April 19, 2024

ఒంటరివైపోయావా??

రచన:- లావణ్య బుద్ధవరపు

ఇప్పుడు కొత్తగా ఏదీ జరగలేదు. కానీ చాలా వెలితిగా ఉంది. విపరీతమైన ఒంటరితనం. ఎన్నో ఏళ్లుగా పరుగులు పరుగులు తీస్తూ, ఏదో సాధించెయ్యాలి అని అనుక్షణం తపన పడుతూ, కింద పడుతూ లేస్తూ, ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి గడిపేకా, ఎందుకో ఈ సాయంత్రం చాలా గుబులుగా, అన్నీ పోయేయేమో అనే దిగులుగా, విపరీతమైన శూన్యం ఆవహించి ఎడతెగని కన్నీటి ధారలు ఆపినా ఆగనంటూ మరింత కలవరపెడుతున్నాయి.
అన్ని పనులూ అలాగే నడుస్తున్నాయి. ఏదీ ఆగలేదు, ఏదీ అలాగని సాధించేయ్యనూలేదు. నిత్య సంఘర్షణ జరుగుతున్నా ఉన్నపళంగా ఎందుకు అన్నీ పోయి విశ్వంలో నేను మాత్రమే మిగిలి ఉండిపోయినట్టు నా చుట్టూ ఏదీ ఎవ్వరూ లేనట్టు అనిపిస్తోంది? పొగిలి పొగిలి ఏడ్వాలనుంది. ఆ ఏడుపు లోనే ప్రాణం పోతే బాగుణ్ణు అనుంది. నాకంటూ ఎవరున్నారు అని వెతికి వెతికి మనసు అలిసిపోతోంది.
శూన్యం అంటే చీకటి అనుకున్నాను ఇన్నాళ్లు. కళ్ళు మూసుకుని నిద్రపోవచ్చని. ఎన్నో కలలు కనచ్చని, ఏదో ఒక కల నిజం చేసుకోవడం కోసం మరుసటి ఉదయం మళ్ళీ నిదుర లేవచ్చని. కానీ ఈ శూన్యం ఎందుకు తెల్లగా వెలవెల బోతోంది? చుట్టూ ఉన్న ఏ ఒక్క చోట, ఏ నీడా జాడ కూడా లేకుండా ఉంది. పట్టపగలే భయాన్ని కలిగిస్తోంది.
ఎక్కడో తీతువు అరుస్తున్నట్టుంది. వెళ్ళి చూస్తే అదీ కానరాకుంది. ఏమైంది ఈ విశ్వానికి?
కాదేమో ఏదో అయినది నాకేనేమో.
ఏం పోగొట్టుకున్నానో వెతకాలంటే అసలు పోయినదేంటో తెలియాలి కదా? ఏం పోయిందబ్బా? మనసు తరచి తరచి అడుగుతోంది. ‘ఏదీ పోలేదంటే నీకర్థం కావడం లేదా, కనిపించడం లేదా’ అంటూ కసురుకుని అలుగుతోంది.
అల్మారాలు, బీరువాలు, అన్నం గిన్నెలు, ముత్యపు చిప్పలు, తోలు సంచులు, తగరపు పెట్టెలు ఎన్ని వెతికినా అదేదో తెలియడం లేదు. అన్నీ నిండుగానే ఉన్నాయే. మరేమి పోయిందని ఈ శూన్యం? ఏదో మెలిపెట్టే నైరాశ్యం?
నిదురపోయే పక్క తడిమి చూసా, గొలుసేమైనా పడిందేమో అని. నన్ను చూసి కిలకిలా నవ్వింది, “ఇక్కడ పడితే మరి ఆ మెడలో ఉన్నదేంటి?” అని.
‘ఇంత పగటి పూట ఎందుకు ఎవరూ కనిపించరు?’ అని పదే పదే మనసు హెచ్చరిస్తోంది. చప్పున పరుగుతో దేవుడి మందిరానికి పోయా, “ఆయన కూడా వదిలేశాడా?” అని. ఆయనకేం, చిరునవ్వు చిందే మోముతో నిండార కాంతులీనుతూ నిలువెత్తు విగ్రహ మూర్తిగా అక్కడే కొలువున్నాడు.
ఇంకేం పోయిందంటూ మళ్లీ అదే ప్రశ్న. అటు తిరిగి చూద్దును కదా, అద్దం కనిపిస్తోంది. నవ్వుతూనే కనిపించే నా ప్రతిబింబం అక్కడ లేదేం?! ఏమైనట్టు? చుట్టూ చూసా … మళ్లీ అదే శూన్యం. అప్పుడు వినిపించింది నా నవ్వు. ఉలిక్కిపడి చూసా. నవ్వుతున్న నా ప్రతిబింబం నన్ను చూసి వెక్కిరిస్తోంది.
నన్నే ఎదిరించి ప్రశ్నిస్తోంది. “దేనికోసం వెతుకులాట? ఏం పోగొట్టుకున్నావో అర్థం కాలేదా? దేనికోసం అయితే నీలో ఉన్న నన్ను మరిచి పిచ్చిదానిలా పరుగులు తీస్తూ పోయేవో, నువ్వాశించిన ఆ నిధి నిన్ను వీడి సుదూర తీరాలకు సాగిపోతోంది. నీకు కనిపించనంత దూరంగా నీకు అందనంత దూరంగా.
ఇప్పుడు నువ్వేం చేస్తావ్? ఆ పెన్నిధి నీదనుకుని నన్ను పక్కకి నెట్టేసెవ్. ఇప్పుడు నీకు అదీ లేదు, నేనూ లేను” అంటూ నేను పోగొట్టుకున్నది ఏదో స్పష్టం చేసి రెక్కలు కట్టుకునెగిరిపోయింది.
‘అదే నాలో ఉన్న అసలైన నేను’
నిన్ను నువ్వు మర్చిపోయి పరుగులు తీస్తే ఆ కల నెరవేరే సమయానికి నీకు నువ్వు మిగలకపోవడం సత్యమా?! ఎన్ని చేసినా
నీకు నువ్వు ఉన్నావని చెప్పకపోతే నీకంటూ మిగిలేది శూన్యమే కదూ. నిన్ను నువ్వు ప్రేమించక పోతే నీలో నిలువెల్లా మిగిలేది
శూన్యమే కదూ.
ఆలోచించు…
నిన్ను నువ్వు ప్రేమించు…
ఒంటరితనాన్ని శూన్యాన్ని జయించు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *