May 26, 2024

జీవనవేదం – 9

రచన: స్వాతీ శ్రీపాద

 

ఇంట్లో మిగిలినది సీత, రవికిరణ్.  ఒక గది మిత్రుడిదే.  తనగదిలో తను ఉండటం ఎప్పుడైనా తనకు కావలసినది వండుకోడం తప్ప పెద్దగా వారిని డిస్టర్బ్ చేసే వాడు కాదు.

సీత మరింత బిజీగా మారిపోయింది.  రవికిరణ్ ఒక్కడూ ఉంటాడని వంటావార్పులకు వెళ్ళడం తగ్గించుకుని ఇంట్లోనే వండి సరఫరా చేసేది.  కదిలినా మెదిలినా రవికిరణ్ ను కంటికి రెప్పలానే చూసుకుంది.  వారానికి రెండు రోజులు సంగీతం నేర్పడానికి వెళ్ళేది.  ఏ పని చేస్తున్నా ఏదో ఒక కూని రాగం అమె నోట్లో నానుతూనే ఉండేది.

ఎవరింట్లోనైనా పూజలూ పునస్కారాలూ ఉంటే సరేసరి, ఆ ఇంట్లో సమస్తం సీత పర్యవేక్షణలోనే జరిగేవి.  మూడు నెలలకు పుర్తిగా కుదురుకోగలిగాడు రవికిరణ్.

కొంచం ఫిజికల్ ఎక్సర సైజ్ మినహా మిగతా మందుల అవసరం లేకపోయింది.  నెమ్మదిగా వేసవి రాడంతో నాలుగైదు మొక్కలు కూడా తెచ్చి పెట్టుకుంది సీత.  అడపాదడపా అత్తతోనూ, ఇంట్లో వాళ్లతో మాట్లాడి వాళ్ళకు ధైర్యం ఇచ్చేది.

ఆరోజు ఉదయమే ఎందుకో రవీంద్ర గుర్తుకు వచ్చాడు, అతని పాట గుర్తుకు వచ్చింది.  ఇద్దరూ పంచుకున్న సమయం, సంభాషణలూ గుర్తుకు వచ్చాయి.  మమతకు ఫోన్ చేసింది.

” సీతా ఎలా ఉన్నావే?” అంటూ సంబరంగా పలకరించింది.

“నేనేదో నీకు దారి చూపించానంటావు కాని సీతా, నువ్వే పది మందికి మార్గదర్శివి.  దేశం కాని దేశంలో నెగ్గుకు రాడం మాటలా? అన్నట్టు ఈ మధ్య ఒకసారి రవీంద్రను కలిసాను.  నీ గురించి అడిగితే చెప్పా.  సీతకు నా శుభకామనలు చెప్పండి అన్నాడు.  ఎంతో సంస్కారం ఉన్న మనిషి అనిపించింది.

నేనే లొడలొడా వాగుతున్నాను కాను నువ్వొక్క మాట చెప్పవు కదా, నీ చదువు సంగతేమిటీ?” అని అడిగితే కాని చదువు మాటే గుర్త్తుకు రాలేదు.

“ఎక్కడ మమతా, ఇప్పటికి కదా బావ కోలుకున్నది, ఇంతవరకూ ఆ మాటే గుర్తులేదు, చూడాలి.  ప్రైవేట్ గానైనా చదువుకోవాలి.  ” అంటూ తన యోగక్షేమాలు కాలక్షేపం, సంపాదన అన్నింటి గురించీ మాట్లాడింది.

” ఒకసారి ప్రిన్సిపల్ గారిని కనుక్కో మమతా, ఇక్కడ చదువుకుని వచ్చి పరీక్షలు రాయవచ్చేమో, మూడేళ్ళ వీ ఒకసారి రాయ వచ్చునా అని కూడా అడుగు” అంటు ముగించింది.

వచ్చే సోమ వారం నుండీ రవికిరణ్ ఆఫీస్ కి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు.  అతను వెళ్తే ఇంట్లో తను ఒంటరిగానే ఉండాలి.  చదువుకుందుకు బోలెడు సమయమూ దొరుకుతుంది.  ఆ మాట అతనితో ఎలా చెప్పాలా అని చూస్తుంటే అతనే పిలిచాడు,

“సీతా రేపు పొద్దున గుడికి వెళ్ళి వద్దాం” అంటూ.

“అవును బావా, నేనే చెబ్దామనుకున్నా ఒకసారి గుడికి వెళ్ళి వచ్చాక ఆఫీస్ కి వెళ్ళడం మొదలుపెట్టమని.  ఈ రోజున ఇలా ఉన్నాం అంటే ఆ దేవుడి అనుగ్రహమే కదా.

అన్నట్టు మమతతో మాట్లాడాను, కాలేజీకి వెళ్ళకుండా మూడేళ్ళ పరీక్షలూ ఒకే సారి రాయనిస్తారే మో కనుక్కోమని, అలాగైతే ఒకసారి వెళ్ళి రాస్తే సరిపోతుంది కదా?”

” మూడేళ్ళు కాదు గాని రెండో ఏడాది లాంగ్వేజెస్ మూడో ఏడాది మిగతా సబ్జెక్ట్ లు రాయాలి అనుకుంటా, కనుక్కో చూద్దాం” అన్నాడు.

మర్నాడు ఇద్దరూ గుడికి వెళ్ళారు.  అక్కడ సీత రెండు మూడు కీర్తనలు పాడి వినిపించింది.  అక్కడే గుళ్ళో ప్రసాదం తీసుకుని భోజనం కూడా అయిందనిపించి చాలా సేఫు బయటే గడిపి ఆరున్నరకు ఇల్లు చేరుకున్నారు.

వీకెండ్ కావడంతో వసంత్ మిత్రుల గదికి వెళ్ళాడు.

కాఫీ తాగి అలసటగా బెడ్ మీద వాలింది సీత.  రవికిరణ్ మంచం అంచున కూర్చోగానే చటుక్కున లేవబోయింది.

“పడుకో పడుకో, అలసిపోయావా,” అంటూ ఆమె పక్కన చోటు చేసుకుని వాలుతూ,

” సీతా నిన్ను చాలా బాధపెట్టాను కదూ అందుకే భగవంతుడు నాకిలాటి శిక్ష విధించాడు” చెయ్యి చాపి చీర పక్కకు తొలగిన సీత పొట్ట మీద చేయి వేసాడు.

“అదే మాట బావా?”

“లేదు సీతా నీకు జరిగినది చెప్పాలి,” అంటూ సుమ బాలతో పరిచయం మొదలు తనలో వచ్చిన మార్పు చివరకు ట్రిప్ కి వెళ్ళేముందు కొన్న ఉంగరాలతో సహా చెప్పేసి, “నిజానికి ఆ సమయం వస్తే ఏం చేసేవాడినో తెలీదు కాని మన పెళ్ళి గురించి అబద్ధం మాత్రం చెప్పే వాడిని కాదు.  నీ గురించి ఇలా దాచి నందుకే నాకు పెద్ద శిక్ష విధించాడు.  ఆరునెలలు దాన్ని అనుభవించేలా చేసాడు.  మళ్ళీ నీ వల్లే కోలుకునేలా చేసాడు” ఆమె గుండెల్లో మొహం దాచుకున్నాడు.

సీత ఒక్క క్షణం స్థాణువయింది.  వణికిపోయింది.  రవీంద్రతో పరిచయం చెప్పేద్దామా అనుకుంది.  కాని, ఉహూ, ఒక స్త్రీ అమ్మలా అన్నీ మరచిపోయి, లేదా పోయినట్టు నటించి ఆదరించగలదు..  పురుషుడు మాత్రం ఏ సందు దొరికినా చిన్న తప్పిదాన్నైనా వేలెత్తి చూపి ఎత్తిపొడుస్తాడు.

అయినా రవీంద్రతో పరిచయం పాటల ప్రయాణమే కదా.

ఆలోచించుకుంటే అంతా అయోమయమే అనిపించింది.  తెలిసీ తెలియని వయసునుండి బావ మీద ప్రేమ పెంచుకోడం, అతన్నే పెళ్ళి చేసుకుని కూడా నాలుగు రోజులు దూరంగా ఉండగానే మనసు అలా చెదిరిపోతుందా?

అందుకే మౌనంగా ఉండిపోయింది.

సున్నితంగానే అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని, ” చదువు పూర్తవనీ బావా, ఈ లోగా నీ ఆరోగ్యం కూడా కుదుటపడాలి” అని మాత్రం అంది.

నెలరోజుల్లో ఆఫీస్ పనికి కూడా మళ్ళీ అలవాటుపడిపోయాడురవికిరణ్.

అతనికన్నా క్షణం తీరిక లేకుండా ఉంటుంది సీత.  చదువుకుంటూనే ఆన్ లైన్ కంప్యూటర్ కోర్స్ చెయ్యడం దాని వల్ల మరింత శ్రమ పడవలసి రాడం, అయితే వీలైనప్పుడల్లా రవికిరణ్ సీతకు అన్ని విధాలా సాయపడేవాడు.  చివరికి ఆమె కేటరింగ్ పనిలో కూడా.

ఒకపక్క సంగీతం క్లాస్ లు, కేటరింగ్ పనులు, చదువు ఒక్క క్షణం ఆలోచించుకునే సమయమే దొరకలేదు సీతకు.

దాదాపు ఏడాదిన్నర తరువాత సీత పరీక్షలకోసం ఇద్దరూ ఇండియా వచ్చారు.  డిగ్రీ పేపర్లన్నీ ఒకే సారి రాసింది సీత.

చివరి పరీక్ష ముగిసాక మమత తో మాట్లాడుతూ జరిగిన సంగతులు నెమరు వేసుకుంటుంటే డోర్ బెల్ రింగైంది.

వచ్చినది రవీంద్ర.

” మర్చిపోయా సీతా, రవీంద్రను రమ్మని నేనే ఫోన్ చేసాను.  ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి.  కాఫీ తెస్తాను” అంటూ వాళ్ళను వదిలి వెళ్ళింది మమత.

” ఎలా ఉన్నారు?” పలకరించాడు రవీంద్ర.

సీత నవ్వింది.  నవ్వి ఊరుకోలేదు అమెరికాలో పిల్లలకు పాటలు నేర్పడం, గుళ్ళో పాడటం అన్నీ ఎంతో ఉత్సాహంగా చెప్పింది.

” మీకు తెలుసా, రవి ఎంత సాంప్రదాయ కుటుంబంలో వాడైనా దేనికీ వద్దనడు” అనేసింది.

“సంతోషం సీతగారూ మీరలా కలకాలం ఆనందంగా పాడుతూ ఉండటం నిజంగా నాకు సంతోషమే”

చిత్రంగా అతని వైపు చూసి,

” మీకు ముందు ఈ విషయం చెప్పలేదని కోపంగా లేదా?” అని అడిగింది

“లేదు.  మన మధ్య అనుబంధం పాట, అది ఎప్పుడూ ఉంటుంది.  మీపాటాంటే ఇష్టం, మీస్వరం అంటే ఇష్టం అయినంత మాత్రాన ఆస్వరమూ మనిషీ నా స్వంతం అయిపోవాలని దురాశకు పోను.  ఎప్పటికీ మీరు ఆత్మీయులే”

చటుక్కున అతని చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని నొక్కి వదిలింది సీత.

ఆ సాయంత్రం పాటలతో నవ్వులతో ఆహ్లాదంగా గడిచిపోయింది.  సెలవు తీసుకునే ముందు రవీంద్ర ఫోన్ నంబర్ అడిగి తీసుకుంది.

****

కాలం ఎక్కడా ఎవరికోసము ఆగదు.

ఒడిదుడుకులతో ఎత్తుపల్లాలతో ఏళ్ళకేళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటుంది.

అవును.  ఎవరి పని వారిదే.

ఇవ్వాళ వెనక్కు తిరిగి చూసుకుంటే –

 

సశేషం

 

1 thought on “జీవనవేదం – 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *