May 26, 2024

అర్చన కనపడుటలేదు – 5

రచన: కర్లపాలెం హనుమంతరావు

 

వానలో తడుస్తూనే గేటు తెరిచి రోడ్డు మీదకు వచ్చి పరుగులాగా అందుకున్నాడు చిన్న కర్రపోటేసుకుంటూనే.  అంతకన్నా వేగంగా ఆటో ముందుకు వెళ్ళి పోయింది.

వీధి చివరలో ఆగింది ఎందుకో !

ఇంట్లోని పోను గణగణ మోగింది.  పరుగెత్తుకుంటూ వెళ్లి ఫోను అందుకుంది కాంతమ్మగారు.  అర్చన గొంతు!

‘నిన్నూ, చిన్ననూ చూసాను ఇప్పుడే.  నా కోసం ఇక ఎదురుచూడద్దు.  చిన్నను బాగా చదివించు పిన్నీ! మంచి డాక్టర్ని చెయ్యి! బ్యాగులో మీ కోసం తెచ్చినవి వున్నాయి.  తీసుకోండి! నీ గాయం మాని రక్తం కారడం తగ్గిందా ? ఇప్పుడున్న పరిస్ధితుల్లో నేను ఇంటికి రాలేను.  క్షమించు ! చిన్ననొక సారి పిలు! వాడి గొంతు వినాలనుంది !’

అప్పటికే లోపలకొచ్చిన చిన్నకు ఫోనందించింది కాంతమ్మగారు.

అర్చన గొంతు.  ‘ హ్యాపీ బర్త్ డే రా చిన్నా! అమ్మను బాగా చూసుకోవాలి.  నన్ను మర్చిపోవని తెలుసనుకో.  కానీ అదే దిగులు పెట్టుకొని చదువు పాడుచేసుకోవద్దు.  మంచి డాక్టరువి కావాలి.  మాలాంటి వాళ్ళ నయం కాని రోగాలకు మందు కనుక్కోవాలిరా నీలాంటివాళ్ళు.  ఉంటా! టాటా ! బైబై! ‘ ఫోన్ కట్ అయింది.

బయటకు పరిగెత్తాడు చిన్న.  వీధి మలుపులోని ఆ ఆటో కదిలి మాయమై పోయింది.  అక్కడ ఉన్న కాయిన్ బాక్సు పోన్ నుంచి పలకరించిందన్న మాట!

ఎంత వెంటబడితే మాత్రం ఏం లాభం.  పోయేవాళ్ళని ఆపడం ఎవరి తరం? విరక్తిగా ఇంట్లోకి తిరిగొచ్చిన చిన్నకి వరండాలో ఒక మూలగా పెట్టున్న అక్క,  షోల్టర్ బ్యాగ్ కనిపించింది.

తెరిచి చూస్తే అందంలో కొత్త డ్రస్,  యాప్రాల కాళ్ళ నొప్పుల మందూ ! అడుగునంతా డబ్బు కట్టలు కట్టలుగా పేర్చి ఉంది!

అందులో అక్క ఉత్తరమూ కనిపించింది.  తెరిచి చూశాడు చిన్న.

‘ఇది ప్రస్తుతానికి నీ కాలేజీ ఖర్చులకి,  ఇంటి ఖర్చులకి.  నెల్లూరు కాలేజీలో చేరడానికి నేను వేరే ఏర్పాటు చేసాను.  తొందరలో నీకు అన్నీ తెలుస్తాయి.’ అని ఉంది.

***

పొద్దున్నే తులసమ్మగారికి పథ్యం పెట్టేసి వేసుకోవాల్సిన మందులు లావణ్యకిచ్చి మఠానికని జైలుదేరారు శ్రీమన్నారాయణగారు.

బస్సులో కూర్చోనున్నాడే గాని మనసు మనసులో లేదు.  ఆలోచనలన్నీ కోడలు అర్చన చుట్టూతానే.

అర్చన ఇంత హఠాత్తుగా ఇల్లు విడిచి వెళ్ళి పోతుందన్న సత్యం తనింకా జీర్ణించుకో లేకుండా ఉన్నాడు.  మామూలుగా ఇంట్లో ఏం జరిగినా కోడలు ముందు తనకే చెపుతుంది.  కావలికని బైలుదేరే రోజు మద్యాహ్నం కూడా తనున్న మఠానికి వచ్చి కూర్చుంది.  ‘మందులూ అవీ వేళకు వేసుకుంటూ వుండండి.  కాఫీలు ఎక్కువగా తాగకండి.  పెందలాడే ఇంటికి వస్తే ముందు అత్తయ్య సంతోషిస్తుంది’ అంటూ అప్పగింతలు పెట్టినప్పుడైనా ఆంతర్యం తను అర్థం చేసుకోలేకపోయాడు.  పోతూ పోతూ ఆ ఫైలు దాచమని ఇచ్చింది.  ఇవ్వడానికే వచ్చినట్లుంది.

‘బ్యాంకు లాకరుందిగా?’ అని అడిగితే ‘ క్లోజ్ చేసాను.  నెలనెలా రెంటు దండగని.  ఆ డబ్బుల్ని సికిందరాబాద్ స్వీకార్ ఛారిటీస్ కు విరాళంగా ఇస్తున్నాను’ ఉంది.

స్వీకార్ అంటే వికలాంగులైన బాలబాలికల బాగోగులు చూసే సేవా సంస్థ.  అర్చన ఏ పని చేసినా దాని వెనుక ఒక పరమార్థముంటుంది.

బ్యాంకు లాకరు లేనందువల్లే ఆ రోజు ఇంట్లోని ఆమె బంగారానికి అలా కాళ్లొచ్చాయి.  సమయానికి ఏ దేవుడో పంపించినట్లు తను ఇంటికి రాబట్టి లావణ్య ఆ బంగారాన్ని ఆ త్రాష్టుడికి చెరవేసిన వైనం తెలిసింది.

బంగారమే కాదు..  బంగారంలాంటి కూతురు బతుకునూ అర్చనే ఆ దుర్మార్గుడి బారి నుంచీ కాపాడింది.  తులసమ్మకు కూడా తెలియకుండా కూతురు గదిలో ఆ త్రాష్టుడి ప్రేమలేఖలు బైటకు లాగి పని చక్కబెట్టింది! ఆ దుర్మార్గుడు ఆ బంగారాన్ని కుదవబెట్టిన దుకాణాన్ని పట్టుకోవడం నుంచి సామ దాన భేదో పాయలతో షాపు వాడి చేత కాచిగూడ పోలీసుస్టేషనులో కంప్లయియింట్ ఇప్పించడం ద్వారా ఎంతో గుట్టుగా చాకచక్యంగా.  తనకు తప్ప ఎవరికీ తెలియకుండా వ్యవహారం నడిపించింది.  వాడు కటకటాల వెనక ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడానికి అర్చన ఒంటరిగా చేసిన పోరాటమే కారణం.

‘ఈ నాలుగురోజులలో మన లావణ్యనేమీ అనవద్దు మామయ్యా! మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వాడు పచ్చి మోసగాడని తెలిస్తే ఏ ఆడపిల్లయినా ఎంత క్షోభ అనుభవిస్తుందో ఒక ఆడపిల్లగా నాకు తెలుసు! నిదానం మీద అన్నీ సర్దుకుంటాయి.  తనెలాగైనా ఆ బి.ఎడ్ పూర్తియిందనిపిస్తే మా స్కూల్లోనే ఏదైనా ఉద్యోగం ఇప్పించు కోవచ్చు.  నేను మా మేనేజ్ మెంట్ తో మాట్లాడి ఆ ‘ఏర్పాట్లు’ అవీ చేసి ఉంచాను.  వేకెన్సీ రావడం ఒక్కటే రిక్వైర్ మెంట్.  దేవుడు దయవల్ల ఆ పోస్టూ తొందర్లోనే వస్తుంది అనుకుంటున్నాను.’ అంది.

ఆ చివరిరోజు చెప్పిపోవడానికి వచ్చినప్పుడు అర్చన అందుకే ఇలాగన్నదన్న మాట!

‘దేవుడా! కాలు విరిచి చేతికి కర్ర ఊతమిచ్చినట్లుగా చేసావయ్యా!’ అనుకున్నారు శ్రీమన్నారాయణగారు.

మఠం దగ్గర ఆగిపోవడంతో బస్సు దిగిపోయారు.

అర్చన దాచుంచమని ఇచ్చిన ఫైలు ఇక్కడ మఠం బీరువాలోనే ఉంది.  ఫైలులో ఏమున్నాయో కూడా తనకు తెలీదు.  దాచమని ఇచ్చింది కనక దాచి ఉంచాడంతే.

అర్చనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారమేనన్న ఇందులో ఉండవచ్చు.  బీరువా తెరిచి ఫైలు బైటికి తీశారు శ్రీమన్నారాయణగారు.

తన పేరు మీదనే అర్చన రాసి వుంచిన తారీఖు లేని కొన్ని బ్లాంక్ చెక్కులు,  తను పనిచేసే మేనేజ్మెంట్ వారిని ఆడ్రెస్ చేస్తూ రాసిన ఒకపెద్ద ఉత్తరం.  తన ఆడపడుచు అప్రోచ్ అయినప్పుడు ముందుగా ప్రామిస్ చేసినట్లు తను ఖాళీ చేసిన సీటులోనే ఉద్యోగం ఇప్పించమం’టూ వ్యక్తిగతంగా రాసుకున్న ఉత్తరం అది.

‘అంటే అర్చన ఇంట్లో కోడలి స్థానమే కాదు…  స్కూల్లో టీచరు స్థానం కూడా ఖాళీ చేయడానికి నిర్ణయించుకొనే కావలి బయలుదేరిందన్న మాట !’

కుప్పకూలిపోయారు శ్రీమన్నారాయణగారు.

***

బస్సు కడలూరు బస్టాండుకి చేరేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది.

బస్సు దిగి ‘ మురుగన్ లాడ్జ్’ అనడిగింది చుట్టుముట్టిన ఆటోవాళ్ళలో ఒకడిని.  “వాంగా అమ్మా…  వాంగా ” అంటూ అతను అర్చన హ్యాండ్ బ్యాగునందుకుని ఆటోలో ఆమె కూర్చున్న తరువాత ఇంజన్ స్టార్ట్ చేశాడు.

ఆటోమెయిన్ రోడ్డులో మెలికలు తిరుగుతూ పోతోంది.  రఘు మ్యారేజి కని వచ్చినప్పుడు ఈ రోడ్లన్నీ మట్టి కొట్టుకోనున్నాయి- అనుకుంది అర్చన.

అప్పట్లో వచ్చిన సునామీ కడలూరు పాంతాన్ని బాగానే దెబ్బ తీసింది.  ఐదు బెస్త  పాలేలు సముద్రంలో కొట్టుకుపోయాయి.

పెళ్ళి హడావుడిలో కూడా రఘు తనకు ఈ చుట్టుపక్కలు తిప్పి చూపించడం ఇప్పటికీ గుర్తే.  ‘సునామీ తాకిడికి సర్వం కోల్పోయిన కుటుంబాల్లోని తల్లులు పిల్లల పాలకోసం లాడ్జీలక్కూడా తెగించి వచ్చేవారు’ అని రఘు చెప్పినప్పుడు తను ఏడుపు ఆపుకోలేకపోయింది.

సిద్దమ్మాళ్ వంటి వాళ్ళు సొంత ట్రస్టులాంటిది మొదలుపెట్టి ఇక్కడ వాళ్లకు పునరా వాసాలు నెలకొల్పటంతోపాటు ఉపాధి మార్గాలు చూపించడంలో ఎంతో సాయం చేసారని రఘు వాళ్ల ట్రస్టుకు తీసుకెళ్ళి చూపించాడు.

ఆ సంస్థలో ముఖ్యంగా ఆడవాళ్లు హెచ్చైవీ లాంటి రుగ్మతల పాలవకుండా,  ఒక వేళ అలా పాలబడితే గౌరవప్రదమయిన జీవితం గడపడానికి చేస్తున్న సేవ చూసి ఒక నెల జీతం చెక్కు రూపంలో అక్కడికక్కడే విరాళంగా ఇచ్చింది అప్పట్లో తను.  ఆ సంస్థ ఇచ్చిన ‘ థేంక్యూ లెటర్ ‘ తన దగ్గర చాలాకాలం ఉంది.  అందులో వుండే నెంబర్లకే ఈ మధ్య ఫోన్ చేస్తే ‘దిస్ నంబర్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ ‘ అంటూ సమాధానాలు వచ్చింది.

 

ఒకసారి సిద్దమ్మాళ్ ని కలుసుకోవడానికే తనిప్పుడు ఇంత దూరం బంటరిగా రావడానికి కారణం.

* * *

ఆడమనిషి ఒక్కరే రావడం చూసి లాడ్జ్ మేనేజర్ కి కాస్త ఆశ్చర్యమనిపించింది.  సింగిల్ రూం బుక్ చేయమని రిజిష్టర్లో వివరాలు రాసింది. ఏదో తెలీని పేరుతో.   తప్పుడు చిరునామా కింద అర్చన.

‘పర్పస్’ అన్న కాలమ్ లో ‘ పర్సనల్’ అని రాసింది.

రూమ్ అరేంజ్ చేసి మీల్స్ కు ఆర్టరు తీసుకొని వెళ్ళిపోయాడు రూం బాయ్.

అతను వచ్చే లోపు రిఫ్రెషయి కూర్చుంది.

భోజనం ముగించి లోపలికి బోల్ట్ వేసుకొని బ్యాగులో నుంచి కొన్ని కాగితాలు తీసుకుని రాయడానికి కూర్చుంది.  ఎలా రాయాలా అని ముందు అనుకుందిగాని. ఒకసారి మొదలుపెట్టిన తరువాత కలం ఇంక ఆగలేదు.

 

ప్రియమైన కుమారికి!

నేను మీ బావ ప్రసాదుగారి భార్యను.  అర్చన నా పేరు,  నీతో మాట్లాడుదామని మామయ్యగారి దగ్గర్నుంచి నెంబరు తీసుకున్నా.  కానీ,  ఎందుకో ఇలా రాయడమే సుఖం అనిపించింది.  అడ్రసు కూడా మామయ్య గారి దగ్గరనుంచే సంపాదించాను.

నేను కనిపించకుండా పోయిన సంగతి ఈ పాటికి నీకు తెలిసే వుంటుంది.  నా అదృశ్యం గురించి మీడియాలో వస్తున్నవన్నీ ఊహాగానాలే.  నిజమేంటో నీ ద్వారా లోకానికి తెలియాలనేది నేను ఈ వుత్తరం రాయడానికి రెండో కారణం.

ఏ పరిచయం లేకపోయినా ఇలా ఎందుకు రాస్తున్నాననే నీ సందేహానికి చివరి దాకా ఓపికగా చదవగలిగితే సమాధానం లభిస్తుంది కుమారీ!

సాఫీగా సాగిపోతున్న నా జీవితంలో దసరా సెలవుల్లో విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనానికని వెళ్ళినప్పుడు జరిగిన దురదృష్ట సంఘటన ఉహించని ఎన్నో మలుపులకు కారణమయింది.  ప్రాణాపాయంలో ఉన్న ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో నా జీవితాన్ని నివారణ లేని ఒక అపాయంలోకి నెట్టుకొన్నాను.  ఒక రక్తనిధి కేంద్రం వాళ్ళ.  నిర్లక్ష్యం వల్ల వాడిన సిరింజినే వాడిన కారణంగా…  నా రక్తమే కాకుండా నా కడుపులోని బిడ్డ రక్తం కూడా పాజిటివ్ గా మారిపోయింది.  విషయం తెలుసుకొనే వేళకే సమయం చేతులు దాటిపోయింది.

మందు లేని ఈ మాయదారి రోగాన్ని గురించి సమాజంలో ఉన్న అపోహలు అన్నీ ఇన్నీ కావు.  సెక్స్ వర్కర్లు,  హోమోసెక్సువల్సు చేసే విచ్చలవిడి శృంగారం వల్ల మాత్రమే ఈ వ్యాధి రాదు. ఈ సంగతి చాలామంది చదువు కొన్నవాళ్ళకే తెలియదు.  హెచ్చైవీ రోగి శరీరం నుంచి వచ్చే రక్తం,  లాలాజలం,  వీర్యం,  రొమ్ముపాల ద్వారా తప్ప అంటుకున్నంత మాత్రానే తగులుకొనే జబ్బు కాదీ హెచ్చైవీ.

ఈ అంటుభయం వల్ల మాత్రమే ప్రేమించిన ప్రసాదు నుంచి నేను దూరంగా వచ్చేసింది.  నేను ఇంటి నుంచి వచ్చే నాటికి ప్రసాద్ హెచ్చైవి నెగెటివ్ చెల్లీ !

‘ చెల్లీ’ అని పిలవడానికి కారణముంది.  నిజానికి నా స్థానంలో నువ్వే వుండవలసిన దానివి.  నీ స్థానం మళ్ళీ నీకిప్పించడానికే దేవుడు నన్నిలా తప్పిస్తూ ఉండి ఉండ వచ్చు.  నువ్వు తిరిగి ప్రసాదు జీవితంలోకి ప్రవేశించాలి.  ఆ దేవుడికి తను చేసిన పొరపాటును సరిదిద్దుకొనే అవకాశం ఇవ్వు.

పండంటి బిడ్డను కని వంశాన్ని నిలబెడతానని మా అత్తమామలకు ఆశలు కల్పించాను.  ఆ కోరికను నిన్ను నెరవేర్చమని కోరుకోవడంలో నా స్వార్థం కూడా ఉంది చెల్లీ! ఈ ప్రపంచంలో నేను మా పోయిన అమ్మ తరువాత అంతగా ప్రేమించిన వ్యక్తి ప్రసాదే.  ప్రసాదుకు బిడ్డను కని ఇవ్వలేకపోతున్నా.  ఆ ప్రసాదునే బిడ్డగా చేసి నీ చేతుల్లో పెడుతున్నా.  మొదట్లో ప్రసాదు మెరాయించవచ్చుగానీ.  క్రమంగా మాలిమి అయ్యే మనస్తత్వం ప్రసాదుది.

నన్ను మించి ఎవరూ ఆ ఇంటిని ప్రేమించలేరని నా నమ్మకం.  నా నమ్మకాన్ని వమ్ము చేయమన్నదే నీకు నా విన్నపం చెల్లమ్మ!

లావణ్యకు నా ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేసి వచ్చాను.  మీ అమ్మగారికి ఇక కోడలుగా చేసుకోవడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు.  మా పిన్నీ,  తమ్ముడూ నీలో నన్ను చూసుకుంటానంటే అభ్యంతరం చెప్పవుగా !

నా స్థానాన్ని నీవు మాత్రమే భర్తీ చేయగలవన్న నా నమ్మకమే నీ కీ ఉత్తరం రాయడానికి కారణం.  వట్టి ఆశీర్వచనాలే కాదు…  నీ కాబోయ వివాహానికి ముందుగానే నా పెళ్ళి కానుకగా దీనితో నా తల్లి నాకిచ్చిన బంగారాన్ని జత చేస్తున్నాను.

ఇందులోని విషయాలు ఎవరెవరికి ఏ మోతాదులో చెపుతావో! ఆ విచక్షణ నీకే వదిలివేస్తున్నాను.

 

ఇట్లు

అక్కలాంటి

అర్చన

 

ఉత్తరాన్ని వెంట తెచ్చుకున్న బంగారం బాక్సులో పెట్టి కుమారి చిరునామా రాసి వున్న పెట్టెలో సర్ది, సీలు చేసి తయారు అయేసరికి సాయంత్రం ఐదు దాటింది.

కౌంటర్లోని మేనేజరుకు ఆ బాక్సు ఇచ్చి ఏదైనా కొరియర్ కు ఇవ్వమని చెప్పి బైటకు వచ్చింది.

ఆటో ఎక్కి భారతీ ట్రస్ట్ కని బైలుదేరింది

***

ఆకాశం ఉరుముతోంది.  ఉండి ఉండి మబ్బుకుండలు పగిలి వెలుతురు ధారగా భూమ్మీదకు కారిపోతోంది.

కడలూరు కడలి ఒడ్డు నిర్మానుష్యంగా ఉంది.  ప్రొద్దుట్నుంచి పోలీసులు చేసిన హెచ్చరికలూ,  గతంలో కడలూరు సముద్రం.  సృష్టించిన సునామీ చేదు అనుభవాలు.  తీరం నుంచి జనాన్ని దూరంగా ఉంచేసాయి.

ఎగసిపడే తాడిఎత్తు అలలతో మహోగ్రంగా ఉంది సాగర దృశ్యం.  అట్లాంటి దృశ్యం మామూలుగా అర్చనకూ భయం గొలిపేదే! కాని ఆపూట అదే అత్యంత ఆనందదాయకంగా ఉంది.  అర్చన చిన్నపిల్లయిపోయింది.

సముద్ర స్నానమంటే తండ్రి పడనిచ్చేవాడు కాదు.  ఎప్పటినుంచో సముద్రంలో దిగి స్నానం చేయాలని కోరిక !

అమ్మ సముద్రంలోనే మునిగి చనిపోయింది.  తనకప్పుడు పదమూడేళ్లు.  కార్తీక మాసం వనభోజనాలకని తమ వీధివాళ్ళందరూ బళ్ళు కట్టుకుని సముద్రపు ఒడ్డుకు పోయారు.

మగవాళ్ళందరూ చెట్లుక్రింద చతుర్ముఖ పారాయణం చేస్తుంటే,  ఆడవాళ్ళు వంట పనుల్లో మునిగి వున్నారు.  పెద్దవాళ్ళెవరూ అదువు చేసేవాళ్ళు లేరు.  అదే సందుగా పిల్లలు కొంతమంది సముద్రంలోకి దిగారు.  రఘు అప్పుడూ దుందుడుకు మనిషే.  ఎంత వద్దన్నా వినకుండా బడాయిలకి పోయి సముద్రం లోపలికి పోతున్నాడు పెద్ద పోజుగా.

తను వెనక నుంచి వద్దని కేకలు వేస్తూనే ఉంది. .  ఇంతలో ఏమయిందో ఏమో వాడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు! మధ్య మధ్య వాడి చేతులూ కాళ్లూ సముద్రపు అలలమీద లేస్తూ కనపడుతున్నాయి.  అంతే…  తనూ ఏదో పూనకం వచ్చినదానిలాగా వాడిని రక్షించడానికి సముద్రంలోకి పరుగెత్తింది.

తనకు ఈత రాదని ఆ క్షణంలో గుర్తుకు రాలేదు.  రఘుని అందుకో కలిగింది కానీ కాళ్లకు నేల తగలటం మానేసింది.  ఇద్దరం అలల మీద పడుతూ లేస్తూ సముద్రంలోకి వెళ్లిపోతున్నాం.  తనకు స్పృహ తప్పింది.

మళ్ళీ కళ్ళు తెరిపిడి పడేసరికి సముద్రపు ఒడ్డుమీద తనూ రఘూ తడిసిన బట్టలతో చుట్టూ మూగి వున్న జనం మధ్య అమ్మ  వంటికి తడిబట్టలు అంటుకొని! పక్కనే కూర్చుని నాన్న భోరుమని రోదిస్తున్నారు.

రఘు అన్నాడు తనతో ‘మనల్నిద్దర్నీ కాపాడపోయి మీ అమ్మ నీళ్లలో మునిగి చచ్చి పోయింది’ అని.

అప్పటి నుంచి తనకు సముద్రమంటే భయం,  కోపం.  కానీ అమ్మ అందులోనే ఉంది.  అమ్మను చూడాలంటే సముద్రంలోపలికి వెళ్ళక తప్పదు కదా!

‘అమ్మమ్మను చూపించడానికి నాతో పాటు నిన్నూ తీసుకు వెళుతున్నాను రా పూజా నేను తోడు లేకుండా ఈ నేల మీద నీవు హాయిగా ఉండలేవమ్మా ! మనం చచ్చి పోతేనే బతికిపోతాం.  బతికుంటే సిగ్గుతో చితికిపోతాం.  ఈ హెచ్చైవీకి కారణం విచ్చలవిడిగా తిరగడమే కారణమని అపోహ ఈ లోకానికి.  లేని ఎయిడ్స్ ఉన్నట్లు సమాజం చిన్నచూపు చూస్తుంటే మౌనంగా అవమానపడకం మనకవసరమా? తప్పు చేస్తేనే హెచ్చైవీ వచ్చినట్లు కాదు.  హెచ్చైవీ వచ్చిన వాళ్లంతా తప్పు చేసిన వాళ్లు కాదు.  ఈ అవగాహన మన సమాజానికి వచ్చిన రోజున మళ్ళీ పుడదాం.  మిగిలిపోయిన ఆనందాలన్నీ అభవించుదాం.  అందాకా. .  ఇదిగో!  అమ్మమ్మ! ఈ అమ్మమ్మ ఒడిలోనే హాయిగా సేదదీరుదాం.  పదా!’ అంటూ ఒక చేయి పొట్టమీద వేసుకొని,  మరో చేత్తో ముక్కు గట్టిగా మూసుకొని ముందు నుంచీ విరుచుకు పడేందుకు నురగలు కక్కుతో మీదకొచ్చే అలల రాక్షసికి ఎదురు వెళ్లింది అర్చన.

***

వెనక నుంచీ వచ్చే మనుషుల సందడి క్రమంగా పెద్దదవడం గమనించలేదు అచ్చన.

స్పృహలోకి వచ్చేసరికి మొహం మీద మొహం పెట్టి చూస్తున్నది అమ్మ !

‘హౌ ఆర్ యూ ? ‘

అమృతంలాగా ఉంది అమ్మ గొంతు.  ఆ అన్న అమ్మ సిద్దమ్మాళ్ అని గ్రహించ  డానికి అట్టే సమయం పట్టింది కాదు ఆర్చనకు.

సిద్దమ్మాళ్ అంటున్నారు ‘నీవు ఇచ్చిన సొమ్ముకు రసీదు  ముట్టినట్లు సంతకం చేసి అందుకొన్నదాకా పూజ కోసం ఈ అర్చన ఈ పృథివీ దేవాలయంలో సేవికగా ఉండాల్సిందే ! సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారమయితే భూమ్మీద మనిషనే వాడే ఉండడు తల్లీ! నీకే కాదు నీ కడుపులోని పూజకు కూడా ఈ విషయం అర్థమవాలి.  ఒక విరాళాలతోనే ఏ బ్రతుకు కుసుమమూ వికసించదు! తిరిగి చిగురు తొడిగి సుగంధ పరిమళాలు పరిసరాలకు పంచాలంటే విసుగు విరామాలెరుగని సాగు సాయం కావాలి.  అందరం ఆనందంగా జీవించే ఆ సుందర భవన నిర్మాణానికి నీ వంటి మంచి మనుషులూ కూలీలుగా రాళ్లెత్తక తప్పదు తల్లీ! ‘

‘నాకూ నా తల్లి సముద్రంలో లేదు.  అంతకు మించిన అగాధం సిద్ధమ్మాళ్ హృదయంలో ఉంది’ అనిపించింది అర్చనకు.  ఆ క్షణంలో తను చేయబోయిన పిరికిపనికి సిగ్గూ అనిపించింది.

సిద్దమ్మాళ్ అందించిన చేతిని ఆర్తిగా అంది పుచ్చుకొని కొత్త శక్తిని కూడ దీసుకుంటూ లేచి కూర్చున్న అర్చనతో అపాలజిటిక్ గా అన్నాడు లాడ్జ్ మేనేజర్ ‘మేడమ్ ! మీరిచ్చిన ఆ కొరియర్ పంపించలేదు.  కానీ,  దాని మీద కనిపించిన ఫోన్ నెంబరుతో మాట్లాడాను.  మా అనుమానమే నిజం అయింది.  నేను చెప్పినట్లు ఈ రూం బాయ్ మిమ్మల్ని ఆ క్షణం నుంచి అనుసరించబట్టే. .  మిమ్మల్ని ఇప్పుడు ఇట్లా సేవ్ చేయగలిగాం.  సారీ!  పోలీస్ కేసయి లాడ్జ్ కు చెడ్డపేరు వస్తుందన్న భయంతో ఈ పని చేయాల్సొచ్చింది’  అన్నాడు అక్కడే తడిసిన బట్టలలో గజగజా వణుకుతూ నిలబడున్న రూమ్ బాయ్ ని చూపిస్తూ!

 

( అయిపోయింది )

 

 

 

 

 

1 thought on “అర్చన కనపడుటలేదు – 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *