April 19, 2024

తస్మై శ్రీ గురవైనమః

రచన: విశాలి పేరి

తస్మై శ్రీ గురవైనమః

 

गुरू गोविन्द दोऊ खड़े, काके लागूं पांय।

बलिहारी गुरू अपने गोविन्द दियो बताय।।

‘గురువు,  భగవంతుడు ఎదురుగా నిలిస్తే నేను నమస్కరించేది మొదట గురువుకే, ఎందుకంటే ఆ భగవంతుడు ఉన్నాడని చెప్పింది నా గురువే కదా!’ అని కబీర్ దాస్ అన్నాడు.  ఈ రోజు విద్యార్థులు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఆ చదువుకు బీజం వేసి దాని మీద ఆసక్తి కలగడానికి దోహదపడినది మాత్రం చదువు నేర్పిన గురువులే!

మేము చదువుకున్నది విద్యానగర్ ‘జ్యోతి బాలా మందిర్’లో. మా స్కూల్ చదువు పూర్తయ్యాక, ఆ స్కూల్ పూర్వపు విద్యార్థులం అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళము. కానీ ఈసారి మాత్రం మా టీచర్స్ ని గౌరవించాలని అనుకున్నాము. ఏ శుభముహూర్తాన ఈ ఆలోచన కలిగిందో కానీ, మా క్లాస్ వాట్స్ ఆప్ గ్రూప్ లో ఈ మాట చెప్పగానే, అందరమూ చాలా ఉత్సాహపడ్డాము. స్కూల్ లో పనిచేసిన అప్పటి మా టీచర్ల ఫోన్ నంబర్లు అన్నీ మా వద్ద లేవు. ఒక్క సి.పి.ఎస్.ఎం. లక్ష్మి టీచర్ ఫోన్ నంబర్ ఉంది. ఆవిడ సహకారంతో మిగిలిన వారందరి ఫోన్ నంబర్లు అన్నీ తీసుకోగలిగాము. మార్చ్ 26వ తారీఖున హిమాయత్ నగర్ లో ఈ ‘గురుపూజోత్సవ’ కార్యక్రమం నిర్ణయించాము.

మా స్కూల్… ‘జ్యోతి బాలా మందిర్’ స్థాపకులు శ్రీ రామ్మోహన్ రావు గారు. ఆయన మొట్ట మొదట స్కూల్ ఖమ్మంలో స్థాపించారు. ఆ తరవాత విజయవాడలో, హైదరాబాద్ లో ఈ స్కూల్ కి శాఖలు విస్తరించాయి. మా స్కూల్ నవాబు గారి ఇళ్ళల్లో ఒక ఇల్లు. గ్రౌండ్ లో ఉండే తరగతి గదులు  ఒకప్పటి వారి కార్ షెడ్లు. వెనకాల ఉన్న యూకేజీ, ఎల్కేజీ క్లాస్ లు (ఇప్పటి స్టాఫ్ రూం) వాళ్ళ పనివాళ్ళ గదులు. వెనకాల ఫౌంటేన్ అవి వాళ్ళ విలాస చిహ్నాలు. అంతటి వైభవం కలిగిన స్థలం మా స్కూల్!

***

శనివారము మా క్లాస్ లో చదివిన వారంతా మా స్కూల్ కి వెళ్ళాము. ముందు రోజే అక్కడి ప్రిన్సిపాల్ అనుమతి తీసుకొని, ఆ రోజు ఎసంబ్లీలో పాల్గొన్నాము. ముందుగా ‘జ్ఞానానందం మయదేవం’ అని హయగ్రీవ ప్రార్థనతో మొదలెట్టి, ‘ఇండియా ఈజ్ మై కంట్రీ’ అని ప్రతిజ్ఞ చెప్పాము. తరవాత అక్కడి టీచర్లతో మాట్లాడి, మేము చదివిన ప్రతి తరగతి చూస్తూ అక్కడ ఏ క్లాస్ లో ఉన్నప్పుడు ఎక్కడ కూర్చున్నామో, ఏ టీచర్ వచ్చేవారో అప్పుడు చేసిన ఆ అల్లర్లు అన్నీ తలచుకున్నాము. సెవెంథ్ క్లాస్ లో మా క్లాస్ కి ‘బెస్ట్ క్లాస్’ అని డిసిప్లేన్ లో అవార్డ్ వచ్చింది, ఆ రోజే అల్లరి ఎక్కువ చేశామని క్లాస్ మొత్తాన్ని నీల్ డౌన్ వేయించారు. క్లాస్ కుర్చిలో ఈ అవార్డ్ పెట్టుకొని, క్లాస్ బయట అందరం నీల్ డవున్ చేసిన ఘనత బహుశా మాకే దక్కిందేమో!

వేపచెట్టు కింద చదువుకునేటప్పుడు కుట్టిన గొంగళీలు, ఆషాఢ మాసంలో వాలే ఈగలు, ఈగలు రాకుండా వేసిన ఫినాయిలు… ఆ వాసనకి సగం మంది పిల్లలు కక్కుకోవడం అన్నీ తలచుకున్నాము. మా నైథ్ క్లాస్ క్లాస్ రూంలో కి వెళ్ళి అక్కడి పిల్లలతో పాటే కూర్చొని కాసేపు ఆ టీచర్ చెప్పిన పాఠం విన్నాము. మేము కూడా వెళ్ళి బ్లాక్ బోర్డ్ మీద కొన్ని లెక్కలు చెప్పేసి వచ్చాము. తరవాత గ్రౌండ్ లోకి వచ్చి ఉయ్యాల బల్ల, జారుడు బల్లా కూడా జారాము.

స్కూల్ నుంచి వచ్చేసేటప్పుడు అక్కడ ఏం నేర్చుకున్నామో అర్ధం కాలేదు, టెంథ్ పాస్ అయ్యి మంచి మార్కులతో బయట ప్రపంచానికి వచ్చామే అని అనుకున్నాము. కానీ మాకు తెలియకుండా మేము జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకున్నాము.

చిన్నప్పుడు కరక్ట్ గా రాస్తే ఎప్పుడూ ‘వెరీ గుడ్’ అని రాసే  టీచర్ నుంచి ప్రతీ వారిని ప్రోత్సహించడానికి ఎప్పుడూ ఎంకరేజ్ చేసేటట్టుగా పొగడాలి అని, ఎప్పుడూ నవ్వుతూ ఉండే టీచర్ ని చూసి ‘నవ్వడం ఒక భోగం’ అని, కళ్ళతో భయపెట్టే టీచర్ నుంచి ‘మిన్ను విరిగి మీద పడ్డ చలించకూడదని’, పిల్లల్ని కొట్టకుండా క్రమశిక్షణలో పెట్టే టీచర్లు, సరదాగా ఉంటూనే పిల్లలకి బుర్రలోకి సబ్జక్ట్ ని ఇండ్యూస్ చేసే టీచర్లను, గంభీరంగా ఉంటూ ఎన్నో విషయాలు నేర్పించిన ప్రతీ టీచర్… మాకు జీవిత పాఠాలు నేర్పారు, ఇలా  నేర్పించిన ప్రతీ టీచర్ కి శతకోటి ప్రణామాలు.

 

आचार्यात् पादमादत्ते पादं शिष्यः स्वमेधया ।

सब्रह्मचारिभ्यः पादं पादं कालक्रमेण च

జీవితంలో పావు వంతు మనము మన గురువుల నుండి నేర్చుకుంటాము, మిగిలిన పావు వంతు తోటి విద్యార్థుల వద్ద నేర్చుకుంటాము, మిగిలిన పావు వంతు కాలం నేర్పుతుంది, మిగిలిన పావు వంతే మన సొంత తెలివితేటలతో నేర్చుకుంటాముట. అంటే మన జీవితంలో అర్ధ భాగం నేర్చుకునేది ఈ స్కూల్ లోనే, మిగిలిన పావు వంతు నేర్చుకోడానికి దోహదపడేది ఈ అర్ధభాగం నుంచే.

మధురమైన జ్ఞాపకం గుర్తొచ్చినప్పుడు కాలాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఎక్కడో పోయిందన్న బాలం భద్రంగా ఈ స్కూల్లో ఉందనిపించింది. వయసు మరచిపోయి అందరం మళ్ళీ పదేళ్ళ పిల్లలమైపోయాము. అప్పుడు టీచర్ల చేతిలో తిన్న తీపి దెబ్బలు తలచుకున్న కొద్దీ మరింత మధురంగా అనిపించాయి. చిన్న చిన్న మాటలకే కోపాలు తెచ్చుకొని కొన్ని రోజుల పాటు మాట్లాడుకోని మా పసితనపు పౌరుషానికి నవ్వొచ్చింది. నిక్ నేంస్ తో పిలిచినందుకు టీచర్లకి కంప్లైంట్ ఇచ్చిన వైనం మురిపంగా అనిపించింది. ఇప్పుడు ఆ నిక్ నేం తో పిలుచుకుంటే ఆ పిలుపు కొత్తగా వచ్చిన మామిడికాయ పులుపులా అనిపించింది.

స్కూల్ ఎదురుగా ఉన్న ఐస్ బండి గుర్తొచ్చింది, అతని మాకు అమ్మిన ఐస్ లు ద్వారా పెద్ద బంగ్లా కట్టేసుకొని ఉండచ్చు. గ్రౌండ్ లో ఉన్న నీళ్ళ టాంక్ దగ్గర క్యూ కట్టి నీరు తాగడం, పక్కనే ఉన్న కుంకుడు చెట్టుకి వచ్చిన కుంకుడు కాయలకి పిన్నీసు గుచ్చి బుడగలూదడం, కొద్దిగా పక్కన ఉన్న రేగిచెట్టు మీద పసిడి రేగి కాయలు వగరు, గ్రౌండ్ లో పరిగెడుతుంటే కాలు అడ్డుపెట్టి పారేస్తే మొకాలు చిప్పలు రేగిపోయి రక్తం కారుతూ ఉన్నప్పుడు వచ్చిన ఏడుపు… ఉక్రోషం, స్కూల్ ఎసంబ్లీ లో మైక్ లో పేరు పెట్టి పిలిచినప్పుడు గర్వంతో అందుకున్న ఆ చిన్న కప్పు, మైక్ లో భగవద్గీత చెప్పినప్పుడు తడబడటం, అందుకు ఏడిపిస్తుంటే వచ్చిన అలక, స్కూల్ కి రాగానే గోడ వెనకాల నిల్చొని కొట్టిన శత్రుమిత్రులు… ఇలా ఎన్ని జ్ఞాపకాలనో మళ్ళీ మూట కట్టుకొని తెచ్చుకున్నాము. చేజారిన బాల్యం మళ్ళీ ఒక్కసారి అద్దంలో కనిపించి సొంతమైనటనిపించింది. స్కూల్ ని వదిలి వస్తూ ఉంటే వృద్ధ్యాప్యంలో ఉన్న అమ్మమ్మని వదిలేసి వస్తునట్లనిపించింది. శిద్ధిలమైన కట్టడాల వెనక ఉన్న వైభవం అంతా కళ్ళ ముందు కలిది మనసుని మెలిపెట్టింది.

జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్నీ డిగ్రీలు సంపాదించినా, ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా… బాల్యం తిరిగొచ్చిన అనుభూతి కన్నా గొప్పది కాలేదు. అందుకే ఎవరో కవి అన్నట్టు

సంపాదించి ఐశ్వర్యం ఇస్తా

గడించిన కీర్తి ధారపోస్తా

ఉద్యోగం ఊరకిచ్చేస్తా

నిలువెత్తు ధనం ఇచ్చేస్తా…

వసివాడని పసితనం చేతికందిస్తే…

మళ్ళీ తిరిగి రాదని తెలిసినా పొందాలనే ఆశ, నెమరు వెసుకొన్న కొద్దీ మధురమైనది బాల్యం. అలాగే బాల్యంలో మనం గడిపిన వ్యక్తులు, వారందరితో గడిపిన ఆ రెండు రోజులు ఒక పండగలాగా అనిపించింది. చిన్ననాటి మిత్రులని కలిసినప్పుడు ఇప్పటికీ అదే ఆప్యాయతతో ఉన్న స్నేహాన్ని చూస్తే చాలా గర్వంగా అనిపించింది.

మల్లెపూవు నల్లగా మాయవచ్చును

మంచు కూడ వేడి సెగలు ఎగయ వచ్చును

పువ్వు బట్టి  తేనె రుచి మారవచ్చును

చెక్కు చెదరనిది స్నేహమని నమ్మవచ్చును

 

కొన్ని రోజుల పాటు ఈ జ్ఞాపకం జీవితాలలో మరింత ఆనందాన్ని నింపుతుంది.

***

ఈ స్కూల్లో చేరే ముందు ఎంట్రన్స్ ఎగ్జాం పెట్టినవారు ‘సంధ్యా టీచర్’, నా మొట్ట మొదటి క్లాస్ టీచర్ ‘మనోరమ’ టీచర్. ఆవిడ మాకు లెక్కలకు  వచ్చేవారు. సెకండ్ క్లాస్ క్లాస్ టీచర్ ‘జయలక్ష్మి టీచర్’, ప్రస్తుతం ఆవిడ అమెరికాలో ఉండడం వలన మా కార్యక్రమానికి రాలేకపోయారు. మూడు, నాలుగు, ఐదవ క్లాస్ క్లాస్ టీచర్ ‘రమా కుమారి టీచర్’. ఆవిడే మాకు ఇంగ్లీష్, తెలుగు, లెక్కలకి వచ్చేవారు. సెకండ్ క్లాస్ లో తెలుగుకి ‘వసుంధర టీచర్’ వచ్చేవారు. థర్డ్ క్లాస్ లో తెలుగుకి ‘లలితా’ టీచర్ వచ్చేవారు. ‘అనురాధ టీచర్’ మాకు మూడవ క్లాస్ లో సైన్స్ కి వచ్చేవారు. ఫోర్త్  క్లాస్ సైన్స్ టీచర్ గా ‘పద్మావతి టీచర్’ వచ్చేవారు.  ఆరవ క్లాస్ క్లాస్ టీచర్ ‘నివేదిత’ టీచర్, ఆవిడ వృద్ధాప్యం కారణం వలన రాలేకపోయారు. ఆరవ క్లాస్ లో సైన్స్ కి ‘లీలా టీచర్’ వచ్చేవారు. మా క్లాస్ పక్కన ఉన్న వేప చెట్టు కింద కూర్చోబెట్టి అక్కడే ప్రశ్నలు, జవాబులు చదివించేవారు.

సెవెంత్ క్లాస్ లో   సోషల్ కి ‘రాజ్యలక్ష్మి’  టీచర్ వచ్చేవారు. సెవెంత్  క్లాస్ క్లాస్ టీచర్ ‘చెంచులక్ష్మి టీచర్’. ఆవిడకి ఈ కార్యక్రమం  గురించి చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు, “నువ్వు గుర్తు ఉన్నావు విశాలి, ఎలా ఉన్నావు?” అని నా స్కూల్ విషయాలు ఆవిడ చెప్పగానే కలిగిన ఆనందం, గర్వం వర్ణనాతీతం! అలాగే వసుంధర టీచర్ కి కూడా నేను గుర్తు ఉన్నానని అన్నప్పుడు మబ్బుల్లో తేలిపోయాను. 8, 9, 10 క్లాస్ లలో తెలుగుకి ‘సీతా మహాలక్ష్మి’ టీచర్ వచ్చేవారు.  ఎనిమిదవ క్లాస్ క్లాస్ టీచర్ ‘సి.పి.ఎస్.ఎం. లక్ష్మి టీచర్’. ఆవిడే మాకు 8, 9, 10 కి లెక్కలకి వచ్చేవారు. ఆవిడే మాకు 9 క్లాస్ క్లాస్ టీచర్. 7, 9, 10 లో హిందీకి ‘అన్నపూర్ణ టీచర్’ వచ్చేవారు. 8, 9, 10 సోషల్ కి ‘శాంతా టీచర్’ వచ్చేవారు.

ఎస్.యు.పి.డబ్ల్యూ. కి ‘ఫ్రాన్ స్వా’ టీచర్ వచ్చేవారు. 10 వ  క్లాస్ క్లాస్ టీచర్ ‘సుశీల’ టీచర్. ఆవిడ కొన్ని సంవత్సరాల క్రితం కాన్సర్ తో పరమపదించారు.  మాకు 10 వ క్లాస్ లో సైన్స్ కి ‘కస్తూరి టీచర్’, అలాగే 8 వ క్లాస్ లో కొద్దిరోజులు ‘పద్మావతి టీచర్’ (మాథ్స్) క్లాస్ టీచర్ గా వచ్చేవారు. వారిరువురూ కొన్ని ఏళ్ళ క్రితం దివంగతులయ్యారు. ప్రస్తుతం ఈ ‘గురుపూజోత్సవం’లో అందరు టీచర్లు వచ్చారు. పరమపదించిన వారి  గొప్పదనాన్ని అందరమూ తలచుకున్నాము.

దేశానికి ఒక డాక్టరునైనా, ఒక ఇంజినీర్ నైనా, ఒక న్యాయవాదినైనా తయారు చేసే శిల్పి… టీచర్. ఒక డాక్టర్ తప్పు ఒక మనిషిని భూమికి ఆరు అడుగుల కిందకు దింపుతుంది, ఒక న్యాయవాది తప్పు మనిషిని భూమికి ఆరు అడుగుల పైకి తీసుకెళ్తుంది, అదే ఒక టీచర్ తప్పు చేస్తే ఒక తరం తరం వేల అడుగుల వెనక్కి వెళ్తుంది. ఈ సమాజంలో ఇంత మంది గొప్ప వ్యక్తులు, గొప్ప వ్యక్తిత్వాలు ఉన్నాయంటే కారణం… టీచరే!

ఈరోజు మా క్లాస్ లో ఉన్న అలనాటి విద్యార్థులు ఎంతో ఉన్నతమైన స్థానాలలో ఉన్నారు. కొందరు కంపెనీకి డైరెక్టర్లు, మరి కొందరు వైస్ ప్రెసిడెంట్లు, బాంక్ మేనేజర్లు… ఇలా అన్నీ రంగాలలోనూ నిష్ణాతులు ఉన్నారు, వారందరి విద్యకి పునాది పడింది మా ‘జ్యోతి బాలా మందిర్’ లోనే! ఆ పునాది వేసినవారు మా గురువులే!

ఆ గురువులను సన్మానించే అదృష్టం మాకు ఈ శోభకృత్ సంవత్సర శుభారంభలో లభించింది.  26వ తారీఖున మా గురువులందరూ పొద్దుట పదిన్నరకి హోటల్ ప్లాటినంకి చేరుకున్నారు. చాలా మంది 70-90 ఏళ్ళ మధ్యలో ఉన్నవారే. ఆరోగ్యం సహకరించకపోయినా, వేరొకరి సాయంతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నా సరే వారు మా కోసం వచ్చిన తీరు చూసేసరికి మేమంతా చలించిపోయాము. మొదట పూజారి గారిని పిలిపించి, ఆశీర్వచన మంత్రాలు చదివించి, మా టీచర్లందరి పాదాలకు పూలు వేసి, పళ్ళ బుట్ట చేతికిచ్చాము. వారు మా మీద అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

రోజంతా నిలుచుని పాఠాలు చెప్పినందుకే కాబోలు వాళ్ళ మోకాలి చిప్పలు ఇప్పుడు సహకరించక, నడవటానికి ఇబ్బంది పడుతున్నారు. మేము పొద్దుట స్కూల్ కి వచ్చేటప్పటికి పాలసముద్రంలో నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవుల్లా చిరునవ్వుతో కనిపించేవారు మా టీచర్లు. వ్యక్తిగతంగా ఎన్ని బాధలున్నా, అవన్ని స్కూల్ గేట్ బయటే వదిలేసి మా అందరికోసం అంకితభావంతో పనిచేసిన వారికి మేము ఏమిచ్చి ఋణం తీర్చుకోగలము, మనస్ఫూర్తిగా పాదాభివందనం చేయడం తప్ప! వారి సహనానికి, సంస్కారానికి ఎన్ని కోట్లిచ్చినా వెల కట్టలేము కదా…

మేము ఆ రోజు చిన్నపిల్లలైపోయాము, మాతో పాటు మా టీచర్లు కూడా  మళ్ళీ యుక్తవయసులోకి వెళ్ళిపోయారు. వారి ముఖాలలో వారి చేతుల్లో పెరిగిన మొక్కలు వృక్షాలైనందుకు గర్వం, మాకు మా టీచర్లు ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారన్న గర్వం పోటీపడ్డాయి!  మధ్యాహ్నం భోజనం అయ్యాక మా ‘సీతా డ్రిల్ టీచర్’ దగ్గరకు ఒక స్కేల్ తీసుకొచ్చి అందరం చేతులు చాపి కొట్టమని బతిమాలాము. ఆవిడ అందరిని మెల్లగా కొట్టి, గట్టిగా ముద్దుపెట్టుకున్నారు.

సాయంత్రం అందరం ఇంటికి వెళ్ళేటప్పుడు గుండెల నిండా ఎన్నో అనుభూతులు మరెన్నో జ్ఞాపకాలతో వదలలేక వదలలేక  బరువుగా కదిలాము. ఈ ఉగాది మాకు బోలెడన్ని గురువుల ఆశీస్సులతో మొదలయ్యింది, ఇన్ని ఆశీస్సులు పొందిన మాకంటే ధన్యులెవరు?

***

 

రచన: విశాలి కొత్తూరి పేరి

 

5 thoughts on “తస్మై శ్రీ గురవైనమః

  1. Great Article , as said in the article School is the seed for care , bonding, knowledge, ever lasting friendship and many more.
    This event is a memorable event and i am really glad to be part of the event.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *