June 24, 2024

పరవశానికి పాత(ర) కథలు – ఊరకే రాకోయి అతిధీ!

రచన: డా. వివేకానందమూర్తి

 

రోజూలాగే నేను రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో యిల్లు చేరాను. రోజూ ఆ టైముకి పిల్లల్ని పడుకోబెట్టి, పెద్ద లైట్లన్నీ ఆర్పేసి మా శ్రీమతి నా కోసం ఎదురుచూస్తూ వుంటుంది. కానీ ఇవాళ మాత్రం ముందుగదిలో పెద్దలైటు ఇంకా వెలుగుతోంది. తలుపులు కూడా తెరచివున్నాయి.

ఎవరా! అని ఆలోచిస్తూ గదిలోకి ప్రవేశించాను. గదిలో ఒక పక్క మంచం మిద దాదాపు నలభై అయిదేళ్ళ ఆసామి ఒకాయన గురక పెట్టి గాఢంగా నిద్రోతున్నాడు. నేను హైదరాబాద్లో వుంటూ వుండటం వల్ల, నేనుండే అద్దె యిల్లు ముఖ్యమైన ఆఫీసులకు, రైల్వే స్టేషనుకు, బస్టాండు సాధ్య మైనంత దగ్గరలో వుండడం చేత, మా ఇంటికి తరచుగా నా తరపునో, మా ఆవిడ తరపునో అతిథులు వచ్చి పోతూనే వుంటారు. ఇప్పుడు నా గదిలో నిద్రపోయే వ్యక్తి ఆ బాపతే అయ్యుంటాడని వూహించాను నేను.

పిల్లలు లోపలిగదిలో నిద్రపోయినట్టున్నారు. బట్టలు మార్చుకుని, లుంగీ ధరించి మా శ్రీమతిని పిలిచాను. వచ్చింది.

“మీ చుట్టమా!” అనడిగాను.

“ష్! నెమ్మదిగా మాట్లాడండి. ఇప్పుడే పడుకున్నాడు. లేస్తాడు” అంది.

“ఎవరు?”

“నాకేం తెలుసు? మీకు దగ్గర మనిషేనట. మావాళ్ళకంటే మీ వాళ్ళ రద్దీ ఎక్కువైందని అంటానని ఏమీ తెలియనట్టు ఎవరూ అని అడుగుతున్నారా?”

“ఇదెక్కడి గోలే! నాకివాళ నా వాళ్లెవరూ వస్తానని చెప్పలేదు.”

“బలేవారే! అతిథి అన్నవాడు చెప్పి వస్తాడేవిటి? తల పక్కకి తిప్పి పడుకొన్నాడు కాబట్టి గుర్తుపట్టలేకపోతున్నారు. రేపు లేచాక మీకే తెలుస్తుంది. ముందు భోజనానికి లేవండి” అని వంటింట్లోకి నడిచింది.

అన్నం తింటూ అనుమానంగా మళ్లీ అడిగాను. “కొంపదీసి దొంగ వెధవ కాదుగదా?”

“నాకామాత్రం వాలకం తెలుసులెండి.”

“ఈ రోజుల్లో వాలకాన్ని నమ్మడానికి లేదు.”

“సర్లెండి చాదస్తం.”

“ఇంతకీ ఎందుకొచ్చాడో చెప్పాడా.”

“ఆఁ! ఏదో స్పాట్ వేల్యుయేషన్స్.”

“లెక్చరరన్నమాట. బేటాలు మిగుల్చుకోడానికిదో పద్దతి కనిపెట్టాడులా వుంది. అయినా ఈ వూళ్లో పనిలేనిదెవడికి? వెధవ ట్రాఫిక్ ప్రాణం తీస్తున్నారు.”

“నెమ్మదిగా మాట్లాడండి”

ఇంకేం నెమ్మది! ఉన్నది మూడు గదులు. అందులో ఒకటి కిచెన్. ఒకటి పిల్లలకి, ఒకటి మనకి. చివరికి మన గది

గెస్టు రూమై పోయింది. తాళికట్టిన పెళ్లాన్ని దగ్గరగా పలకరించడానికి నెలకి ఒక్కరోజైనా కుదిరి చావడం లేదు.”

“ఏమిటా మాటలు? అంత ప్రేమ వొలికిపోతూంటే ఏ హెటల్లో అన్నా రూము తీసుకోకూడదూ?

“అవును మన సంపాదన గెస్టు ఖర్చులు పోను బాగా ఆదా అవుతోందని. అయినా – ఆ, భార్యాభర్తలు హెటల్ కి వెడితే పోలీసులు నన్ను నిలువుదోపిడి చేసి నిన్నట్టుకుపోతారు.”

“అదేం చోద్యం ?”

“సంసారులకి పోలీసు రక్షణ అంటే అదే మరి – అయినా శుభ్రంగా యిల్లుంచుకుని నాకు హోటళ్ళ వెంట తిరిగే కర్మేం? రేపు లేవగానే వాణ్ణి బైటికి పొమ్మను.”

“నేనెందుకంటాను? మావాడేనట, మీరే చెప్పండి!”

“సరే, మజ్జిగ పొయ్యి.”

భోజనం పూర్తయింది. నిద్రాదేవి ఆవహిస్తోంది. నడుం వాల్చబోయాను. శ్రీమతి వారించింది. “మీ పడక వీధి గదిలో?”

“అదేవిటి? – వాడి పక్కనా?”

“లేకపోతే! పిల్లలు ఎదుగుతున్నారు. వారు పొద్దుటే లేవరు. అంచేత ఆ గదిలోనే పక్కేశాను, వెళ్ళిపడుకోండి” అని ఖండితంగా చెప్పేసింది. ,

చేసేదిలేక వీధిగదిలో ఆ కొత్త శాల్తీ పక్క నున్న మంచం మీద నడుం వాల్చాను.

నా పక్క మంచం మీద పడుకున్న గెస్టు ఫుల్ వాల్యూమ్ లో గురక పెడు తున్నాడు. నాకు నిద్ర మీద ఆశ క్రమంగా సన్నగిల్లిపో నారంభించింది. లోగడ నేను చాలా రకాల గురకలు విన్నాను కానీ యింత దారుణమైన గురక ఎప్పుడూ వినలేదు. అడవిలో సింహాన్ని పట్టుకుని బోనులో కెక్కిస్తే బైటికి రాలేక కోపంతో గింజుకుంటూ అరచినట్లుంది అతడి గురక, నిద్ర తేలిపోయి, నాకు వొళ్ళు మండిపోతోంది. లేపేద్దామా అంటే నాకు తెలిసిన పెద్ద మనిషేమోనన్న అనుమానం. ఎలాగ? వరండాలో నా మోటర్ సైకిలకున్న సైలెన్సర్ పీకేసి అతని నోటికి తగిలించేస్తే! సాధ్యం కాదు. పోనీ నోట్లో గుడ్డలు కుక్కేస్తే! లేచి కూర్చొని అరుస్తాడు. చుట్టుపక్కల జనం అంతా పోగవుతారు. న్యూసెన్స్! ఇదెక్కడి శవజాగరణగా బాబూ అనుకుంటూ అలగే పడుకున్నాను. నాకు నిద్రపట్టి సరిగ్గా గంట కూడా కాలేదేమో ఏదో అలారం పెట్టినట్టు మెలకువొచ్చింది. చూస్తే గదిమూలగా బెడ్ లైట్ వెలుగులో ఒక ఆకారం కూర్చుని మంత్రాలు చదువుతోంది. భయపడి అరవబోయాను. కానీ ఆ ఆకారం రాత్రి వచ్చిన అతిథేనని తెలుసుకున్నాక ఆ ప్రయత్నం మానుకున్నాను. తెల్లారే దాకా భూతవైద్యుడిలా అతగాడు జపం చేస్తూనే వున్నాడు.

ఉదయాన్నే నాక్కాస్త నిద్ర పట్టింది. అంతలోనే ఎవరో నన్ను కుదిపి లేపేశారు. నేను మా ఆవిడేమో ననుకొని కళ్లు తెరవకుండానే విసుగ్గా ‘ఊఁ’ అన్నాను.

“ఊఁ ఏమిటయ్యా! లేలే! బారెడు పొద్దెక్కింది?” అని కసురుకోవడం వినబడగానే కళ్ళు తెరిచాను. ఇంకెవరు? – నిన్నటి శాల్తీనే. శుచిగా స్నానం చేసి తయారైపోయాడు. ఇప్పుడు స్ఫుటంగా తెలుస్తున్నాడు. ఇదివరకెక్కడా ఆయన్ని చూచిన గుర్తు నాకు లేదు. కళ్లు నులుముకుంటూ లేచాను.

“ఇదుగో అబ్బాయ్! ఈ వయస్సులో ఇంత నిద్ర పనికి రాదు. లేచి ముఖం కడుక్కో” అన్నాడు.

నాకు వొళ్లు మండిపోయింది. నిన్న రాత్రి గురకతో నానిద్రంతా పాడుచేసింది చాలక పైగా యిదొకటా? లేచి కూర్చుని సీరియస్ గా అడిగాను.

“ఇంతకీ మీరెవరు?”

“సర్లే. నేనెవరో తెలిస్తే – నేనుండగా యింతసేపు నిద్రోతావా! నా పేరు శరభలింగం. కొత్త పేటలో మీ అన్నయ్య పనిచేసే కాలేజీలోనే నేనూ లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. మీ అన్నయ్య నీ గురించి నేనిక్కడికి బైల్దేరేటప్పుడే అంతా చెప్పాడు. నేను స్పాట్ వేల్యుయేషన్ కి వచ్చాను. వారం రోజులుంటాను. అన్ని విషయాలూ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముందు పళ్లు తోముకుని కాఫీ తాగు. నేనలా వీధిలోకి వెళ్లిస్తాను” అని చకచకా చెప్పేసి, నేను షాకులోంచి తేరుకునేలోగానే గుమ్మం దాటేశాడు. వారం రోజులు శరభలింగం ఉనికిని, ఉరుములాంటి అతడి గురకని ఊహించుకుంటే నాకు గుండె ఆగినంత పనయింది. ఏమి చెయ్యలేక వీడు త్వరగా నాకొంప వదిలేస్తే కొబ్బరికాయ కొడతానని ఆంజనేయస్వామికి మొక్కుకున్నాను.

స్నానానికి వెళుతూంటే మా ఆవిడ నన్ను చూసి కిసుక్కున నవ్వింది. నాకు కోపం మరీ ఎక్కువైపోయింది. ఏమి అనలేక మా ఆవిడని కొరకొరా చూశాను.

“నన్నెందుకిలా చూస్తారు?” అని చిలిపిగా చూసి,” సాయంత్రం త్వరగానే వచ్చేస్తాట్టా” అంది సన్నగా నవ్వుతూ.

ఆఫీసుకి వెళ్ళాక, నాకు పని మీదికి ధ్యాస పోలేదు. శరభలింగం నా బుర్రలో చేరి పురుగులా దొలిచేస్తున్నాడు.

సాయంత్రం యింటికి రాగానే వీధిగదిలో వాలుకుర్చీలో కూర్చుని చిరునవ్వుతో స్వాగతం పలికాడు శరభలింగం. “ఆఫీసైపోయిందేవిటి?” అంటూ

“ఊఁ” అన్నాను ముభావంగా,

“అమ్మాయ్! అబ్బాయ్ వచ్చాడు కాఫీ ఇయ్యి!” అన్నాడు. అక్కడికేదో వాడింటికి నే వచ్చినట్టు.

మళ్ళీ “ముఖం కడుక్కురావోయ్! అలా షికారెళ్ళి వద్దాం” అన్నాడు.

“టైరయిపోయాను. లాభం లేదు.” అన్నాను.

“అలసట మర్చిపోడానికేనయ్యా షికారు నడు నడు” అన్నాడు.

నా గుండెల్లో రాయిపడింది. వీడు వెళ్ళేలోపులో యిలా వరుసగా నా గుండె నిండా రాళ్లు పడేసి, దాన్ని కాస్తా కడుపులోకంటా లాగేస్తాడులా వుంది.

ముఖం కడుక్కువచ్చాను. రేడియోలో ఘంటసాల పాట వస్తోంది.

“తయారవు. వెళ్తాం” అన్నాడు శరభలింగం.

“పాటలయ్యాక వెళ్లాం” అన్నా పోస్టపోన్ చేద్దామని.

శరభలింగం తటాలున లేచి రేడియో కట్టేశాడు. నాకసలే ఘంటసాల పాటలంటే ఇష్టం. పాటకట్టే సరికి నాకు కోపం వచ్చి మళ్ళీ రేడియో ఆన్ చేసి, “అదేవిటి రేడియో కట్టేశారు? ఘంటసాల పాట” అన్నాను.

“ఆఁ – ఏవిటయ్యా? ఘంటసాల ఘంటసాల అంటారు, ఏవుందని? ఏదో భగవంతుడు కాస్త వాయిసిచ్చాడంతే”

అన్నాడు. ఆ వాయిస్ చాలదూ.

మళ్ళీ అన్నాడు. “ఆ మాటకొస్తే అది వరకు అంతా యస్వీ రంగారావంటే పడి చచ్చేవారు. ఏవుందని? ఏదో కాస్త నాచురల్ గా నటిస్తాడంతే” అన్నాడు. అది చాలదూ?

ఈలోగా మా శ్రీమతి ‘ఏవండీ, ఏవండీ! గ్యాస్ అయిపోయిందండీ’ అని గుర్తు చేసింది.

శరభలింగం మళ్ళా తడుముకున్నాడు. “ఏమిటర్రా! గ్యాస్, గ్యాస్ అంటారు గానీ ఏవుందని విశేషం అందులో? వీలయితే చచ్చే ప్రమాదం. సుబ్బరంగా పొయ్యి బెస్ట్” అన్నాడు.

శరభలింగం ధోరణి చూస్తే తను ఎవర్నీ ఏ విషయాన్ని కూడా ఆమోదించేలా లేడు.

“నడు సినిమాకి” అన్నాడు. ఇందాక షికారన్నవాడు సినిమా దాకా వచ్చాడు.

“ఏ వుందండి వెధవ సినిమాల్లో? అన్నీ బోరు” అన్నాను మాటకి మాట విసరాలని.

“భలేవాడివే, ఆ మాట అనడానికేనా ఓసారి చూసి రావాలా? – నడు!” అని మళ్ళీ పడేశాడు నన్ను. ఇక లాభం లేదనుకొని బైల్దేరాను.

వెళ్ళేముందు “ఒరే పిల్లలు వీధిలోకి వెళ్ళి ఆడుకోకండి! కార్లు, రిక్షాలు – లోపలే ఆడుకోండి”అన్నాడు నా పిల్లల్ని తనే కన్నట్టు.

సినిమాహాలు దగ్గరికి చేరేలోపలే శరభలింగం చిరుతిళ్ళ కోసం దాదాపు పది రూపాయల దాకా ఖర్చయింది నాకు. తీరా థియేటర్లో కూర్చొన్నాక వెనక వాళ్ళని చూడనివ్వడు. ముందు కూర్చున్నవాళ్ళని విననివ్వడు. వసపిట్టలా ఒకటే వాగుడు.

ఆట వదిలాక ఎలాగో ఇంటికి వచ్చి పడ్డాం.

“వెధవసినిమా – టైము వేస్ట్, డబ్బు వేస్ట్ – అమ్మాయ్ అన్నం వడ్డించు” అన్నాడు. తనేదో నా బలవంతం మీద నన్ను సినిమాకి లాక్కెళ్ళినట్లు,

భోజనాలయ్యాయి.

“ఏం కొంపయ్యా? మార్చిపారెయ్. మరీ యిరుకు” అన్నాడు. నాకు చిర్రెత్తుకొస్తోంది. కానీ ఏమి చేయలేకపోతున్నాను. “వీడి మొహంమ్మండ అన్నీ కావాలి, అన్నీ అనుభవిస్తాడు. దేన్నీ ఓ.కే. చెయ్యడు’ అనుకున్నాను.

రాత్రయింది. మళ్ళీ గురక మొదలు.

రెండ్రోజులయ్యేసరికి శరభలింగం ప్రవర్తన మరీ బాధాకరంగా తయారైంది నాకు. ఇక మూడోరోజు నుండి ‘అమ్మాయ్ కాఫీ పెట్టు’- ‘అమ్మాయ్ నీళ్ళు పెట్టు’ – ‘అమ్మాయ్ పక్కలు వెయ్యి’ – ‘ఏవోయ్ ఏమిటీ ఆలస్యం’- ‘ఆ గళ్ళ            లుంగీ ఏవిటి? మంచీ, మర్యాద ఉండక్కర్లా’ – ‘ఒరేయ్ పిల్లలూ – ఇక్కడ ఈ గ్లాసులు తీసేయండి’ – యిలా మొదలెట్టాడు,

క్రమంగా నా యిల్లు శరభలింగం యిల్లయిపోయినట్టు నేనే వాడి గెస్టునయినట్టు ఫీలింగు తెచ్చేశాడు. ఈ ధోరణిలో పడి నాకు తెలియకుండానే నేను నా యిల్లు వదిలేసి ఎక్కడికేనా వెళ్ళిపోతానేమోనని భయం వేసి, అర్జంటుగా మా కొత్తపేట అన్నయ్యకి ఉత్తరం రాశాను.

అసలు ఈ శరభలింగం ఎవడు? నీ కోలెక్చరర్ని అంటున్నాడు. నిజమేనా? అయితే వీణ్ణి నా మీదికి ఎందుకు

తోలావు? నేను నిన్ను అన్నగా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నానే, నీకెప్పుడూ ఎలాంటి హానీ తల పెట్టలేదే, – ఎందుకిలా చేశావ్? ఈ గురక భూతంగాణ్ణి ఎందుకు నా కొంప మీదికి వదిలావ్! నా పచ్చని కాపురంలో ఎందుకీ గెస్ట్ చిచ్చు పెట్టావ్? అర్జంటుగా జవాబు వ్రాయి” అని రాసి పడేశాను.

రెండ్రోజుల్లో రిప్లై వచ్చింది.

– శరభలింగం నా కోలెక్చరర్ కావడం నిజమే. అయతే వాడికిప్పుడు స్పాట్ వేల్యుయేషన్ లేదు. అక్కడి కెందుకొచ్చాడో తెలీదు. శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా నేను వాణ్ణి మీ యింటి మీదకు తోలలేదు సరికదా, వాడు నీ ఎడ్రసు అడిగితే నీ దగ్గర దిగవద్దని మరీ మరీ చెప్పాను. వాడేం పేదవాడు కాదు. వాడికి ఇరవై ఎకరాల మాగాణి వుంది. వాడి భార్యకి మంచి వుద్యోగం వుంది. అయితే వాడు పొదుపు రాక్షసుడు. తన పొదుపు కోసం ఏమైనా చేస్తాడు. వెంటనే వాణ్ణి పొమ్మనక పోతే, నిన్నే పొమ్మంటాడు – జాగర్త అని రాశాడు మా అన్నయ్య.

నాకు ఏదో జ్ఞానోదయం అయినట్టనిపించింది. సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేశాను. శరభలింగాన్ని ‘వెళ్ళి పొమ్మ’నడానికి తగిన ధైర్యాన్ని పుంజుకున్నాను.

కొంత సేపటికి శరభలింగం వచ్చాడు. నేను మాట్లాడబోయేంతలో తనే మాట్లాడాడు.

“నేనిక వస్తానయ్యా! యిల్లు జాగర్తగా చూసుకో, వస్తానమ్మాయ్!” అని సంచీ చేతికి తీసుకుని మౌనంగా కదిలాడు. నాకర్థం కాలేదు.

‘వెళ్తున్నారా?’ అని మాత్రం అనగలిగాను. ఏమైతేనేం వారంరోజుల బాధ తప్పింది. హాయిగా వూపిరి తీసుకున్నాను.

మర్నాడు శనివారం. సికింద్రాబాదులో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరున్న ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అనుకున్న ప్రకారం కృతజ్ఞతా పూర్వకంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టేశాను.

తిరిగి వస్తుంటే మళ్ళీ శరభలింగం కనిపించాడు. ఆశ్చర్యపోయాను.

కండువాతో కళ్ళాత్తుకుంటూ నావైపే నడుస్తున్నాడు. చూస్తే జాలేసింది. పలకరించాను ‘శరభలింగంగారూ!” అని.

శరభలింగం తలెత్తి చూశాడు. కాస్త తడబడ్డాడు. కానీ అతడి దుఃఖం ఆ తడబాటును చాటు చేసింది. అతడు అబద్ధమాడగలిగే స్థితిలో కూడా లేదనిపించింది.

“ఏం జరిగింది?” అడిగాను.

“అయిపోయింది. అంతా అయిపోయింది బాబూ! నా భార్యకి ప్రాణం మీదికొస్తే మా వూళ్ళో లాభం లేదు, ఇక్కడ పెద్దాసుపత్రికి తీసుకెళ్ళమన్నారు. తీసుకొచ్చి యిక్కడ చేర్పించాను. వారం రోజులైంది. ఇవాళ ఉదయమే పోయింది. డాక్టరుగారిని కలిసిపోదామని వచ్చాను.” అన్నాడు శరభలింగం చంటిపిల్లాడిలా ఏడుస్తూ, నా గుండె రెపరెపలాడింది.

“ఇంటికి పోదాం రండి” అన్నాను పొడి పెదవులో, ఆయన చేతిసంచి నా చేతికి తీసుకుంటూ.

 

******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *