June 24, 2024

విరించినై విరచించితిని … వంటింట్లోనే కాదు మార్కెటింగ్‌లోనూ వీరు అసాధ్యులే!

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి

 

గృహిణిలు వ్యాపారం చెయ్యటం సాధ్యమా?

సాధ్యమేనని నిరూపించారు విజయలక్ష్మి, శకుంతల, కృష్ణవేణి, నాగలక్ష్మి.

గృహిణులు కూడా వ్యాపారం చేసి ఎలా విజయం సాధించగలరో తెలుసుకోటానికి వీరిని పాఠకులకు పరిచయం చేస్తున్నాము.

 

ప్ర. విజయలక్ష్మిగారూ! మీరు ఈ ఒన్‌ గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు?

జ. మొదట్లో లక్ష రూపాయల పెట్టుబడితో 2001లో బంగారు నగల వ్యాపారం ప్రారంభించాను. బంగారం రేటు పెరగటంతో 2003 నుంచి ఒన్ గ్రామ్ గోల్డ్ నగల వ్యాపారం చేస్తున్నాను.

ప్ర. మీరు నగలు తయారుచేయిస్తారా?

జ. లేదండీ. ఎక్కువగా ముంబై నుంచే తెచ్చి ఇక్కడ సేల్ చేస్తుంటాను.

ప్ర. మీ దగ్గర ఏ ఏ రకాలు ఉన్నాయి?

జ. పాపిడిబిళ్ళలు, జడలు, కొప్పులకి పెట్టుకునే పిన్నులు ఇలా చాలా రకాలు ఉన్నాయి. వెరైటీ డిజైన్స్‌తో, బీడ్స్‌తో, రంగురంగుల రాళ్ళతోనూ ఉన్నాయి. మెడలో వేసుకునే రాళ్ళ నెక్లెస్లు, లాంగ్ హారాలు, వాటికి మేచ్ అయ్యే దుద్దులు, హేంగింగ్స్, అన్నిరకాల డిజైన్స్ రంగు రంగుల రాళ్ళతోను, బీడ్స్, పచ్చలు, కెంపులు, ముత్యాలతోను ఉన్నాయి. గాజులలోనూ ఇలాగే చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు సెట్ బాంగిల్స్ అని కొత్త రకానివి వస్తున్నాయి. వడ్డాణాలలో కూడా ఎన్నో రకాల డిజైన్లు, బీడ్స్, రంగురంగుల రాళ్ళతోనూ వస్తాయి. పచ్చలు, కెంపులు, ముత్యాలు తాపడం చేసినవి బాగా మెరుస్తూ చాలా అందంగా ఉంటాయి. మనం ‘నడుంజాలర్లు’ అంటాము. హిందీవాళ్ళు ‘కందోరాలు’ అంటారు. అవి ఇప్పుడు బాగా ఫ్యాషన్. మిడిల్ ఏజ్ వాళ్ళు వాటిని ఇష్టంగా కొని వాడుతున్నారు.

ప్ర. మీ దగ్గర ఏ రకం నగలు ఎక్కువగా కొంటారు?

జ. అన్నిటికీ గిరాకీ బాగానే ఉంది. ‘యాంటిక్’ జ్యూయలరీని ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. ఎంత ఖరీదైనా కొంటున్నారు. అందుకని ఆ రకాలే ఎక్కువ తెస్తున్నాను.

ప్ర. మీ ఇంటికే వచ్చి జ్యూయలరీ కొంటారా?

జ. మొదట్లో మహిళలకి ఈ నగల ప్రాముఖ్యత తెలిసేదికాదు. వాటి గురించి చెప్పటానికి చాలా కష్టపడవలసి వచ్చేది. ఇప్పుడు మౌత్ టు మౌత్ పబ్లిసిటీతో నా వ్యాపారం బాగా పెరిగింది. నా ఖాతాదారులు దగ్గర దగ్గర నాలుగు వందలమంది దాకా ఉన్నారు. ఫోన్ చే సి వాళ్ళకి కావలసిన డిజైన్స్ ఆర్డర్ చేస్తారు.ఉద్యోగినులకి షాపింగ్‌కి టైమ్ దొరకదు. అందుకని నేనే వాళ్ళడిగిన వెరైటీలు తీసుకువెళ్ళి ఇస్తాను.

ప్ర. మీ వారు, పిల్లలు ఎలా సహకరిస్తున్నారు?

జ. మా అబ్బాయిలిద్దరూ బి.టెక్. చదువుతున్నారు. ఖాళీగా ఉండటం ఇష్టంలేక ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను. మా వారు పెట్టుబడి పెట్టటానికి లక్షన్నర రూపాయలిచ్చి సహకరించారు. దానితో నాకిష్టమైన ఈ వ్యాపారం ప్రారంభించాను. నా డిగ్రీ అయ్యాక బిజినెస్ మొదలుపెట్టాను. ఇప్పుడు ఎమ్.బి.ఏ. చేస్తున్నాను. 2009 ఏప్రియల్‌కి అయిపోతుంది. నా చదువుకీ, వ్యాపారానికీ కూడా మా వారు ఎంతో సహాయం చేస్తున్నారు. నా డబ్బుతో బండి కొనుక్కున్నాను. కస్టమర్స్ ఇళ్ళకి వెళ్ళటానికి ఈజీగా ఉంది. ఇంటి బాధ్యతలు, వ్యాపారం రెండూ చక్కగా చేసుకోగలుగుతున్నాను. చీరల డ్రెస్లకీ నప్పుతాయని, మేచింగ్గా ఉంటాయని ఎక్కువమంది ఈ నగలు కొంటున్నారు. వ్యాపారం బాగుంది.

 

ఎక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి మంచి లాభాలు పొందుతున్న గృహిణి విజయలక్ష్మిగారి విజయాలు చూశారు కదా!

***

 

ఇప్పుడు కొద్దిపెట్టుబడితో స్వంతంగా ఇంట్లో తయారుచేసిన వస్తువులతో బిజినెస్ చేస్తున్న గృహిణి ఎమ్. శకుంతలాదేవిగారిని కలుద్దాం!

 

 

ప్ర. దేవిగారూ! తళతళ మెరిసే ఈ కాసుల పేరు దండలు మీరే చేశారా?

జ. అవునండీ. ఈ మెరిసే బిళ్ళలు మూడురకాల సైజుల్లో దొరుకుతాయి. నేను చేసే దండనుబట్టి ఈ మెరుపు బిళ్ళలు కొని వాటికి కాంబినేషన్‌గా గోల్డ్ పూసలు, ముత్యాలు, పగడాలు, నల్లపూసలు, పచ్చలు, కుందన్లు, బీడ్సు కలిపి కాసులు పేరు దండలు చేస్తాను. ఇవి ఎక్కువగా ఇంట్లో చిత్రపటాలకి వెయ్యటానికి, డెకొరేట్ చేయడానికి వాడతారు. లంగా, ఓణీలు వేసుకునే పిల్లలకి వడ్డాణంలాగా కూడా తయారుచేశాను. భరతనాట్యం చేసే పిల్లలకోసం ఈ కాసులతోనే కొంచెం రిచ్‌గా కనపడేలాగా మెడలోకి, నడుముకి తయారుచేసి ఇస్తాను. ఇవి ఎంత పెద్దగా ఉన్నా చుట్టలాగా చుట్టి కవర్లో పెట్టి మనతో ప్రయాణాలకి తీసుకుని వెళ్ళటానికి అనువుగా చేశాను. బంగారు రంగు ఆకులతో ద్వారబంధానికి, మండపాలకి తోరణాలు చేశాను. శుభసూచకంగా, బంగారు ఆకులను ఎరుపు, ఆకుపచ్చ రంగులతో డెకొరేట్ చేశాను.

మిక్స్‌డ్ పాలియస్టర్ క్లాత్ ఇరవై రంగుల్లో లభిస్తుంది. దానితో చిన్న గులాబీల నుంచి పెద్ద గులాబీలదాకా ‘చామంతి, మల్లె, టెంకిస్, జినియా’ అలా చాలా రకాల పూలు తయారుచేశాను. వాటితో బంగారురంగు ఆకులు, పూసలు, ముత్యాలు, బీడ్స్, ఎరుపు, ఆకుపచ్చ పూసలు కలిపి పూలబొకేలు చాలారకాలు తయారుచేశాను. గంటలు, బొమ్మలు, మెరుపు బిళ్ళలు, కుందన్లు అన్నిటితో డెకొరేట్ చేశాను. గులాబీ పూలదండలకి, సంపెంగ పూలదండలకి, పూలబొకేలకి గిరాకీ బాగా ఉంది.

థర్మోకోల్‌తో పళ్ళెం ఆకారం తయారుచేసి రంగు కాగితాలు, రంగురంగుల పూసలు, కుందన్లు ఉపయోగించి థాల్ (దీపారాధన పళ్ళెం) అందంగా తయారుచేస్తాను. ఇవి ఆర్డరిచ్చి మరీ చేయించుకుంటున్నారు.

ఊలుతో షాల్స్, స్వెట్టర్స్, టెలిఫోన్ మేట్స్, హాఫ్ డోర్ కర్టెన్స్, స్కార్ఫులు చేస్తాను. చలికాలానికి ముందునుంచే వీటికోసం ఆర్డర్లు వస్తాయి.

ప్ర. మీరు ఈ వ్యాపారం ఎప్పటినుంచి చేస్తున్నారు? మీ వారు, పిల్లలు ఎలా సహకరిస్తున్నారు?

జ. మొదట్లో సరదాగా తయారుచేసి గిఫ్టుగా ఇచ్చేదాన్ని. అందరూ ఇష్టపడి కావాలని అడుగుతుండడంతో కొద్ది పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాను. ఐదేళ్ళక్రితం వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడది ఫోన్ మీద ఆర్డర్లు తీసుకుని చేసేంతగా పెరిగింది. మా వారికి బిజినెస్‌లో ఇంతకుముందు సాయం చేసేదాన్ని. ఇప్పుడు నాకు నా బిజినెస్సే  సరిపోతోంది. పాప యు.ఎస్  లో  ఎమ్.ఎస్ చేస్తున్నది. బాబు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. నాకు దొరికిన ఖాళీ సమయాన్ని వృధా చేసుకోవటం ఇష్టం లేక కాలక్షేపంగా మొదలుపెట్టిన వ్యాపారం ఇప్పుడు బాగా పెరిగింది. నేను స్వంతంగా తయారుచేసినవి అందరూ ఇష్టపడి ఆర్డరిచ్చి, ఫోన్లు చేసి మరీ కొంటుంటే ఎంతో తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. దాంతో నేను నా శ్రమంతా మర్చిపోతాను.

 

తన శ్రమను వ్యాపారంగా మలచుకున్న దేవిని అభినందిద్దాం!

***

చిన్న వయసులోనే చీరల వ్యాపారం చక్కగా చేస్తున్న కృష్ణవేణిగారిని పలకరిద్దాం!

 

ప్ర. కృష్ణవేణిగారూ! మీరు చూస్తే వయసులో చిన్న. మరి మీరు ఈ చీరల వ్యాపారం ఎప్పటినుంచి చేస్తున్నారు?

జ.1993లో మా పెళ్ళి అయింది. మా బంధువులకి, ఫ్రెండ్స్‌కి, జాకెట్లు, చీరల ఫాల్స్, డ్రెస్లు నేను కుట్టేదాన్ని. ఆరు సంవత్సరాల క్రితం మా వారు ఇచ్చిన ఐదువేలతో చీరెల వ్యాపారం మొదలుపెట్టాను.

ప్ర. మీరు ఏ రకం చీరలు సేల్ చేస్తారు?

జ. అన్ని రకాల నేతచీరలు, గుంటూరు జరీచీరలు, గద్వాల చీరలు, లేజర్ చీరలు, వర్క్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అమ్ముతాను.

ప్ర. చీరలు ఎక్కడ నుంచి తెస్తారు?

జ. సాధారణంగా హైదరాబాద్‌లో హోల్‌సేల్‌లో కొంటాను. విజయవాడ, చీరాల, గుంటూరు, మంగళగిరిల నుంచి కొనుక్కు వస్తాను. ఈ సంవత్సరం సూరత్ వెళ్ళి అక్కడ మిల్లు దగ్గర నుంచి చీరలు తెచ్చాను. అక్కడ బాగా తక్కువ ధరకు వస్తాయి. చీరలు మంచి క్వాలిటీవి కావటంతో బాగా సేల్ అవుతాయి.

వ్యాపారం మొదలుపెట్టినప్పుడు తెలిసినవాళ్ళు, బంధువులు వచ్చి కొనుక్కుని వెళ్ళేవారు. అలా అందరికీ తెలిసి ఇప్పుడు అందరూ ఇంటికి వచ్చి తీసుకుని వెళుతుంటారు. ఒక్కోసారి ఇన్స్టాల్‌మెంట్‌ మీద కూడా ఇస్తాను. ఫోన్ చేసి వస్తుంటారు కాబట్టి నాకు ఇబ్బంది ఉండదు. గృహిణులే కాదు, ఉద్యోగినులు కూడా వచ్చి తీసుకుని వెళతారు. స్టాకు రాగానే వచ్చి కొనుక్కుని వెళతారు. వ్యాపారం బాగా పుంజుకుంది. ఆ డబ్బులు రొటేట్ చేస్తూ లాభాలలో కొంతమాత్రమే వాడుకుంటాను.

ప్ర. ఇప్పుడు ఏ చీరలకి డిమాండ్ ఉంది?

జ. వర్క్ శారీస్ బాగా కొంటున్నారు. ఫ్యాన్సీ చీరలు కూడా బాగానే కొంటారు.

ప్ర. ఇటు బిజినెస్, అటు గృహిణిగా. ఎలా మేనేజ్ చేస్తున్నారు?

జ. అందరూ ఫోన్ చేసి ఇంటికి వచ్చి తీసుకువెళతారు. కాబట్టి నాకు ఇబ్బంది కాదు. ఎవరికైనా అర్జంటుగా కావాలని నా పని టైంలో వచ్చినా ముందుగా వాళ్ళకు కావలసినవి ఇచ్చి పంపి, తర్వాత నా పని చేసుకుంటాను. అమ్మాయి నైన్త్, అబ్బాయి సెవెన్త్ చదువుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు.

ప్ర.మీ వారి సహకారం ఎంత?

జ.ఆయన పూజారిగా చేస్తున్నారు. నేను చీరల కోసం ఊళ్ళకి వెళ్ళాలంటే మా వారు కానీ, మా అన్నయ్యలు కానీ తోడు వస్తారు.

ప్ర.ఈ బిజినెస్ చెయ్యాలని మీకెందుకనిపించింది?

జ. చీరలంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టంలేక నాకిష్టమైన చీరలతోనే బిజినెస్ మొదలుపెట్టాను.

 

***

 

 

శ్రమనే పెట్టుబడిగా పెట్టి చీరలమీద పెయింటింగ్, ఎంబ్రాయిడరీలు చేస్తూ మంచి పేరుతోపాటు డబ్బుకూడా గడిస్తున్న నాగలక్ష్మిగారి అభిప్రాయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

ప్ర. నాగలక్ష్మిగారూ ఈ వర్క్ శారీస్ మీరు చేసినవేనా?

జ. అవునండీ! నాకు చేతిపనులు చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ ప్రోద్బలంతో పెయింటింగ్, హేండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను. మూడు సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నాను.

ప్ర. చీరలు మీరే కొని కుడతారా?

జ. కాదండీ. చీరలు, డ్రెస్ మెటీరియల్ వాళ్ళే తెచ్చి ఇస్తారు. నా దగ్గర ఉన్న డిజైన్స్ చూసి సెలక్ట్ చేసుకుంటారు. నేను వాళ్ళ ఇష్టాన్నిబట్టి ఎంబ్రాయిడరీ లేదా పెయింటింగ్ చేసి ఇస్తాను.

ప్ర. ఎంబ్రాయిడరీతో ఎన్ని రకాలు చేస్తారు?

జ. మామూలుగా చేసేవి కాకుండా సీక్వెన్స్, బ్రీడ్స్, మోతీవర్క్, షిష్ బోన్, హెర్రింగ్ బోన్, బంజీరా మిర్రర్ వర్క్, ఆప్లిక్ వర్క్, మగ్గం వర్క్, జర్దోసీ, కుందన్ వర్క్, ఆలోవర్ డిజైన్ ఇవన్నీ ఎంబ్రాయిడరీ చేస్తాను.

ప్ర. పెయింటింగ్స్ కూడా రకాలు ఉన్నాయా?

జ. బ్లాక్‌లైన్, రేడియేషన్, ఫిల్లింగ్, డిజైన్, యాంటెల్ తోపు (జింకల డిజైన్) మోనోక్రొమాటెక్స్, మధుబని డిజైన్, టెంటీ, పంచ్ డిజైన్, వాటర్ ఎఫ్టర్, ఎంబోజింగ్, కేట్ డిజైన్, స్ట్రెన్సిల్, థ్రెడ్ పెయింటింగ్, శాండ్ పేపర్ పెయింటింగ్, బ్లాక్ ప్రింట్స్, జ్యూయలరీ డిజైన్.

ప్ర. కొన్ని వెరైటీల గురించి చెప్పండి?

జ. ఎంబోజింగ్, శాండ్ పేపర్ పెయింటింగ్, వాల్ హేంగింగ్స్ చేస్తాము. మధబని డిజైన్, రాజస్థానీ డిజైన్. ఇది పట్టుచీరలు. టస్సర్ చీరలమీద బాగుంటుంది. బ్లాక్ ప్రింట్ చేస్తే ఒరిజనల్ ప్రింటెడ్ చీరలాగా ఉంటుంది. జ్యూయలరీ డిజైన్ పట్టుచీరలు, పట్టులంగాల మీద బాగుంటుంది. ఆభరణాలన్నీ ఈ డిజైనే వస్తాయి. చూడటానికి చాలా రిచ్‌గా ఉంటుంది. పెళ్ళిళ్ళకి, మ్యారేజ్ యానివర్సరీలకి ఇవి ఎక్కువగా చేయించుకుంటారు.

ప్ర. ఒక్కో చీరకు మీకు ఎంత సమయం పడుతుంది?

జ. హేండ్ వర్క్ అయితే మూడు నెలలు. పెయింటింగ్ అయితే వారం రోజులు పడుతుంది. ఒక్కోసారి డిజైన్ని బట్టి చేసే టైం పెరుగుతుంది.

ప్ర. ఈ ఉయ్యాల ఏమిటి?

జ. నైలాన్ లేసులతో చిన్న ఉయ్యాలలు అల్లుతాను. వాటిని హాల్లో హేంగ్ చేసి దాంట్లో చిన్న టెడ్డీబేర్ కాని, బొమ్మకాని పెడితే ఎంతో అందంగా ఉంటుంది. వాటిని ఈ మధ్య అమెరికాకి కూడా కొనుక్కుని వెళ్ళారు. ఐదు ఉయ్యాలల దాకా అమెరికా వెళ్ళాయి. ఇప్పుడు ఇంకో నాలుగు ఆర్డర్లు చెయ్యాల్సినవి ఉన్నాయి.

ప్ర. ఇంట్లో పనితో ఇవన్నీ తయారుచెయ్యటానికి మీకు సమయం సరిపోతుందా?

జ. ఉదయం ఐదు గంటలకే లేచి వంట, టిఫిన్ రెడీ చేసేస్తాను. మా వారికి, అబ్బాయిలిద్దరికీ బాక్స్ లు కట్టి ఇచ్చేస్తాను. వాళ్ళంతా ఎనిమిదిన్నరకే వెళ్ళిపోతారు. అప్పటినుంచీ పిల్లలు వచ్చేదాకా నా వర్క్ చేసుకుంటాను. మా పెద్దవాడు ఇంటర్, రెండోవాడు ఎయిత్ క్లాస్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మా వారు కూడా బాగా సహకరిస్తారు.

వారానికి రెండు రోజులైనా సోషల్ సర్వీస్ చేస్తాను.

ప్ర. ఈ వ్యాపారం మీకు ఎలా ఉంది?

జ.  ఖాళీగా ఉండకుండా చేతినిండా పని ఉండడంతో ఇటు తృప్తిగానూ ఉంది. అటు డబ్బులూ వస్తాయి. ఇంట్లోనే ఉండి ఈ వ్యాపారం చేసుకోవటం నాకు గౌరవంగానూ ఉంది. పెట్టుబడి లేని వ్యాపారం. కాకపోతే నా శ్రమనే పెట్టుబడి కింద పెట్టి చేసే వ్యాపారం. ఇష్టంగా చెయ్యటంతో కష్టం అనిపించటం లేదు. మనసు, శరీరం బిజీగా ఉండటంతో ఆరోగ్యంగా కూడా చాలా బాగుంది. అందుకే అన్నారు పెద్దలు ‘ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్’ అని.

 

******

 

 

1 thought on “విరించినై విరచించితిని … వంటింట్లోనే కాదు మార్కెటింగ్‌లోనూ వీరు అసాధ్యులే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *