April 20, 2024

అమ్మమ్మ – 45

రచన: గిరిజ పీసపాటి

రాత్రి షాప్ నుండి ఉత్సాహంగా ఇంటికి వచ్చిన గిరిజ, తనకోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులందరికీ షాప్ సంగతులన్నీ పూసగుచ్చినట్లు వివరించి “అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే, ఇదివరకు బిల్స్ రాసే ఆవిడ తిరిగి వచ్చేవరకే నాకీ ఉద్యోగం ఉంటుంది.”
“ఆవిడ తమిళియన్ కావడంతో మద్రాస్ (ఇప్పుడు చెన్నై) వెళ్ళిందట. రెండు మూడు నెలల్లో ఆవిడ వచ్చేస్తుంది. తరువాత మళ్ళీ ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి” అంది కొంచెం దిగులుగా.
“ఏం పరవాలేదు గిరీ! అసలు ఉద్యోమంటూ చెయ్యడం మొదలుపెడితే పరిచయాలు పెరిగి, నీ పనితీరు నచ్చిన వారెవరైనా ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది. అనుభవం మీద చెప్తున్నాను” అన్న తల్లి మాటలకు నిజమే అన్నట్లు తల ఊపింది.
వసంత సంతోషంగా వంటగదిలోకి వెళ్ళి, కొంచెం పంచదార తెచ్చి, ముందు చెల్లి నోట్లో కొంచెం పోసి, తరువాత అందరి నోళ్ళూ తీపి చేసింది.
అతి తక్కువ కాలంలోనే గిరిజ సమయపాలన, పని తీరు, నిబద్ధతతో బాస్ అభిమానాన్ని చూరగొంది. ఒకటవ తారీఖునాడు తన మొదటి సంపాదన అందుకుంటున్న గిరిజ, కళ్ళలో కోటికాంతులు మెరుస్తుండగా “థాంక్యూ సర్. థాంక్యూ వెరీ మచ్” అంది జీతం ఇస్తున్న బాస్ తో.
“ఇన్నాళ్ళూ ఆడపిల్లలు సమయానికి రారు, వచ్చినా సరిగ్గా పని చెయ్యరు అనే అపోహ ఉండేది నాకు. అందుకే నాన్నగారి పోరు పడలేక సేల్స్ గర్స్ కావాలని ప్రకటన ఇచ్చినా, ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదు. మిమ్మల్ని చూసాక ఆ అపోహ తొలగిపోయింది. ఇకనుండి ఆడపిల్లలను కూడా పనిలోకి తీసుకుందామని నిర్ణయించుకున్నాను” అన్న ఆయన పొగడ్తకు ఉబ్బితబ్బిబ్బవుతూనే…
“మరి బిల్స్ రాసే మేడమ్…!?” అంటూ ఆపై ఎలా అడగాలో తెలియక ఆపేసింది.
“ఓ ఆవిడా! ఆవిడను మా విజయనగరం షాప్ నుండి నాన్నగారు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన మాట కాదనలేకపోయాను. అసలు ఆవిడ వల్లే నాకీ అపోహ కలిగింది. సమయానికి రారు. పిల్లలకు బాగోలేదని, భర్తకు బాగోలేదని మధ్యలో పని వదిలి పర్మిషన్ అంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు కూడా చూసారుగా! ఏకంగా రెండు నెలలు సెలవు పెట్టింది. రెండు నెలలకు వస్తారో, లేక మూడు నెలలే పడుతుందో ఆ దేవుడికే తెలియాలి” అన్నారాయన.
ఆరాత్రి గిరిజ సంపాదన చూసిన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. “హమ్మయ్య. ఇంటద్దె, కరెంటు ఖర్చు నీ జీతంతో గడిచిపోతాయి గిరీ! పై ఖర్చులకి నా సంపాదన సరిపోతుంది. తమ్ముడు ఢిల్లీ మామతో పనికి వెళ్ళినన్నాళ్ళూ అక్క ఇన్సులిన్ ఖర్చుకి పరవాలేదు.”
“కాలేజీ తెరిస్తే వాడ్ని ఇంటర్ లో జాయిన్ చెయ్యాలి. అప్పుడు అక్క మెడిసిన్ కి, వాడి చదువుకి ఎలా అన్నదే తెలియట్లేదు” అన్న నాగ మాటలకి “అదేమిటే అలా అంటావ్? అప్పటికి నేను అందుకురానూ? మీరేం దిగులు పడబాకండి” అంది అమ్మమ్మ.
“ఇంకా టైమ్ ఉంది కదా! చూద్దాం లెండి. రేపు అన్నపూర్ణ ఆంటీకి చెప్పి, ఇంటిగలాయనని అద్దె తీసుకోవడానికి రమ్మని చెప్పు. ముందు ఒక నెల అద్దె అయినా ఇస్తే బాగుంటుంది” అంది వసంత.
“నిజమే. రేపు ఉదయాన్నే చెప్తాను” అంది నాగ. ఆరాత్రి ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండి, కొంత సంతోషం, కొంత దిగులు కలగలిసిన భావంతో ఎప్పటికో గానీ నిద్ర పోలేదు.
మర్నాడు ఉదయాన్నే షాప్ కి వెళ్ళిన గిరిజ షాప్ ఖాళీగా ఉన్న సమయంలో తనకు బ్యాంకు క్రెడిట్ కార్డ్స్ యొక్క వేలిడిటీ డేట్ ఎలా చెక్ చెయ్యాలో వివరిస్తున్న బాస్ తో “సర్ చిన్న మాట అడగొచ్చా!” అంది.
“అడగండి మేడమ్” అన్నాడాయన ఎప్పటిలాగే చిరునవ్వు నవ్వుతూ. “ఎలాగూ మీరు ఇకమీదట ఆడవాళ్ళకి ఉద్యోగం ఇద్దామని నిర్ణయించుకున్నారు కనుక, ఈవిడ వచ్చాక నాకు సేల్స్ గర్ల్ ఉద్యోగం ఇస్తారా సర్!?” అండిగింది అభ్యర్ధనగా, ఆశగా.
“మీ అప్లికేషన్ లో మీ ఇంటి పేరు చూసాను. మీరు పీసపాటి నరసింహమూర్తి గారి బంధువులా?” అడిగారాయన.
“అవును సర్. ఆయన మనుమరాలిని” అంది గిరిజ.
“నా అనుమానం నిజమే అన్నమాట. చూడండి మేడమ్. మేము మార్వాడీలమే అయినా… మా తాతల కాలంలోనే వ్యాపార నిమిత్తం విజయనగరంలో సెటిల్ అయ్యాము. నేను పుట్టింది, పెరిగింది విజయనగరం లోనే. చదువు కూడా తెలుగు మీడియమ్ లోనే చదివాను. మీ తాతగారి నాటకాలు నేను చూడకపోయినా, వారి నటన గురించి విని ఉన్నాను.”
“వారి పేరు తరచూ ఏదో ఒక పేపర్ లో చూస్తూనే ఉంటాను. అంత పెద్దింటి ఆడపిల్ల అయిన మీకు చూస్తూ చూస్తూ సేల్స్ గర్ల్ ఉద్యోగం ఇవ్వలేను. అంతేకాక టైమ్ పాస్ కోసం ఉద్యోగం చేసే మీవంటి డబ్బున్న ఆడపిల్లకు ఉద్యోగం ఇచ్చేకంటే, అవసరంలో ఉన్న ఆడపిల్లలకు ఇవ్వడం మంచిది కదా!”
“ఇప్పుడైనా మూర్తి నాకు తెలిసినవాడు కాబట్టి అతని మాట కాదనలేక, సరిగ్గా ఇదే సమయంలో ఈవిడ ఊరు వెళ్ళబట్టి మీకీ ఉద్యోగం ఇచ్చాను. డబ్బు అవసరం ఉన్నవారికి మాత్రమే ఉద్యోగం ఇవ్వదలుచుకున్నాను. ఇలా చెప్తున్నందుకు సారీ!” అన్నారాయన నిర్మొహమాటంగా.
గిరిజ పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్లు అయింది. “సరే సర్. మీ ఇష్టం” అంది ఇంకేం అనలేక, ఇంటి గుట్టు బయట పెట్టుకోలేక.
మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు బాస్ తనతో అన్న మాటలు ఇంట్లోవాళ్ళతో చెప్పింది గిరిజ. “అసలు అప్లికేషన్ లో నీ పూర్తి ఇంటిపేరు ఎవరు రాయమన్నారు. ‘పి’ అని రాస్తే సరిపోయేదిగా!?” అంటూ గయ్ మని గిరిజని కోప్పడుతున్న వసంతతో…
“అప్లికేషన్ లో ఇంటి పేరు పూర్తిగా రాయాలి పాపా! అయినా దాని టెన్త్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ కూడా అప్లికేషన్ కి జతచేసి పంపిందిగా. అందులోనైనా ఇంటిపేరు ఉంటుందిగా” అని సర్ది చెప్పింది నాగ.
అక్కని ఏమీ అనలేక గుర్రుగా చూస్తున్న గిరిజ, తల్లి తనను సమర్ధించడంతో “మొదట్లో ఒకసారి నువ్వూ అప్లికేషన్ పంపావుగా! అందులో ఇంటిపేరు పూర్తిగా రాయలేదా!?” అడిగింది ఉక్రోషం పట్టలేక.
“రాసానులే. అమ్మ సపోర్ట్ వచ్చిందని రెచ్చిపోకు” అని రెట్టిస్తున్న అక్కని చూస్తూ “పెద్దక్క చేతిరాత చూసిన వాళ్ళెవరికైనా అసలేం రాసిందో అర్ధమైతే కదా! ఇంటిపేరు అర్థం కావడానికి” అన్న తమ్ముడి మాటలకు వాతావరణం తేలిక పడినట్లయి అందరూ నవ్వుతూండంతో, అక్కడే ఉండి వీళ్ళ సంభాషణ వింటున్న అమ్మమ్మ కూడా నవ్వుతూ “భడవకనా! నీ దుంప పిలక వెయ్య” అని ముద్దుగా కసిరింది మనవడిని.
మర్నాడు ఉదయం అన్నపూర్ణ గారికి విషయాలన్నీ వివరించి, ఇంటిగలాయనకి ప్రస్తుతం ఒక నెల అద్దె ఇచ్చేస్తామని ఫోన్ చేసి చెప్పమంది నాగ. ఆవిడ వాళ్ళాయన చేత వెంటనే ఫోన్ చేయించి, మర్నాడు ఉదయం ఆయన అద్దె తీసుకోవడానికి వస్తానన్నారన్న విషయం చెప్పింది.
ఆయన మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా వచ్చేసాడు. లోనికి రమ్మని ఆహ్వానించి, కూర్చోవడానికి కుర్చీ చూపించి, ఆయనకి మంచినీళ్ళు, కాఫీ తెమ్మని వసంతకి పురమాయించింది నాగ.
ఆయన కాఫీ తాగేవరకు ఆగి, అద్దె డబ్బు ఆయన చేతికి అందిస్తూ “ఇన్నాళ్ళు ఓపిక పట్టినందుకు థాంక్యూ అన్నయ్య గారు. వచ్చేనెల మొత్తం బాకీ తీర్చేస్తాను” అంది కృతజ్ఞతగా.
ఆయన ఆ డబ్బు అందుకుని లెక్క చూసుకుని “ఇదేమిటి ఒక్క నెల అద్దె మాత్రమే ఇస్తున్నారు? ఒక్క నెల అద్దె డబ్బు కోసం విజయనగరం నుండి ఛార్జీలు పెట్టుకుని వచ్చాననుకున్నారా? ” అడిగాడు కోపంగా.
“అదేంటి అన్నయ్ గారు!? నిన్న నా ముందే మూర్తి అన్నయ్యగారు ‘ప్రస్తుతం ఒక్క నెల డబ్బు మాత్రమే ఇవ్వగలరు. మిగతాది తరువాత ఇస్తార’ని చెప్పారుగా” అంది తెల్లబోతూ.

****** సశేషం ******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *