February 27, 2024

రాతి మనసు

 

రచన: యశస్వి జవ్వాది

 

చేతిలో ఉన్న సారా ప్యాకెట్‌ను మూలగా కొరికి నోట్లో పెట్టుకుని అరచేతితో గట్టిగా నొక్కాడు రంగడు.  నిషా మత్తు గొంతు నుండి బుర్రకెక్కగానే గుడారం నుండి బయటకు అడుగులు వేశాడు.  ఎండ గూబని తాకింది.  భుజం మీదున్న కండువా తీసుకుని నెత్తికి చుట్టుకుని,  రిక్షా దగ్గరకెళ్లాడు.  రిక్షా మీద చెక్కిన రుబ్బురోళ్ళు,  సనికలు రాళ్లు ఉన్నాయి.  వాటి పక్కనే గంట్లు పెట్టడానికి అవసరమయ్యే సుత్తి,  శానాలు వున్నాయి.  శానాలకు ఉన్న చెక్క పిడులు చిన్నచిన్న పగుళ్లుతో ఉన్నాయి.  రంగడు రిక్షా ముందుకెళ్లి కుడిచేత్తో హ్యాండిల్ పట్టుకుని ఎడమచేత్తో రిక్షాని పట్టుకుని ముందుకులాగాడు.  రిక్షా ఒక్క అడుగు కూడా కదలేదు.  గుడారం వైపు చూసాడు.  గుడారం మూసేసి,  చంకలో రెండేళ్ల పిల్లాడ్ని వేసుకుని నెత్తి మీద కొంగు చుట్టుకుని దగ్గరకు వస్తున్న విమలమ్మ కనిపించింది.

మొగుడు పడుతున్న అవస్థ చూసి,  “ఏందయ్యో! మందెక్కినట్లు లేదు,  ఈపాటి రిక్షానే లాగలేక పోతున్నావు” అని రిక్షా వెనక్కి వెళ్ళింది.  గతుకల రోడ్ల మీద రాళ్లు కిందపడకుండా దాపుగా పెట్టిన గోనెసంచుల మీద పిలాడ్ని కూర్చోబెట్టి రిక్షాని గట్టిగా ముందుకు నెట్టింది.  రిక్షా ముందుకు కదిలింది.  రిక్షా కదులుతుంటే రాళ్లు అటూ ఇటూ ఊగుతూ శబ్దం చేస్తున్నాయి.

నడుస్తున్న రిక్షా నుండే పిల్లాడిని తీసుకుని, “ఇయ్యాల ఏ కాడికి పోదామయ్యా?” అనడిగింది.

రంగడు,  “ఏ కాడికి పోయినా ఒక్కటేనే…  ” అన్నాడు.

ఆమె,  “అట్టెట్టవుద్ది? మాపటేల కరణాల వీధికి పోవాలన్నావు కదా?” అనడిగింది.

“ఆ పోదాములే! గానీ,  ఆ నీళ్ల సీసాను రిక్షా కింద కొంకీకి తగిలియ్యి.  లేకపోతే సెగపట్టిన నీళ్లతో గొంతు తడుపుకోవాలి” అని వెనక్కి చూశాడు.  అప్పటికే అతని శరీరం చెమటతో తడిచిపోయింది.

విమలమ్మ,  రిక్షా వేగానికి సమానంగా నడుస్తూ సీసా కోసం చూసింది.  సీసా కనబడలేదు.  రిక్షా కిందకూడా చూసింది.  సీసా జాడ లేదు.

వెంటనే,  “అయ్యాయ్యో! నీళ్ల సీసా పెట్టనేలేదయ్యా” అంది.

రంగడు రిక్షాని చెట్టుకింద నీడలో ఆపి,  “నువ్వూ చంటోడు ఈడే కూసోండి. ,  గబుక్కున్నెల్లి అట్టుకోచేస్తాను. . . . ” అన్నాడు.

విమలమ్మ ఆకాశం వైపు,  వచ్చిన దారి వైపు చూసి, “ఇంకో పదడుగులేస్తే ఊరొచ్చేస్తదయ్యా. ,  నువ్వు ఆకాడికి పోయి రావాల్నంటే చాలా సేపైతది.  ఊర్లో ఓ గుక్కెడు నీళ్లు ఏ అయ్యో ఏ అమ్మో మనకియ్యరంటావా?” అనడిగింది.

“మనమొకాలు,  వాలకాలు చూసేవాళ్ళు ‘దూరం దూరం’ అంటారు. ,  ఇక మనకి నీళ్ళెక్కడిస్తారే ఎర్రిమొహమా?” అన్నాడు రంగడు,  నెత్తిమీద కట్టుకున్న కండువా విప్పుతూ.

“పంచాయితీ పంపులు బోలెడు నీళ్లుంటాయి. ,  అక్కడ తాగుదాములే. ,  ముందైతే ఊళ్ళోకి పదా?” అంది.

విప్పిన కండువాతో మొహం మీదున్న చెమటలు తుడుచుకుని,  “సరే నీ ఇట్టం. . ” అంటూ ఆపిన రిక్షాని లాగుతూ

విమలమ్మతో గ్రామంలోకి చేరాడు.

☆☆☆

గ్రామంలో రోడ్లని కంకరరోడ్లు.  గతుకులు,  పెద్దపెద్ద గుంతలతో ఉంది.  ఊర్లో మొదటి వీధి రాగానే,  “రుబ్బురోళ్ళమ్మా! రుబ్బురోళ్ళు,  సనికాల రాళ్లమా! తిరగాళ్లమ్మా! తిరగళ్ళు. . ,  కొత్తవి అమ్ముతాం. ,  పాత వాటికి గంట్లు పెడతాం.  రుబ్బురోళ్ళుకు పిడులు కూడా వేస్తాం. ,  రుబ్బురోళ్లమా. ,  రుబ్బురోళ్ళు. . . . . ” అని బిగ్గరగా అరవడం మొదలెట్టాడు రంగడు.

ఎండ తీవ్రతకు వీధుల్లో జనం లేరు.  పిల్లాడి మీద ఎండ పడకుండా విమలమ్మ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎండ తగులుతూనే ఉంది.  విమలమ్మ కూడా రంగడి వెనుకాల అరవడం మొదలెట్టింది.  రెండు మూడు వీధులు దాటినా ఒక్కరు కూడా పిలవలేదు.  మరొక వీధి కోసం మలుపు తిరగబోతుంటే,  “రేయ్! గంట్లోడా. . . . ! ఇలా రా. . !” అని అరుస్తున్న అరుపులు వినిపించి వెనక్కి చూశాడు రంగడు.  అతను వీధి మొదట్లో వున్నాడు.  చేసేది లేక రిక్షాని వెనక్కి తిప్పి అతని వద్దకు వెళ్లారు.

విమలమ్మ అతని వంక చూసి నవ్వింది.

రంగడు, ”సెప్పండయ్యా! కొత్తవి కావాలా? పాతవాటికి గంట్లు పెట్టాలా?” అనడిగాడు.

అతను రిక్షా మీదున్న వాటిని చూస్తూ,  “కొత్తదే కావాలి,  అమ్మాయికి పట్నం పంపించాలి.  మిక్సీలు గ్రైండర్లు వున్నా అల్లుడికి మాత్రం దీనిలో వండిన పచ్చడే కావాలంటా. . . . . !” అన్నాడు.

“రుబ్బురోలు ఒకటే కావాలా? సనికాల్రాయి కూడా తీసుకుంటారా?”

“ముందు రుబ్బురోలు చూపించారా? మరీ పెద్దది కాకుండా మరీ చిన్నదీ కాకుండా ఉండాలి. . . . . . ”

“అయ్యా! మీరడిగిన దానికి ఇదైతే సరిపోతుంది. . . ” అంటూ పిలాడ్ని కిందకు దింపి ఓ రుబ్బు రోలుని దొర్లిస్తూ ముందుకు లాగింది విమలమ్మ.  ఈలోగా రిక్షా అటు ఇటు కదలకుండా ఉండటానికి చక్రాల కింద రాళ్లు పెట్టాడు రంగడు.

అతను, “అలా కాదమ్మా! దాన్ని కిందకు దింపు…” అన్నాడు.

విమలమ్మ దింపబోతుంటే,  “నువ్వాగవే! నేనున్నాను కదా!” అంటూ రుబ్బురోలుని అమాంతం పొట్ట మీదకు ఎత్తుకుని అడుగులు వేస్తూ అతని కాళ్ళ ముందు దింపాడు.  విమలమ్మ వెంటనే చీర కొంగుతో రోలు గుంతలో ఉన్న మట్టిని శుభ్రం చేస్తూ,  ”అయ్యా! ఇది అమ్మాయిగారికి నప్పుతుంది.  మరో ఐదారేళ్ళ వరకూ గంట్లు కూడా కొట్టీబల్లేదు. . . ” అని చెప్తుంటే మధ్యలో అతను,  “ఒకసారి వెనక్కి తిప్పరా?” అనడిగాడు.

రంగడు,  ‛ఇక మొదలు. . !’ అనుకుని రోలుని మెల్లిగా వెనక్కి తిప్పాడు.  అతను దానిని భూతద్దం పెట్టి పరిశీలించినట్టుగా చూసి,  “బీటలేమైనా ఉంటే మాత్రం తీసుకోను” అన్నాడు.

రంగడు,  “బీట్లున్నా,  పగుళ్లున్నా మేమే అట్టుకురామయ్యా. . ! మీకాలోచనే వద్దు.  కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు” అన్నాడు. “నీకేరా వంద చెబుతావు. . ,  పంపిన తర్వాత రెండు మూడు రోజులకే ఇది పగిలిందనుకో నాకు మీ అమ్మగారి

చేతిలో తిట్లు, చివాట్లు.  సర్లేగానీ పక్కకు తిప్పు. . . . . ” అన్నాడతను.

రంగడు పక్కకు తిప్పుతూ, “ఈ ఊరిలోనీ ఇంకో పచ్చం రోజలుంటాము.  పగుళొస్తే నాకిచ్చేయండి సామీ.  మీ సొమ్ములు మీకిచ్చేస్తాను” అన్నాడు నమ్మకంగా. . ,

అతను,  “ఏరా నీ చేతిలో బడిన డబ్బులు మళ్లీ నేను తీసుకోవాలా?” అనాలోచిస్తూ,  “ఒక పని చెయ్! ఈ రోలు లోపల అరుగుమీద పెట్టు,  ఎలాగో నువ్వు వారం రోజుల్లో వెళ్లిపోతావు కదా.  వెళ్ళేటప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్లు.  అప్పటికి రోలు బాగుంటే డబ్బులిస్తాను తీస్కొని వెళ్లు. ,  ఒకవేళ రోలు పగిలితే నీ రోలు నువ్వు తీసుకునిపో. . . !” అన్నాడు.

రంగడు,  విమలమ్మ వంక చూసాడు.

విమలమ్మ, “అయ్యా! ఇదే మొదటి బేరం. ,  సొమ్ములియ్యకుండా వస్తువెలా ఇచ్చీదయ్యా?” అనడిగింది.

“అలా అంటావా!” అంటూ వేసుకున్న లాల్చి జేబులో చెయ్యి పెట్టి కొన్ని చిల్లర నాణాలు తీసి,  “ఇవిగో ఇవి తీసుకో. . ,  వారంరోజుల తర్వాత పూర్తి డబ్బులు తీసుకో. . . ” అన్నాడు.

విమలమ్మ ఆ చిల్లర వంక చూసింది.  అవి అసలు ధరలో పదోవంతు కూడా కాదని అర్ధమైంది.  మౌనంగా నిలబడింది.

అతను,  “ఏమిరా ఆలోచనా? ఈ డబ్బులు సరిపోవనా? లేదా నీ డబ్బులు ఎగ్గొట్టి ఊరు వదిలి పోతాననా?” అని గదమాయించాడు.

రంగడు బెదిరి,  “అదేం లేదాయ్యా!” అని చిల్లర తీసుకుని రోలుని అరుగు మీద పెట్టి వెనుతిరిగాడు.  విమలమ్మకు మొగుడు చేసిన పని నచ్చలేదు.

పిలాడ్ని ఎత్తుకుని రిక్షా మీద కూర్చోబెట్టి,  రంగడు ముందు నుండి లాగుతుంటే వెనుక నుండి తాను నెట్టుతూ మరొక వీధికి వెళ్లారు.

వీధి దాటగానే,  “ఎందయ్యా అట్టాసేసినావు?” అనడిగింది.

“నువ్విటాడుగుతావని తెల్సే! పెపంచకం ఎప్పుడో మారిందే.  ఇప్పుడు జనమంతా అలుపు సొలుపు లేకుండా పనులవాలని అనుకుంటున్నారు.  కరంటు పెట్టే మిచ్చీలు,  గైండర్లు వచ్చినాక ఈ రోల్లు,  రోకల్లు ఎవరు వాడతారే.  లగ్గాలు పెట్టినప్పుడో,  ఏ పంతుల్లో చెప్పినప్పుడో వీటిని బయటకు తీస్తారు.  అప్పుడు మట్టికి శుభ్రంగా కడిగి,  పసుపు కుంకుమ రాసి దేవతలాగా చూసుకుంటారు.  పనైనా తరవాత రోజు తీసుకునెళ్లి ఏదొక మూల పడేస్తారు.  అట్టాంటి ఈటిని ఆయన కొంటానన్నాడే అదే పదివేలు” అని విమలమ్మకు తెలియని విషయాలు చెప్పాడు రంగడు.

విమలమ్మ,  “అదేందయ్యా! మనం ఏల్లు,  గోల్లు నలగొట్టుకుని,  రక్తం గార్సి మరీ వీటిని సెక్కతాము కదా? మన కట్టానికి పలితమే లేదా?” అనడిగింది.

రంగడు రిక్షాని చెట్టునీడలో ఆపి,  “మొన్న శివయ్యని కలిసాను.  వాడేమో పట్నంలో అమ్మతుంటాడు కదా. !” అంటూ చెట్టు కింద కూర్చున్నాడు.  విమలమ్మ కూడా అతని పక్కనే కూర్చుని పిల్లాడికి పాలు పట్టిస్తూ పైట కొంగు కప్పుకుని కూర్చుంది.

రంగడు కొనసాగుస్తూ,  ”ఆడు చెప్పాడే! పట్నంలో వాడి యాపారం మనకంటే దారుణంగా ఉందంట.  ఈ పని మానేసి పెద్దపెద్ద బిల్డింగుల్లో శ్లాబులు పోయడానికి కూలీగా పోతున్నాడట.  అలవాటు లేని పనికదా కూసింత కట్టంగానే ఉందన్నాడు.  పెళ్ళాం పిల్లల్ని సాకాలి కదా తప్పదు మరి.  చేతి వేలు మొనలో చిన్నచిన్న పుండ్లు పడ్డాయంట పాపం. పట్టుమని నాలుగు ముద్దలు నోట్లో పెట్టుకోలేకపోతున్నాడు.  నేను గూడా కొత్తవి సేయడమందుకే మానేశాను.  ఉన్న వీటిని తక్కువుకో,  ఎక్కువుకో ఎవరి సేతులోనన్నా పెట్టి వేరే పని సూసుకుంటాను.  ఇంకెన్నాళ్లు ఇలా ఉపయోగం లేకుండా వీధులు యెంట నేను తిరగా,  నిన్ను తిప్పా. . . ” అని మనసులో మాట చెప్పాడు.

విమలమ్మకు అంతా అయోమయంగా ఉంది.  మనసులో,  ‛ఇంత బాగా వచ్చిన పనినొదిలేసి మరొక పనికి పోతే పూట గడిసేదెట్టా. . ?’ అనుకుంటూ పాలు తాగుతూ పడుకున్న పిల్లాడ్ని బయటకు తీసి కాళ్లు చాపి,  పడుకోబెట్టుకుని మొగుడి వంక ప్రశ్నార్థకంగా చూసింది.

రంగడు తన భార్య మనసునర్థం చేసుకుని, “పని ఎంత బాగా వచ్చినా సొమ్ములు రావడం లేదు కదా. . . !” అన్నాడు.

విమలమ్మ ఆశ్చర్యంగా,  “మరేం సేత్తావయ్యా?” అనడిగింది.

రంగడు పైకి లేచి,  “సెప్పాను గదే! ఈ పాతవి అమ్మినాక మనం గూడా పట్నం పోదాము.  అక్కడే ఏ కూలో నాలో సేసుకుందాము” అని రిక్షా వద్దకు నడిచాడు.  అతని వెనుక విమలమ్మ కూడా పిల్లాడ్ని తీసుకుని మరొక వీధికి నడిచింది.

☆☆☆

ఒకరి తర్వాత మరొకరు అరుస్తూ వీధి మధ్యలోకి చేరుకున్నారు.  ఓ పెద్దావిడ పిలుపుతో ఓ ఇంటి ముందు ఆగారు.  ఆమె రిక్షా వంకా,  వాళ్ల వంక ఒకసారి చూసి,  “ఏమయ్యో! మీరు నిజంగా గంట్లు కొట్టేవాళ్లేనా? లేదా వాటి పేరు చెప్పి గొలుసులు తెంపుకెళ్లేవాళ్ళా?” అంటూ మెడలో ఉన్న గొలుసు,  మంగళసూత్రం లోపలకు వేసుకుంది.

రంగడు,  ”మా వాలకాలు అలా ఉన్నాయేమో గానీ,  మేము అలాంటోళ్లం గాదమ్మ. . !,  చెప్పండి ఏం కావాలో?” అనడిగాడు.

“మా అత్తయ్యగారి నుండి కాపాడుకుంటూ వస్తున్న తిరగలికి గంట్లు పెట్టాల్రా. . .”

“అట్టాగేనమ్మా! ఎక్కడుంది?”

”అదిగో ఆ లోపల ఉంది,  ధ్యాస పెట్టి పని చెయ్. . . ,  నువ్వు గంట్లు పెట్టేటప్పుడు అది విరిగినా బీటలు వారినా దాని బదులు కొత్తది లాక్కుంటాను. ,  పై పెచ్చు ఒక్క పైసా కూడా ఇవ్వను. . . . . ” అని నొక్కి చెప్పిందావిడ.

రంగడు మౌనంగానే వెళ్లి తిరగలి బయటకు తెచ్చాడు.  దానిని పరిశీలించినతను అది బాగా అరిగిపోయిందనర్థం చేసుకున్నాడు.  ఏ మాత్రం కొద్దిగా బలమెక్కువయినా విరిగిపోయే స్థితిలో ఉంది.  దానిని చూసిన విమలమ్మ పిల్లాడ్ని మెల్లిగా గోనె సంచి మీద పెట్టి దగ్గరకు వెళ్లి,  “దీన్ని సూత్తుంటే ఒక్క సేనం దెబ్బకే విరిగిపోయేలా ఉంది.  వద్దులెయ్యా! పోదాం” అంది భర్తతో.

రంగడు,  తిరగలిని విడదీసి పై రాతిని పక్కన పెట్టాడు.  రిక్షా నుండి సన్నపాటి శానం,  సుత్తి తీసుకుని అరికాళ్ళను శుభ్రంగా కడుక్కుని వాటి రెండింటి మధ్య ఒక్కో రాతిని పెట్టుకుని గిలకలు ఊడకుండా జాగ్రత్తగా గంట్లు పెట్టడం ఆరంభించాడు.  అతని శానపు దెబ్బలు లయబద్దంగా ఉన్నాయి.

సమయం గడిచింది.  పూర్తయిన వాటిని విమలమ్మ జాగ్రత్తగా తీసుకుని తొట్టి వద్ద శుభ్రంగా కడిగింది.

రంగడు పనితీరుతో సంతృప్తి చెందినట్లు ఆమె,  “భలే చేశావురా అబ్బాయ్. . . ” అంటూ లోపలకు వెళ్ళింది.

ఆమె సంతోషం చూసి అడిగినంత ఇస్తుందేమో అనుకుని ఆమె రాగానే,  “అమ్మగారూ! రెండింటికి కలిపి మూడొందలు ఇప్పించండమ్మా. . !” అన్నాడు.

ఆమె, “మూడొందలా!” అంటూ నోటి మీద చెయ్యేసుకుని,  “నేనేమైనా కొత్తది కొంటున్నానా ఏంటి? పాత దానికి నాలుగు గంట్లు వందలు అడుగుతున్నావు.  రెండింటికి కలిపి వంద ఇస్తాను.  ఇష్టం ఉంటే తీసుకో. ,  లేకపోతే అవతలికి పో” అంది.

విమలమ్మకి కోపం నెత్తికి చేరి,  “ఏవమ్మో! మూడొందల పనికి వందిత్తావా? మా మావ సున్నితంగా సేసాడు కాబట్టి నాలుగు ముక్కలవ్వాల్సిన తిరగలి కాస్త నాలుగేళ్ళ ఆయుస్సు పోసుకుంది” అని ఎదురుచెప్పింది.

ఆమె,  “ఓహో! చెట్టంత మొగుడ్ని లెక్కచేయకుండా నువ్వే మాట్లాడుతున్నావు. . ,  ఏం అబ్బాయ్ ఆ వంద కావాలా వద్దా? లేదంటే ఆ తిరగలి నువ్వే తీసుకుపో,  దేవుడి పేరు చెప్పి ఏ అనామకుడికో దానం ఇచ్చానని అనుకుంటాను ” అనుకుంటూ లోపలకెళ్లబోయింది.

రంగడు,  “ఆగండమ్మా! ఆ వంద యియ్యండి. . .” అంటూ చేతులు చాచాడు.

ఆమె మనసులో,  ‛దారికొచ్చాడు…’ అనుకుని రంగడి చేతిలో డబ్బులు పెట్టి లోపలకు వెళ్ళిపోయింది.

కోపంగా ఉన్న భార్య దగ్గరికెళ్లి,  “పదే పోదాము!” అన్నాడు.

విమలమ్మ,  “ఎందయ్యా ఇదీ,  సగం సొమ్ములు రాకపోయే,  నువ్వేమో గంగిరెద్దాలె తలాడించినావు” అంది.

“ఈ పనే వద్దనుకున్నా.  ఆటి గురుతులు మనకెందుకే. . ” అని రిక్షాని పట్టుకుని ముందుకు లాగాడు.  విమలమ్మకు తన భర్త మనసుని పూర్తిగా అర్థం చేసుకుని రిక్షాలో మిగిలిన వాటి వంక చూస్తూ రిక్షాని ముందుకు నెట్టింది.

☆☆☆

రంగడి రిక్షా చక్రం,  వేగంగా వారం రోజులు తిరిగింది.  భార్య గుర్తు చేయడంతో వారం రోజుల తర్వాత డబ్బులిస్తానన్న వ్యక్తి వద్దకు వెళ్ళాడు.  అంతలో విమలమ్మ ఆ ఊరు వదిలి మరో ఊరు వెళ్ళడానికి గుడారం పీకి,  ఒక్కో వస్తువుని సర్దడం మొదలెట్టింది.

☆☆☆

సాయంత్రమైంది.  విమలమ్మ అన్నింటిని సర్ది భర్త కోసం చూడసాగింది.  రంగడు నీరసంగా నడుస్తూ వచ్చాడు.  అతను నేరుగా రిక్షా వద్దకెళ్లి రిక్షా మీదున్న అన్నింటిని కిందకు దింపడమారంభించాడు.  భర్త చేస్తున్న పనినర్థం చేసుకుని దగ్గరి కెళ్లి, “ఏమందయ్యా. . !?” అనడిగింది సాయం పడుతూ.

రంగడు,  “వారం రోజుల తర్వాత సొమ్ములిస్తానన్న ఆ పెద్దాయన అదేరోజు సాయంత్రం రోలుతో సహా  వెళ్లిపోయా

డంట. . .” అని మరొక రోలుని దింపబోయాడు.  విమలమ్మ ఓ పెద్ద నిటూర్పు విడిచి,  తాను కూడా ఒక్కో

రోలుని దింపడం ఆరంభించింది.

అన్నింటిని దింపిన తర్వాత,  ఇద్దరూ వాలిపోతున్న సూర్యుడి వంక చూస్తూ కూర్చున్నారు.

రంగడు,  “రోజులు మారిపోయాయి.  మంచి మనసులు కరువయ్యాయి.  ఒక్కరికి కూడా నీతీ నిజాయితీ లేదు.  ఇట్టాంటపుడు మన కులవుత్తిలో ఇమడలేము.  అలానని గట్టిగా ఎదురెళ్లి అడగలేము.  తలొంచుకుని సద్దుకుపోవాలి.  ఈకాడికి ఈ పనిసేసి ఉపయోగం ఏంటి సెప్పూ!” అన్నాడు.

దూరంగా గోనె సంచి మీదున్న కొడుకుని చూస్తూ, ‛ఈడికైనా అంతా మంచిగ జరగాలి. . .’ అనుకుంది.

 

 

*****

1 thought on “రాతి మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *