June 24, 2024

వాసంత సమీరం

రచన : బుద్ధవరపు కామేశ్వరరావు

వసంత ఋతువు వచ్చిందన్న సూచనగా అక్కడ ఉన్న పచ్చని చెట్లనుంచి చల్లటి పిల్లసమీరాలు అతడిని తాకుతున్నాయి. పచ్చని చేల మీద తిరిగే తెల్లని కొంగల్లా కనబడుతున్నారు, పచ్చటి మొక్కల మధ్య తెల్లటి యూనిఫారం వేసుకుని నడుస్తున్న ఆ బడి పిల్లలు.
ఆ రోజునే అక్కడ టీచర్ గా చేరడానికి వచ్చిన చంద్రశేఖర్, ఆ దృశ్యం చూస్తూ బాల్యంలో తనకు దక్కని ఆ ఆనందాన్ని వాళ్లలో చూసుకుంటూ అలా కాసేపు మైమరచి ఉండిపోయాడు.
***
ఉద్యోగ నియామకానికి సంబంధించిన తతంగం పూర్తి అయిన తర్వాత, తనకు కేటాయించిన తరగతి గది వద్దకు వచ్చిన చంద్రశేఖర్, పిల్లలను ఉద్దేశించి, “డియర్ స్టూడెంట్స్, ఈరోజు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ముందుగా మీ పేరు చెప్పి, తర్వాత మీ తల్లితండ్రులు గురించి చెప్పండి” అని ఒక్కొక్కరినే అడగసాగాడు. అందరూ తమ తమ పరిచయాలు చేసుకుంటున్నారు.
“గుడ్… నెక్స్ట్ ?” ఓ విద్యార్థిని అడిగాడు
“సార్, నా పేరు వినాయక్. మమ్మీ ఓ హాస్పిటల్ లో నర్స్” అని చెప్పి కూర్చున్నాడు.
“మరి మీ నాన్న గారు?” అడిగాడు చంద్రశేఖర్.
ఆ కుర్రాడు లేచాడు, కానీ ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఈలోగా లేచిన సుభాష్ అనే కుర్రాడు, “వాడికి వాళ్ల డాడీ ఎవరో తెలియదు సార్! వీడు పుట్టకుండానే ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయారుట” కొంచెం వెటకారం ధ్వనించింది అతని మాటల్లో. అది విన్న చంద్రశేఖర్,
“తప్పు సుభాష్, ఒకరు బాధపడేలా అలా మాట్లాడకూడదమ్మా. ఇకనుంచి మీరు ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉండాలి. సరేనా? ముందు ఇద్దరూ కూడా షేక్ హాండ్ ఇచ్చుకుని తర్వాత కూర్చోండి. ఓకేనా? నెక్ట్స్?” అంటూ మిగతా వారిని ప్రశ్నించసాగాడు చంద్రశేఖర్.
కాసేపటికి, బెల్ మోగడంతో, “ఇదిగో, వినాయక్! ఓసారి స్టాఫ్ రూమ్ కి వచ్చి నన్ను కలుసుకో” అని చెప్పి బయటకు నడిచాడు చంద్రశేఖర్.
***
స్టాఫ్ రూమ్ లో భోజనానికి కూర్చోబోతున్న చంద్రశేఖర్, పక్కనే చేతులు కట్టుకుని నిలబడి, ఏడుస్తున్న వినాయక్ ని చూసి, “ఏరా? వచ్చావా? గుడ్. ఔనూ, ఎందుకు అలా ఏడుస్తున్నావు?” అతని తల నిమురుతూ అడిగాడు.
“సార్! నేను కడుపులో ఉండగానే మా నాన్న మా అమ్మని వదిలేసి ఎక్కడికో పోయాడుట. అందరికీ నాన్న ఉన్నాడు. నాకే లేడు. నాకు కూడా నాన్నుంటే..” అంటూ బిక్కమొహం వేసుకుని ఏడుస్తూ చెప్పాడు వినాయక్.
“ఎవరో లేరని అలా బాధ పడకూడదురా! ఆ మామిడి చెట్టు చూడు. తనని ఎవరు నాటారో, తనకు ఎవరు నీరు పోసారో
ఆలోచించదు. తనకు తెలిసిందల్లా తను బతికినంత కాలం తీయటి పండ్లు అందించడమే! అలాగే మనం కూడా జరిగిన దానికి కాదు, జరగబోయే దాని గురించే ఆలోచించాలి, మిగతా వాటి గురించి ఆలోచించకూడదు. అర్థమయ్యిందా?” అనునయిస్తూ చెప్పాడు చంద్రశేఖర్.
“అలాగే సార్! కానీ నాన్నుంటే ఇంకా బాగుండేది కదా అని…” నసుగుతూ చెప్పాడు వినాయక్.
“సరే! నీకు నాన్న లేని లోటు గురించి నేను ఆలోచిస్తా కానీ, మీ ఇల్లు ఎక్కడ?”
ఆ అడ్రసు జ్ఞాపకం పెట్టుకుని, “సరే ఏదో ఒక ఆదివారం వచ్చి మాట్లాడతానని మీ అమ్మగారికి చెప్పు” అతని భుజం తట్టి చెప్పాడు చంద్రశేఖర్.
***
నాలుగు నెలలు గిర్రున తిరిగాయి. ఆ ఆదివారం రోజు ఉదయం వినాయక్ ఇంటికి బయలుదేరాడు చంద్రశేఖర్.
తలుపు తీసిన వినాయక్, “మమ్మీ! మన ఇంటికి మా చంద్రశేఖర్ సార్ వచ్చారు” అంటూ సంతోషం ఆపుకోలేక గట్టిగా అరిచాడు.
“నమస్కారం మాష్టారూ! రండి. మీ గురించి మా వాడు ప్రతీరోజూ చెబుతూ ఉంటాడు. ఎలా ఉంది మా వాడి చదువు” అంటూ పలకరించింది వంటింట్లోంచి వచ్చిన వాసంతి.
“బాగానే చదువుతున్నాడండీ! ఇక వాడి గురించి మీరేం బెంగ పెట్టుకోవద్దు. వాడి బాధ్యత నాది” అని చెబుతూ, తెచ్చిన స్వీట్ పాకెట్ వినాయక్ చేతిలో పెడుతూ, “ఒరే ! నేను కాసేపు ఇక్కడే ఉంటా! నేను వెళ్లేలోగా హోమ్ వర్క్ కంప్లీట్ చేసి నాకు చూపించాలి. ఓకేనా? గదిలోకి వెళ్లి ఆ పని మీద ఉండు మరి” అని వినాయక్ ని అక్కడ నుంచి పంపించాడు చంద్రశేఖర్.
***
“ఇప్పుడు చెప్పండి మాష్టారూ! ఎందుకు వచ్చారు? మా హాస్పిటల్ తో ఏదైనా అవసరం పడిందా ?” అనుమానంగా అడిగింది వాసంతి.
“అబ్బే! అలాంటి అవసరం ఇంతవరకు పడలేదండి. ఇక టైం వేస్ట్ చేయకుండా పాయింట్ లోకి వచ్చేస్తున్నా. వినాయక్ వాళ్ళ నాన్నగారు ఎవరు? ఆయన మిమ్మల్ని ఎందుకు వదిలేసారు? మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి” సూటిగా అడిగాడు చంద్రశేఖర్.
“చెప్పడానికి అభ్యంతరం ఏముంది మాష్టారూ?” అంటూ చెప్పసాగింది వాసంతి.
***
“మాది చాలా పరువు ప్రతిష్టలు కలిగిన కుటుంబం. డిగ్రీ చదువుకునే రోజుల్లో, మా కాలేజ్ కేంటీన్ లో పనిచేసే ఒకతన్ని ప్రేమించి, మా వాళ్లను ఎదిరించి అతన్ని గుళ్లో పెళ్లి చేసుకున్నాను. ఈ విషయం తెలిసి, పరువుకు ప్రాణం ఇచ్చే మా నాన్న, అన్నయ్యలు నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. అంతే, పౌరుషం వచ్చి నేను కూడా జన్మలో ఈ ఇంటి గడప తొక్కనని శపథం చేసి బయటకు వచ్చేసాను” చెబుతూ ఆగింది వాసంతి.
“అయ్యో, పుట్టింటి వారు అలా ప్రవర్తించడం చాలా బాధాకరం అండీ, సరే తర్వాత ఏం జరిగింది చెప్పండి” ఆసక్తిగా
అడిగాడు.
“వెంటనే ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చేసాం. అతడు ఇక్కడ ఓ హోటల్లో పనిచేసేవాడు. కొన్నాళ్ళు బాగానే గడిచాయి. ఇక అక్కడనుంచి నేను మా వాళ్లతో అనవసరంగా గొడవపడి వచ్చేసాననీ, మా ఇంటికి వెళ్లి వాళ్లని బతిమాలి అయినా సరే డబ్బులు తెమ్మని సాధించేవాడు. ఆత్మాభిమానం కల నేను చావనైనా చస్తాను కానీ, పుట్టింటికి వెళ్లి అడుక్కునే ప్రసక్తే లేదని కరాకండీగా చెప్పాను. అప్పుడే తెలిసింది, వాడి ప్రేమ నా మీద కాదనీ, మా నాన్న నాకు ఇచ్చే ఆస్తి మీద అని. అంతే ఓ రోజు ఉదయం లేచి చూసేసరికి వాడు కనబడలేదు. తెలిసిన అన్ని చోట్లా ఎంక్వయిరీ చేసాను. ఫలితం లేదు. ఆ తరువాత నేను వాడి గురించి వెతకలేదు. కానీ, ఆ తర్వాత తెలిసింది నేను గర్భవతిని అనీ, నాకు ఐదవ నెల అనీ” అంటూ ఏమాత్రం తత్తరపాటు లేకుండా చెప్పింది వాసంతి.
“మరి, మీరు గర్భవతి అన్న విషయం మీ ఇంట్లో వాళ్లకు చెప్పలేదా?” అనుమానంగా అడిగాడు చంద్రశేఖర్.
“చెప్పాను మాష్టారూ! మా అమ్మ అయితే విని బాధపడింది కానీ, మిగతావారు వినకుండానే ఫోన్ కట్ చేసారు. ఆత్మాభిమానంతో నేను మళ్ళీ ఈ రోజు వరకూ వాళ్లకు ఫోన్ చేయలేదు. ఆ తర్వాత ఒక సంఘసేవకురాలు నన్ను కూతురులా చేరదీసి, పురుడు పోయించి, అదే హాస్పిటల్ లో నర్స్ ఉద్యోగం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం హాయిగా బతుకుతున్నాం, మాకు ఎటువంటి సమస్యలు లేవు మాష్టారూ! నా కొడుక్కి నాన్న లేడన్న ఒక్క లోటు తప్పించి..” అంటూ ఎంతో ఆత్మస్థైర్యంతో చెప్పింది వాసంతి.
అంతా విని, “మీరు ఒప్పుకుంటే, మీ అబ్బాయికి నాన్న లేని లోటు నేను…” అని చెప్పబోతున్న చంద్రశేఖర్ తో, “ముందు మర్యాదగా బయటకు నడవండి. ఇదే ప్రపోజల్ తో ఇంతవరకూ పదిమంది వచ్చారు. మా అబ్బాయికి విద్యాబుద్ధులు నేర్పే మాష్టారు అని ఆలోచిస్తున్నా! లేకపోతే మీ బండారం బయటపెట్టేద్దును. ఇదిగో ఇలాంటివి చూసిన తర్వాతే నాకు మగవాళ్ళు అంటే అసహ్యం పుట్టింది. నా ఖర్మ కొద్దీ నాకు మగపిల్లవాడినే ఇచ్చాడు ఆ భగవంతుడు” అంటూ ఆవేశంగా మాట్లాడుతూ చంద్రశేఖర్ ని బయటకు వెళ్లమన్నట్టుగా చెయ్యి చూపించింది వాసంతి.
ఆమె మాటలకు బిత్తరపోయిన చంద్రశేఖర్ కాసేపటికి తేరుకుని, “మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను చెప్పదలచుకున్నది, మీ అబ్బాయికి నాన్న లేని లోటు నేను తీర్చలేను కానీ వాడికి ఒక మేనమామగా, మీకు ఒక తమ్ముడిగా ఆ బాధ్యత తీసుకోగలను అని. నిజం అక్కా! నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఒక అనాథ ఆశ్రమంలో పెరిగాను. నాకూ ఒక పెద్ద కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో కదా అనుకునేవాడిని. మీరు అంగీకరిస్తే, మీ కుటుంబంలో ఒకనిగా…” అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడసాగాడు చంద్రశేఖర్.
కాసేపటికి తేరుకున్న వాసంతి, “భలేవాడివయ్యా! అందరు మగవాళ్లలాగే నిన్నూ జమ కట్టాను. నువ్వు అలాంటివాడివి కాదని తెలిసింది. సరే కానీ మా మరదల్ని కాపురానికి ఎప్పుడు తీసుకొస్తావ్?” అని నవ్వుతూ అడిగింది.
“నాకు ఇంకా పెళ్లి కాలేదక్కా! నీలాగే ఒక మంచి ధైర్యవంతురాలైన అమ్మాయి నాకు భార్యగా దొరకాలని ఆశీర్వదించు అక్కా” అంటూ ఆమె పాదాలకు నమస్కరించాడు చంద్రశేఖర్.
“తథాస్తు” అని దీవించి, “ఉండు, ఈ సందర్భంగా ఏదైనా స్వీట్ చేస్తా” అంటూ లేవబోయింది వాసంతి.
“స్వీట్ వద్దు అక్కా! ఏకంగా భోజనమే చేస్తా!” అంటూ చెప్పాడు చంద్రశేఖర్.
ఈలోగా లోపలినుంచి వచ్చి, “మమ్మీ! మనకు చందమామ అతి దగ్గరగా ఏ రోజు ఉంటాడు?” అని తల్లిని అడిగాడు వినాయక్.
“ఆ చందమామ కేవలం పౌర్ణమి రోజునే దగ్గరగా ఉంటాడు. కానీ ఈ చంద్రం మామ ఇంక ప్రతీరోజూ నీకు దగ్గరగా ఉంటాడు. వెళ్లి మావయ్యకు నమస్కారం చెయ్యి” కొడుకుతో చెప్పింది వాసంతి.
“ఒరే! ఇంట్లో ఉన్నప్పుడే మావయ్యా అనాలి. స్కూల్లో మటుకు కాదురోయ్” నవ్వుతూ చెప్పాడు చంద్రశేఖర్.
“సరే, మామా, అల్లుడు కూర్చుని కబుర్లు చెప్పుకోండి. ఈలోగా భోజనం ఏర్పాట్లు చేస్తా” అంటూ, పెరట్లో గాలికి ఊగుతున్న గులాబీ మొక్కకు పూసిన మూడు పువ్వుల వంక ఆనందంగా చూస్తూ, వాటి మీదుగా వస్తున్న సమీరాన్ని ఆఘ్రాణిస్తూ వంటగది వైపు నడిచింది వాసంతి.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *