April 25, 2024

పక్కవారిది పరమానందం

రచన:వేణి కొలిపాక

ఇల్లంతా హడావిడిగా ఉంది. కమల అన్ని, ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటోంది. సోఫా కవర్లు మళ్ళీ సర్ది, ఫ్లవర్ వాసులు వాటి స్థానాల్లో పెట్టి!! సంగతి ఏమిటంటే వాళ్ళింట్లో ఈరోజు కిట్టి పార్టీ ఉంది.

కమల లాయర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ విధంగా ఆమెకు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఆడవారు స్నేహితులయ్యారు.’

“వంట అయిపోయినట్టే కదా అత్తయ్య” అంటూ,  వంట పర్యవేక్షిస్తున్న అత్తగారిని అడిగింది..’ఆ..అంతా అయినట్టే,  ఇదిగో ఈ అప్పడాలు వేయిస్తే,  అన్ని సర్వింగ్ బౌల్స్ లోకి సర్దించేస్తా ‘అన్నది ఆవిడ. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. కమల వెళ్లి తలుపు తీయగానే,  ఏడు ఎనిమిది మంది రంగురంగుల బట్టల్లో సీతాకోకచిలక లాంటి ఆడవారు ఉన్నారు. వారందరినీ ‘హాయ్,  వెల్కమ్, ప్లీజ్ కం’ అంటూ సాదరంగా ఆహ్వానించింది.. అంతా కూర్చున్నాక,  ‘అత్తయ్య,  రండి మా ఫ్రెండ్స్ వచ్చేసారు ‘ అని పిలిచి ఆవిడను వాళ్లకు పరిచయం చేసింది. అందులో ఒకరు డాక్టర్ అని ఒకరు గవర్నమెంట్ ఆఫీసర్ అని,  ఒకరు సాఫ్టువేర్ లో మంచి పొజిషన్లో ఉన్నారని,  ఒకరు లెక్చరర్ అని,  ఒకరిద్దరు లాయర్లని చెప్పింది. పరిచయాలయ్యాక, అతిధి మర్యాదల అనంతరం వాళ్లంతా కబుర్లలో పడ్డారు.

ఇంతలో ఒక ఆవిడ ‘అబ్బా మీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు పని హాయి!! బోలెడు జీతాలు,  శని,  ఆదివారాలు సెలవులు’ అంది. వెంటనే ఆ సాఫ్టువేర్ ఉద్యోగి ని,  ‘ఏమిటి మా జాబ్స్ హాయా !! మేము లేట్ నైట్ దాకా పనిచేయాల్సి ఉంటుంది.పిల్లలతో సరిగా స్పెండ్ చేయడమే కుదరదు. టార్గెట్స్ తో స్ట్రెస్ బాగా పెంచేస్తారు మా బాస్ లు. అదే మీ లాయర్ లు అయితే హాయిగా కోర్టుకెళ్లటం,  వాదించేయడం,  వచ్చేయటం !! మీకు మీరే బాసులు’ అంది తన ఉద్యోగాన్ని తలచుకొని ఎంతో అసంతృప్తిగా ఆ సాఫ్టువేర్ ఇంజనీర్!!!

‘ భలే చెప్తున్నావు, 30 ఏళ్ల హిస్టరీ పట్టుకొచ్చి,  మూడు గంటలు వాయిస్తారు, ఒక్కో క్లైంట్. వాళ్ళ గోలే గాని మన టైం పట్టించుకోరు. అక్కడ జడ్జిగారు.. ఆయన మూడ్ ని బట్టి ఉంటుంది, మన వాదన కరెక్టా,  రాంగా అనేది. మీకు హాయిగా సెలవు పెట్టి నాలుగు రోజులు ఎటైనా వెళ్లే వీలుంది. మాకు ఆ అవకాశం కూడా లేదు !! అసలు డాక్టర్ల పని హాయి! చక్కగా సంపాదనకు సంపాదన, సంఘంలో గౌరవాని కి గౌరవం !!! అన్నది అక్కడ ఉన్నడాక్టర్ ఫ్రెండ్ వైపు చూస్తూ.

” ‘ హూ ‘ అని పెద్దగా నిట్టూర్చి, ఆ డాక్టర్ గారు, ‘ఇక మా సంగతే చెప్తారా!! మాకు సెలవులు అసలే ఉండవు. విపరీతంగా పేషెంట్లు వస్తారు. కొంచెం తేడా వస్తే మొత్తం జనాన్ని వేసుకొని మా మీదకు వచ్చేస్తారు. ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయడం చాలా కష్టం అవుతూ ఉంటుంది ‘ అన్నది విచారంగా మొహం పెట్టి, తన బాధలు గుర్తుతెచ్చుకుంటూ !

అందరి దృష్టి అక్కడ లెక్చరర్ గా పనిచేసే ఆవిడ మీద పడింది. ‘అసలు సుఖం అంటే మీది. సెలవులు బోలెడు ఉంటాయి. టైం ప్రకారం వెళ్లి రావొచ్చు’ అన్నారు అంతా!! వెంటనే ఆ లెక్చరర్ గారు “చెప్పనా నా బాధలు కూడా.. రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. పోకిరి వాళ్ళు,  డల్ స్టూడెంట్స్,  అన్ని రకాల వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ ని మెప్పించాలి. మేనేజ్మెంట్ కి ర్యాంకులు కావాలి.. వీళ్ళని రుద్ద లేక మా పని అవుతూ ఉంటుంది !! ఇంత చేసినా,  సంఘంలో మాకు పెద్ద ఉద్యోగస్తులమన్న హోదా లేదు.. అసలు పవర్ ఎంజాయ్ చేస్తూ కాలు మీద కాలు వేసుకునే గవర్నమెంట్ ఉద్యోగస్తుల పని హాయ్’ అన్నది అక్కసుగా.

అప్పుడు అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసర్ గారు దిగ్గున లేచి,  సీరియస్ గా అన్నారు ‘సర్లే మా బాధలు పగవాళ్లకు కూడా వద్దు రా బాబు అనుకుంటూ ఉంటాము మేము. ఏం చదువుకోకపోయినా,  సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ మా మీద ఆజమాయిషి చెలాయించే వాళ్లే !! మళ్లీ బాసుల నుంచి బోలెడంత మానిటరింగ్!! విభేదించామా,  వెంటనే ట్రాన్స్ఫర్ తప్పదు..అసలు నిజం చెప్పాలంటే మన అందరికన్నా,  ఆంటీ వాళ్ళే మంచి జీవితాలు గడుపుతున్నారు హాయిగా!! హౌస్ వైఫ్ గా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు.. పిల్లల్ని చూసుకున్నారు, అన్నిటికీ టైం ఉండేది వాళ్లకి’ అన్నదావిడ కమల అత్తగారు వైపు చూస్తూ..

కమల అత్తగారు చిరునవ్వుతో వీళ్ళ సంభాషణ వింటూనే ఉంది మౌనంగా,  ఇందాకటి నుంచి.. అందరి దృష్టి తన మీద పడటంతో,

మాట్లాడటం మొదలు పెట్టింది “అవునమ్మా !! మేము నిజంగానే చక్కటి జీవితాలను గడిపాం. సందేహం లేదు. అయితే ఎందులో అయినా సాధకబాధకాలు,  లాభనష్టాలు ఉంటాయి. ఇవన్నీ మీరు ఎంతో ఆలోచించి, ఎంచుకున్న రంగాలు కదా!! వాటికోసం మీరు ఎంతో కష్టపడి చదివి పనిచేసి నేటి ఈ పొజిషన్లోకి వచ్చి ఉంటారు. కానీ ఎవరికీ వర్క్ శాటిస్ఫాక్షన్ ఉన్నట్లు నాకు కనపడటం లేదు. బహుశా దాని కారణం మీకు వేరే వాళ్ళ రంగాల్లోని సుఖాలు కనబడటమే అనుకుంటా. నేను హౌస్ వైఫ్ గా హాయిగా ఉన్న మాట వాస్తవమే,  కానీ మీకు లాగా సంపాదన,  ఆర్థిక స్వాతంత్రం నాకు లేదు కదా !! మీరు మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో ఊహించుకోగలరా? మీ వృత్తులను గురించి పాజిటివ్గా ఒక్కసారి ఆలోచించి చూడండి!! డాక్టర్లు ఎంతో మందికి రోగాలు నయం చేసి మంచి జీవితాలను ఇస్తున్నారు… సాఫ్ట్వేర్ వాళ్ళ వల్లే కదా మనం ఇవాళ వాడుతున్న టెక్నాలజీ అంతా… ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంతో ప్రజాసేవ చేయగలుగుతున్నారు.. లెక్చరర్ గా మీరు ఎంతో మంది భావి పౌరులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే లాయర్లు అనేకమందిని సమస్యల నుండి బయటపడేస్తున్నారు.. సో ఎవరు చేసే పనిమీద వాళ్లు గౌరవం,  ఇష్టం పెంచుకుంటే లాభాలు ఎక్కువ,  ఇబ్బందులు తక్కువ కనబడతాయి. అంతే కాదు పనిమీద అసంతృప్తి పెంచుకుంటుంటే అది నెమ్మదిగా జీవితంలో మిగతా అంశాలు కూడా పాకుతుంది. పక్క వాళ్ళ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తున్నారు అనుకుంటాం,  వాళ్ళ జీవితం బాగుంది అనుకుంటాo… అది మన్ని చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ లో పడేస్తుంది తర్వాత!!! ఎప్పుడూ పక్క వారిది బాగుంది అనుకోవటం మానవ నైజం… అంతేగాని నిజం కాదు! ” అని నవ్వుకుంటూ, “ఇక  లేవండి భోజనాలు చేద్దాం ” అంది ఆవిడ ముగింపుగా!! అంతా ఆవిడ మాటలతో స్ఫూర్తి పొందిన మొహాలతో కృతజ్ఞతగా ఆమె వేపు చూస్తూ,  నవ్వుతూ లేచారు భోజనాలకి!!!!

*****

1 thought on “పక్కవారిది పరమానందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *