June 24, 2024

అమ్మమ్మ – 46

రచన: గిరిజ పీసపాటి

 

 

“ఆయన చెప్పాడు కానీ నాకు వీలు కాదు. మొత్తం డబ్బు కట్టండి. లేదా, వెంటనే ఇల్లు ఖాళీ చేసెయ్యండి” అన్నాడు తిరిగి.

“ఇప్పటికిప్పుడు ఇల్లు దొరకాలి కదా అన్నయ్యగారు! ఇన్నాళ్ళు ఆగారు. ఈ ఒక్క నెల పిల్లల ముఖం చూసైనా దయచేసి ఆగండి. వచ్చే నెల మొత్తం ఇచ్చేస్తాను” అంది నాగ బతిమాలుతూ.

“కుదరదు. వెంటనే ఖాళీ చెయ్యండి” అన్నాడు తిరిగి. అంతవరకు సహనంగా వీళ్ళ మాటలు వింటున్న అమ్మమ్మ కలగజేసుకుని “అదేంటబ్బాయ్!? ఉన్నపాళాన ఖాళీ చెయ్యమంటే ఇల్లు దొరకొద్దూ! అయినా ఇల్లు ఖాళీ చెయ్యడానికి కనీసం మూడు నెలల గడువు ఇవ్వాలి కదా! ఆ విషయం నీకు తెలిసే ఉండాలే” అంది.

“అద్దె కట్టకపోయినా రూల్స్ మాట్లాడతారు. సరే అయితే! మూడు నెలలు గడువిస్తున్నాను. వచ్చే నెల బాకీ మొత్తం చెల్లించి, ఇక మీద మీరు ఉండబోయే మూడు నెలలూ ప్రతీనెలా ఒకటో తారీఖునాటికి ఏ నెలకానెల అద్దె చెల్లించండి” అన్నాడు అధికారంగా.

“అలా ఎలా అండీ? మొత్తం డబ్బు చెల్లించి, ఏ నెలకా నెల అద్దె చెల్లిస్తే… మరి మీ దగ్గర ఉన్న మా అడ్వాన్స్ సంగతేంటి? బాకీ కింద అడ్వాన్స్ జమ చేసుకుని, ప్రతీనెలా ఐదవ తారీఖున వచ్చి అద్దె పట్టుకెళ్ళండి. ఒకటో తారీఖు అంటే జీతం అందదు” అంది వసంత.

“అడ్వాన్స్ డబ్బు మీరు ఖాళీ చేసేటప్పుడు ఇస్తాను. వచ్చే నెల మొత్తం ఇచ్చేయండి” అన్నాడాయన మొండిగా.

“కుదరదబ్బాయ్. నువ్వు మమ్మల్ని నమ్మనప్పుడు మేమూ నిన్ను నమ్మలేము. ఇన్నాళ్ళు ఆగినందుకు చాలా సంతోషం” అంది అమ్మమ్మ ఇక మీరు దయచేయొచ్చు అన్న ధోరణిలో కోపంగా.

ఆయన విసురుగా లేచి, అన్నపూర్ణమ్మ గారి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆయనతో ఏం చెప్పారో కానీ, తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి, “త్వరగా ఇల్లు చూసుకోండి. నేను ఈ ఇల్లు అమ్మేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే మిమ్మల్ని ఖాళీ చెయ్యమంటున్నాను” అన్నాడు ప్రశాంతంగా.

దాంతో అమ్మమ్మ “నీకు చెప్పినట్లే మూడు నెలల్లో ఖాళీ చేసేస్తాము బాబూ! ఇప్పటి నుండే ఇల్లు వెతకడం ప్రారంభిస్తాము. ఇల్లు దొరికిందంటే మూడు నెలల కన్నా ముందే ఖాళీ చేసేస్తాములే. మేమూ బతికి చెడిన వాళ్ళమే. మాట పడాలంటే మాకూ బాధే! మా తలరాత బాగోలేక గానీ, లేకపోతే ఒకళ్ళ చేత మాట పడి ఎరగం” అంది అంతకు ముందు ఆయన మాట్లాడిన విధానాన్ని తలుచుకుంటూ.

“క్షమించండి మామ్మగారూ! ఇంట్లో ఆడవాళ్ళు డబ్బు గట్టిగా అడగమని పదేపదే చెప్తే అలా మాట్లాడాను. అది మనసులో పెట్టుకోకండి. వెళ్ళొస్తానండీ!” అని నాగతో చెప్పి వెళిపోయాడాయన.

ఆయన వెళ్ళగానే తుఫాను వెలసినట్లయి, అందరూ సైలెంట్ గా ఎవరి పనిలో వారు మునిగిపోయారు.

ఆ రోజు నుండి నాగ, అమ్మమ్మ తమకు తెలిసిన వారందరికీ ఏవైనా ఇళ్ళు ఖాళీ ఉంటే చెప్పమని చెప్పసాగారు. ఒకటి రెండు ఇళ్ళు చూసినా అద్దె బాగా ఎక్కువగా ఉండడంతో వద్దనుకోవలసి వచ్చింది.

ఒకరోజు ఉదయాన్నే అన్నపూర్ణమ్మ గారు పేపర్ తీసుకుని వీళ్ళ ఇంటి గుమ్మం వద్ద నిలబడి “వసంతా! ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. నీదీ, చెల్లిదీ నంబర్లు ఉన్నాయో లేదో చూడు” అంటూ ఉండగానే, వేసవి సెలవులకని అన్నపూర్ణమ్మ గారి ఇంటికి వచ్చిన వాళ్ళ బంధువుల అమ్మాయి “నేను చూస్తాను. నంబర్లు చెప్పండి” అంటూ ఆవిడ చేతిలోని పేపర్ లాక్కుంది.

ఆ అమ్మాయి కూడా గిరిజ వయసు అమ్మాయే. వచ్చి వారం అవుతున్నా ఏనాడూ వీళ్ళతో మాట్లాడడం కాదు కదా, కనీసం వీళ్ళను చూసి చిరునవ్వు కూడా నవ్వి ఎరగదు. వీళ్ళు తనను చూసి నవ్వబోయినా వీళ్ళను చూడనట్లే ముఖం తిప్పుకుని వెళ్ళిపోయేది. ఆ అమ్మాయి కళ్ళల్లోని తిరస్కారభావానికి గిరిజ మనసు ముడుచుకుపోయినట్లు అయిపోయేది. కానీ, వసంత మాత్రం సమయం దొరకకపోతుందా అన్నట్లు ఉండేది.

ఆరోజు ఆ అమ్మాయి చూపిస్తున్న అత్యుత్సాహానికి వీళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ వసంత “మేము చూసుకుంటాము” అంది ముక్తసరిగా.

కానీ ఇవేమీ తెలియని అన్నపూర్ణమ్మగారు “పరవాలేదులే వసంతా! తనను చూడనీ!” అనడంతో ఏమీ అనలేక తన చేతిలోని చెల్లెలి హాల్ టికెట్ ఆ అమ్మాయి చేతిలో పెట్టింది.

“మీదేదీ?” అనడిగిన ఆ అమ్మాయితో “నేను బాగా చదవలేదు. పాసవుతాననే నమ్మకం లేదు. మా చెల్లిది చూడు” అంది.

“అవేం మాటలు వసంతా!” అంటూ నాగ వసంత హాల్ టికెట్ కూడా తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చింది.

ఆ అమ్మాయి ముందు వసంత నెంబరు కోసం వెతికి “నంబర్ లేదండీ!” అంది. “నేను చెప్పాను కదా! నాకు నమ్మకం లేదని. ఇప్పటికైనా మా చెల్లిది చూస్తావా?!” అంది వసంత. ఆ అమ్మాయి గిరిజ నంబర్ కోసం వెతికి “తనది కూడా లేదు” అంది. అలా అంటున్న ఆ అమ్మాయి కళ్ళలో తను ఊహించినదే నిజమైంది అనే భావం స్పష్టంగా కనబడుతోంది.

“నేను నమ్మను. నేను పాసవనని నాకు ముందే తెలుసు. మా చెల్లి ఖచ్చితంగా పాసవుతుంది. నువ్వు నంబర్ సరిగ్గా వెతికి ఉండవు. ఆ పేపర్ ఇలా ఇవ్వు” అంటూ ఆ అమ్మాయి చేతిలోని పేపర్ లాక్కున్నట్లు తీసుకుని, చెల్లి చేతికిచ్చి “నీ నంబర్ చూడు” అంది వసంత.

గిరిజ గబగబా థర్డ్ (ఆర్డినరీ) క్లాస్ లో చూస్తుంటే… “ఫస్ట్ క్లాస్ లో చూడు” అంది వసంత. కానీ థర్డ్ క్లాస్ లో చూసి అందులో నెంబర్ లేకపోవడంతో, ఫస్ట్ క్లాస్ లో కూడా చూసి, లేదన్నట్లు తల ఊపింది గిరిజ.

“నేను చెప్పానా లేదని” అంటున్న ఆంటీ వాళ్ళ బంధువుల అమ్మాయితో “మా చెల్లి ఫెయిలవడం జరగని పని. అవసరమైతే రీ వేల్యుయేషన్ కి వెళతాం” అని ఆ అమ్మాయితో అంటూ, చెల్లెలి వంక చూసి “సెకెండ్ క్లాస్ లో కూడా చూడు” అంది.

సెకెండ్ క్లాస్ లో చూసిన గిరిజ కళ్ళలోకి పోయిన కాంతి తిరిగి వచ్చినట్లయి “ఇందులో ఉందక్కా! అమ్మా! నేను పాసయాను. అంటీ! నేను పాసయాను అంటీ!” అంది సంతోషంగా.

“శుభం. అక్కది కూడా ఆ చేత్తోనే మరోసారి చూడు” అంది అమ్మమ్మ.

గబగబా అక్క నంబర్ వెతికిన గిరిజ “థర్డ్ క్లాస్ లో ఉందమ్మా!” అంది రెట్టింపు సంతోషంతో.

“అన్ని కష్టాలు పడుతూ, తినడానికి సరైన తిండి లేకపోయినా, అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ, పరీక్షలు రాసి పాసయ్యారు. అదే సమయానికి తిండి, నిద్ర ఉండి, ట్యూషన్ కూడా పెట్టి చదివిస్తే డిస్టింక్షనో, స్టేట్ రేంకో వచ్చేది. మీ పిల్లలు బంగారాలు వదినగారూ!” అంటూ అన్నపూర్ణమ్మ గారు నాగతో అంటుండగానే వసంత అందరికీ పంచదార ఇచ్చింది.

“ఏంటి వసంతా! పంచదారతో సరిపెట్టేస్తావా!?” అన్నారు మూర్తి అంకుల్ ఆట పట్టిస్తూ. ఆయన వీళ్ళతో ఎప్పుడూ అలా సరదాగానే మాట్లాడతారు.

“లేదంకుల్. కాసేపట్లో రవ్వ లడ్లు చేస్తాను” అన్న వసంతతో “అహా! రవ్వ లడ్లే! త్వరగా చేసి ఓ నాలుగు నా నోట్లో పడేయమ్మా! పేరు వినగానే నోరు ఊరుతోంది” అన్నారాయన.

వసంత తమ్మడి చేత గోధుమ రవ్వ, పంచదార, జీడిపప్పు, కిస్ మిస్ లు, ఏలకులు తెప్పించింది. “ఇవాళ కాఫీలు ఒక పూటే తాగుదాం. రవ్వ లడ్లు పాలు వెయ్యక పోతే బాగోవు. అందులోకి పాలు పోస్తే సాయంత్రం కాఫీలకి చాలవు” అంది వసంత.

“సాయంత్రం మరో పాకెట్ పాలు నేను తెస్తాలే వసంతా!” అంది అమ్మమ్మ.

గంటలో రవ్వ లడ్లు చేసి అన్నపూర్ణ అంటీ వాళ్ళకి కొన్ని ఇచ్చి, మరికొన్ని బాక్స్ లో పెట్టి  చెల్లి చేతికిచ్చి “మీ షాప్ లో అందరికీ ఇవ్వు” అంది వసంత.

“ముందు మీ బాస్ కి ఇచ్చిన తరువాత స్టాఫ్ కి ఇవ్వాలి గిరీ!” అని చెప్పింది నాగ.

గిరిజ షాప్ కి వెళ్ళగానే ముందు బాస్ దగ్గరకు వెళ్ళి చేతిలోని బాక్స్ ఓపెన్ చేసి “తీసుకోండి సర్” అంటూ ఆయనకు ఆఫర్ చేసింది.

“ఏంటి విశేషం? మీ పుట్టిన రోజా?” అడిగారాయన ఒక రవ్వ లడ్డు తీసుకుని. “కాదు సర్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చాయి. నేను పాసయ్యాను” అంది గిరిజ దాద్దామన్నా దాగనంటున్న చిరునవ్వుతో.

“కంగ్రాచ్యులేషన్స్. ఏ కాలేజీకి అప్లయ్ చేస్తున్నారు?” అడిగారాయన. ఆ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియక, పాసయిన ఆనందం ఆవిరయిపోతుండగా, చిన్నబోయిన ముఖంతో తన సీట్లోకి వచ్చి కూర్చుండిపోయింది గిరిజ.

తనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఎందుకలా వెళ్ళిపోతోందో అర్థం కాక, వెళ్తున్న గిరిజనే సాలోచనగా చూసారాయన.

గంటాగాక ఆయనే గిరిజ దగ్గరకు వచ్చి, ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తూ “వన్స్ ఎగైన్ కంగ్రాచ్యులేషన్స్!” అన్నారు. “థాంక్యూ వెరీ మచ్ సర్” అని చెప్పి, “అందరికీ స్వీట్ ఇవ్వొచ్చా సర్?” అంటూ ఆయన వద్ద పర్మిషన్ తీసుకుని, ఒక్కొక్క కౌంటర్ దగ్గరకు వెళ్ళి తను పాసయిన విషయం చెప్పి, స్వీట్ ఇచ్చి, అందరి అభినందనలు అందుకుని వచ్చింది.

మర్నాడు ఉదయం షాప్ తెరచి గంట కూడా కాకముందే, ఒక అమ్మాయి వచ్చి బాస్ ని కలవడం, బాస్ ఆ అమ్మాయిని క్రోకరీ కౌంటర్ కి తీసుకెళ్ళి ఆ సెక్షన్ సేల్స్ మేన్  అయిన వెంకట్రావుకి పరిచయం చెయ్యడం, ఆ వెంటనే ఈ అమ్మాయి ఆ కౌంటర్ లోపలికి వెళ్లి, అక్కడ ఉన్న ఒక్కొక్క ఐటెమ్ పరిశీలనగా చూసి, రేట్లు తెలుసుకోవడం చెయ్యసాగింది.

 

***** సశేషం *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *