April 18, 2024

జీవన వేదం – 8

రచన: స్వాతీ శ్రీపాద

ఇమ్మిగ్రేషన్ తంతు ముగించుకుని బెరుకు బెరుగ్గా బయటకు వచ్చేసరికి రవికిరణ్ పేరు రాసిన ప్లకార్డ్ పట్టుకుని నించున్న అతని మిత్రులు ముగ్గురినీ చూసి సులభంగానే గుర్తుపట్టి చేతులు ఊపారు. చొరవగా ముందుకు వచ్చి రండి అంటూ వారి సామాన్ల ట్రాలీలను అందుకున్నారు. ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియడం లేదు.
సీత మనసు ఒకరకంగా మొద్దుబారిపోయింది. ప్రమాదం జరిగింది, రవికిరణ్ ఆసుపత్రిలో ఉన్నాడని విన్నది మొదలు ఒక్క మాటా నోటరాలేదు. ఏ ఆలోచనా తోచడమే లేదు. ఒంటి మీద ఒక రకంగా స్పృహే లేదు. చదువు వదిలేసి, దేశం వదిలేసి పరాయి గడ్డమీద కాలుపెట్టడం కూడా యాంత్రికంగానే జరిగింది. ముందేమిటన్న ఊహే మనసుకు రాడం లేదు.
రవికిరణ్ తో అపార్ట్మెంట్ షేర్ చేసుకున్న మిత్రుడు వసంత్ మహారాష్ట్ర నుండి వచ్చాడు. పెద్ద మనసుతో వారిని తనతో ఉండమన్నాడు. తెలుగువారందరూ తలా ఒక చెయ్యి వేసి అవసరాలకు ఆదుకుంటున్నారు.
గాజు కిటికీలోంచి రోజుకు ఒక్కసారి మాత్రం చూడనిచ్చేవారు రవికిరణ్ ను. నాలుగైదు గంటలు ఆసుపత్రి బయటే గడిపి ఇల్లు చేరేవారు. ముగ్గురికీ కష్టంగానే ఉంది వసంత్ మీద ఆధారపడటం.
సీత మనసు నెమ్మదిగా కూడదీసుకుంది. తను మట్టెలూ మంగళ సూత్రాలూ తీసేసినందుకే అలా జరిగిందా అన్న గిల్టీ ఫీలింగ్ ఆమెను తినేస్తోంది. ఎందుకు నా మనసు అలా మారిపోయి రవికిరణ్ ను తృణీకరించి రవీంద్రను ఎంచుకుంది? తప్పుడు దారిలోకి మళ్ళినందుకే ఈ శిక్షా?
ఈ ఆలోచనల తాకిడికి తట్టుకోలేకపోయేది.
ఒకసారి వసంత్ ను అడిగి మమతకు ఫోన్ చేసింది.
“ఏం చెప్పను మమతా కనురెప్పపాటులో కధ మారిపోయింది.” అంటూ జరిగినదంతా వివరించింది.
“ఏం చెయ్యాలో అర్ధం కాట్లేదు మమతా, ఇక్కడ ఈ పరిస్థితుల్లో నువ్వన్నట్టు మానసికంగానే కాదు ఆర్ధికంగాను ఆధారం కావాలి. ఎన్నాళ్లని బావ మిత్రుల మీద ఆధారపడగలం. అత్త ఇరవై నాలుగు గంటలూ మౌనంగానే మృత్యుంజయ జపం వల్లే వేస్తూ ఉంటారు. మామగారు సుందరాకాంద పారాయణం. నాకా పెద్ద చదువూ లేదు, బావ మంచం మీద పడి ఉన్నాడు. ఏం చెయ్యను?”
“అధైర్యపడకు సీతా, ఇప్పుడు నీ ముందు ఉన్నదారులు రెండే రెండు. ఒకటి బంధాలు తెగతెంపులు చేసుకుని నీ జీవితం
నీదనుకుని వెనక్కు రాడం, లేదూ ధైర్యం కోల్పోకుండా నీకు తెలిసిన విద్యతో బ్రతుకు తెరువు వెతుక్కుని అక్కడే కొనసాగడం. నీకేం సీతా స్వరం విప్పితే అమృతం కురుస్తుంది. అంతో ఇంతో సంగీతం తెలుసు , చక్కగా వంట చెయ్యడం తెలుసు. నలుగురు పిల్లలకు నాలా చదువు చెప్పగలవు కూడా. మంచీ చెడు ఆలోచించుకునే వివేచన ఉంది నీకు బీ బ్రేవ్ సీతా”
ఒక్క క్షణం అంతే.
సీత గుండెల మీద మంగళసూత్రం తళుక్కున మెరిసింది. ఆ క్షణంలో రవీంద్ర ఏమాత్రం గుర్తుకు రాలేదు. ఊహ తెలిసినప్పటి నుండీ ఆశలు పెంచుకున్న బావే మనసంతా ఆక్రమించాడు.
శివరాత్రి రోజు ముగ్గురినీ దగ్గరలో హిందూ దేవాలయానికి తీసుకువెళ్ళాడు వసంత్ కొంతలో కొంతైనా స్థిమిత పడతారని.
అన్యమనస్కంగానే వెళ్ళినా కాస్సేపటిలోనే అక్కడి వాతావరణంలో కలిసిపోయారు, సర్వం మరచి భగవత్ సన్నిధిలో తేలికపడ్డారు. వారిని అక్కడే వదిలి సాయంత్రం వచ్చి తీసుకు వెళ్తానని వెళ్లాడు వసంత్.
గుడి కింద పెద్ద హాల్, డైనింగ్ ఏరియా ఉన్నాయి. అక్కడ రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పాటలపోటీల మొదలుకుని విచిత్ర వేషాలు, డాన్స్ లూ , భగవత్ గీత పఠనం.
పిల్లల పాటల పోటీలు ముగిసాక పెద్దలకు మొదలయ్యాయి.
“సీతా నువ్వూ వెళ్ళి పాడు” అత్త మాట విని తుళ్ళిపడింది.
“అవును సీతా, పేరుకోసం కాదు బహుమతిగా వచ్చే డబ్బు మన చేతిఖర్చుకన్నా వస్తుంది కదా?” ఆవిడ కళ్ళలో నీళ్ళు.
నిజమే ఎప్పుడూ నలుగురికి పెట్టిన చెయ్యే కాని ఒకరు ముందు ఒదిగి బ్రతికినది కాదు.
చటుక్కున లేచి సీత వేదిక వైపు కదిలింది.
“పేరు చెప్పి పాడండమ్మా” నిర్వాహకులు ముందుకు పంపారు.
మైక్ ముందు నించోడమే తెలుసు సీతకు. ఆ తరువాత ఆమె పాట ప్రవాహమై సాగిపోయింది. వినడంలో లీనమయిన వారెవరికీ ఆమెను ఆపాలనిపించలేదు.
బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటూ మొదలు పెట్టిన స్వరాన్ని గుడి గోడలు ప్రతిధ్వనించాయి.
ఊపిరి తిప్పుకుందుకు ఆమె ఒక్క క్షణం ఆగగానే చప్పట్లు వర్షమై కురిసాయి. అభినందనల వెల్లువ ముంచెత్తింది.
ఆపైన జరిగినది కలలా అనిపించింది. వాళ్ళేం అడిగారో తనేం చెప్పిందో గుర్తు లేదు.
మొదటి బహుమతిగా వచ్చిన డబ్బుకు తోడు మరింత సేకరించి దాదాపు వెయ్యి డాలర్లు ఆమె చేతిలో పెట్టారు.
సాయంత్రం గుడిలో శివానంద లహరి వినిపించింది. శివస్తోత్రం చదివింది.
ఆమె మైక్ ముందు ఉన్నప్పుడే వచ్చాడు వసంత్ హడావిడిగా,
“అమ్మా, అమ్మా, ” అంటు ఆత్రంగా సీత అత్తను పిలిచి,
“రవికిరణ్ స్పృహలోకి వచ్చాడు, కోమాలోంచి బయటకు వచ్చాడు, నిజంగా ఎవరూ ఊహించని మిరకిల్” అంటూ ఆనందాన్ని పంచాడు.
అయితే, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ , గాయాలు తగ్గేందుకు మరో మూడునెలల సమయమైనా కావాలి. కాదంటే ఒక వారంలో డిస్చార్జ్ చేస్తారు. ఆ వార్త సీతకు అందకన్నా ముందే చాలామంది తెలుగ వాళ్ళు ఆమె గురించి విన్నాక తమ పిల్లలకు సీత సంగీతంలో శిక్షణ ఇస్తే బాగుండునన్న అభిప్రాయానికి వచ్చారు.
*****
ఏదైతేనేం రవికిరణ్ కోమాలో నుండి బయటకు రాడం అక్కడి డాక్టర్లకూ చిత్రంగానే ఉంది. తల్లిని, తండ్రిని, సీతను చూసిన రవికిరణ్ కళ్ళలో ఒక అపరాధ భావన సముద్రమై పొంగిపొర్లింది.
“సీతా” ఆమె చేతి తన చేతిలోకి తీసుకున్నప్పుడు తనలోకి ఏదో విద్యుత్తు పాకినట్టే అనిపించింది. ఏ వ్యామోహంలో , ఏ మైకంలో పడి కొట్టుకుపోయాను అనుకున్నాడు. వెంటనే సుమబాల గుర్తుకు వచ్చింది. సుమ, సుమ లోలోపలే అనుకున్నాడు. ఎవరిని అడగాలి? అడగలేక మౌనంగానే ఉన్నాడు.
కాని సుమ ఏమైందోనన్న ఆందోళన మనసును అతలాకుతలం చేస్తూనే ఉంది.
మర్నాడు ఇంటికి పంపిస్తారనగా ఆ రాత్రి డ్యూటీ నర్స్ ను మాటల్లో పెట్టి తనను ఎవరు ఎలా ఆసుపత్రికి తెచ్చారు, అని ఆసక్తిగా అడిగాడు. మీరంతా నాకు మళ్ళీ పునర్జీవనం ఇచ్చారని పొగిడాడు.
ఆవిడ అత్యుత్సాహంగా రెండు నెలల క్రితం జరిగిన సంఘటనలు పూసగుచ్చినట్టు వివరించింది.
అపస్మారక స్థితిలో రవి కిరణ్ నూ, ఆఖరి క్షణాల్లో సుమనూ అక్కడికి తీసుకు రాడం వివరించింది.
“చిత్రం ఏమిటంటే, మీరు మరిక మామూలు కాలేరనీ సుమను సేవ్ చెయ్యగలమనీ అనుకున్నాము. కాని మీరు కోమాలోకి వెళ్ళి సురక్షితంగా బయట పడ్డారు, క్షణాల్లో సుమ…”
“సుమ, సుమకు ఏమైంది?” గాభరాగా అడిగాడు.
“పాపం ఆయుష్షు తీరిపోయింది”
రవికిరణ్ గుండె గబగబా కొట్టుకుంది.
” ఆమె బాడి ఇండియాకు పంపేసారు”
” సుమా సుమా ” మౌనంగానే రోదించింది అతని మనసు.
******
“ఒకరికొకరు ఎక్కువయ్యే కొద్దీ ఖర్చులూ పెరుగుతాయి కద నాన్నా, నేనూ, అమ్మా వెళ్లమా?” కొడుకు కొంచం తేరుకుని లేచి నడవగలుగుతున్న స్థితిలో అడిగాడు. ఇంటికి వచ్చాక కూడా కాలూ చెయ్యీ కూడదీసుకుని లేచి నడవడానికి నెలన్నర పైనే పట్టింది రవికిరణ్ కు.
సీత ఎంత శ్రమ పడిందో అతను చూస్తూనే ఉన్నాడు. పొద్దున్నే లేచి డాక్టర్ హైమ ఇంట్లో వంటా-వార్పూ చేసి వచ్చేది. గంటకో పది డాలర్ల చొప్పున ఒక మూడు గంటలు పని చేసి రోజుకు ముప్పై డాలర్లు. వారానికి రెండు రోజులు పిల్లలకు మ్యూజిక్ క్లాస్ లు. ఇంట్లో అన్ని పనులూ చూసుకుంటూనే ముగ్గురినీ కంటికి రెప్పలా ఉండేది. ఇరుగూ పొరుగూ ఎవరింట్లో ఏ కార్యక్రమం ఉన్నా సీత పాటా, వంటా ఉండాల్సిందే.
ఒకప్పుడు సీత గురించి అనుకున్నదానికి సిగ్గుతో కుంగిపోయేవాడు రవికిరణ్. నెమ్మదిగా ఆ క్రితం రోజే వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలుపెట్టాడు.
” మాకిచ్చిన టెంపరరీ వీసా గడువు కూడా దగ్గరపడుతోంది. సీత ఎక్కడున్నా సమర్ధించుకు రాగలదన్న ధైర్యం మాకుంది. నిన్ను కాపాడినది దాని మెళ్ళో మంగళసూత్రమేనని నమ్ముతున్నాను. అది నిన్ను పది కాలాలు పచ్చగా ఉంచుతుంది. మీరు కుదుటపడ్డాక ఇండియా వద్దురు గాని” తల్లి నచ్చజెప్పింది.
“అదేం మాట అత్తా, మీరు క్షణం వదలకుండా చదివిన మృత్యుంజయ జపమే బావను రక్షించింది. మామయ్య ఆపకుండా చేసిన సుందరకాండ పారాయణ తక్కువదా?” అత్తకు, మామకూ కాఫీ అందిస్తూ వారిని ఆపాలని చూసింది.
” లేదులే సీతా మాది మాట సాయం. నీదో ఇది అని చెప్పగలమా? సరేలే. ఈ మాటలు, ఒకరినొకరు మెచ్చుకోడాలు ఇక్కడ ఆపేద్దాం. కాని త్వరగా స్థిరపడి ఇద్దరూ ఇంటికి వస్తే వ్రతం చేసుకుందాం. మొక్కులు తీర్చుకుందాం. ఇద్దరూ ఇద్దరుగానే రండి. ముగ్గురయ్యేవరకూ ఆగకండి” అంటూ తేలికపరచారు అందరినీ.
సీత బుగ్గల్లో సింధూరం చల్లినట్టయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *