June 14, 2024

లోపలి ఖాళీ – సిద్ధయ్య మఠం

రచన: రామా చంద్రమౌళి

 

 

ఎర్రగా తెల్లారింది.

మైసమ్మగండి ఊరు ఊరంతా ఇక ప్రేలబోతున్న అగ్నిపర్వతంలా నిశ్శబ్దంగా, గంభీరంగా, కుతకుత ఉడుకుతున్న లోపలి లావాలా ఉంది.

ఊరి జనాబా రెండు వేలమందిలో ఏ ముసలీముతకనో విడిచిపెడ్తే.. ఆడా , మగా .. పిల్లా పాపతో సహా అందరూ మైసమ్మ గుట్ట చుట్టూ వరుసగా నిలబడి ఒక చుట్టు చుట్టి.. పాల సముద్రంలో మందరపర్వతం చుట్టూ తాడులా వాసుకి చుట్టుకున్నట్టు గుట్టను అలుముకుని నిలబడ్డరు.. ఎర్రటి ఎండలో.. రెండు గంటలనుండి.

‘‘ఎవడస్తడో రానీ.. వానింట్ల పీనుగెల్ల.. మా గుట్టే దొరికినాది వానికి. మైసమ్మ తల్లి వాన్ని నెత్తురు కక్కించి పిడాత పానం తీత్తది ’’ అని ఎనబై ఏండ్ల ముత్తక్క శాపనార్థాలు పెడ్తోంది.

ఎండాకాలం. మే నెల. పొద్దెక్కి గంటయిందోలేదో. వడగాలి మనుషులను కుమ్ములో పెట్టిన కందగడ్డోల్గె ఉడికిస్తాంది.

ఊరి బాయిలల్ల నీళ్ళు నెలరోజుల కిందటే ఎండిపోయి .. నేలలన్నీ నెర్రెలుబాసినై.

డెబ్భైరెండు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం.. ఊళ్ళల్ల తాగటానికి నీళ్ళు లేవు.

ఈ పరిస్థితిని ముందే ఊహించిన ఆ ఊరి జనం సిద్ధయ్య నేతృత్వంలో స్వయంగా చెక్‌ డ్యాం లను నిర్మించుకోవడం, ఇంకుడు గుంటలను ఏర్పాటుచేసుకోవడం , ఊరి పోతురాజు చెరువు పూడికను తీసుకోవడం.. ఇట్లా ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూనే ఉంది. కాని.. గత మూడు సంవత్సరాలుగా మామూలు వర్షాలుకూడా లేవు. ఎటూ తోచని గడ్డు పరిస్థితి.

ప్రకృతి వికటిస్తే మనిషి ఎంత గొప్పవాడైనా ఎట్లా నిస్సహాయుడౌతాడో అనుభవపూర్వకంగా తెలుస్తోంది ఆ ఊరిలోని ప్రతి ఒక్కరికీ.

ఇప్పుడు.. రెండు సమస్యలు.

ఒకటి.. ఊరికి ‘ అమ్మ ’ యాభై రెండేండ్ల జానకి హఠాత్తుగా చచ్చిపోయింది నిన్న.

ఊరు ఊరంతా అనాథ ఐపోయినట్టు.. ప్రతి ఒక్కరిలోనూ దుఃఖం గూడు కట్టుకుంది. ఆ ఊరి ప్రతి కుటుంబం లోని బాలబాలికనూ జానకమ్మే స్వయంగా బాధ్యత వహించి తల్లికంటే ఎక్కువగా వాత్సల్యిస్తూ.. సిద్ధయ్య మఠం నేతృత్వంలో ఒక్కొక్కరిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ భిన్నమైన రంగాల్లో ప్రముఖ పాత్రికేయులుగా, సామాజిక కార్యకర్తలుగా, రచయితలుగా, పారిశ్రామిక వేత్తలుగా, ఉద్యోగాలు చేసేవాళ్ళుగా కాకుండా ఉద్యోగాలను సృష్టించి ఉపాధి కల్పించే ఔత్సాహికులుగా రూపొందిస్తూ.. మైసమ్మ గండి అంటే ఒక ఆదర్శ గ్రామం.. ఒక సమసమాజ నిర్మాణ లక్ష్యంతో రూపొందుతూ చుట్టూ వందల గ్రామాలకు ఒక ‘ మోడల్‌ ’ గ్రామంగా వర్థిల్లుతున్న ఊరుగా ముద్ర.

జానకి ఎప్పుడూ చెప్పేది.. ‘ మైసమ్మ గండి అంటే.. తొణికిసలాడే నిత్యనూతన చైతన్యం.. మైసమ్మ గండి అంటే బిగించిన పిడికిలివంటి.. ఒక ఐక్యత. ఒక కట్టు. ఒక అవిభాజ్య శక్తి ’. అని.

బయట ఒక ముద్ర ఏర్పడిరది ‘ మైసమ్మ గండి అంటే.. అందరిదీ ఒక్కటే మాట.. అందరిదీ ఒకటే బాట ’ అనిగ కూడా.

రెండవది.. రాత్రి సిద్ధయ్య మఠం లో జరిగిన గ్రామపెద్దల సమావేశంలో తెలిసిన సంగతి. ఊరి సర్పంచ్‌ తో సహా ఏడుగురు వార్డ్‌ సభ్యులు.. ఇతర ముఖ్యులూ సిద్ధయ్యతో చర్చించి కార్యాచరణను రూపొందించుకుని వచ్చి ఎవరికివారు వారివారి ఇండ్లలో అందరికీ సమాచారమందించి .. మొత్తం ఊరి జనాన్ని సంసిద్ధులను చేయడం.

సమాచారం వేసవికాలం మంట అంటుకున్న గడ్డివాములా వ్యాపించింది.

ఊరికి ఉత్తరాన యుగయుగాలుగా గ్రామరక్షగా ఉంటున్న ‘ మైసమ్మ గుట్ట ’ ను ఎవరో కాంట్రాక్టర్‌ కు ప్రభుత్వం పదేండ్ల మైనింగ్‌ కోసం లీజ్‌ కిచ్చిందట. ఈ వార్త ఊరి గుండెల్లో బాంబులా ప్రేలింది. ఉలిక్కిపడిరది పిల్లాపాపా, పడుచూముసలీ , పశువూపక్షీ.

రాత్రి సిద్ధయ్య దాదాపు యాభై మంది ఊరి పెద్దలతో జరిపిన సమావేశంలో చెప్పిండు.. ‘ మైనింగ్‌ ’ అంటే ఏమి జరుగబోతోందో. పదేండ్లలో మైసమ్మ గుట్ట కల్లాస్‌ అని అర్థమైంది అందరికీ.

‘ మన తెలంగాణలో కరీంనగర్‌ ను చూచిండ్లా.. ఆంధ్రా లో తమిళనాడుకు దగ్గర్లోనే ఉండే కుప్పం గురించి విన్నరా.. దాదాపు వందల గుట్టలను మైనింగ్‌ పేర ప్రభుత్వాలతో కుమ్మక్కై గ్రానైట్‌ మాఫియాలు కోట్లకొద్ది రూపాయలను దండుకుంటూ బహిరంగంగానే ప్రకృతి సంపదను హరిస్తున్నాయి. ఒక్క కరీంనగర్‌ లోనే గత పదేండ్లలో వందల గుట్టలు మాయమై గుట్ట ఉన్నచోట లోపలిదాకా రాయిని తొలుచుకుపోయిన భూమి లోపలి కుడుకను గీక్కున్న కొబ్బరి చిప్పల్లా చెరువులై మిగిలిపోయినై. ఊళ్ళకు ఊళ్ళు ప్రజలందరూ నిస్సహాయులై చూస్తూండగానే ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రత్యేక రైలు పెట్టెవంటి ఇరవై చక్రాల ఓపెన్‌ టాప్‌ లారీలు పదుల టన్నులకంటే ఎక్కువగా ఉన్న గ్రానైట్‌ బ్లాక్‌ లను మోసుకుంటూ గర్భినీ స్త్రీలవలె రొప్పుతూ వరంగల్‌, తొర్రూర్‌, ఖమ్మం ల మీదుగా చెన్నై, కృష్ణపట్నం ఓడరేవులకు చేరుకుంటుంటై. అక్కడినుండి ఓడల్లో లోడై.. చైనాకు, జపాన్‌ కు.. తదితర దేశాలకు ఎగుమతి ఔతున్నై. వాళ్ళు ఈ ఉత్తమమైన మన గ్రానైట్‌ ను సన్నని పలకలుగా కట్‌ చేసి, పాలిష్‌ చేసి మళ్ళీ ఎక్కువ ధరకు మనకే అమ్ముతూ.. ప్రపంచ మార్కెట్‌ ను విపరీతమైన లాభాలతో మోనోపలీగా ఏలుతున్నారు. ఎన్నో మానవవనరులు, సాంకేతిక పరిజ్ఞానం ఉండికూడా దివాళాకోరు రాజకీయ నాయకులవల్ల ఇక్కడి ప్రభుత్వాలు ఈ రకమైన ప్రకృతి సంపదను నాశనం చేస్తూ వాతావరణ సమతుల్యతను ధ్వంసం చేస్తూ ఇక్కడి భావితరాల నోళ్లలో మట్టి కొడ్తోంది. ఈ గ్రానైట్‌ రాకెట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు.. ఎమ్మెల్యేలు, ఎం.పీ లు.. స్థానిక జిల్లా నాయకత్వాలు, రాష్ట్ర కేంద్ర మంత్రులు అందరూ తమతమ పార్టీలకతీతంగా అందరూ ఒక్కటై ఈ పరిపూర్ణ పర్యావరణ దోపిడీకి పాల్పడుతున్నరు. మన్నుతిన్న పాముల్లా సెల్‌ ఫోన్లకూ, ఇంటర్నెట్‌ భోగాలకూ, బూతు సినిమాల మోజుల్లో కూరుకుపోయిన మన వృద్ధ యువతా, నిస్సహాయ గ్రామ ప్రజలూ విధిలేక బిక్కచచ్చి చూస్తూ ఊర్కుంటున్నరు. ఎక్కడో ఎవరో ఒకరు ఈ మాఫియాను ప్రతిఘటిస్తూ ప్రశ్నించి తిరుగబడ్తే.. వాడంతే.. ఏ రాతిగుట్ట బ్లాస్టింగ్‌ లోనో హతమైపోతున్నడు. ఈ రాకెట్‌ లో లారీలను పర్మిట్‌ చేస్తున్న రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ ఆఫీసర్లు, నియమితమైన లోడ్‌ ను మాత్రమే మోయగలిగి.. బరువు అధికమైతే చితికిపోయే రోడ్లపై ప్రయాణానికి అర్హంకాని ఈ రాతి లోడ్‌ లారీలను అనుమతిస్తున్న ఆర్‌ అండ్‌ బి అధికారులు, పోలీస్‌, మైనింగ్‌ డిపార్ట్‌ మెంట్‌ ఆఫీసర్లు.. సీ పోర్ట్‌ లలో నిబంధనలను ఉల్లంఘిస్తూ సత్వర ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్న పోర్ట్‌ అధికారులు, ప్రకృతి వనరుల పరిరక్షణకు బాధ్యత వహించవలసిన జియాలజీ శాఖ.. ఇంతమంది కుమ్మక్కై ప్రకృతిమాతను హత్య చేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా.

ఈ సామాజిక దోపిడీని కొనసాగిస్తున్నవాళ్ళు నిరక్షరాస్యులా.. ఈ విధ్వంసాన్ని తెలియక చేస్తున్నారా.. అంటే అదికాదు. అందరూ బాగా చదువుకున్నవారు.. ఉన్నత విద్యావంతులు. మంచీ చెడూ అన్నీ తెలిసినవాళ్లే. ఈ దేశానికి ఎప్పటినుండో ఈ ఉన్నత విద్యావంతులతోనే ప్రమాదం ముంచుకొస్తోంది. వాళ్ళే దేశద్రోహులు.

సహజంగా ఒక్క రాయి తయారు కావాలంటే .. కొన్ని లక్షల సంవత్సరాల కాలం కావాలె. వీళ్ళు హరిస్తున్న ఈ గుట్టలకు గుట్టల శిలలు మళ్ళీ సృష్టించబడాలంటే.. ఈ ప్రకృతి ఎన్ని యుగాల కాలం ప్రసూతినొప్పులు పడాలో ఆలోచించండి. కొన్ని యుగాలపూర్వం సూర్యశకలంగా విడివడి కోట్ల సంవత్సరాల తర్వాత ‘ మాగ్నా ’ అని వ్యవహరించబడే ద్రవశిల శీతలీకరణ చెందుతూ ముప్పై కిలోమీటర్ల లోతుగల భూమి పైపొరగా ఏర్పడి.. లిథిఫికేషన్‌ చెంది .. ఈ అందమైన పర్వతాలు.. సరస్సులు, అడవులు, నదులు, కొండలు.. సెలయేర్లు.. ఏర్పడ్తే.. ఈ మానవ దుర్మార్గులు.. తల్లి శరీరంపైబడి ఒంటిని పీక్కుతింటున్న రాబందుల్లా.. ఒకడు గుట్టలను, ఒకడు ఇసుకను, ఒకడు ఇనుప, అల్యూమినియం ఖనిజాలను, మరొకడు బైరైట్‌ గనులను, ఇంకొకడు అడవులను, చందనపు చెట్లను.. ఇక ప్రభుత్వాలు ఏకంగా భూమిని తొలుస్తూ దశాబ్దాల పర్యంతం బొగ్గు గనులపేరుతో ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ రూపంలో ఊళ్లకు ఊళ్లను కబళిస్తూ.. ఒక నిరంతర హత్యాసదృశ విధ్వంసం ఇది.

మన దేశం నుండి ఈ గ్రానైట్‌ ను కొంటున్న చైనా గానీ, జపాన్‌ గానీ , ఇతర ఏ దేశమైనాగానీ.. వాళ్ల దగ్గరి గుట్టల జోలికి మాత్రం పోరు. వాళ్ళ ప్రకృతి వనరులను జాగ్రత్తగా పదిలపర్చుకుని దాచుకుంటరు వాళ్ళ భావి తరాలకోసం. మనకు ఈ ఇంగిత జ్ఞానం లేదు. మనవాళ్ళు.. ప్రధానంగా రాజకీయ నాయకులు తమకు లాభం వస్తోందంటే ఈ దేశాన్ని కూడా ఎవరికైనా కుదువబెట్టి అవసరమైతే అమ్ముకుంటరు. ‘

గ్రామమంతా చింతాక్రాంతులై వింటూండగా.. సిద్ధయ్య మొబైల్‌ ఫోన్‌ మోగింది.

‘‘ హలో.. మోహన్‌. ఎక్కడి నుండి.. అమెరికానుండి హైదరాబాద్‌ కు చేరుకున్నవా. అనేక ప్రాంతాల్లో సెటిలైన మన ఊరి యువకులందరూ ఒకరి తర్వాత ఒకరు దుఃఖపూరితంగా స్పందిస్తున్నారు. జానకమ్మ హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ కూడా ఊరూఉరంతా శోకసముద్రంలో మునిగి ఉంది. ఇప్పటికే భారతదేశంలో ఉండే మనోళ్ళు ఇరవైమందిదాకా వచ్చిండ్లు. ఈ రోజే సాయంత్రం శవ యాత్ర జరుగుతుంది. అంత్యక్రియలుకూడా. ’’ సిద్ధయ్య గొంతు గద్గదమై కూరుకుపోయింది.

కాస్సేపు నిశ్శబ్దంగా ‘‘ ఊఁ ఊఁ ’’ అని ‘‘ నువ్వొచ్చేయ్‌ త్వరగా.. మనూరికి ఇంకో సమస్య కూడా వచ్చింది.. మైసమ్మ గుట్టని భుజించే రాక్షసుడొకడు రాబోతున్నాడిక్కడికి. వానితో యుద్ధానికి మేమంతా సిద్ధపడ్తున్నాము ’’ అని ఫోన్‌ కట్‌ చేశాడు.

‘‘ అయ్యా.. ఇప్పటికే వచ్చిన పదిపదిహేనుమంది మన పిల్లలను మన ఊరి గెస్ట్‌ హౌజ్‌ లో ఉంచినం.. ’’

సిద్ధయ్య టైం చూచుకున్నడు. పదీ నలబై. ‘‘ రామచంద్రం.. ఇట్రా..’’ అని పిలిచాడు ఓ నలభై ఏండ్లు నిండిన తన అనుచరుణ్ణి. అతను దగ్గరికి రాగానే చెవిలో చెప్పాడు ఏదో. అతను వెంటనే ఆవేశంగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడినుండి మైసమ్మ గుట్ట దిక్కు వెళ్ళిపోయాడు.

సిద్ధయ్య మఠం మైసమ్మగండి ఊరి చివర గుట్ట దగ్గర్లోని రెండెకరాల తోటలో ఉంది గత నలభై ఏళ్ళుగా. చుట్టూ దట్టమైన చెట్ల మధ్య పర్ణశాలలా విశాలంగా మట్టితో కట్టిన ఇల్లు అది. జాజుతో అలికిన గోడలు.. వాటిపై తెల్లని సున్నపు గీతలతో ముగ్గులు.. విశాలమైన అరుగులు.. బయట వాకిట్లో వెదురు బుట్టలతో చేసిన ప్రత్యేక గూళ్ళలో కువకువమంటూ పావురాల గుంపులు.. ఎత్తుగా దేవదారు వృక్షాలు.. తోట ప్రక్కనుండి సన్నగా పారే సెలయేరుపైనుండి వీస్తూ వచ్చే చల్లని గాలి.. గాలిలో ఎగిరే పిచ్చుకలు, గోరింకలు, చిలకలు.

అదంతా ఒక స్వ్సప్నలోకం. సిద్ధయ్య దాదాపు అరవై ఏళ్లక్రితం చిన్న పిల్లవానిగా ఆ ఊరికి ఎక్కడినుండో వచ్చి .. ఆ ఊరి శివుని గుడిలో.. ఊరవతలి మైసమ్మ గుట్టమీద.. బ్రహ్మచెరువు గట్టు మీది శంకర అవధూత గుహలో అతనితో కొన్నాళ్ళు.. ఇట్లా ఎవరెవరితోనో.. గడుపుతూ.. చటుక్కున మాయమై.. ఎక్కడెక్కడో పెద్ద పెద్ద చదువులు చదివి.. ఉన్నత విద్యావంతునిగా తిరిగొచ్చి.. ఇక ఊరిని ఒక జ్ఞానమఠంగా మార్చేందుకు.. జానకమ్మతో కలిసి.,

జానకమ్మ బాగా చదువుకుని హైదరాబాద్‌ నుండి వచ్చేనాటికి ఆమె తండ్రి.. ఊరి దొర.. రాఘవరెడ్ది.. ఆయన భార్య సీతమ్మ.. ఒక భావన      ఉంది.. ఊరి దొరలైన రెడ్ది కులం వాళ్ళందరూ దోపిడీదారులూ, బడుగు కులాలవాళ్ళందరినీ అణచివేసే దుర్మార్గులూ అని. కాని రాఘవరెడ్ది అది తప్పుడు అభిప్రాయమని ఆ ఊరి యావత్‌ జనాన్ని ప్రేమించడం, సహాయం చేయడం ద్వారా ఋజువు చేశాడు.

కాని.. పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ నక్స లైట్లు ఉత్తర తెలంగాణాలో పాగా వేస్తున్న క్రమంలో ‘ భయం ’ ద్వారా ప్రజల్లో పాతుకుపోవాలని అవలంభించిన పంథాలో భాగంగా.. ‘ ప్రజా కంఠకుడు భూస్వామి రాఘవరెడ్ది పటేల్‌ ను ప్రజాకోర్ట్‌ లో శిక్షిస్తున్నాం ’ అని ఒక రాత్రి భార్యాభర్తలిద్దరినీ అతి కిరాతకంగా చంపేసిన తర్వాత.. ఇక ఆ గడీలో మిగిలింది.. ఒక్క జానకే. ఒంటరి జానకి.. దిక్కుతోచని జానకి.. విప్లవాలకు పెడ నిర్వచనాలతో ప్రజలను దూరం చేసుకునే సూడో సంఘాల ప్రవర్తన అర్థంకాని జానకి.. అప్పటికే ఒక యోగిలా దర్శనమిచ్చిన సిద్ధయ్యతో పరిచయం పెంచుకుంది. ‘ జానకీ.. ఈ మనుషులను గెలువ గలిగే మహత్తర ఆయుధం .. ప్రేమ ఒక్కటే.. మనుషులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ శాసించగలిగే అస్త్రం ‘ భయం ’ ఒక్కటే. ఐతే ప్రేమ శాశ్వతం. భయం .. గాలి బుడగ.’ అన్నాడు సిద్ధయ్య ఒక సారాంశ వాక్యాన్ని బోధిస్తూ ఒక రోజు.

ఆ ఒక్క మాటతో మనుషులను.. ముఖ్యంగా ఊరి పిల్లలను ప్రేమిస్తూ ఆనందించడం నేర్చుకున్న జానకి మొత్తం మానవజాతినే ప్రేమించడంలోని సార్థక్యాన్ని తెలుసుకుంది. అప్పుడామె ఆ ఊరికి క్రమంగా ఒక ‘ తల్లి ’ గా మారింది. ఊరి జనమంతా అమె పిల్లలే.

సిద్ధయ్య ఆ ఊరి ప్రతి బాలునికీ, బాలికకూ పాఠం చెప్పిండు. ఫిజిక్స్‌, కెమిస్త్రీ, మాథమ్యాటిక్స్‌.. ఆయన పాఠం చెప్పిన ప్రతి విద్యార్థీ.. ఐ ఐ.టి ల్లో, ఆర్‌.ఇ.సి ల్లో.. గాంధీ మెడికల్‌ కాలేజ్‌ వంటి ఉన్నత స్థాయి వ్యవస్థల్లో చేరి.. చదివి.. ఉన్నతులై.. ఎక్కడెక్కడో.. దేశ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి.,

‘ ప్రతి విద్యావంతుడూ ఒక జ్యోతి. జ్యోతి ఎప్పుడూ మరో జ్యోతిని వెలిగించేందుకు మాత్రమే ఉపయోగపడాలి ’ అని సిద్ధయ్య చెప్పిన మాటను ఆయన శిష్యులందరూ వేదవాక్కుగా పాటిస్తూ.,

మైసమ్మగండి ఊరునిండా ఎప్పుడూ విద్యాపరిమళమే.

సిద్ధయ్య సింహంలా నడుస్తూ.. జానకి గడీని చేరుకున్నాడు. అతని వెనుక వందలమంది అనుచరులు.. అప్పటికే ఇంకా ఇంకా చేరుతున్న శిష్య పరంపర.

ప్రజలందరూ మైసమ్మ గుట్ట దగ్గరికి పరుగెత్తడంతో ఊరు ఊరంతా ఖాళీగా ఉంది. ఒక్క శివాలయం అర్చకుడు శేషగిరి మాత్రం సిద్ధయ్య సూచనపై జానకి పార్థివ శరీరం దగ్గరే నిలబడి.. విషణ్ణ వదనంతో.. రాత్రినుండి.

సిద్ధయ్య గడీ వాకిట్లోకి ప్రవేశించి.. జానకి శిరోభాగం దగ్గర ప్రజ్వలిస్తున్న ఆముదపు దీపపు వత్తిని ఎగద్రోసి.. ఒక్క క్షణం నిశ్శబ్దం పాటించి.. అప్పుడే నిద్రలోకి జారుకున్నట్టున్న జానకి ప్రసన్న వదనాన్ని తదేకంగా వీక్షించి.,

‘‘ శేషగిరి గారూ.. ఇప్పుడు ఈ ఊళ్ళోనుండి ఒక తార దివికేగింది.. మరోవైపు ధర్మసంరక్షణార్థం.. ఒక దుష్ట సంహారం జరుగబోతోంది.. ఈ పవిత్ర ముహూర్తాన్ని జ్ఞాపకముంచుకోండి ’’ అని అడుగులను సంధిస్తూనే,, ‘‘ ఈ వచ్చిన మన ఊరి పూర్వ విద్యార్థుల సారథ్యంలో మీరు జానకి శవయాత్రకు సన్నాహాలు ప్రారంభించండి. నేను వచ్చి ఊరేగింపు మధ్యలో కలుస్తా ’’ అని అపర వీరభద్రునిలా వెళ్లిపోయాడు పెద్ద పెద్ద అంగలతో. అతని వెంట అతని సైన్యం .. ఓ యాభై అరవై మంది కదిలిండ్లు ప్రవాహంలా.

సిద్ధయ్య మైసమ్మ గుట్ట దగ్గరికి చేరేసరికే అతను ఊహించినట్టే ఒక యుద్ధ వాతావరణం ఉంది మహోగ్రంగా. గుట్ట చుట్టూ చుట్టుముట్టి నిలబడ్డ ఊరి ప్రజలు భూమిలోనుండి మొలిచిన శూలాల్లా ఉన్నారు.

ఎదురుగా తన ప్రైవేట్‌ గూండా సైన్యంతో .. బుల్డోజర్స్‌, క్రేన్స్‌, ఎర్త్‌ మూవర్స్‌.. టిప్పర్స్‌ తో.. మోహరించి.. ఎమ్మెల్యే శివానందం.

శివానందం.. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీనుండి గెలిచాడు. అంతకుముందు అతను సి.పి.ఎం. ఆ పార్టీ మారి నానా గడ్డి కరిచి కాంగ్రెస్‌ టికెట్‌ సంపాదించి.. గెలిచిండు విపరీతంగా డబ్బు పంచి. మొన్న అధికారంలోకి బి.జె.పి రావడానికి తోడ్పడ్తూ.. లోపాయికారిగా ‘ మంత్రి ‘ పదవిని గ్యారంటీగా పొందే ఒప్పందంపై.. మొన్ననే బి.జె.పి తీర్థం. పార్టీ మార్పిడి. ఈ గోడ దూకుడుకు లంచం కింద ‘ మైసమ్మ గుట్ట ’ కానుక.. ‘ మైనింగ్‌ కాంట్రాక్ట్‌.. పదేళ్ళ పాటు.

ఈ పవిత్ర పుణ్యభూమిపై రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టి నీతి నియమాలు, నైతిక విలువలు, న్యాయధర్మాలు సకలమూ భూస్థాపితమైపోతున్నాయి. ఎక్కడో ఒకచోట ఈ దుష్ట రాజకీయుల విచ్చలవిడితనాన్ని నిర్మూలించి ప్రజలంటే ఏమిటో.. రుచి చూపించాలి.

‘‘ ప్రక్కకు తప్పుకోండి.. లేకుంటే ఈ బుల్డోజర్లు మిమ్ముల్ని తొక్కుకుంటూ ఈ మైసమ్మ గుట్టమీదికి పోతై బిడ్దా ’’ అని అరుస్తున్నాడు శివానందంముత్తక్క అనే ముసలమ్మ ముందట నిలబడి అరుస్తూ.. కోపంతో ఊగిపోతూ.

‘‘ ఎవడౌరా నువ్వు మా గుట్టను ముట్టుకునేటానికి. నీ అయ్యదా ఇది.. ఏదీ రారా ‘‘ అని ముత్తక్క కొంగును నడుంచుట్టు బిగిస్తోంది. అప్పుడు ప్రవేశించిండు సిద్ధయ్య.

నిలకడగా.. స్థిరంగా.. శాంతంగా ‘‘ ఏమిటి శివానందం.. ఈ గుట్ట నీదా.. ఊరికి ఆభరణంగా ప్రక ృతి ప్రసాదించిన వరం ఈ గుట్ట. దీన్ని లీజ్‌ కు గీజ్‌ కు ఇవ్వడానికి ఏ ప్రభుత్వాలకూ అధికారం లేదు. ఇక్కడినుండి ఒక్క రాయి ముక్కనుకూడా తీసుకుపోనివ్వం. చెప్పుకోపో మీ ప్రభుత్వాలకు. ప్రజల మాటను వినాలె ప్రభుత్వాలు. అంతేగాని నీ వంటి లోఫర్లకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాల మాటను ప్రజలు వినరు తమ సహజ వనరులను ఫణంగా పెడ్తూ.. ఐనా.. నువ్వు మూడు నెలల్లో మూడు పార్టీలను మార్చుతూ ఏం చేస్తానౌరా బ్రూట్‌. ప్రజాస్వామ్యమంటే మజాక్‌ చేస్తానవా. ఒక నియోజకవర్గ ప్రజలచేత ఎన్నుకోబడి వాళ్ళ అనుమతి లేకుండానే నిన్ను నువ్వు అమ్ముకుని గోడలు దూకి పార్టీలను మారుస్తవా. మరి.. నిన్నెన్నుకున్న ప్రజల సంగతేమిటి.. నీ ప్రజాద్రోహాన్ని చూస్తూ ఊర్కోడానికి ప్రజలు దద్దమ్మలు కారు గుర్తుంచుకో. నిన్ను ఈ క్షణం ఈ మైసమ్మ గండి ఊరి ప్రజాదర్బార్‌ లో బహిరంగంగా శిక్షిస్తున్నాం.. నీకు ప్రజలు వేస్తున్న ఈ శిక్ష నీ వంటి గోడదూకుడు గాళ్లకు సింహస్వప్నం కావాలె. గెట్‌ రెడీ.. నీకు ఊళ్ళళ్ళ ఉన్న గుట్టలకు గుట్టలే కావాల్నా బిడ్డా.. ’’

సిద్ధయ్య వెనుకనుండి ఎవరో చటుక్కున పేల్చిన పిస్టల్‌ గుండు లిప్తకాలంలో శివానందం గుండెలోనుండి దూసుకుపోయింది.

ఎర్రగా రక్తం చిమ్ముతూండగా..‘‘ అమ్మామ్మామ్మా’’ అన్న ఎమ్మెల్యే శివానందం కేక మైసమ్మ గుట్టల్లో ప్రతిధ్వనించింది.

‘‘ ఒక పార్టీ అభ్యర్థిగా ప్రజలచేత ఎన్నుకోబడి.. తర్వాత ఆ ఎన్నుకున్న ప్రజల అనుమతి లేకుండా అమ్ముడుపోతూ పార్టీలు మార్చే ప్రతి వెధవా ఈ ఘటనతో వణికిపోవాలె. భవిష్యత్తుకీ ఘటన ఒక మార్గదర్శకం కావాలె’’ అని సిద్ధయ్య శివానందం మృత శరీరంపైనుండి నడచి అడుగులు వేస్తూండగా.. వెనుక ఊరి జనమంతా ఉప్పెనలా కదిలింది అతని వెంట.,   చచ్చిన ఎమ్మెల్యే శివానందం తోక్కుకుంటూ

అప్పుడే మైసమ్మ గుట్ట దగ్గరికి జానకి శవయాత్ర చేరువౌతూండగా.. సూర్యాస్తమౌతోంది.

అప్పటిదాకా కాలభైరవునిలా ఊగిపోతున్న సిద్ధయ్య.. వందలమందితో తరలివస్తున్న ఊరేగింపును చేరుకుని.. పూనకంతో ఊగిపోతూ అందుకున్నాడు ఒకమిత్రుని చేతిలోని మాదిగ డప్పును. ఆ క్షణం అతని చేతిలోని వెదురు పుల్లలు మెరుపు కడ్డీలై మ్రోగినై. దద్దరిల్లింది ప్రకృతి. శివుడై నర్తిస్తూ తాండవిస్తున్నాడు సిద్ధయ్య.

జనంలోకి ప్రేమ నిండిన మహాదావేశం ఏదో నిప్పుల ప్రవాహంలా ప్రవహిస్తోంది.

‘ హత్య.. సంహారం.. రెండూ ఒకటి కావు.’

యథా యథాహి ధర్మస్య..,

సిద్ధయ్య డప్పును వాయిస్తూ మహోగ్రంగా నర్తిస్తున్నాడు ప్రళయకాల రుద్రుడై.

 

* * *

1 thought on “లోపలి ఖాళీ – సిద్ధయ్య మఠం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *