April 19, 2024

జీవన వేదం 10

రచన స్వాతీ శ్రీపాద

వెనక్కు తిరిగి చూసుకుంటే నడిచి వచ్చిన దారి పూలబాట కాదు. చక్కగా పరచిన రహదారీ కాదు.
డిగ్రీ పూర్తయినా చదువు ఆగలేదు, అదే ఊపులో ఆపాటికే నేర్చుకున్న ఇంగ్లీష్ భాషమీద వ్యామోహంతో ఎమ్. ఏ కూడా ప్రైవేట్ గానే పూర్తి చేసింది.
సజావుగా సాగుతున్న జీవితంలో ఈవెంట్ మానేజర్ గా సీత మానేజ్ మెంట్ దారిలో రవికిరణ్ అత్యున్నత స్థాయికి వెళ్ళినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పిల్లలు లేకపోవడం ఎవరూ తీర్చే లోటు కాదు. మెడికల్ గా లోపం లేదు. పూజలూ వ్రతాలూ ఎన్ని చెయ్యలేదు.
చివరికి అక్క చెల్లెళ్ళందరూ తమ పిల్లలను దత్తత తీసుకోమని ఎంతో బలవంతం చేసినా ఇద్దరికిద్దరూ వద్దనే అనుకున్నారు.
” మన అనుకుంటే స్వార్ధం ఎక్కువవుతుంది. లేనప్పుడూ నాకు అందరూ సమానం. మీ పిల్లలందరూ మా పిల్లలే” అని తోసిపుచ్చాడు.
అమెరికాలో పచ్చదనం, పరిశుభ్రత మాత్రమే నచ్చాయి. దాదాపు ముప్పై ఏళ్ళపాటు అక్కడే ఉండి ఏడాదికో ఆర్నెల్లకో వచ్చి వెళ్తున్నా, ఎనభైల్లోకి వచ్చిన తల్లీ తండ్రిని వదిలి పోబుద్ధి కాక సతమత మవుతున్నప్పుడు సీతే చొరవ తీసుకుంది.
“వెళ్ళిపోదాం. ఇహ ఇక్కడ ఉండి సంపాదించి ఏం చేసుకుందామని? అక్కడ అత్త, మామను చూసుకుందుకు ఎంత ఇబ్బందిగా ఉంది చూసారుగా. మీ అక్కలు ఉన్నా ఎవరి సంసార ఝంఝాటం వాళ్ళది. వీళ్ళా వెళ్ళి అక్కడ ఎవరిళ్ళలోనూ ఉండలేరు. ”
అయినా ఆర్నెల్లపాటు సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక కూడా బాదరబందీ వదుల్చుకుందుకు ఏడాదిపైనే పట్టింది.
తలిదండ్రులకోసం కొన్న అపార్ట్మెంట్ సౌకర్యంగానే ఉన్నా, విశాలమైన ఇంట్లో ఉండి వచ్చిన ఇద్దరికీ అది ఇరుకిరుగ్గానే అనిపించేది.
అప్పుడే ధైర్యం చేసి పదెకరాల ఆ తోట కొన్నది.
అక్కడే ఒక చిన్న ఇల్లు తమకూ తలిదండ్రులకూ సరిపోయేలా అదీ మండువా లోగిలితో కట్టుకోవాలన్న కోరిక కలిగింది.
ఆ పని పూర్తి కాకముందే తల్లికీ, తండ్రికీ నెల రోజుల వ్యవధిలో కాలం చెల్లిపోయింది.
ఎక్కడినుండి వచ్చారో మళ్ళీ అక్కడే జీవనం మొదలుపెట్టారు.
నాగరికత మానవతను కబళిస్తున్న ఆ సంధి సమయంలో మళ్ళి మనుషులుగా బ్రతకాలన్న తపన ఇద్దరిదీ.
ఎవరిపనులు వాళ్ళు చేసుకోడం అలవాటయాక పనివాళ్ళు ఆదరాబాదరా చేస్తే నచ్చేది కాదు.
కొన్న పదెకరాల స్థలంలో ఉచిత గురుకుల విద్యాలయం, తలిదండ్రుల పేరిట నిరంతరం అందించే ఉచిత ఆయుర్వేద వైద్యం, వృద్ధాశ్రమం సింహ భాగాన్ని ఆక్రమించగా మిగతా స్థలంలోనే సేంద్రీయ విధానాన కూరగాయల పెంపకం తమకంటూ ఉంచుకున్న చిన్న ఇల్లు.
సీత ఇప్పటికీ పిల్లలకు సంగీత పాఠాలు చెబుతూనే ఉంది.
ఎక్కడ శుభకార్యం జరిగినా సీత ఉండాల్సిందే.
రవి సాయంత్రాలు పిల్లలకు టెక్నికల్ సుళువులూ, మానేజ్ మెంట్ మెళుకువలూ నేర్పుతాడు.
ఇది ఉంది ఇది లేదు అన్న బెంగ ఎప్పుడు లేదు ఇద్దరికీ. అక్షయంలా ఉన్న సంపద సౌఖ్యాలు వదిలి సాధారణ జీవనం గడుపుతున్న వారిని చూసి పిచ్చి మొహాలు అని నవ్వుకునే వారున్నారని తెలిసినా బ్రతుకు బ్రతకనివ్వు అదే వారి సిద్ధాంతం.
భారతీయత ఔన్నత్యమే వేరు. భారతీయ జీవన విధానం అపూర్వం అద్వితీయం. వేరు పురుగుల్లా, బురదలో దొర్లే జీవాల్లా ఎందరున్నా అక్షయ పాత్రల్లా ఆర్తులకు అండగా నిలిచేవారు, ధర్మాన్ని మరచిపోని మహాత్ములు ఉన్నంత వరకు ఈ ధర్మపధం ఈ యాత్ర కొనసాగుతాయి.
బ్రతుకు బ్రతకనివ్వు అదే జీవన వేదం.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *