March 29, 2024

పరవశానికి పాత(ర) కథలు – గుంపులో గోవిందా

రచన: డా. వివేకానందమూర్తి

విసిరేసిన చెప్పులు సగం తిని విసిరేసిన నిలవ చపాతీముక్కల్లా కనిపిస్తున్నాయి. వాటి వేపు గోవిందయ్య కృతజ్ఞతాపూర్వకంగా చూశారు. తన కూతురి పెళ్ళికోసం అవి తమ శరీరాల్ని ధారపోసి శ్రమించాయి. నాలుగో పిల్ల నాగరత్నం పెళ్ళికోసం గోవిందయ్య ఆ చెప్పులు తొడుక్కుని నాలుగేళ్ళు తిరిగేడు. తను పూర్తిగా అలిసిపోయి, అవి పూర్తిగా అరిగిపోయేదాకా పిల్ల పెళ్ళి నిశ్చయం కాలేదు. యిన్నాళ్ళకి సంబంధం కుదిరింది. యివాళే ముహూర్తం. యింటి దగ్గర కళ్యాణశోభ అంతా ఏర్పాటైపోయింది. యిప్పుడిక యీ చెప్పులు పనికిరావు. తొడుక్కోడానిక్కూడా వీల్లేకుండా వీగిపోయాయి.
గోవిందయ్య మళ్ళా విసిరేసిన ఆ చెప్పులకేసి చూశాడు. ఏదో జంతువు ఎలాగో చస్తే ఆ చావులోంచి జన్మెత్తి యివి యిలా చచ్చిపోయాయి. పద్దతి తెలీదుగానీ లేకపోతే అవి తనకి చేసిన మేలుకి వాటికి దహన సంస్కారం చెయ్యాలనిపిస్తోంది.
ఎండలో తార్రోడుమీద నిలబడ్డ ఎలిమెంటరీ స్కూలు మేస్టరు గోవిందయ్యకి యిప్పుడు తన చెప్పుల్లేని కాళ్లు కాలుతున్నాయని తెలుస్తోంది.
రెండుపూటలా యింట్లో భోజనం కూడా ఏర్పాటు చేసుకోలేని గోవిందయ్య కుటుంబంలో నాలుగో పిల్ల నాగరత్నం ఇంట్లో ఆకలిలాగే ఎదిగిపోసాగింది. ఎలాగో తిప్పలుబడి ఇంట్లో పెరిగే బరువుని ఇంటిదాన్ని చేయడానికి ఏర్పాటు చెయ్యగలిగాడు.
పెళ్ళిపన్లన్నీ పూర్తయ్యాయి. పెళ్ళివారంతా వచ్చేశారు. తను సంపన్నుడైతే “విచ్చేసేవారు”. బజారు పనులు ముగించుకున్నాడు. ఒక ఇంటికి వెళ్ళాలి. పక్కవీధిలోనే ఇల్లు. భజంత్రీలు వినబడుతున్నాయి. కాళ్ళు కాలుతున్నాయి. ఏదేనా మంచి చెప్పుల జత కొనుక్కోవాలి.
పిల్లతండ్రికి కనీసం కాళ్ళకి చెప్పులు తొడుక్కునే స్తోమత కూడా లేదంటే, నలుగురూ నవ్విపోవడమే కాదు, పీటల మీద పెళ్ళికూడా ఆగిపోవచ్చు. మగపెళ్ళివారికి తనకి డబ్బు లేదని మాత్రం తెల్సుగానీ, తను దరిద్రుడని తెలీదు. అంచేత అర్జంటుగా చెప్పులు కొనుక్కోవాలి. పెళ్ళిసమయం కదా! చెమ్కీ చెప్పులు కొనుక్కొని తొడుక్కుంటే హాయిగా హోదాగా వుంటుంది.
గోవిందయ్య జేబులు తడుముకున్నాడు. చిల్లర చేతికి చల్లగా తగిలింది. అప్పు తెచ్చిన డబ్బంతా చెప్పులకేనా మిగలకుండా ఖర్చయిపోయింది. చెమ్కీ చెప్పులు కాదు కదా – కనీసం చెడిపోయిన చెప్పులు కొనుక్కోడానిక్కూడ దగ్గర డబ్బు లేదు. చెప్పుల విషయం ఇంతవరకూ నిర్లక్ష్యం చేసినందుకు చెప్పు తీసుకుని కొట్టుకోవాలనిపించింది. కానీ కాలికి చెప్పులేదని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.
కాళ్ళు మరీ కాలుతున్నాయి.
గోవిందయ్య ముందుకి నడక సాగించాడు.
కాస్త దూరం నడవగానే కామేశ్వర్రావు ఎదురై “గోవిందయ్యా!” అని పిలిచాడు.
గోవిందయ్య ఆగి, అతడికేసి పరాగ్గా చూశాడు.
“ఏం అలా వున్నావ్? ఏం జరిగింది?” అనడిగాడు. కామేశ్వర్రావు.
గోవిందయ్య బదులు చెప్పకపోతే కామేశ్వర్రావే మళ్ళీ అడిగాడు. “చెప్పు!”
గోవిందయ్య ఒక్కసారి రౌద్రుడైపోయి- “చెప్పు తీసుకుకొడతా?” అన్నాడు.
కామేశ్వర్రావు అతని కాళ్ళవేపు చూసి “ఏవీ! లేవుగా!” అని యికిలిస్తూ వెళ్ళిపోయాడు.
గోవిందయ్యకి కొండంత కోపం వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలన్నంత అవమానం అనిపించింది. యిక ఆగకుండా ముందుకి నడక ప్రారంభించాడు.
వీధి చివర ఏదో షూటింగు జరుగుతోంది. జనమంతా గుంపులు గుంపులుగా నిలబడి చూస్తున్నారు. పోలీసులు విరగబడే జనాన్ని అదుపులో పెడుతున్నారు. గోవిందయ్య కూడా గుంపులోకి దూరాడు.
కెమేరా ముందు ఎవరో యిద్దరు నటులున్నారు.
డైరెక్టర్ “ఏక్షన్” అని అరిచాడు. ఒకతను, రెండో అతన్ని వేడుకుంటు న్నాడు
“బాబూ! అంతమాటనకండి! నా చర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తా!”
ఆ డైలాగు వినగానే, గోవిందయ్యకి అక్కడి అందరి చర్మాలు వొలిచి రకరకాల చెప్పులు కుట్టుకోవాలనిపించింది. అంతలో ఎవరో “పేకప్” అని అరిచాడు.
నటీనటులు, కెమేరాలూ, వగైరా సినిమా ప్రజలంతా అన్నీ సర్దుకుని, ఎవరి కార్లలోకి వాళ్ళు ప్రవేశించారు. విరగబడి చూసిన జనమంతా నటీనటుల కార్లమీదికి విరగబడ్డారు. గుంపులన్నీ గుమిగూడి కలగాపులగం అయ్యాయి. కార్లు కదిలి దూసుకువెళ్లిపోయాయి. పోలీసులు జనాన్ని చెదరగొడుతున్నారు. రోడ్డంతా కలగూరగుంపుగా తయారైంది. అందరూ అటూయిటూ కోలాహలం చేస్తూ పరుగులెడుతున్నారు. గోవిందయ్య కూడా వరదలో కొట్టుకుపోతున్నాడు. ఎవరో తోశారు. తను కింద పడ్డాడు. చుట్టూ చూశాడు. వందలకొద్ది కాళ్ళు, వందలకొద్ది చెప్పులు, వేలసంఖ్యలో కదలికలు.
ఆ కాళ్ళ మధ్యా, ఆ కదలికల మధ్యా గోవిందయ్య కళ్ళకి కనబడింది – ఒక చెమ్కీ చెప్పు! ఎండలో అరటితోటలో ఏకాంతకన్యలా కనబడింది. అతని కళ్ళు పెద్దవయ్యాయి. అంతే గబగబా లేచి, కాళ్ళ మధ్య నుంచి పరుగెడుతూ వెళ్ళి ఆ చెప్పుని చేతుల్లోకి తీసుకున్నాడు. మహాదానందమైంది. ఆ తోపిడిలో ఎవరిది జారిపడిపోయిందో దాని తోటి చెప్పుకోసం గోవిందయ్య చుట్టూరా చూశాడు. దాని జతగాడు కనబడలేదు. ఆ జనం మధ్య అటూ యిటూ కదుల్తూ అంతటా వేటగాడిలా చూశాడు. అతని ఆశ ఫలించింది. రెండో చెమ్కీ చెప్పు రోడ్డుకి అవతలివేపు విడిచేసిన భార్యలా పడుంది. గోవిందయ్య ఆనందానికి హద్దుల్లేవు. యిలా యాదృచ్ఛికంగా తన సమస్య తీరిపోవడంతో అతడి మనసు ఆనందంతో గంతులు వేసింది. గోవిందయ్య దొరికిన చెప్పు చేతిలో పట్టుకొని దొరకాల్సిన చెప్పు కోసం ఒక్క గంతు వేశాడు.
మరుక్షణం అతని కళ్ళు బైర్లు కమ్మాయి. లారీ శబ్దం వినిపించి, గుండెల్లోంచి దూసుకుని దూరం కావడమే అతనికి తెల్సింది.
సూర్యుడు పొడుస్తూంటే స్పృహ తెలుస్తోంది.
కుడికాలు భాగం వేపు బాగా నొప్పిగా వుంది.
కళ్ళు విప్పి చూసుకున్నాడు. కుడికాలు రక్తసిక్తమై పండిన కోడికాలులా తయారైంది. దాన్నెవరో నమిలేసినట్టుగా కూడా వుంది. కాలు కదపబోయాడు. నరాలు జివ్వుమన్నాయి. ఆ కాలింకా తను వాడుకోలేనన్న విషయం చెప్పి, దాన్ని కాస్తా హాస్పిటల్లో తీసేస్తారని గోవిందయ్యకి తెల్సిపోయింది. ఎడం కాలు బాగానే వుంది. ఎడం చేతిలో చెప్పు ఎక్కడికీ పోలేదు. అల్లంత దూరంలో రెండో చెమ్కీ చెప్పు ఎండలో మెరుస్తోంది. గోవిందయ్య అంత బాధలోనూ, అంత బాధని ఏ మాత్రం ఫీలవకుండా విరిగిపోయిన కాలుని ఒకసారి చూసుకుని విర్రవీగిపోతున్న ఈ రెండో చెప్పుని పరిహాసంగా చూశాడు. తనకిక బెంగలేదు. సమస్య లేదు. ఉన్నది ఒక కాలు. ఉన్నది. దానికొక కొత్త చెప్పు. ఎంతో సంతోషంగా వున్నది. తన చెప్పు సమస్య యింత సుళువుగా, తీయని బాధతో తీరిపోయిందన్న సంతోషంతో గోవిందయ్య తన ఎడం చేతిలో చెమ్కీ చెప్పుని మోజుగా చూసుకుని, దాన్ని మిగిలిపోయిన తన ఎడంకాలుకి తగిలించుకున్నాడు. కానీ, కాలు వొప్పుకున్నా, చెప్పు వొప్పుకోలేదు. తీరా తనకు దొరికింది అక్కర్లేని కుడికాలు చెప్పు అని తేల్చేసరికి గోవిందయ్యని సూర్యుడు మళ్ళీ వేడిగా పొడిచాడు.
కళ్ళు బైర్లు కమ్మూతూంటే, పక్కవీధిలో కూతురికి పెళ్ళికి ఏర్పాటు చేసుకున్న భజంత్రీలు గోవిందయ్య చెవులకి లీలగా వినిపించసాగాయి.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *