April 25, 2024

జన్మ భూమి

రచన: సి.హెచ్.ప్రతాప్

కృష్ణా జిల్లా చీమలపాడుకు చెందిన మాధవయ్య కుటుంబం ఒక సాదా సీదా రైతు కుటుంబం. ఉన్న ఎకరం పొలంపై వచ్చే ఆదాయంతో మొత్తం కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ వచ్చాడు. అతనికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వాడికి మహేష్ అనే పేరు పెట్టుకొని ఉన్నదాంట్లోనే వాడికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. మహేశ్ స్వతాహాగా చాలా తెలివైనవాడు. చిన్నప్పటి నుండి పేదరికంలో పెరిగినా, ఊళ్ళో వున్న ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ పొరుగునున్న విజయవాడలో సాంఘీక సంక్షేమ హాస్టల్ లో ఉండి చదువుకున్న మంచి తెలివితేటలు కనబరిచాడు. సినిమాలు, షికార్లు వంటి సరదాలను పక్కన పెట్టి మొత్తం రోజు చదువుకే కేటాయించి, కష్టపడి చదువుకొని, చివరకు బందరు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్సులో ఉచిత సీటు తెచ్చుకున్నాడు. అతడికి ఇంటర్లో వచ్చిన మార్కులు, ఎంసెట్లో వచ్చిన మంచి ర్యాంకు ఆధారంగా ప్రభుత్వం స్కాలర్ షిప్ కూడా మంజూరు చేసింది.ఆ విధంగా మహేశ్ చదువుకు ఆర్థికపరంగా ఎలాంటి ఆటంకం కలగలేదు.
ఇంజనీరింగ్ చదువులో అసాధారణ ప్రతిభ కనబరచిన మహేశ్ కు ఆఖరు సంవత్సరంలో బెంగళూరులో ఒక మంచి మల్టీ నేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు లక్ష రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగంలో చేరుతూ తల్లిదండ్రులను కూడా బెంగుళూరుకు తమతో రమ్మన్నాడు. పుట్టి పెరిగిన ఊరు వదిలి రావడానికి వారు ససేమిరా అంగీకరించలేదు. పైగా చావైనా, రేవైనా తమ స్వంత ఊరిలోనే అని ఖరాఖండీగా చెప్పి, అతడిని వెంటనే వెళ్ళి ఉద్యోగంలో చేరమని ఆశీర్వదించారు.
ఒక శుభముహూర్తాన బెంగళూరులో మహేశ్ ఉద్యోగంలో చేరాడు. తన అసమానమైన ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా ప్రమోషన్లు సంపాదించుకుంటూ జీవితంలో మంచి విజయాలను అందుకోసాగాడు. మూడేళ్ళ తర్వాత కంపెనీ తరఫున అతనికి అమెరికాలో పని చేసే ఛాన్స్ వచ్చింది. అందుకు కూడా అభ్యంతరం పెట్టక హాయిగా వెళ్ళి అమెరికాలో ఉద్యోగం చేసుకోమని మహేశ్ తల్లిదండ్రులు అతనిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పంపించారు.
మరొక రెండేళ్ళు గడిచాయి. మహేశ్ తల్లిదండ్రులు చూపించిన సలక్షణమైన అమ్మాయిని పెళ్ళి చేసుకొని అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు. ఇద్దరూ అక్కడ మంచి ఉద్యోగాలు చేస్తూ చేజేతులా లక్షల్లో సంపాదిస్తూ మూడు పువ్వులు ఆరుకాయలుగా జీవితం ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.
ఒకరోజు మహేశ్ తండ్రి అనారోగ్యంతో మంచం పట్టినట్లు కబురు వచ్చింది. ఉద్యోగానికి శెలవు పెట్టి హుటాహుటిన చీమలపాడు చేరుకున్నాడు మహేశ్. తండ్రి ఆఖరి దశలో ఉన్నాడు. కొడుకుతో “నువ్వు మంచి దశలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. మన కుటుంబానికి మంచి పేరు తెచ్చి నువ్వు నా ఋణం తీర్చుకున్నావు. అయితే నువ్వు తీర్చుకోవాల్సిన మరొక రుణం కూడా వుంది. అది నీ జన్మ భూమి రుణం. నేను పుట్టినప్పటి నుండి ఆఖరి ఊపిరి వరకు నన్ను అన్నివిధాల ఈ నేల నన్ను భరించడం, నీకు కూడా పుట్టుకకు కారణమై నీ అభ్యున్నతికి ఎంతగానో సహకరించిన ఈ జన్మభూమికి నా ఆఖరు కోరికగా ఏమైనా చేసి ఋణం తీర్చుకో” అని అడిగాడు. అలాగేనని మహేశ్ మాట ఇచ్చాక తృప్తిగా కన్ను మూసాడు మహేశ్ తండ్రి మాధవయ్య.
తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం సొంత ఊరి అభివృద్ధికి ఒక పక్కా ప్రణాళిక వేసుకున్నాడు మహేశ్. అందుకు అతని భార్య కూడా నిండు మనస్సుతో సహకరించింది. అయిదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఊరి స్కూలు బాగు చేయించి మంచి ఫర్నిచర్ కొన్నాడు. మరుసటి సంవత్సరం ఆ ఊరిలో తండ్రి పేరు మీద రెండు మంచి నీటి ప్లాంట్ ఏర్పాటు చేసి అయిదు రూపాయలకే ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చేలా గ్రామ పంచాయితీ కార్యవర్గంతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ప్లాంటుకు అయ్యే ఖర్చులన్నీ తానే భరించే నిర్ణయం తీసుకున్నాడు.
తర్వాత ఊరి ప్రాథమిక వైద్యశాల బాగు చేయించడం, ఊరి రోడ్డు రిపేర్ చేయించడం, అత్యవసర పరిస్థితి కోసం ఒక యాంబులెన్స్ కొనడం, ఈ విధంగా తన ఖర్చులు తగ్గించుకుని, ఆదా అయిన డబ్బుతో ఏదో ఒక ప్రజోపకార్యం మహేశ్ ఇప్పటికీ చేస్తూనే వున్నాడు. ఆ విధంగా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం కన్న నేల రుణం ఎంతో కొంత ఈనాటికి కూడా తీర్చుకుంటునే వున్నాడు. తరలుదాం రండి మన జన్మభూమికి…తల్లి పాల రుణం కొంత తీర్చడానికి అందరం నడుం బిగిద్దాం. దేశం అభివృద్ధి కోసం ఒక్క ప్రభుత్వమే అన్నీ చేయడం సాధ్యం కాదని, ఇలా సంస్థలు, వ్యక్తులు కూడా సేవా దృక్పథంతో పని చేయాలని, కార్పొరేట్ సోషల్ బాధ్యతగా పెద్ద కంపెనీలు కూడా ఇలాంటి సేవలకు ముందుకు రావాలని మహెశ్ పిలుపునిచ్చాడు. తమ తమ స్వగ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యతను ఎంతో కొంత తీసుకోవాలని మహేశ్ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చాడు.
రెక్కలు వచ్చేక అందరినీ వారి ఖర్మలకు వదిలేసి డాలర్ల వేటలో విదేశాలకు ఎగిరిపోయే ఎందరో యువతరానికి మహేశ్ చర్యలు స్పూర్తిదాయకంగా నిలిచాయి.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *