April 25, 2024

పాపం ఆనందరావు

రచన: మోహనరావు MNAR

ఆనందరావు ఉషారుగా ఆఫీసులోకి ప్రవేశించి తిన్నగా మేనేజరుగారి రూము తలుపు తోసుకొని లోపలకెళ్ళి “గుడ్మార్నింగ్ సార్! మీకో సెన్సేషసల్ న్యూస్” అని తల పైకెత్తి చూసి, స్టన్నయిపోయాడు.
అక్కడ కొత్త మేనేజరుగారు స్టెనోకి ఏదో డిక్టేటు చేస్తున్నారు. ఆయన తలపైకెత్తి ఆనందరావుని చూసారు.
“ఆయన మన ఆఫీసు సీనియర్ సార్” అని పరిచయం చేసింది స్టెనో.
“నమస్తే సార్” అన్నాడు ఆనందరావు మెల్లగా.
“మిష్టర్ ఆనందరావుగారు ఇదిగో ఈ పేపరు మీద ఈ రోజుకి లీవు లెటరు వ్రాసి ఇచ్చి, రేపు మామూలుగా ఆఫీసు టైంకి రండి” అన్నాడాయన.
ఆనందరావు లీవు వ్రాసి ఇచ్చి, హాల్లోకి వచ్చాడు.
“హలో మిష్టర్ ఆనందరావు! కొత్త బాస్ దెబ్బగాని తగిలిందా అలా డల్లైపోయావు” అడిగాడు ఓ గుమస్తా.
“బహుశా అదే అయింటదండి” అని మరొకాయన సపోర్టు చేసాడు.
“అయినా రెండేసి మూడేసి రోజులకోసారి ఆఫీసుకొస్తే ఇలానే ఉంటుంది” అన్నాడు మరో ఆయన.
“హలో ఫ్రండ్సు నా గురించి ఈ మేనేజరుకి తెలియదు, అని అంటుండగానే అందరు ఒక్కసారి లేచి నిలబడ్డారు, “నిలబడ్డం ఎందుకయ్యా కూర్చోండి. రేపో దెబ్బ కొట్టించానంటే అంతే సరైపోతుంది” అని నవ్వుతూ వెనక్కి చూసి ష్టన్నయిపోయాడు. “సార్!” అని మాత్రం అనగలిగాడు.
“మిష్టర్ ఆనందరావు మీరు ఈ రోజు కూడా సెలవు తీసుకొని రేపు ఆ దెబ్బేదో తీసుకొని రండి” అని ఆయన రూంలోకి వెళ్ళిపోయాడు.
ఆనందరావు విలాసంగా నవ్వుకొంటు ఇంటికి చేరాడు, ఫోన్ తీసి డయల్ చేసాడు, అవతల వ్యక్తి “బాబు ఆనందరావు ఈ విషయంలో నేనేం చెయ్యలేను. ఆయన చండశాసనుడు, దయచేసి నన్ను వదిలేయి, బహుశా రేపు నీ జాతకం కూడా మారచ్చు” అని ఫోను పెట్టేసాడు ఆవతలాయన.
ఆమరనాడు ఆఫీసుకి కరెక్టు టైంకి వెళ్ళాడు, అటిండెన్సు రిజిష్టరు మేనేజరుగారి గదిలోఉందని చెప్పాడు అటెండరు. ఆనందరావు నెమ్మదిగా లోపలికెళ్ళి “నమస్తే సార్” అని సంతకం చేయబోయాడు.
“మిష్టరు ఆనందరావు! సంతకం పెట్టకండి. మిమ్మల్ని రిలీవ్ చేసాను మీకు వరంగల్ బదిలి అయింది” అని ఆర్డరు కాగితం అందించారు ఆయన.
ఆనందరావు తిన్నగా హాల్లోకి వచ్చాడు. “ఏం గురు దెబ్బ కొట్టించావా?” అడిగాడు ఒకతను
“భలేవాడివే ఆయన దెబ్బ గాని కొట్టించుంటే ఆనందంగానే ఉండును, కొంపతీసి ఈయనే దెబ్బ తిన్నట్టున్నాడు మొహం విచారంగా ఉంది” అన్నాడు మరో ఆయన.
“అవునా ఆనందరావు” అని అడిగాడు మరొకతను.
“అవునండి లాంగ్ స్టాడింగని నన్ను వరంగల్ బదిలి చేసారండి” అని విచారంగా బైటకి నడిచాడు ఆనందరావు.
అందుకే అతి పనికిరాదని పెద్దలు అన్నారు. పాపం ఆందరావు” అని సింపతి చూపించాడో పెద్దాయన.

*****

1 thought on “పాపం ఆనందరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *