April 25, 2024

రిమెంబర్ – రీమెంబెర్

రచన: శ్యామదాసి

 

రిమెంబర్ (సదాస్మరణ) రీమెంబెర్ (మళ్ళీ ప్రపంచంలోకి)

అద్దoలో చూస్తేగాని మన ముఖం మనకు తెలియదు శాస్త్రాల ద్వారాగానే గురుముద్రతతో ఆత్మ దర్శనం కలుగుతుంది.  గురువు అనే దర్పణం మన స్థితిని మనకు చూపిస్తుంది,  కర్తవ్యాన్ని బోధిస్తుంది.  శ్రీకృష్ణ పరమాత్మను గురువుగా స్వీకరించి

నష్టోమోహ: స్మృతిర్లబ్ధా త్వత్ప్రసా దాన్మయాచ్యుతI

స్థితో స్మి గతసన్దేహ: కరిష్యే వచనం తవ

భగవద్గీత 18-73

“ఓఅచ్యుతా నా మోహము తొలగినది,  నీ కరుణచే నా స్మృతిని తిరిగి పొందితిని.  ఇప్పుడు నేను సందేహరహితుడను,  సావధానముగ నీ ఆజ్ఞాను సారము వర్తించుటకు సిద్ధముగానున్నాను అంటూ అర్జునుడు శరణాగతుడై వినయముగా భగవంతుని గీత విన్నాడు.  ఆచరించేందుకు ఉద్యుక్తుడైయ్యాడు.  ఒకానొక సందర్భంలో శ్రీరామచంద్రుడు నిర్లిప్తత,  నిస్తేజంతో కూడిన విరక్తిని పొంది ” రక్షణ చేయలేని అల్పుని కట్టుకుని కన్య ఎలా కష్టపడుతుందో అలాగ నా మనసు వికల్పాలతో లోనికి వస్తారో, వెలుపలికి వెళ్తారో తెలియని గుమ్మం మీద నిలబడ్డ వారిలా నిరంతరం వచ్చే పోయే ఆలోచనలతో అగర్తంలో పడిపోతున్నది మననం లేక నా నుండి జ్ఞానం వెళ్ళిపోతున్నది”.  నేను అంతరంలో బ్రహ్మజ్ఞానం,  బహిరంలో గడ్డిపోచలా చూడగలగాలి “.  ఇతరుల దుఃఖాన్ని నాకు కలిగిన దుఃఖంలా పోగొట్టాలి.  నాకు కలిగిన దుఃఖాన్ని గడ్డి పోచలా తీసివేయాలి.  ఉట్టి సంతోషం కాదు ఉత్తమ సంతోషం కలగాలి.

సంసారం,  ఆధ్యాత్మికంగా రెండు విధాల జారిపోతున్నాను.  జ్ఞానం లేక ఒక సారి పట్టుకుంటున్నాను,  ఒక సారి వదిలి వేస్తున్నాను పుణ్య పాపాల బురద నాకు అంటుకోకుండ ఎలా ఉండాలి చెప్పండి.  పుట్టింది మనసు,  పెరిగింది శరీరం,  మన పుట్టుకకు మనమే కారణమా!ఱంపంతో కోసిన దానికన్నా ఈ విషయం నన్ను బాధిస్తున్నది.  ‘తృష్ణ’ అనే “మాలను” జన్మపరంపరగా ధరిస్తున్నామా! మరెన్నో సందేహ సమాధానాలతో విశ్వామిత్ర మహర్షి సమక్షంలో కుల గురువైన వశిష్ట మహర్షి నుండి యోగవాసిష్ట రూపంలో మనసు పై చేరిన దుమ్మును తొలగించి అవతారమూర్తి అయిన శ్రీరామచంద్రుడు యదార్థ తత్వాన్ని దర్శించగలిగాడు.

సంసారులకైనా సర్వసంగ పరిత్యాగులైన సన్నాసులకైనా “స్వబావోదురతిక్రమ:” స్వభావం మారడం సులభమైన విషయం కానప్పటికీ,  ఎప్పుడు వెలుపలి ప్రపంచాన్ని చూడడానికి అలవాటు పడిన మన ఇంద్రియాలకు మనలోని మరోలోకాన్ని,  దాన్ని చేరేందుకు కావలసిన మనః పరిశీలన ప్రకృతిలోని పరమాత్మను దర్శించ గలిగిన గురువును,  ఆశ్రయించిన వారి సత్సంగ కూటమిలో వారి వారి ప్రారబ్దాన్ని పరిహరించుకోగల ప్రాప్తి తప్పక లభిస్తుంది.  అందుకు ప్రధమ సాధనగా భగవత్సేవ,  పూజ,  జపధ్యానాదులు ఒక టోకటిగ మనలను పక్వస్థితికి చేర్చగలవు.

సత్సంగంలో మనం పొందే ప్రయోజనాలను

 

1)       తోడేళ్ళలోని నైజంతో పోల్చుతుంటారు.  అదెలాగంటే తోడేలు ఎప్పుడూ గుంపుతోనే ఉంటుంది.  సత్సంగాశ్రయంలో మనమెప్పుడూ ఉండగలగాలి.

2)       వేటాడిన ఆహారం గుంపుతో కలిసి పంచుకుంటుంది,  మనలోని కుతితత్వం తొలగి,  విశాలమైన ధార్మికమైన బుద్ది కలుగుతుంది.

3)       ఆపద వస్తే అన్నీ కలిసి కట్టుగా పోరాడతాయి.  మన చుట్టూ ఒంటరితనం లేని ఆత్మబలం కవచమై నిలుస్తుంది.

4)       వేటాడలేని ముసలి వాటికి ఆహరం తెచ్చిపెడ్తాయి.  నైతిక ధర్మాన్ని గుర్తుచేస్తున్నదీ గుణం .

5)       ఒక తోడేలు చనిపోతే తక్కినవన్నీ ఆ రోజు ఆహరం ముట్టుకోవు.  ఊళ వేస్తూ తమ సంతాపాన్ని తెలుపుతాయట.  మానవత్వపు విలువలను తెల్పుతూ నిజ జీవితంలో ధైర్యం,  స్థయిర్యం,  ఆధ్యాత్మికంగా భగవత్స్మృతిని కలిగిస్తూ అనాయాస స్థితిలో నిలుపుతుంది ఈ గుణం.

పుట్టడం,  చావడం,  అనే ఈ రెండు పదాలు ప్రతి మనిషికి తెలుసుంటాయి కానీ ఈ రెంటి మద్య గడపవలసిన జీవితం అర్ధం కాని పజిల్ సత్సాంగత్సoలో “నిమిషమెడతెగక హరి నిన్ను తలచి” అంటూ హరిని దర్శించిన అన్నమయ్య సాధన బోధనలో “రిమెంబరెన్స్” పెంచుకుని “రీమెంబర్స్” గా జన్మపరంపర నుండి తప్పుకుందాము.  ఇందుకుగా ఓదేవా ! నా అదృష్టం కొద్దీ సంసార సాగరాన్ని దాటడానికి పడవ అనే మానవ శరీరం లభించింది కనుక ప్రసన్నుడవై నా పడవ నడిపే వ్యక్తిగా ఆధ్యాత్మిక గురువును లభింపజేసి ఆవలి తీరానికి నేను చేరుకోవడానికి సహకరించే సానుకూల పవనంగా సాక్షాత్తు నువ్వే ఉండాలని కోరుకుంటున్నాను అంటున్న ఒక భక్తుని శరణాగతిని మన నిత్యప్రార్ధన చేసుకుందాము.

 

******

1 thought on “రిమెంబర్ – రీమెంబెర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *