December 6, 2023

అమ్మమ్మ – 47

రచన: గిరిజ పీసపాటి

వేసవి కాలం కావడంతో పగలు పెద్దగా కస్టమర్ల తాకిడి ఉండకపోవడంతో ఖాళీగా ఉన్న గిరిజ, తనతో పాటు కనిపిస్తున్న మరో ఆడ ప్రాణిని కుతూహలంగా చూడసాగింది. ఆ అమ్మాయి కూడా మధ్యమధ్యలో గిరిజను చూసినా, బాస్ తననే చూస్తూ ఉండడంతో తల తిప్పేసుకుంటోంది.
మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వెళ్ళడానికి సీట్లోంచి లేచి, బాస్ దగ్గరకు వెళ్ళి “సర్! భోజనానికి వెళ్ళొస్తాను” అని చెప్పింది గిరిజ.
ఆయన “ఒక్క నిముషం ఉండండి మేడమ్!” అంటూ గిరిజను క్రోకరీ కౌంటర్ దగ్గరకు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ “ఈ రోజే జాయిన్ అయారు. పేరు మల్లిక. షాప్ లో ఉన్న అమ్మాయిలు మీరిద్దరే. అదీకాక ఇద్దరూ ఒక వయసు వారే కనుక ఫ్రెండ్స్ లా ఉండండి.
“ఈ అమ్మాయి ఉండేది మద్దిలపాలెంలో. ఇల్లు దూరం కనుక లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు. ఇక్కడ తినడం పెద్ద ఇబ్బంది కాదు కానీ, లేడీస్ కి ఏవో ప్రాబ్లామ్స్ ఉంటాయి కదా! మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటికి తీసుకెళ్ళండి. భోజనం అయాక ఇద్దరూ కలిసి రావొచ్చు” అన్నారు.
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని పలకరింపుగా చిరునవ్వు నవ్వుకున్నాక “నాకేం అభ్యంతరం లేదు సర్” అని బాస్ కి చెప్పి, మల్లికతో “మీరు నాతో మా ఇంటికి రండి మల్లికగారు. అక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు” అంటూ ఆహ్వానించింది గిరిజ.
ఇబ్బంది పడుతూనే గత్యంతరం లేక ఒప్పకున్న మల్లిక తను బాక్స్ లో తెచ్చుకున్న అన్నం కాక మరికొంత అన్నం, కూర, పచ్చడి తినమని కొసరి కొసరి వడ్డించిన వసంత తీరుకి, యావత్ కుటుంబం తనపట్ల చూపిన ఆప్యాయతకి మొహమాటం పోయి చక్కగా కలిసిపోయింది.
ముఖ్యంగా మల్లికను గిరిజతో పంపడానికి కారణం షాప్ లో ఒకే టాయిలెట్ ఉండం, అందరు మగవారి మధ్య ఆడపిల్ల వాడాలంటే ఇబ్బంది అవుతుందని. అలా రోజూ ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రోజూ వెళ్ళి భోజనం చేసి తిరిగి షాప్ కి వచ్చేవారు.
రోజులు దొర్లిపోతున్నా ఇల్లు మాత్రం సరైనది దొరకడం లేదు. అద్దెలు విపరీతంగా పెరిగిపోవడం, చిన్న పోర్షన్ అయితే ఇంతమంది ఉండడానికి ఒప్పుకోకపోవడం, కొన్ని ఇళ్ళకు నీటి సదుపాయం లేకపోవడం ఇలా రకరకాల కారణాలు.
అమ్మమ్మ కూడా మాసికాలు, తద్దినాలు వంటి వంటలు ఒప్పుకుని, చేస్తోంది. చేతికింద సరైన పనివాళ్ళు దొరకకపోవడం వల్ల పెద్ద వంటలు ఒప్పుకోవట్లేదు. సహాయకులని వాళ్ళే తెచ్చుకునేటట్లయితే మాత్రం పెద్ద వంటలు ఒప్పుకుంటోంది.
వచ్చిన డబ్బుని సగం ఇంటి ఖర్చులకి ఇచ్చి, మిగిలినది తన ఖర్చులకు వాడుకుంటోంది. బ్యాంక్ లో నెలనెలా పడుతున్న తాతయ్య పెన్షన్ ని డ్రా చెయ్యకుండా ఉంచుతోంది.
మల్లికతో స్నేహం పెరిగి, మీరు నుండి నువ్వు లోకి పిలుపు మారింది‌. ఒకరోజు ఉదయం గిరిజ షాప్ కి వెళ్ళేసరికి
కోపంతో ఉల్లాస్ ని తిడుతూ కనిపించారు బాస్. కాసేపటికి విసురుగా లోపల ఉన్న తన కేబిన్ లోకి వెళ్ళిపోయారు.
ఆయన లోపలికి వెళ్ళగానే ఉల్లాస్ గిరిజ దగ్గరకు వచ్చి “మీ వర్క్ లో తప్పులు లేకుండా చూసుకోండి. ఇవాళ బాస్ బాగా కోపం మీద ఉన్నారు” అన్నాడు.
“ఇందాక మీ భాషలో మీ మీద అరుస్తుంటే విన్నాను. ఎందుకని?” అనడిగిన గిరిజతో “నేనేం చెయ్యలేదు. మీకిదివరకే చెప్పాను కదా! ఆయనకు ఎవరి మీద కోపం వచ్చినా నన్నే తిడతారని. ఇప్పుడూ అదే జరిగింది. మీరు వచ్చే ముందు ఆ మల్లిక‌ వాళ్ళ నాన్నగారు వచ్చి, బాస్ తో ఏదో మాట్లాడి వెళ్ళారు. అప్పటినుండి ఈయన కోపంగా ఉన్నారు” అన్నాడు.
“బహుశా లీవ్ పెట్టిందేమో! ఎవరైనా లీవ్ అడిగితే ఆయనకు కోపం వస్తుంది కదా!” అన్న గిరిజతో “అయుండొచ్చు” అంటూ… తన పని చూసుకోసాగాడు.
ఉల్లాస్ ది టాయ్స్ సెక్షన్ కావడం, ఆ సెక్షన్ ని ఆనుకునే గిరిజ సీటు ఉండడం వల్ల అప్పుడప్పుడూ ఉల్లాస్ తో మాట్లాడే అవకాశం ఉంటుంది.
అరగంట తరువాత ఇంటర్ కమ్ మోగడంతో ఫోన్ వంక చూసిన గిరిజకు డిస్ప్లే లో బాస్ కేబిన్ నంబర్ కనబడడంతో, రిసీవర్ ఎత్తి “సర్!” అంది వినయంగా. “ఒకసారి కేబిన్ కి రండి” చెప్పి ఫోన్ పెట్టేసారాయన.
‘ఏం తప్పు చేసానో ఏంటో!’ మనసులోనే అనుకుంటూ సీట్లోంచి లేచింది. ‘ఆల్ ద బెస్ట్’ అన్నట్లు బొటనవేలు పైకెత్తి చూపాడు ఉల్లాస్ నవ్వుతూ. “మీకలాగే ఉంటుంది మరి” అంటూ లోపలి కేబిన్ దగ్గరకు వెళ్ళి కొద్దిగా డోర్ తెరిచి “మే ఐ కమిన్ సర్?” అడిగింది.
లోపల గణేష్ గారితో పాటు ఆయన తమ్ముడు మహవీర్ గారు కూడా ఉన్నారు. “కూర్చోండి” అన్న గణేష్ గారి మాటకు ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.
గణేష్ గారి ముఖంలో కోపం ఛాయలు అలాగే ఉన్నాయి. “మీరు కాలేజ్ లో ఎప్పుడు చేరుతున్నారు” అడిగారు గణేష్ గారు సీరియస్ గా.
“నేను కాలేజ్ లో జాయిన్ అవట్లేదు సర్” అన్న గిరిజతో “ఏం? సీట్ రాలేదా? మంచి మార్కులే వచ్చాయిగా?” అడిగారు మంచినీళ్ళు తాగుతూ. మహవీర్ గారు మౌనంగా ఇద్దరి సంభాషణ వింటున్నారు.
“నేను అప్లయ్ చెయ్యలేదు సర్!” అంది తలవంచుకుని. “ఎందుకని?” ఆశ్చర్యంగా అడుగుతున్న ఆయనకు ఏమని జవాబివ్వాలో తెలియక, కళ్ళలో ఆగలేమంటూ బయటకు ఉబుకుతున్న కన్నీరు వారి కంట పడకుండా దాచే ప్రయత్నంలో తల మరింత దించేసుకుంది గిరిజ.
“ఇందాక మల్లిక వాళ్ళ నాన్నగారు వచ్చి, తమ అమ్మాయిని ఇక షాప్ కి పంపమని, కాలేజ్ లో జాయిన్ అవుతోందని చెప్పారు. కాలేజ్ లో చేరే ఉద్దేశం ఉంటే జాబ్ ఇవ్వనని ఆ అమ్మాయికి ముందే చెప్పాను. తనకు చదువంటే ఇష్టం లేదని చెప్పింది. ఇప్పుడు ఇలా చేసింది. మీకు కూడా చదువంటే ఇష్టం లేదా?” రెట్టించారు ఆయన.
“చాలా ఇష్టం సర్! కానీ…” తన్నుకుంటూ వస్తున్న ఏడుపును గొంతులో అదిమిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం వల్ల ఇక మాట్లాడలేక, మౌనంగా ఉండిపోయింది.
ఆ సమాధానం వినగానే “అరె! ఏడుస్తున్నారా!? అసలు విషయం ఏంటో నాకు చెప్పు. మీ వెల్ విషెర్ గా అడుగుతున్నాను”
లాలనగా అడుగుతూ కర్చీఫ్ అందించారు.
ఆయన గొంతులోని ఆప్యాయతకి ఇక కన్నీరు దాచుకునే ప్రయత్నం చెయ్యలేక ఆయన అందించిన కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుని తలెత్తి ఆయన వంక చూస్తూ “నాకు చదువంటే చాలా ఇష్టం సర్! కానీ… ప్రస్తుతం మా ఇంటి పరిస్థితి బాగోలేదు. అందుకే ఈ ఉద్యోగంలో చేరాను” అంటూ చిన్న గొంతుతో తమ కుటుంబ విషయాలు ఆయనతో దాచకుండా చెప్పసాగింది.
గిరిజ చెప్పడం ప్రారంభించగానే మహవీర్ గారు లేచి బయటకు వెళ్ళిపోవడం గమనించి వాళ్ళ సంస్కారానికి మనసులోనే నమస్కరించింది గిరిజ. ఇంటి విషయాలు బయటి వారికి చెప్పకూడదని తెలిసినా, అంతా చెప్పేసాక మనసులోని భారం తగ్గి తేలికగా అనిపించింది.
మొత్తం విన్నాక “మీ నాన్నగారు త్వరలోనే మళ్ళీ మీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను. అనవసర విషయాలు ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుంది. చిన్నపిల్లవి. ఇన్ని సమస్యలు మానసికంగా తట్టుకోవడం కష్టమైన పనే.”
“ఈ సందర్భంగా నీకో గుడ్ న్యూస్. ఇదివరకు నీ ప్లేస్ లో పని చేసిన మేడమ్ ఉద్యోగం మానేస్తున్నట్లు, మద్రాస్ లోనే సెటిల్ అయిపోయినట్లు ఫోన్ చేసారు. కనుక హాయిగా నీ జాబ్ నువ్వు చేసుకో. నీ అంతట నువ్వు మానేసేవరకు నిన్ను ఉద్యోగంలోంచి నేను తీసెయ్యడం జరగదు” అన్నారాయన.
ఆ మాట నిజంగానే చాలా ఊరటనివ్వగా “థాంక్యూ సర్! థాంక్యూ వెరీ మచ్” అంది సంతోషంగా. “పిచ్చి పిల్ల” అంటూ నెత్తి మీద చిన్నగా తట్టారాయన.
ఈ సమయంలో ఆయన సంబోధన మీరు నుండి నువ్వులోకి మారడం గమనించినా, ఆయన కన్నా వయసులో సగం వయసు ఉన్నందున అదే బెటర్ అనుకుంది.
మరో ఐదు నిముషాలకి అకౌంటెంట్ శర్మగారికి ఫోన్ చేసి, ఆయన లోపలికి రాగానే “ఈ రోజు నుండి మేడమ్ కి సేల్స్ రిజిస్టర్, డే బుక్ రాయడం, లెడ్జర్ పోస్టింగ్స్ చెయ్యడం నేర్పండి. మీరు రాని రోజు వర్క్ పెండింగ్ ఉండకుండా మేడమ్ చేసేస్తారు” అని చెప్పి,
గిరిజ వంక చూసి “మీరు ప్రతీరోజూ ఉదయం శర్మగారు రాగానే ఆయన దగ్గర అకౌంటింగ్ నేర్చుకోండి. అప్పటివరకు బిల్లింగ్ వర్క్ ఎవరో ఒకరం చూసుకుంటాం” అని చెప్పడంతో సంతోషంగా “సరే”నంది.
ఆరోజు భోజనానికి ఇంటికి వెళ్తుండగా గణేష్ గారు పిలిచి జీతం ఉన్న కవర్ ఇవ్వడంతో ఇంటికి వెళ్ళగానే ఎప్పటిలాగే తల్లి చేతిలో కవర్ పెట్టేసి, కాళ్ళూ చేతులు కడుక్కుని రావడానికి వెళ్ళింది.
ఈలోగా డబ్బు లెక్కించిన నాగ ” ఇదేంటి గిరీ! ఐదువందల ముఫ్ఫై మూడు రూపాయలు ఇచ్చారు? ” అని అడగడంతో…
“అవునా! ఏమోనమ్మా! ఆయన జీతం ఇచ్చాక, ఆయన ముందు లెక్కపెట్టడం సభ్యత కాదని ఎప్పుడూ లెక్క పెట్టను. ఎందుకైనా మంచిది మరోసారి లెక్కపెట్టు” అన్న గిరిజ మాటలకు, ఈసారి వసంత లెక్కపెట్టి “నిజమే! ₹533/- ఇచ్చారు” అంది.

**** సశేషం *****

1 thought on “అమ్మమ్మ – 47

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

June 2023
M T W T F S S
« May   Jul »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930