April 25, 2024

గోపమ్మ కథ… 8

రచన: గిరిజారాణి కలవల

 

గోపమ్మని అలాంటి పరిస్థితుల్లో చూసాక, ఎలా ఓదార్చాలో కూడా తెలీలేదు నాకు.

“ఊరుకో! గోపమ్మా! వాడికి అంతవరకే రాసి పెట్టి వుంది. మన చేతుల్లో ఏముంది చెప్పు.” అన్నాను.

“చేజేతులా చేసుకున్నాడమ్మగారూ! వాడి చావుని వాడే కొనితెచ్చుకున్నాడు. సంపాదించినదంతా… ఆ తాగుడికీ, చెడ్డ తిరుగుళ్ళకీ పెట్టి… నడి వయసులోనే చచ్చిపోయాడు. మా ఇళ్ళలో మగాళ్ళందరికీ ఇది మామూలే కదమ్మా! ఇలాంటి చావులు చస్తూనే వుంటారు. మా పీకల మీదకు తెస్తూనే వుంటారు.” అంది. పోతా పోతా అప్పులు సేసి మరీ పోతారు. మేము చచ్చేదాకా… వాటిని తీరుస్తూ వుండాలి. మా బతుకులే అలాంటివి.” నిర్వేదంగా అంది గోపమ్మ.

పాపం… నాకు ఆ మాటలకి చాలా జాలి కలిగింది. ‘ఎందుకిలా ప్రవర్తిస్తారు వీళ్ళందరూ? కారణం ఏంటి? చదువులేక పోవడమా? చెప్పేవారు లేకపోవడమా? బాధ్యతా రాహిత్యమా? ఏదైనా కానీ… వీళ్ళ అలవాట్ల మూలానా… జీవితాలు నాశనమయిపోతున్నాయి.’ అని అనుకున్నాను.

“బాధపడకు గోపమ్మా! ఒక రకంగా నీ కష్టాలు తీరాయనే అనుకోవాలి. పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసేసావు. ఇక నీ జీవితం ఎలాగోలా సాగిపోతుంది.” అని చెప్పి… తన చేతిలో ఖర్చులకి వుంచమని,ఓ ఐదువేలు పెట్టాను.

రెండు చేతులూ జోడించింది. “మా ఇళ్ళల్లో పుట్టినపుడు వేడుక చేయకపోయినా… చచ్చాక మాత్రం గొప్పగా చేయాలమ్మగారూ! శవాన్ని పారేసటప్పటి నుంచి… సారాయి పారుతూనే వుండాలి. ఖర్చు మామూలుగా వుండదు. మా కులపోళ్ళందరికీ… చిన్న దినం, పెద్ద దినంకి పలావులు వండించి పెట్టాలి. డబ్బు ఎలా వస్తుంది? అని కూడా అనుకోరు. అప్పు చేసి మరీ పెట్టాలి.” అంది.

ఏం చెప్పాలో తెలీలేదు నాకు.

“నువ్వు కొంచెం కుదుటపడ్డాక, మామూలుగా పనికి వచ్చెయ్యి గోపమ్మా! నాకు ఎలాంటి పట్టింపులూ లేవు.” అని చెప్పాను.

“మీరు మంచి మనసుతో చెప్పారు కానీ, అమ్మా! మా ఇళ్ళలో మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ పోయేదాకా.. వీథి గుమ్మం తొక్కకూడదమ్మా! అప్పటిదాకా నా కోడలు కానీ, మా అక్క కానీ వచ్చి చేస్తారు.” అని చెప్పింది.

“సరే, నీ ఇష్టం” అని చెప్పి, అక్కడ నుంచి బయలుదేరాను.

ఇంటికి వచ్చే దారిలో అంతా గోపమ్మ గురించి ఆలోచనలే.

మొదటినుంచీ కూడా పాపం కష్టజీవే! ఇంటి గురించి, పిల్లల పోషణ ఏదీ కూడా పట్టించుకోని భర్తతో అగచాట్లు పడింది. ఇప్పుడు వాటి నుంచి విముక్తి చెందింది. తనకి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు సంతోషించాలో, బాధపడాలో కూడా తెలీడం లేదు.

ఇలా కింద తరగతి మనుషులలో… వీళ్ళందరూ ప్రతీదీ సామాన్యంగానే తీసుకుంటారు. చావు పుటకలకి వీళ్ళ స్పందనలు పెద్దగా వుండవు కదా అనుకున్నాను.

అప్పుడే నాకు శ్యామల గుర్తుకొచ్చింది. ఒకప్పుడు మా ఇంటి వెనక వైపున వున్న చిన్న గదిలో అద్దెకు వుండేవారు మోహన్,

శ్యామల. వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు. ఆరేళ్ల కూతురు, మూడేళ్ల కొడుకు.  మోహన్ ఏదో ప్రవేట్ కాలేజీ లో గుమాస్తాగా చేసేవాడు. మధ్య తరగతి జీవితం వారిది. మోహన్ కి వచ్చే జీతం, పొదుపుగా వాడుకుంటే … ఫర్వాలేదు బాగానే సాగేది కుటుంబ జీవనం.

కానీ మోహన్ కి పట్టుకున్న వ్యసనం తాగుడు మహమ్మారి. దాంతో ఆ కుటుంబం అస్తవ్యస్తం అయిపోయింది. వచ్చిన జీతం మొత్తం దానికే అవగొట్టడమే కాకుండా అప్పుల పాలయిపోయాడు. ప్రతిరోజూ శ్యామలకి నరకం చూపించేవాడు. పాపం, బయట పడితే పరువు పోతుందని, తనలో తానే కుమిలిపోయేది. పిల్లలకి సరైన పోషణ వుండేది కాదు. తనంతట తాను బయటకి వచ్చి ఏదైనా పని చేసుకోవాలంటే… ఎక్కడలేని పరువూ అక్కడ అడ్డు వచ్చేది. చేయి చాపి ఎవరి సహాయమైనా తీసుకోవాలంటే సిగ్గు, ముఖమాటం పడేది.

అదంతా చూస్తుంటే, నాకు చాలా బాధ కలిగేది. తన వద్దంటున్నా కూడా, నేను ఏ కూరో, పప్పో, ఇలా వాళ్ళకోసం కూడా చేసి ఇస్తూ వుండేదాన్ని. అప్పుడప్పుడు, నాకు చేతనైన పదో పరకో శ్యామల చేతిలో పెడుతూ వుండేదాన్ని. తీసుకోవడానికి చాలా అభిమానపడేది.

ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మోహన్ లో మార్పు వచ్చేది కాదు. చేతిలో డబ్బు ఆడక, తాగడానికి కుదరకపోతే ఆ కోపం శ్యామల మీద చూపించేవాడు. ఈ బాధలు భరించలేక, ఒకరోజు శ్యామల పిల్లలిద్దరికీ పాయసంలో,  విషం కలిపి ఇచ్చి, తాను ఉరి పోసుకుని జీవితాన్ని ముగించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే మోహన్ ఆరోగ్యం కూడా క్షీణించి. లివర్ మొత్తం డ్యామేజ్ అయిందట. ఆ జబ్బుతో అతను కూడా చనిపోయాడు.

అప్పుడు నాకు అనిపించింది… ఈ మధ్యతరగతి మనుషులు… ? పరువు, పరువు అని ఆలోచిస్తారు. ఎవరేమనుకుంటారో అనుకుంటూ వుంటారు. మార్పు రాలేని, దుర్వ్యసనాల పాలయిన అటువంటి భర్తతో జీవనం సాగించడం కష్టమయితే తెగతెంపులు చేసుకుని, బయటకి వచ్చేసి, ఏదో ఒక పని చేసుకుని, పిల్లల్ని పోషించుకోలేని అశక్తులై, ముందుకు సాగడానికి, ఏ ఆధారమూ లేదనుకుని, పిరికితనంతో జీవితాలనే ముగించేసుకుంటారు.

ఆలోచిస్తే.. గోపమ్మ లాంటివారి జీవితాలే నయమనిపించింది. జీవిత గమనాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇప్పుడు భర్త లేకపోయినా కూడా … ఏ కష్టమయినా ఎదురీద గలదు. ఎవరేమనుకున్నా లెక్కచేయరు. ఆర్ధికంగా కూడా తమకి తాము స్వావలంబన చేకూర్చుకోగలరు.

ఏదైనా ఈ మద్యపానం అలవాటు ఎన్ని జీవితాలనో అతలాకుతలం చేస్తుంది. వారి బతుకులలో తీరని నష్టాన్ని కలుగచేస్తుంది. తెలిసి కూడా ఆ వలలో చిక్కుకుని, అంజి, మోహన్ వంటివారెందరో నాశనం అయిపోతున్నారు. వారి బతుకు చిందర వందర కావడమే కాకుండా వారి కుటుంబాన్ని కూడా బలి తీసుకుంటున్నారు.

ఇలాంటి వారిలో మార్పు వస్తే ఎంత బావుంటుందో కదా!  అనుకుంటూ ఇల్లు చేరాను.

 

సమాప్తం.

1 thought on “గోపమ్మ కథ… 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *