March 28, 2024

వెంటాడే కథ – 17

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

చొరవ!

వీణా మహంతికి ఆనందంతో నేల మీద కాలు నిలవడం లేదు.
ఎందుకు నిలుస్తుంది? ఎప్పుడో పదేళ్ల క్రితం తను ప్రేమ పెళ్లి చేసుకుని ఇల్లు వదిలి వచ్చేసింది.
మహంతి మంచివాడే! కానీ నాన్నకు నచ్చలేదు.
నాన్న ‘కాదు’ అనేసరికి తన మీద ఎంతో ప్రేమ ఉన్న అన్నయ్య హరి కూడా ఏమీ అనలేకపోయాడు.
“నా కూతురు చచ్చిందనుకుంటున్నాను. మీరెవరైనా మళ్లీ దాని గడప తొక్కితే నేను చచ్చినంత ఒట్టు. అలాగే ఉత్తరాలు, పత్రాలు కూడా రాయడానికి, రావడానికి వీల్లేదు” అంటూ నాన్న ఒట్టు వేసేసరికి పదేళ్లుగా ఆ ఇంటితో తనకు బంధం తెగిపోయింది.
అందుకే గత ఏడాది నాన్న చచ్చిపోయినా తను వెళ్లలేకపోయింది, ఆయన పెట్టిన ఒట్టు గట్టున పెట్టలేక.
నాన్న ఎలాగో పోయారు. ఉన్న ఒక్కగానొక్క చెల్లెలు బంధం కలుపుకోవడానికి హరి చొరవచూపాడు.
అలా భువనేశ్వర్ నుంచి కలకత్తా ఇవాళ ఉదయానికల్లా వస్తానని టెలిగ్రామ్ పంపాడు.
అప్పటి నుంచి వీణ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.
పనిపిల్ల అమోహి కూడా వీణ హడావుడికి భయపడుతోంది. రాబోయే అతిథి కోసం యజమానురాలు తనతో ఐదు రకాల వంటకాలతో భోజనం సిద్ధం చేయించింది. అన్నకు ఇష్టమైన స్వీట్ తయారు చేయించింది. ఈ పనులన్నింటిని చేసి చేసి పదకొండేళ్ల అమోహికి ఒళ్ళు హూనం అయిపోయింది.
మధ్య మధ్యలో యజమాని మహంతి వచ్చి “కాస్త టీ ఇస్తావా. జ్యూస్ ఇస్తావా?” అంటూ తన వెనకే తిరుగుతూ వేధింపులు. ఆయన అటు వెళ్లగానే యజమానురాలు వచ్చి “ఇంకా ఆ వంట కాలేదా? ఈ వంట కాలేదా?” అని తిట్లు ఆమె చిన్ని బుర్రను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
మధ్యాహ్నం 12 గంటలకు కాలింగ్ బెల్ మోగింది.
వీణ తూనీగలా పరిగెత్తుతూ వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా నవ్వుతూ అన్నయ్య హరి!
‘ఎంత చక్కగా ఉండేవాడు. ఎలా అయిపోయాడు? నలభై ఏళ్లకే బట్టతల వస్తోంది.. చెంపలు నెరిసాయి.’ అనుకుంటుండంగానే హరి తన చెల్లెల్ని దగ్గరకు తీసుకుని గుండెలకు ప్రేమగా హత్తుకున్నాడు.
ఇద్దరి కళ్ళు ప్రేమాశ్రువులు వర్షిస్తున్నాయి.
అంతలో కిచెన్ లో నుంచి ‘హాయ్’ అంటూ మహంతి వచ్చాడు.
అతని వెనకే ట్రేలో జ్యూస్ గ్లాసులతో ముఖం మీద పడుతున్న వెంట్రుకలు ఎడమచేత్తో పైకి తోస్తూ వచ్చింది అమోహి.
ఆమె ఒళ్ళంతా చెమటలు దిగ కారుతున్నాయి.
అప్పటిదాకా కిచెన్‌లో వేడి వేడి వంటలతో కుస్తీ పడుతోంది కనుక ఆ పరిస్థితి!
బావగారికి నమస్కారం చేసి హరి సోఫాలో కూర్చున్నాడు. అతని పక్కనే వీణ అన్నపై ఒరిగిపోతూ అంటిపెట్టుకుని కూర్చుంది.
అంతలోనే ట్రేను టీపాయ్ మీద పెడుతున్న అమోహిని చూస్తూనే అగ్గి బరాటా అయింది వీణ.
“కాస్త మొహం, కాళ్లు చేతులు కడుక్కుని తగలడచ్చు కదా చమట మొహంతో రాకపోతే?. మా అన్నయ్యకు నీ చెమట చేతులతో జ్యూస్ చేసి తెస్తావా.. దౌర్భాగ్యురాలా?” అని తిట్టిపోసింది.
అమోహి మొహం మాడిపోయింది.
చకచకా కిచెన్‌లోకి వెళ్ళిపోయింది.

“కూల్ కూల్. డియర్ ” అంటూ భార్యకు చెబుతూ మహంతి తన జ్యూస్ గ్లాస్ చేతిలోకి తీసుకొని
అమోహి వెనక కిచెన్‌లోకి నడిచాడు.
హరి కూడా చెల్లెలి చేతిని ప్రేమగా నిమురుతూ పర్వాలేదన్నట్టు సైగ చేసి జ్యూస్ గ్లాస్ అందుకున్నాడు.
ఇక తర్వాత అన్నాచెల్లెళ్ల ముచ్చట్లు అంతే లేకుండా పోయాయి.
ఇద్దరూ కాసేపు తండ్రి గురించి తలుచుకుని బాధపడ్డారు.
తర్వాత మళ్లీ ప్రస్తుతంలోకొచ్చి కబుర్లలో పడ్డారు.
అన్నగారి పిల్లలు ఇతర కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుంది చెల్లెలు.
చెల్లెలికి ఇంకా సంతాన యోగం పట్టనందుకు బాధపడ్డాడు అన్నగారు.
డైనింగ్ టేబుల్ వద్ద అన్నగారికి కొసరి కొసరి వడ్డించింది చెల్లెలు.
“అన్నయ్యా నీకు ఈ స్వీట్ ఇష్టమని నేనే స్వయంగా తయారు చేశాను. కొంచెం రుచి చూసి చెప్పు.. ఎలా ఉందో?” అంటూ అన్న గారి కంచంలో స్వీట్ వడ్డించింది వీణ.
“ఇదిగో ఈ చేపల కూర నువ్వు చిన్నప్పుడు ఇష్టంగా తినేవాడివి. అందుకోసం ప్రత్యేకంగా మార్కెట్ నుంచి తెప్పించి తయారు చేశాను” అంటూ కూరలు వడ్డించింది.
‘ఇవన్నీ చేసింది నేను కదా? అమ్మగారు ఏంటి ఇలా చెప్తారు?’ అన్నట్టుగా యజమానురాలి వంక చూసింది అక్కడ నిలబడి ఉన్న అమోహి.
అది గమనించి వీణకు చిర్రెత్తుకుని వచ్చింది.
తినేసేలా చూస్తూ “నువ్వెందుకే ఇక్కడ దిష్టిచేటు..? ఈ గదిలోంచి బయటకు తగలడు” అంటూ తిట్టింది.
హరి చెల్లెలి ప్రేమను ఆస్వాదిస్తూనే అనవసరంగా పనిపిల్లపై ఆమె విరుచుకుపడుతోందని అర్థం చేసుకున్నాడు. అప్పటికే తినడం పూర్తి చేసిన మహంతి పనిపిల్లను బయటకు వెళ్ళమని సైగ చేస్తూ తను కూడా బయటకు నడిచాడు.
‘పోనీలే బావగారన్నా ఆ పిల్లను ఓదారుస్తున్నారు. ఎంతైనా చిన్నపిల్ల కదా!’ అని సంతృప్తిపడ్డాడు హరి.
రెండు రోజులు గడిచాయి.
చెల్లెలు అన్నగారికి ఇష్టమైనవన్నీ వడ్డిస్తోంది. కానీ నిజానికి అవన్నీ చేసేది అమోహి అని హరికి అర్థమైంది.
ఒక రోజు వీణ అన్న లేవకముందే మార్కెట్‌కి వెళ్ళింది.
లేటుగా నిద్రలేచిన హరి తన గదిలోంచి వాష్‌రూమ్‌కి వెళుతూ కిచెన్‌లోకి చూసి ఉలిక్కిపడ్డాడు.
బావగారు, అమోహి కిచెన్ ప్లాట్‌ఫామ్ పై వైపు తిరిగి ఉండడంతో వాళ్లు అతన్ని చూడలేదు. కానీ బావగారి కుడి చేయి అమోహి పిరుదులపై నాట్యం ఆడటం గమనించాడు. ఆ పిల్ల దూరం జరిగిన కొద్దీ అతను మరింతగా ఆమె పైకి వాలిపోతున్నాడు.
హరికి బాధేసింది. ఏమిటి ఈ అసభ్య ప్రవర్తన? అని.
పాపం అమోహి ఎంత పిల్ల? తన చిన్న కూతురు వయసు కూడా లేదు. అలాంటి పిల్లతో చెల్లెలు ఒక పక్క బండ చాకిరీ చేయిస్తుంటే బావగారు ఇలా ప్రవర్తిస్తున్నారు.
తన ముద్దుల చెల్లి పోయి పోయి కట్టుకుంది ఇలాంటివాడినా ?
అతని నోరంతా చేదు తిన్నట్టు అయిపోయింది.
ఇదంతా చెల్లెలికి తెలుసా?
లేక భార్య చాటుగా భర్త సాగిస్తున్న లీలలా?
అయినా ఏమీ దౌర్భాగ్యం ? పదేళ్ల వయసున్న పిల్లతోనా సరసాలు.. సరాగాలు?
మరో రోజు గడిచింది.
“అమోహి! నా రూంలో బెడ్ షీట్ మార్చుదాం రామ్మా. నీకు నేను హెల్ప్ చేస్తాను” అంటూ బావగారు పిలవడం, ఆ పిల్ల గజగజ
వణుకుతూ గదిలోకి వెళ్లడం గమనించాడు హరి.
చెల్లెలు ఆ సమయంలో ఇంట్లోనే ఉంది. కానీ మొహం నిప్పులు చెరుగుతోంది..
ఏదో పని ఉన్నట్లు ఆ గది వైపు వెళ్లిన హరికి కిటికీలో నుంచి కనబడిన దృశ్యం ఒళ్ళు జలదరింపజేసింది. ఆ పసిదాన్ని గట్టిగా కౌగిలించుకుని నలిపేస్తున్నాడు ఆ పెద్దమనిషి. టాప్ పైకి జరిపి, ఎదిగీ ఎదగని ఛాతీపై ముద్దులు పెడుతున్నాడు.. ఆ చిన్నారి అతని కబంధ హస్తాలలో విలవిలలాడుతోంది.
ఏం చేయాలో అర్థం కాక ఏదో సాకుతో బావగార్ని బయటకు రప్పించాలని డోర్ నాక్ చెసాడు.
తెచ్చి పెట్టుకున్న నవ్వుతో తలుపు తీసిన మహంతితో
”బావగారూ మీ ఆఫీస్ విషయాలు ఇంతవరకూ ఏమీ చెప్పనే లేదు. ప్యాకేజీలు ఎలా ఉంటాయి ? మా పెద్దమ్మాయి బీ. టెక్ చివరి సంవత్సరంలో ఉంది. అదయ్యాక ఇక్కడికే పంపుదామని ఆలోచన…” అంటూ టాపిక్ మల్లించాడు హరి.
బయట వీణ, గదిలో అమోహి ఊపిరి పీల్చుకున్నారు.
హరికి కూడా మనసుకు హాయిగా ఉంది.
నాలుగో రోజున వీణ, ఆమె భర్త అతిథి కోసం బీచ్ ప్రోగ్రాం పెట్టారు.
దీనంగా చూస్తున్న అమోహిని కూడా రమ్మన్నాడు హరి ప్రేమగా.
“అదెందుకన్నయ్యా దరిద్రం? దాన్ని కొంపలో చావనీ. మనం తిరిగి వచ్చేసరికి తిండి తిప్పలు రెడీ చేస్తుంది” అంది వీణ చిరాకుగా.
“లేదులే చిన్న పిల్ల కదా. తీసుకెళ్దాం. కావాలంటే తిండి బయట హోటల్లో తినొచ్చు” అన్నాడు హరి అమోహి వంక ఆదరంగా చూస్తూ.
ఆ లేత మొహంలో వెలుగు వచ్చింది.
అమోహిని చూస్తుంటే హరికి తన చిన్న కూతురు హరిణి గుర్తొస్తోంది. పితృ వాత్సల్యం ఉప్పొంగుతోంది.
అమోహిని తీసుకెళ్దాం అనేసరికి మహంతికి కూడా కళ్ళు మెరిశాయి.
“ఎలాగో కార్లోనే కదా వెళ్లేది. లగేజీ మోస్తుంది.. రానీ డియర్” అన్నాడు వీణవంక చూస్తూ.
అయిష్టంగానే ఒప్పుకుంది వీణ.

* * *

బీచ్ దగ్గర పెద్దవాళ్లు ముగ్గురూ చిన్నపిల్లలై పోయారు.
హుషారుగా గంతులు వేశారు. వీణ ఆనందం అంబరాన్ని తాకింది.
పెద్దలే అలా చిన్నపిల్లలై పోయినప్పుడు, చిన్నపిల్ల అమోహి మరింత చిన్నపిల్లయిపోయింది.
కాసేపు అలలతో ఆడుకుని వచ్చి కారు దగ్గర కూర్చుని ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతోంది.
కాసేపటికి హరి అక్కడికి వచ్చాడు..
భార్యాభర్తలిద్దరూ అల్లంత దూరంలో సముద్రంలో కెరటాల్లా ఎగిసిపడుతున్నప్పుడు –
హరి బలవంతపెట్టడంతో అమోహి నోరు విప్పింది.
ఆరేళ్ల వయసులో ఆమె వారికి రైల్వేస్టేషన్లో కనబడితే ఇంటికి తెచ్చుకున్నారట. ఆ వయసు నుంచే ఆమెతో చాకిరీ చేయించడం మొదలుపెట్టారు. పని సరిగా చేయకపోయినా, గ్లాసులు పగిలిపోయినా, వీణ అట్లకాడ కాల్చి తొడలపై వాతలు పెట్టేదని, ఇంటాయన బెల్టుతో కొట్టేవాడనీ ఆ చిన్నారి ఏడుస్తూ చెప్పింది. తన ఏడుపు బయటకు వినబడకూడదని రేడియో సౌండ్ పెద్దగా పెట్టి ఈ అకృత్యానికి పూనుకునేవారని దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో చెప్పింది. పదేళ్లు నిండిన తర్వాత నుంచి మహంతి డేగ కన్ను ఆమె ఎదిగీ ఎదగని అందాలపై పడింది.
అప్పటి నుంచి ఆమె బతుకు నరకమే అయిందట.
యజమాని దగ్గరకు వెళితే యజమానురాలి కోపం.. వెళ్లకపోతే యజమానికి కోపం..
ఏ పని చేసినా తిట్లు తన్నులు పడేది తనకే అని ఏడ్చిందామె.
“నీ మూలంగానే నా భర్త ఇలా తయారయ్యాడు. బంగారంలాంటి వాడిని పాడు చేశావు కదే ముదనష్టపుముండా. నువ్వు మా కొంపలో ఉండొద్దు వెళ్ళిపో” అని తిట్టడం, కడుపు మాడ్చటం చేస్తుందట వీణ.
ఒక్కోసారి చలికాలంలో ఇంట్లోంచి బయటకు నెట్టి తలుపు గడియ పెట్టేస్తుందట.
“ఏ చిన్న తప్పుకైనా పెద్ద శిక్ష పడుతుంది. తప్పు చేయకపోయినా ‘పెద్ద శిక్ష’ పడుతుంది” అని అమోహి వెక్కివెక్కి ఏడుస్తుంటే హరి హృదయం ద్రవించిపోయింది!
బయటకు పోతే ఈ మాత్రం ఆసరా కూడా దొరకదని ఆ పిల్ల భయం..
‘నిజమే. బయట లోకం మాత్రం ఇంతకన్నా మెరుగ్గా ఉందా?’ అనుకున్నాడు హరి.
మర్నాటి సాయంత్రం హరి వెళ్ళిపోయాడు.

* * *

టింగ్ టింగ్…
ఉదయం 10 గంటల వేళ కాలింగ్ బెల్ మోగటంతో బ్రష్ నోట్లో పెట్టుకునే తలుపు తీశాడు మహంతి.
ఎదురుగా నలుగురు ఐదుగురు వ్యక్తులు, ఒక మహిళ నిలబడి ఉన్నారు.
అతను ఆశ్చర్యంగా చూస్తుంటే-
“ఆర్ యు మిస్టర్ అభయ్ మహంతి?” అడిగాడు వచ్చిన వాళ్ళలో ఒకాయన.
“ఎవరండీ ఇంత పొద్దున్నే?’ అ0టూ నైటీ సర్దుకుంటూ గుమ్మంలోకి వచ్చింది వీణ.
ఎవరో అతిథులు వచ్చారనుకుని అందరికీ టీ కలుపుకు రావడానికి కిచెన్ లోకి వెళ్ళింది అమోహి.
“మీ ఇంట్లో చిన్నపిల్లతో చాకిరీ చేయిస్తున్నారని ఫిర్యాదు అందింది నిజమేనా?” అడిగాడు ఒక ఆఫీసర్.
ఉలిక్కిపడ్డారు భార్యాభర్తలు.
“నో నో అలాంటిదేం లేదు మీకు ఎవరో గిట్టనివాళ్లు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు” అని వాళ్లు అంటుండగా అమోహి ట్రేలో టీ కప్పులు, నీళ్ల గ్లాసులతో వచ్చింది.
“దెన్ హూ ఈజ్ దిస్ గాళ్?” వచ్చిన వాళ్లలో లేడీ ఆఫీసర్ గబగబా లోపలికి వచ్చి అమోహిని చూపిస్తూ అడిగింది.
“ఆమె మా కూతురు” మహంతి అంటుండగా-
“మా చుట్టం” అంది తడబడుతూ వీణ.
“కూతురా. చుట్టమా లేక పనిమనిషా? ఏదో ఒకటి తేల్చుకుని నిజం చెప్పండి” వ్యంగ్యంగా అంది లేడీ ఆఫీసర్.
“అమ్మాయి నీ పేరేంటి?” ఒకాయన అడిగాడు అమోహిని.
“.. అమోహి” భయంగా అందామె.
“నిజమేనండి ఆమె మా చుట్టమే. దత్తత తీసుకున్నాం” అన్నాడు మహంతి.
“వెరీ గుడ్. దత్తత పత్రాలు చూపించండి” అన్నాడాయన.
మహంతికి ఏం చేయాలో పాలుపోలేదు. బిత్తరచూపులు చూస్తూ నిలబడ్డాడు.
“ఏమ్మా వీళ్ళ కూతురివా నువ్వు? లేక పని మనిషివా?” అడిగింది లేడీ ఆఫీసర్.
అమోహి ఏం మాట్లాడలేదు.
“ఈ కాలనీలో మేమంటే గిట్టనివాళ్లు చాలామంది ఉన్నారు సార్! వాళ్ళల్లో ఎవరో మీకు ఈ తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు.. ఈ అమ్మాయి మా బంధువు.. మా దత్తపుత్రి” ధైర్యంగా చెప్పింది వీణ.

“అలాగా? ఈ ఫోటో ఎవరిదో చూసి చెప్పండి?” అన్నాడాయన.
ఫోటో చూసి ఖిన్నురాలైంది వీణ.
“ఈ ఫోటోలో ఉన్నాయనే మాకు ఫిర్యాదు ఇచ్చారు. మీకు బాగా కావలసిన వ్యక్తేనట కద ఆయన” అన్నాడు ఆఫీసర్.
ఆఫీసర్ చూపించిన ఫోటో చూసి తానూ అదిరిపడ్డాడు మహంతి!
“తమరు ఈ అమ్మాయి మీద లైంగిక దాడులు కూడా చేస్తున్నట్టు ఆయన రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు నిజమేనా?” మహంతి వంక హేయంగా చూస్తూ అడిగాడు ఆఫీసర్.
“మీ దంపతులిద్దరూ తక్షణం ఆ పాపను తీసుకుని మా ఆఫీసుకు రావాలి. నడవండి” అని సీరియస్ గా చెప్పి మెట్లు దిగి జీప్ ఎక్కాడు ఆఫీసర్.
వీణ, మహంతి లకు ఆఫీసర్ చూపిన ఫోటో ఎవరిదో కాదు హరి ఫోటోనే!

-:0:-

నా విశ్లేషణ:

నాకు గుర్తున్నంత మేరకు ఇది ఒడియా కథ. రచయిత ఎవరో గుర్తు రావడంలేదు కానీ మంచి కథ. ఇందులో పాత్రలు చాలా సహజ సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా అన్న హరి పాత్ర ఉదాత్తంగా చిత్రీకరించారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు అతను ఎంతటి మానసిక వేదనకు గురై ఉంటారన్నది పాఠకులకు వదిలేయడంలోనే రచయిత పరిణతి అర్థం అవుతుంది. ముద్దుల చెల్లెలు, ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఒకవైపు, దిక్కు మొక్కు లేక లైంగిక వేధింపులకు, వెట్టి చాకిరికి గురవుతున్న అమోహి ఒకవైపు! బావగారు- చెల్లి … ఆ ఇద్దరిలో ఏ ఒక్కరిలోనూ కనీస మానవత్వం లేకపోవడం వల్లనే హరి ఆ నిర్ణయం తీసుకుని ఉంటాడు అనిపిస్తుంది.
ఇలాంటి కథలు మనకు తెలిసిన చాలా ఇళ్లలో కళ్ళ ముందే జరుగుతూనే ఉంటాయి. కానీ హరి తీసుకున్న చొరవ మనం తీసుకోలేం. దరిమిలా అన్ని చోట్ల బాధితులే నిందల్ని మోస్తూ, హింసను ఎదుర్కొంటూ చిత్రవధకు గురవుతూ ఉంటారు. ఇదే నేటి సమాజంలో ఐరనీ!

+++++

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *