June 19, 2024

మాటే మంత్రము!

రచన: విజయలక్ష్మి వారణాసి

“ఎక్కడికో బయల్దేరినట్లున్నావు” నీలం సిల్కు చీర, స్ట్రైట్ చేసుకుని వదిలేసిన జుట్టు, అందంగా తయారయిన భార్య గౌతమిని మురిపెంగా చూసుకుంటూ, లాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటున్న, ఉదయ్ వెనక్కి మెడ తిప్పి చూస్తూ కామెంట్ చేసాడు.
చెప్పుల దగ్గరకి వెళ్తున్న గౌతమి చివ్వున తలతిప్పి”బైటకి వెళ్తున్నాను” అన్నది.
“తెలుసులేవోయ్ బైటికేనని. ఎక్కడికి అని అడుగుతున్నా” ఉదయ్ గౌతమి గొంతులోని చిరాకు గమనించ కుండా, “ఇంత గొప్ప మొగుణ్ణి, మగాణ్ణి ఇక్కడుంటే, నువ్వు ఇంత అందంగా తయారయ్యి ఎక్కడికోయ్?” లాప్ టాప్ మూసేసి, భార్య వైపుకి తిరిగిన ఉదయ్ విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోతున్న గౌతమిని చూసి విస్తుపోయాడు!
రాత్రి ఎనిమిది దాటాక వచ్చిన భార్యకి మంచినీళ్లు అందిస్తుంటే, “నేను తీసుకోగలను” అంటూ గౌతమి విసురుగా వెళ్ళిపోయింది.
“అసలు ఎందుకు ఈ కోపం? చెప్పకుండా వెళ్లిపోయావని, నాకు రావాలి కోపం” సహనం కోల్పోతున్న ఉదయ్, గౌతమి రెక్క పట్టుకుని ఆపాడు.
“ఏమిటి కొడతారా? ఏం ఏదన్నా పనిమీద వెళ్లకూడదా? మీకు చెప్పనంతమాత్రాన ఇలా పట్టుకుని” గద్గదమౌతున్న గౌతమి గొంతు. ఉదయ్ గౌతమిని వదిలేసాడు. అసలు సూచన లేని ఈ తుఫాను ఎందుకో అర్థం కాని గౌతమ్ దిగ్భ్రాంతితో దిక్కు తోచక టీవీ ముందు కూర్చుండి పోయాడు. కళ్ళు టివి చూస్తునాయంతే!
***
“ఏమైందే వీళ్ళద్దరికీ? ఎప్పుడూ గువ్వపిట్టలల్లే కువకువలాడుతూ ఉండేవాళ్ళు. ఇలా కలవరపడుతున్నారు, మాటలు రువ్వుకుంటున్నారు సాయంకాలం నించీ” ఉదయ్ తండ్రి బలరాం మాటకి, తల్లి సుమతి, “అదేనండీ నేనూ చూస్తున్నాను. మనవాడెప్పుడన్నా తొందరపడతాడేమో కానీ గౌతమి ఇలా మాట్లాడటం నేనెప్పుడూ చూడలేదు”అంటూ వాపోయింది.
***
బలరాం, సుమతులకి ఉదయ్ తరవాత ఒక ఆడపిల్ల సుజాత. పెళ్లి అయ్యి అత్తగారింట్లో ఉన్నది తన ఇద్దరు పిల్లలతో. ఉదయ్ కి పెళ్లి అయి రెండేళ్లవుతున్నది. ఇంకా పిల్లలు కలగలేదని, ఈ మధ్యనే డాక్టరుకు చూపిస్తే ఉదయ్ కి చిన్న లోపమున్నదని చెప్పగా మందులు వాడుతున్నారు. ఆ విషయమై కూడా పెద్దగా ఆదుర్దాపడవలసినదేమీలేదనీ, కొద్దిగా టైం పడుతుందని చెప్పారు డాక్టర్లు.
అన్ని విధాలా అన్యోన్యంగా ఉండే ఆలుమగలు ఎన్నడూ లేనిది ఇలా మాటల బాణాలతో ఒకరినొకరు హింసించుకోవడం, బలరాం, సుమతులకి చాలా బాధ కలిగిస్తున్నది.
***
రాత్రి గదిలోకొచ్చినాక కూడా, గౌతమి మూడ్ చూసి ఉదయ్ కూడా బిగుసుకుపోయాడు. ఇద్దరూ ఎవరికి
వారు తామే ముందు మాట్లాడాలా అసలేమీ తప్పు చెయ్యకుండా అని బిగదీసుకున్నారు. ఫలితం ఆ రాత్రి నిశ్శబ్ద నీరవ రాత్రి కాగా, నిరాశా నిస్పృహలతో తెల్లవారింది ఆ జంటకు!
వారి ఎడమొహ పెడమొహాలు అలవాటు లేని ఆ ఇంట్లో. టిఫిన్ చేస్తున్నప్పుడు బలరాం ఇంక ఆగలేక”ఏమ్మా గౌతమీ! మావాడేమన్నా అల్లరి పెడుతున్నాడా నిన్ను? ఏదన్నా ఉంటే చెప్పు. వీడికి క్లాసు తీసుకుని చాలా రోజులే అయింది. నాకూ పెరపెరగా ఉన్నది క్లాసు తీసుకోవాలని” జోవియల్ గా అంటున్న మావగారి వైపు చూడకుండానే గౌతమి” పచ్చడి తీసుకొస్తా మావయ్యా” అంటూ చూపులు తప్పించుకున్నది. అది చూసిన సుమతి, భర్తకి ఆగమని కనుసైగ చేసింది.
ఆఫీసుకి వెళ్ళేటప్పుడు కార్లో కూడా భార్యా భర్తలిద్దరూ మాట్లాడుకోలేదు. ఆలోచనల్లో మునిగిపోయిన ఉదయ్, ఎదురుకుండా వస్తున్న లారీని చూసుకోలేదు. ఉదయ్ మీదే దృష్టి పెట్టిన గౌతమి ఒక్కసారి పెద్దగా” హనీ” అని అరుస్తూ ఉదయ్ భుజం మీద వాలిపోయి కళ్ళు మూసుకున్నది. గౌతమి హెచ్చరికను విన్న ఉదయ్, మనసు కుదుటపర్చుకుని, డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు.
“భయపడ్డావా స్వీటీ. కానీ నువ్వు అరవడం వలన ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో! నన్నే చూస్తూ కూర్చు న్నావా? ఎందుకురా ఇంత కోపం. .. చెప్పి అలగవచ్చు కదా. ఇంత ప్రేమ పెట్టుకుని ఒక రోజు మొత్తము వేస్ట్ చేసావు కదా. ‘హనీ’ నీ పిలుపు కోసం నిన్నట్నుంచీ తల్లడిల్లిపోతున్నా!”
గౌతమి బుంమూతితో, “అదిగో అదే నీ దగ్గర ఉన్నది. చేసేదంతా నువ్వు చేసి నన్నంటావు.” ఇంకా మాట్లాడు తున్నది. గౌతమి ఆఫీస్ వచ్చేసింది.
***
సాయంత్రం గౌతమి వచ్చి తలుపు కొడితే, తలుపు తెరిచిన సుమతి, వాడిపోయిన గౌతమి ముఖం, ఒక్కతే కాబ్ లో రావటం చూసి ‘వీళ్ళ పోట్లాట తారస్థాయికి చేరుకున్నదా’ అనుకుని బాధపడ్డది.
“అత్తయ్యా! తనకి ఫోన్ చెయ్యండి. నేను చేస్తే ఎంగేజ్ అయి ఉండింది చాలాసేపు. తరవాత నాకు చేతకాలేదు” అంటూనే సింక్ దగ్గరకు పరిగెత్తింది.
సుమతి గబగబా నీళ్లు తీసుకుని, గౌతమికి హెల్ప్ చేసింది. తల పగిలి పోతూ, వామిటింగ్ సెన్సేషన్ ఉండి తాను ముందుగా వచ్చేసానని చెప్పింది గౌతమి, అత్తగారికి. బలరాం కూడా ఆదుర్దా పడుతూ గౌతమిని”నువ్వు నిన్నట్నుంచీ ఏదో బాధ పడుతున్నావమ్మాయ్. మీ అత్తగారికి చెప్పు ఆవిడ చిటికెలో మంత్రం వేసేస్తుంది నీ బాధకి. అంత బాధలో కూడా గౌతమి మావగారి ప్రేమకి అబ్బురపడగా చిన్నగా పెదవులు విచ్చుకున్నాయి.
బలరాం అవతలకి వెళ్ళగానే గౌతమి మొహం చూసిన సుమతికి ఏదో అనుమానం వచ్చి, “నీకు డేట్ రాలేదు కదా ఈ నెల?” అన్నది.
“అవునత్తయ్యా” అంటూ బాత్రూమ్ లోకి వెళ్ళింది. టెస్ట్ చేసుకోవడానికి.
ఒకింత అలజడి, ఒకింత సంతోషం, ఒకింత ప్రశ్నార్థకపు మొహంతో బైటకి వచ్చిన కోడల్ని చూసి, పరిస్థితిని
గెస్ చేసిన సుమతి, గౌతమితో కంఫర్మ్ చేసుకున్నది. శుభవార్త అని!
గౌతమిని దగ్గరకు తీసుకొని” ఎందుకు అంతలా పజిల్ అవుతున్నావు? ముందు తెలియగానే అలాగే ఉంటుందిలేమ్మా. రిలాక్స్. వాడు రాగానే మన డాక్టర్ దగ్గరకు వెల్దురుగాని”. అని ఎన్నో జాగ్రత్తలు చెప్తూ” గౌతమీ! మీ పర్సనల్ విషయాల్లో తలదూరుస్తున్నాను అనుకోకపోతే ఏమైందో చెప్పమ్మా. ఇంక ఈ టైంలో మీ మధ్య ఎటువంటి పొరపొచ్చాలు అస్సలు ఉండకూడదు” అని బుజ్జగించి అడిగింది.
నిన్నట్నుంచీ ఆపుకుంటున్న బాధ ఒక్కసారిగా పెల్లుబికింది, “అత్తయ్యా! నేను ముందు మీకే చెబుదా మనుకున్నాను. మళ్లీ తన మీద కంప్లైంట్ నాకే ఇష్టం లేకపోయింది. తన బర్త్ డే కి సర్ప్రైజ్ గా గిఫ్ట్ తేవాలని ఉండింది. దానికోసమే చెప్పకుండా బైల్దేరాను. తను ‘ఎక్కడికి బైల్దేరావు” అని ఆరాగా, అధికారంగా అడిగేప్పటికి నాకూ కొంచెం సతాయించాలనిపించి, “బైటకి” అని చెప్పా. కొంచెం నవ్వు బిగబట్టే చెప్పా. తను అటుతిరిగి ఉన్నారు నా ఫీలింగ్స్ చూడలేదు. ఆ తరవాత ఎవరి కోసమో నేను తయారయినట్లు అనేప్పటికి నాకు తిక్కరేగిపోయింది” బాధ సుడులు తిరుగుతుండగా చెప్తున్న కోడల్ని చూస్తూ, “అమ్మా! ఇదా తల్లీ నీ బాధకి కారణం. వాడు ఆ మాట అంటున్న ప్పుడు, నువ్వు విసురుగా వెళ్లిపోతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. నువ్వు ఎలా అటు తిరిగి నవ్వు బిగపట్టుకున్నావో అలాగే వాడూ ‘మగాణ్ణి’ అంటున్నప్పుడు నవ్వు బిగపట్టుకునే అన్నాడు. కానీ జోక్ గా కూడా అలా అనకూడదు. ఈ శుభసందర్భంలో మాఫ్ కర్ దో తేరే పతీ కో”
అత్తగారిని గట్టిగా పట్టుకున్నది గౌతమి.
అత్తా, కోడళ్ల నవ్వులు విని, వచ్చిన బలరాం”ఓయోయ్ నాకూ చెప్పండర్రా. నిన్నట్నుంచీ ఇంట్లోని స్ట్రెస్ నేను కూడా భరించానోయ్”
“ఆ ఆ మిమ్మల్ని మీ అబ్బాయిని ఊరికే వదుల్తామా మేము. ఉందిలెండి మీకూ, మీ అబ్బాయికీ.” సుమతి తర్జని చూపుతూ అంటుంటే మానవుడు బిక్కచచ్చిపోయాడు!,
“ఏమయింది గౌతమికి. స్వీటీ స్వీటీ” కంగారుగా బెడ్రూంలోకి వెళ్లబోయిన కొడుకుని అపి”ఒరేయ్! నీకీ మధ్య ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియట్లేదురా. టూ బాడ్.” అని క్రితం రోజు సంఘటన అంతా రీల్ తిప్పింది సుమతి. భార్య దగ్గరకి వెళ్ళడానికి ఆత్ర పడుతున్న కొడుకుని వీపుమీద తట్టి ” కొన్ని మాటలు నవ్వుతూ కూడా అనకూడదురా” అంటే ఉదయ్,
“అయ్యో అమ్మా! నేనేదో చిలిపిగా అన్నానే”. అని సిగ్గుపడుతున్న కొడుకుని తలమీద మొట్టి “నీ మొహం కదూ. నీ ఇంగ్లిష్ మీడియం స్కూలు, నువ్వూను. మాట మంత్రంలా ఉండాలిరా కన్నా!” అంటూ ఉదయ్ చెయ్యి వదిలింది. బుల్లెట్ లా దూసుకుపోయాడు భార్యదగ్గరకి!
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *