్రత్యక్షమై, ‘ఈ ధర్మరాజు అనేవాడికి అసలు దయాగుణముందా అని పరీక్షిస్తున్నా కుక్కనై ’ అని జవాబు.
అసలు వీడెవడు వాణ్ణి పరీక్షించడానికి.
దేవత. గాడ్‌. స్పెల్లింగ్‌ GOD. కుక్క. డాగ్‌. స్పెల్లింగ్‌ DOG. అదీ రిలేషన్‌.
డాగ్‌ అనబడే కుక్క అతి విశ్వసనీయమైన జంతువు. మరి గాడ్‌ అనబడే దేవుడు లేక దేవత కుక్కవలె విశ్వసనీయుడూ. లేదా విశ్వసనీయురాలేనా.?
ఏమో గాడ్‌ ఓన్లీ నోస్‌. నోస్‌ అంటే ముక్కు కూడా కదా.
ఎందుకో శివుడు తన సహచరి కుక్క దిక్కు చూశాడు. సరిగ్గా అప్పుడదికూడా ఎందుకో అతన్నే చూస్తోంది. అప్పుడప్పు డంతే. కొన్ని కో- ఇన్సిడెన్స్‌.
శివుడు నిజానికి ఎన్నో చరిత్రలు సృష్టించిన చరిత్రకారుడు. పదవతరగతిలో స్టేట్‌ ఫస్ట్‌. ఇంటర్‌లోనూ అంతే. ఫస్టే. తర్వాత ఇంజనీరింగ్‌. యూనివర్సిటీ ఫస్టే. పి. హెచ్‌.డి. ఇక మొదలు కుక్క గజ్జి అక్కడ్నుండి. పిహెచ్‌డి ఉంటే గాని ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో ఉద్యోగం రాదు. లంచం ఇస్తే గాని పిహెచ్‌డిలో సీట్‌ రాదు. వచ్చినా లంచమిస్తే గాని గైడ్‌ దొరకడు. దొరికినా లంచమిస్తే గాని థీసిస్‌ తయారు కాదు. లంచమిస్తే గాని ఎక్స్‌టర్నల్‌ రాడు. మళ్ళీ లంచమిస్తేగాని. వైవా ఓసీ.,
ఓసీ. సిగ్గు లేని సమాజమా. బంగారు రంగు అక్షరాల్తో. ఏమి థీసిస్రా, ‘ స్పెషల్‌ అప్లికేషన్‌ బేరింగ్స్‌ ఇన్‌ రాకెట్‌ సిస్టంస్‌ ’ అన్నీ కట్‌పేస్ట్‌లు. సెమినార్లు. ఉపన్యసించుము. కట్‌ కాపీలు. లిసన్‌ అండ్‌ రీప్రొడ్యూజ్‌. అంతా రిప్రొడక్షన్‌. రెప్రొడక్టరీ సిస్టమే.
రీసర్చ్‌. రీఇంజనీరింగ్‌. రీసైక్లింగ్‌,, రీడూఇంగ్‌. రీథింకింగ్‌. రీపేరింగ్‌. అన్నీ ‘ రీ ’ లే. మళ్లీ మళ్ళీ కలుపుడు. జతచేయుట. జత చేయాలంటే ముందు విడిపోవాలా.విడిపోవడమంటే. ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో మళ్లీ జతకావలసిందేనా. జాయిన్‌ అండ్‌ పార్ట్‌. పార్ట్‌ అండ్‌ జాయిన్‌.
అంతే. ఆమెతో కలువు. జతపడు. పడు. లే. లేచి మళ్ళీ పడ్తూ లేచి మళ్ళి ఎవరితోనే కలువు. దట్సాల్‌. పడిలేచే కెరటమే మనకు ఆదర్శం. అని ఒక సొల్లు పాట పాడుతూ. ఇదిగో. గో. ఈ బాక్రా నంగాల్‌ బ్రిడ్జ్‌. ఇండియాలోకెల్లా ఎత్తైన గ్రావిటీ డ్యాంపై. హిమాచల్‌ప్రదేశ్‌లో. కుక్కతో సహా.
ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో. అసిస్టంట్‌ ప్రొఫెసర్‌. ఎనభై వేలు జీతం. తను యాభై వేలకు ఒక చెక్‌ను మేనేజ్‌మెంట్‌కు ఇస్తే వాడు ఎనభై వేలకు చెక్‌ ఇస్తాడు. రివర్స్‌ పేమెంట్‌. నువ్వు ముందు యాభయ్యిస్తే. నేను నీకు ఎనభయ్యిస్తా. నెట్‌ పేమెంట్‌ ముప్ఫై. అక్విటెన్స్‌ పై. ఎనభై వేలకు ఒక బానిస కొనబడెను.
బహిరంగ ఇన్స్పెక్‌షన్‌లలో. ఎంటెక్‌లు. పిహెచ్‌డిలు తాత్కాలిక ప్రాతిపదికపై కూలీ డబ్బులకు కొనబడుదురు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగును. మనుషులు లెక్క చూచుకుని కళ్ళను పూర్తిగా తెరిచే కట్టలకు కట్టలు లెక్కపెట్టుకుని లంచములను తీసుకుందురు. ఇచట అన్ని కోర్స్‌ లూ, అడిషనల్‌ సీట్లూ. బ్రాంచ్‌ లూ. యూనివర్సిటీ అఫ్లియేషన్‌ లూ సరసమైన ధరలకు అమ్మ బడును. ఇంజనీరింగ్‌ కాలేజ్‌లు ఐదు నుండి పదుల సంఖ్యలో ఉన్నవారు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలు, అమాత్యుల రూపంలో ప్రభుత్వ మంత్రివర్గంలో ఉందురు. అసలు కంచె లేదు. చేను అస్సలే లేదు. ఉన్నదల్లా ఒట్టి గారడీ మాయ. అంతా వర్చువల్‌ రియాలిటీ. ప్రతిక్షణం ఉద్విగ్నమే. బస్‌ ఖేల్‌ ఖతం. తాలీ బజావ్‌.
తరాలు మారుతున్నై. స్వాతంత్య్రమొచ్చి. డెబ్భై రెండేండ్లు. అప్పుడు పదిహేను శాతం అక్షరాస్యులున్న దేశంలో. ప్రజాస్వామ్యం. వోటంటే తెలియని ఎడ్డి జనం. అమాయకపు చూపులు. లొట్టి కల్లు. ఓట్ల డబ్బాలు మాయం. మూడు రెడ్డి కుటుంబాలే ఉన్న ఊళ్ళలో వందల ఇతర కుల కుటుంబాలకు రెడ్ది దొరే నాయకుడు. ఎమ్మెల్యే. అడవుల్లో గిరిజనులు. గడీలల్ల బానిసలుగా దళితబహుజనులు. అవిద్య,, అసంఘటితత్వం. అనార్గనైజ్డ్‌.
వందమందిలో యాభై ఒక్క వోట్లచ్చినోడు. మిగతా నలభై తొమ్మిదిమందిని కలుపుకుని మొత్తం వందమందిపై పెత్తనం. మెజారిటీ మైనారిటీ లెక్కలు. రూలింగ్‌ పార్టీ స్పీకర్‌. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడని బూటకపు ప్రకటనలు. గవర్నర్‌ ను రూలింగ్‌ పార్టే నియమిస్తే. ఏ పక్షపాతమూ లేకుండా వ్యవహరిస్తాడని అందరి చెవుల్లో పువ్వుల ముచ్చట.
కొనుడే మనుషులను. శాసనసభల్లో. పార్లమెంట్‌లలో. గోడమీద పిల్లుల్లా దూకుతున్న రాజకీయ నాయకులపై. బహిరంగ వలలే. రేట్లు. కొనుగోళ్ళు. హోటళ్లలో క్యాంప్‌లు. బస్సుల్లో తినీ తాగే నీతిమాలిన వ్యభిచారాలు.
ఒక ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్న ప్రభుత్వ అధికారిని క్రికెట్‌ బ్యాట్‌తో పిర్రలపై కొడ్తూ వీధుల్లో నడిపించుకుపోతాడు అందరూ కళ్ళప్పగించి చూస్తూండగా.
ఊరి దొర ఇప్పటికీ ఒక మహిళను రేప్‌ చేసి నగ్నంగా ఊరేగిస్తాడు. ఎవడూ కిక్కుమనడు.
రింగ్‌ రోడ్లపై ఉన్న వందల ఫాంహౌజ్‌లన్నీ ‘సెక్స్‌ క్యాంప్‌’ లే. ఎవడు నియంత్రిస్తాడు. మైనర్‌ పోరగాళ్ళు. ఫుల్లుగా తాగి. రాత్రింబవళ్ళు రేవ్‌ పార్టీలు. నడిరోడ్లపై విచ్చలవిడి నగ్న నృత్యాలు. స్వేచ్ఛేనా ఇది. అరాచక విశృంఖలత్వమా.
గూగుల్‌. తెర తెరిస్తే. బూతు ప్రపంచం ఆవలిస్తూ బట్టలు విప్పి బరిబాత నిలబడ్తుంది ఎదుట. ల్యాప్‌ టాప్లన్నీ పోరగాండ్ల తొడలపై రాత్రి ఒంటిగంటదాకా బూతును కార్చీ కార్చీ. మర్నాడు పదింటికి నిద్రలేస్తాయి.
అమెజాన్లు. నెట్‌ఫ్లిక్స్‌లు. హాట్‌ స్టార్లు. అరచేతుల్లో సమస్త ‘ ఎంటర్‌’ టెయిన్‌ ప్రపంచం. వారాలకొద్ది క్రికెట్‌ మాయలో తేలియాడ్తూ యువ తరమంతా. అంతమంది యువకులూ పుట్టకముందునుండే వృద్ధులు.
ఎవనిమీద ఎవనికీ నియంత్రణ లేదు. సింహానికి చీల్చుకుని తినడం జన్మహక్కులా. ఇక్కడ లంచం తీసుకోవడం స్త్రీకైనా, పురుషునికైనా జన్మహక్కే. మోసం చేయడం ఇక్కడ సంస్కృతిగా మారుతున్న వేళ. ‘భారత్‌ మాతా కీ జై ’. ఓట్ల కోసం ప్రభుత్వాలు సంక్షేమం పేర ప్రత్యక్ష లంచాలిస్తూ. మనుషులను సోమరిపోతులుగా, దద్దమ్మలుగా, పనిదొంగలుగా మారుస్తూ కష్టపడి పని చేయమని మనుషులను ఉత్పాదక కేంద్రాలుగా తయారు చేయవలసిన ప్రభుత్వాలు. ఈ నిర్వీర్య యువతరాన్ని సృష్టిస్తూ పోతూంటే. ఎట్లా.
పదేళ్ళ పిల్లలకు ప్రేమలు. బాయ్‌ ఫ్రెండ్స్‌. గర్ల్‌ ఫ్రెండ్స్‌. విచ్చలవిడి టి వి యాడ్స్‌. మనుషులకు ఉరితాళ్లై నెత్తిపై వ్రేలాడ్తున్న స్మార్ట్‌ ఫోన్స్‌. ఏ క్షణంలోనైనా ఒక సర్వే చేస్తే. ఈ దేశంలోని మనుషులు తరతమ భేదాలు లేకుండా దాదాపు ఎనభై శాతం మంది తమ స్మార్ట్‌ ఫోన్‌ ల లోనే సమాధి ఐపోయి.,
అసలు ఏం జరుగుతోందిక్కడ.
నలభై ఏళ్ళక్రితం. నేషనలైజేషన్‌ పాలసీ. హెచ్‌ ఎ ఎల్‌. బి హెచ్‌ ఇ ఎల్‌. భారత్‌ హెవీ ప్లేట్స్‌ అండ్‌ వెస్సెల్స్‌, పద్నాల్గు బ్యాంక్‌ ల జాతీయీకరణ. హిందుస్తాన్‌ షిప్‌ యార్డ్‌. హిందుస్తాన్‌ మషీన్‌ టూల్స్‌, ఏవి అవన్నీ. ఇప్పుడు పబ్లిక్‌ సెక్టార్‌ అండర్టేకింగ్స్‌ అన్నింటినీ ‘ ఏర్‌ ఇండియా ’ తో సహా అమ్మడానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ.. ఇప్పుడు అంతా ప్రైవేటీకరణ. రైల్వేలు. ఇండియన్‌ టెలిఫోన్లు. పోస్టాఫీస్‌ లు.రోడ్లు పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టిసిపేషన్‌ పేరుతో దేశవ్యాప్త రోడ్లన్నీ ప్రైవేట్‌ పరమై. అన్నీ టో( తో) ల్‌ గేట్లు. అసలు ఈ ‘పాలసీ మేకర్స్‌’ ఎవరు. ఎటు పోతోందీ సమాజం. బ్యాంక్‌లను విచ్చలవిడిగా వేల కోట్లలో ప్రజాధనాన్ని లూటీ చేసి విదేశాలకు పారిపోతున్న వైట్‌ కాలర్డ్‌ దొంగలను పట్టుకోలేని అసమర్థ ప్రభుత్వాలు.,
స్వతంత్రం విశృంఖలత్వంగా. స్వేచ్ఛ అరాచకత్వంగా మారుతున్న వేళ. కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా విడిపోతూ, మనుషులు కేవలం ఓట్లుగా మాత్రమే చూడబడ్తున్న సందర్భంలో. మాతృదేశమన్న స్పృహే లేకుండా ఈ దేశ మేధో వర్గమైన యువత విదేశాలకు అమ్ముడుపోతూంటే.,
తను. శివుడు అని పిలువబడే. నిరర్థక మేధావి. ఈ అంతర్ఘర్షణతో. ఐదు పి హెచ్‌ డి లుండి. రాజీ. రాజీ. రాజీ. పడలేక.,
వెలుగు ఓడిపోతూ. చీకటి కమ్ముకొస్తున్న వేళ. 741 ఫీట్ల ఎత్తైన సట్లెజ్‌ నదిమీద నిర్మితమైన బాక్రానంగాల్‌ డ్యాం అంచుపై రైల్‌ మీద నిలబడి.,
మహోద్విగ్నతతో దూకుతున్న జలప్రళయంలోకి అతనికి తెలియకుండానే అప్రయత్నంగా దూకేశాడు శివుడు. అప్పుడతని మనసులో ఉన్నదంతా అతి స్వచ్ఛమైన డేశ స్పృహే. మృత్యుకాంక్ష విచక్షణను జయిస్తుందా.?
అప్పటిదాకా వెంట వచ్చిన కుక్క ఏమనుకుందో ఏమోగాని అది కూడా శివుని వెంట జలోధ ృతిలోకి ఆవేశంగా దూకింది.
ప్రతి మనిషికి తప్పనిసరిగా ఈత రాదు.
కాని ప్రతి కుక్కకూ జన్మతః ఈత వస్తుంది. అది డాగ్‌. గాడ్‌ కదా.

* * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *