March 29, 2024

లోపలి ఖాళీ – మాతృక

రచన: రామా చంద్రమౌళి

‘‘ హౌ ఓల్డ్‌ యు ఆర్‌ ’’ అని ప్రశ్న.
‘‘ ఐయాం సిక్స్టీ వన్‌ ఇయర్స్‌ ఓల్డ్‌ ’’ అని ఆమె జవాబు.
ఔను. మనుషులు పాతబడిపోతూంటారు. అసలు ఈ పాతబడిపోవడమేమిటి. అరవై ఒక్క ఏండ్లు ఎప్పటినుండి. పుట్టిననాటినుండే కదా. మనిషి పుట్టుక ఒక డేటం లైన్‌. ఆరిజిన్‌. మూల బిందువు. ఇక అక్కడినుండి లెక్క. వన్‌ డే ఓల్డ్‌. టు డేస్‌ ఓల్డ్‌. వన్‌ ఇయర్‌ ఓల్డ్‌. వన్‌ సెంచరీ ఓల్డ్‌. శతాధిక పురాతనత ఉంటుందా మనిషికి. సాధారణంగా ఉండదు.
ఎందుకు. ?
మనిషి ప్రామాణిక ఆయువు వందేండ్లు అని నిర్ధారణ చేసిందెవరు. అలా ఎందుకు చేయబడిరది. వందేండ్లే ఎందుకు. యాభయ్యో. నూటా యాభయ్యో. రెండు వందలో ఎందుకు కాదు. జనన మరణాల మధ్యదే జీవితమని మనం దేన్నైతే వ్యవహరిస్తున్నామో అదే నిజమైన జీవితమా. మనిషి పొందే ఖ్యాతి అపఖ్యాతులతో నిమిత్తమైన మనిషియొక్క మరణానంతర జీవితం గురించి ఏమిటి. ?
తెలుగులో ఐతే. ‘‘ మీ వయసెంత.?’’ అన్న ప్రశ్నకు ‘‘అరవై ఒక్కటి’’ అన్న జవాబులో పాతబడ్డం ప్రస్తావనే లేదు.
అసలు ఈ వయసు ఏమిటి. దేనికి. శరీరానికా. మనసుకా. హృదయానికా. బుద్ధికా. ‘ కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు ఏమిటి. ఈ వృద్ధాప్యమనేది కేవలం దేహానికి మాత్రమే సంబంధించిన వ్యక్తీకరణా. ? ‘హి డైడ్‌ ఎట్‌ సిక్స్టీ. బట్‌ హి వాస్‌ ట్వంటీ ఇయర్స్‌ యంగ్‌’ ఏమిటిది. మనిషియొక్క జీవన విధానాన్ని బట్టి, అభిరుచులనుబట్టి, మానసిక నిర్మలతను బట్టి, మనిషిలో భాసించే మానవీయ పరిమళ సాంద్రతనుబట్టి అసూయా ద్వేషాలు, రాగేచ్ఛలను బట్టి జీవితం రూపుదిద్ధుకుంటూంటుందా. మనిషిలో తనూ, తన చుట్టూ సమాజం. సహమానవులు. సాంగత్య సహవాస అనురక్తత . ఇనన్నీకూడా మనిషి జీవిత నాణ్యతపై ప్రభావిస్తాయికదా.
అసలు ‘ కన్ను తెరిస్తే జీవితం. కన్ను మూస్తే మరణం ’ అని ఒక కవెవరో అన్నట్టు. మధ్య ఉండే నాణ్యమైన లిప్తకాలమే నిజమైన జీవితమని నిర్వచించినపుడు. నిజంగా మానవులందరూ ఎంత జాగ్రత్తగా. పదిలంగా, అపురూపంగా, ఉన్నతంగా జీవించాలి.
కాని జీవిస్తున్నారా ఎవరైనా అట్లా.
ఎందుకో ఆమె. సైంటిస్ట్‌ పుష్పకు చటుక్కున ఒక డంప్‌ యార్డ్‌ లో పరమ దుర్గంధపూరితమైన చెత్తను కుమ్మరిస్తున్న మునిసిపల్‌ గార్బేజ్‌ మూవర్‌ జ్ఞాపకమొచ్చింది. జలజలా కుప్పలు కుప్పలుగా ఒక రాశిలా జారుతున్న చెత్త. జీవించడం ఒక కళైనపుడు. ఆ కళ తెలియనివాడు ఆ చెత్తతో సమానులేకదా.
నూటా ముప్పై కోట్ల మనుషుల్లో ఎంత మానవ చెత్త ఉందో ఈ దేశంలో. హ్యూమన్‌ గార్బేజ్‌. అతి
దుర్గంధపూరితమైన మానవ చెత్తను వేయడానికి ఈ దేశంలో ఏ డంప్‌ యార్డ్‌ కూడా సరిపోదు. ఇటీజ్‌ టు బి బర్న్‌ ట్‌. కాలబెట్టాలి.
మళ్ళీ రెండు భయపెట్టే కవిత్వ చరణాలు.
‘ బ్రతికున్నపుడు మట్టిపై నువ్వు
మరణించిన తర్వాత నీపై మట్టి ’
అసలు ఈ మట్టి ఏమిటి. పంచభూతాల్లో ఒకటైన మట్టి. చెట్టై, పర్వాతాలై, సముద్రాలై, ఆకాశమై, అగ్నై, నీరై, గాలై. ఈ ఐదూ సంలీనమై. మళ్ళీ భాజ్యమై. విభాజ్యమౌతూ ప్రాణాన్ని పోసుకుని సమస్త జీవరాశుల దేహాలై, జీవనిర్జీవ ప్రకృతై. మనిషి శరీరమంతా మట్టే. బొటనవ్రేలితో పెయ్యిని నలుస్తున్నపుడు తెలుస్తూంటుంది మట్టి సంగతి.
పుష్ప తనే స్వయంగా తన జాగ్వర్‌ కార్‌ ను నడుపుకుంటూ వెళ్తోంది తాడ్వాయి అడవులగుండా ఒక్కతే. ఆమె మనసు వేసనిలో అగ్గి అంటుకున్న అడవిలా ఉంటూనే ఒక శీతాకాల ప్రాతః వేళ మంచుకురుస్తున్నవేళ తుహిణ బిందువుల్లో తడుస్తున్న ఒట్టి గులాబీ పువ్వులాకూడా ఉంది. ఒకే జీవితంలో అనేక జీవితాలు, ఒకే కాలంలో అనేక బహుముఖ అనుభూతులు, ఏకసమయంలో భిన్న తాదాత్మ్యతలు అనుభవించగల సంక్లిష్ట సాధన చేయడంవల్ల పుష్పకు అనేకానేక జీవిత ఆంతరిక శక్తులతోపాటు పరిమితులూ, అపరిమిత పరిపరి తప్తతలూ, ధ్యానమగ్నతల రహస్యాలూ తెలుసు. జీవితంలో దేన్నైనా ‘ తెలుసుకోవడం ’ ఒక రహస్య విద్య అని ఆమె ఎంతో సాధన చేసిన తర్వాత గ్రహించింది.
జీవితకాలమంతా ఒక న్యూక్లియర్‌ సైంటిస్ట్‌ గా పనిచేసిన ఆమెకు ఎందుకో చటుక్కున ‘ శక్తి నిత్యత్వ సూత్రం ’ జ్ఞాపకమొచ్చింది . శక్తికి నాశనం లేదు. శక్తి ఒక రూపంలో అంతర్ధానమైనచో వెనువెంటనే మరో రూపంలో ప్రత్యక్షమగును. విద్యుత్‌ శక్తి రాగి వాహకంలోకి అంతర్ధానమై బల్బ్‌ లోని టంగ్స్టన్‌ చుట్టలోనుండి కాంతి శక్తిగా బహిర్గతమౌతుంది. రసాయనిక శక్తి, అయస్కాంత శక్తి, విద్యుదయస్కాంత శక్తి, యాంత్రిక శక్తి, భౌతిక శక్తి, అణుశక్తి . ఇట్లా శక్తి ఎన్ని రూపాల్లో ఉందో. ఈ శక్తి రూపాంతరతలు . అర్థం కావు.
కారు మహా వేగంగా దూసుకుపోతోంది అడవి దారుల్లో. ఆమెకు యాదృచ్ఛికంగా ఈ విశ్వం పుట్టుకకు మూలమైన ‘ మహా విస్ఫోటన ’ బిగ్‌ బ్యాంగ్‌ సిద్ధాంతం జ్ఞాపకమొచ్చింది మెరుపువలె. దానిలో నిక్షిప్తమై ఉన్న ‘ అద్వైత తత్త్వం ’ స్ఫురించింది. చెట్టు ఆకు రాలి మట్టిలో పడ్తే కాలాన్ని మాధ్యమంగా చేసుకుని అది మళ్ళీ మట్టిగా మారాలని పడే తపన జ్ఞప్తికొచ్చింది. మట్టిలోనుండి పుట్టిన మొక్క చెట్టై. అకుగా ఎదిగి రాలిపడి మరల మట్టిగా మారడం. శక్తి నిత్యత్వత కిందికే జడత్వ సిద్ధాంతమై అనువర్తిస్తుందా. అట్లాగే మనిషికి కూడా ఏదైనా ఎత్తైన ఏ నూరు అంతస్తుల భవనంపైకో చేరి కిందికి తొంగిచూచినపుడు. ఒక లిప్తకాలం కిందికి దూకుతే ఎంత బాగుండును అని పొందే చిత్రానుభూతి ఏమిటి. అది మరణ కాంక్షేనా. మనిషి మరణం నుండే జన్మిస్తున్నాడు కాబట్టి మళ్ళీ మరణాన్ని చేరుకోవాలన్నదే ప్రకృతి పరమమా.
మన కంటికి కనబడ్తూ, గోచరిస్తూ, అనుభవమౌతూ. కొన్నిసార్లు కనబడకా మన చుట్టూ తరంగాలు తరంగాలుగా అల్లుకుని ఉన్న ఈ భౌతిక అభౌతిక బాహ్య శక్తులు కాక మోస్ట్‌ ఇన్నర్‌. అంతర్గత అతీత శక్తుల గురించి ఏమిటి.
కారును నడుపుతూనే ప్రక్క సీట్‌ లో ఉన్న న్యూడిల్లీకి చెందిన ప్రొఫెసర్‌ ఎ వి మొహరిర్‌ రాసిన ‘ సైన్స్‌, స్పిరిట్యువాలిటీ, అండ్‌ గాడ్‌ ’ పుస్తకం వైపు చూచింది. ‘ మనిషి వెన్నుపాము పొడవునా, నుదుటిపైనా, శిరస్సు పైనా విపులమై ఉన్న సప్త చక్రాలే దేహాత్మ శక్తి కేంద్రాలు. కఠోరమైన ప్రాణాయామంతో కూడిన ధ్యానంతో ఈ సప్త శక్తి వాహక కేంద్రాలైన మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, అజ్ఞా చక్రాల ద్వారా అంతిమంగా తురీయ స్థితిలో ఉన్న సహస్రార చక్రాన్ని చేరుకోగలిగినప్పుడు మనిషిలోని మూలస్థానంలో నిద్రాణమై ఉండే ‘ కుండలినీ శక్తి ’ మేల్కొంటుంది. ఇదే విశ్వాత్మ శక్తి. మనిషి యొక్క ప్రాణమయ కోశంలో విస్తరించి ఉన్న 72000 నాడులు ఉద్రిక్తమై ప్రధాన నాడులైన ఇద, పింగళ, సుషుమ్న నాడులను ప్రేరేపించి ఆత్మశక్తిని సాక్షాత్కరింపజేస్తాయి. ఈ శక్తి ద్వారానే చేతన, ప్రేరణ, ఉద్దీపన, దివ్యత, చికిత్స సాధ్యమౌతాయి. ఇవన్నిటి గురించి విపులంగా భారతీయ శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి. ఆ కోణంలో మనిషి పరివ్యాప్తమౌతున్న కొద్దీ తనను తాను సూక్ష్మంగా. తనను మినహాయిస్తే ఇతరమై చుట్టూ వ్యాపించి ఉన్న విశ్వమంతా స్థూలమై ఒకానొక ఊర్థ్వ ప్రయాణంలో. మనసు ఆకాశంలో విహరించే పక్షవుతుంది. ఎగిరిపోతున్న హంసవుతుంది. ఒకానొక నిశ్శబ్ద సమాధిలో సంలీనం చెందుతూ పిల్లనగ్రోవి హంసధ్వని రాగమై వర్థిల్లుతూంటుంది.
అప్పుడంతా శూన్యం. అన్నీ ఉండి ఏమీ లేని ప్రతిశూన్య స్థితి.
పుష్ప కారు తాడ్వాయి అడవులు దాటి చిన్న బోయినపల్లి, ఏటూర్‌ నాగారం తర్వాత. శంకరాజుపల్లి. ముళ్ళకట్ట గ్రామాన్ని చేరుకుంటోంది. అదే ఆమె పుట్టిన ఊరు. అక్కడ తను చిన్ననాడు స్నేహించిన గోదావరి నది ఉంది. తన తండ్రీ, తల్లీ, ఇతర చిల్లర బంధువులు అందరూ ఎప్పుడో గతించి పోయారు. జీవితమంతా ఆకాశంలో పక్షిలా ప్రపంచమంతా తిరిగి తిరిగి. అశాంతిలోనుండి ప్రశాంతతను వెదికి వెదికి. గగన యాత్రలు. అణు విచ్ఛేదనలు. అణువే మహా శక్తిశాలి అనే గ్రహింపు. ఇవన్నీ గడిచి. అసలు ‘ అంతిమం ’ ఏమిటి అన్న అన్వేషణ. ఈ అన్వేషణలో భాగమే గోదావరి ఒడ్దున తన ఆత్మసమానమైన అలల లయాత్మక శబ్దాన్ని వినాలనే లక్ష్యంతో ప్రాణప్రదంగా నిర్మించుకున్న తన ‘కుటీరం’.
ఆ కుటీరం ‘ తలుపు తీస్తే జలసంగీతం. అలల గానం. తలుపు మూస్తే మహాధ్యానం ’
యాత్రలు. పర్యటనలు. శోధనలు. వెదుకులాటలు. తన మాతృకను అన్వేషించే క్రమంలో.
మనిషికి తన ఊరు మాతృక. ఊరుకు అక్కడి మట్టి మాతృక. మట్టికి మనిషి మరణం మాతృక. మరణానికి జన్మ మాతృక. జననానికి మళ్ళీ మరణమే మాతృక. అంతా వలయభ్రమణం.
నిన్నటినుండి ఏదో ఒక అర్థంకాని పరితపన పుష్పలో. ఎవరో పిలుస్తున్నట్టు. ఎవరో బాహువులను చాపి ఆహ్వానిస్తున్నట్టు. ఎవరో అవ్యక్త మోహవ్యామోహ మోహనంతో చుట్టూ మోహరించి తనను ఆవహిస్తున్నట్టు. ,
ఎవరది. తన ఊరు ముళ్ళకట్టనా. తన ఊరి నేలా. ఊరి గుట్టా. ఊరి మట్టా. ఊరి గాలా. ఊరిని స్పర్శిస్తూ యుగయుగాలుగా ప్రవహిస్తున్న గోదావరి నదా. ?
ఎవరు. పిలిచేదెవరు. ఒక అద ృశ్య ప్రేమపాశాన్ని విసురుతున్నదెవరు. ఎన్నో తెలిసిన తనకు ఈ తెలియని ‘ అర్థం కానిది ’ ఏమిటి. ?
ఆమె వెదుకులాటలో భాగంగా. గత నెలలో థాయ్‌ ల్యాండ్‌ వెళ్ళింది. ‘ డోర్‌ వే టు సైలెన్స్‌ ’ . ‘ టాకింగ్‌ టు
నేచర్‌.’ ప్రకృతితో మాట్లాడ్డం. ఎంత సుందర భావన. అద్భుతమైన సంగీతాన్ని పరిచయం చేశారు థాయ్‌ సంగీతకారులు వాళ్ళ ప్రత్యేక వాద్యాలతో. అక్కడ పరిచయమైనవాడు ‘శాస్త్రో’. తన వేణు గానంతో, స్వరంతో ఎవరినైనా మైమరిపించి రసగంగా ప్రవాహంలో ఓలలాడిస్తూ అతీతలోకాల్లో విహంగమై విహరించే తురీయ స్థితికి తీసుకుపోయే ఒక స్వరగురు.
అతనికి మహాద్భుతమైన మురళీ గాన ప్రావీణ్యతను దానం చేసింది భారతదేశమే. అతను మొదట తన ఆధ్యాత్మిక గురు ఓషో’ తో భారతదేశంలో కొన్నేండ్లు గడిపి ‘ధ్యానం. భావాతీత ధ్యానం’ మార్గాన్ని సంగీతంతో మేళవిస్తూ సాధన చేసి ప్రపంచం పరవశించిపోయే ‘ఫ్యూజన్‌ మ్యూజిక్‌’ కు రూపకల్పన చేశాడు. భారతదేశ అమర వాయిద్యం బాంసురీ. కృష్ణుని వాయిద్యం మురళి లో ఆత్మను పలికించే ప్రవీణుడుగా తపస్సించి అమెరికాలో ఇరవై ఏళ్లు గడిపి మొత్తం పదిహేను ఆల్బమ్స్ విడుదల చేసి ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. జెన్‌ నోట్స్‌, తాంత్రిక్‌ హార్ట్‌, రేఖీ ఆఫరింగ్స్‌, షమాన్స్‌ హీలింగ్‌ వంటి అపురూప విద్యలతో మానవాళికి ఒక కొత్త సంగీతమార్గాన్ని చూపుతూ తనవెంట నడిపించుకు వెళ్తున్న చైతన్యశీలి శాస్త్రో. ప్రస్తుతం తన స్వంత ప్రాంతం యూరోప్‌, ఇటలీలలో నివసిస్తూ అంతర్జాతీయ రసపిపాసుల ఆధ్యాత్మిక దాహార్తిని తీరుస్తున్నాడు. 1986లో భారతదేశానికి ఒక ఫోటోగ్రాఫర్‌ గా వచ్చిన శాస్త్రో మొట్టమొదట పూణే లోని ఓషో ఆశ్రమం గేట్‌ బయట కూర్చుని వెదురుతో చేసిన ఫ్లూట్స్‌ ను అమ్ముకునేవాడు. ఒకరోజు ఓషో అతన్ని గమనించి. ‘‘ నీవిక నా దగ్గర ఫోటోగ్రాఫర్‌ గా, ఈ బాంసురీ లు అమ్ముకునే స్థితినుండి ఒక అంతర్జాతీయ స్థాయి సంగీతకారునిగా మారబోతున్నావు ’’ అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడట.
ఓషో అన్నట్టే శాస్త్రో ఒక విశ్వ స్వరకారునిగా మారి ఇప్పుడు ఇటలీలోని ఆశ్రమంలో ఆధ్యాత్మిక చింతనాపరులకు, దాహార్తులకు ‘ లివ్‌ మ్యూజిక్‌ ’ వినిపిస్తున్నాడు.
అప్పటికే పుష్ప శాస్త్రో యొక్క ‘ టాకింగ్‌ టు నేచర్‌ ’ ఆల్బంను వింటోంది దారి పొడవునా. అది వింటూ తాడ్వాయి అడవిదారుల్లో దూసుకుపోవడం ఆమెకు అప్పుడే రెక్కలు మొలుస్తున్న పక్షిపిల్ల పొందే మహదానందాన్ని అందిస్తోంది.
అలౌకికం. అంటే ఇదేనా ?
ముళ్ళకట్ట గ్రామం వచ్చింది. కారు ఆ చిన్న గ్రామంలోకి ప్రవేశించగానే. అనుకున్నట్టే తన పరిచారిక రాజవ్వ వచ్చింది ఎదురుగా. బడి ముంగిట కలయిక. . ఎప్పుడూ. ఆ బడి తను కట్టించిందే. ప్రక్కనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తను ఏర్పాటు చేసిందే. వరుసగా పద్దెమిది ఇళ్ళను నిర్మింపజేసి పేదలకు తాను దానం చేసిందే. ఇంటింటికీ మొక్కలను పెంచుకుంటూ. పొలాలలో అసాధారణ పంటలను సాగు చేసే విద్యను తనే శిక్షణనిప్పించి నేర్పించి. ముళ్ళకట్ట ఊరును తను దత్తత తీసుకుంది పదేండ్ల క్రితం.
బిలబిలమని బడిపిల్లలు పరుగెత్తుకొచ్చారు పుష్ప దగ్గరికి. వచ్చి మోకాళ్ళ చుట్టూ ఆత్మీయంగా చుట్టుకుని. లేగదూడ వచ్చి తల్లి ఆవును పొదువుకుంటూంటే. కలిగే మాతృ అనుభూతి అది. పుష్ప రాజవ్వకు సైగ చేసింది. ఆమె పరుగున వెళ్ళి కార్‌ డిక్కీలోని పెద్ద సంచీని తీసుకొచ్చింది. ‘‘ దాంట్లో ఉన్నవన్నీ పిల్లలకూ, ఊరివాళ్ళకూ పంచిపెట్టు రాజవ్వా ’’ అని. ఎంతో అలసిపోయిన ఆమె ప్రక్కనే గోదావరి ఒడ్డున ఉన్న తన మట్టి ఇంటిలోకి వెళ్ళింది. తను కోరి కట్టించుకున్న సాంప్రదాయ మట్టిగోడల ఇల్లు అది. గోడలకు జాజు పూత, పైన సున్నపు ముగ్గులు. ఎర్రమన్నుతో అలికిన నేల. వాకిట్లో విరివిగా పూల చెట్లు. వెదురు ఆకృతులపై గుంపులు గుంపులుగా పావురాలు ఎగురుతూ జీవ సంరంభం. ఒక్కసారిగా మారిన ప్రకృతి సహజ వాతావరణం ఆమెలో కొత్త శక్తిని నింపుతూండగా. “రాజమ్మా నేను కాస్సేపు ఆ గోదావరి తల్లి ఒడ్డున కూర్చుని వస్తా . నువ్వు కాఫీ చెయ్‌’’ అని. నడుస్తూ ఒడ్డు ఒడిలోకి నడిచింది.
తనే పెట్టిన రావి చెట్టు. పెరిగి పెద్దదై. చుట్టూ తనే కట్టించుకున్న సిమెంట్‌ చప్టా.
కూర్చుంది నిరామయంగా.
చిన్నప్పటినుండి. అమ్మా నాన్న. బడి ఈ ఊళ్లోనే. కొద్దిపాటి పొలం. చదువుకోసం పడరాని పాట్లు. పట్టణానికి. ములుగు. వరంగల్‌. అటు తర్వాత హైదరాబాద్‌. వారణాసి. డిగ్రీ. పి. జి. రీసర్చ్‌. పి. హెచ్‌ డి. పెళ్ళి. భిన్న తత్వాలు. భిన్న ధృవాలు. విభిన్న అభిరుచులు. స్వార్థాలు. విడిపోయే మార్గాలు. కలవని దారులు. వైరుధ్యాల భిన్న అభిప్రాయాలు. వ్చ్‌.
వెనక్కి చెట్టు బోదెకు ఒరిగి. అప్రయత్నంగానే శాస్త్రో ‘ టచింగ్‌ సైలెన్స్‌’ ఆల్బం ను ఆన్‌ చేసింది. అంతే రాగరaరి ఉప్పొంగి. అటు గోదావరి. ఇటు రసగంగ.
కళ్ళు మూసుకుంది పుష్ప లీనమై తాదాత్మ్యతతో. ఆత్మ లోపల వేణువు ధ్వని. బయట గోదావరి లాలింత. తలనిమురుతున్నట్టు.
‘ నిజమైన బాహ్య స్వరమధురిమ
ఆత్మలో నిక్షిప్తమై ఉన్న అంతర ఆత్మసంగీతాన్ని చేరి
రెండూ సంయుక్తమై ఒక పరమ నిశ్శబ్దాన్ని ప్రసాదిస్తాయి
అదే అంతిమం ’
‘ దెన్‌ ది మార్కెట్‌ ప్లేస్‌ ఇన్‌ యు డిసప్పియర్స్‌. ’ ఓషో.
అదే జరుగుతోందామెలో. సమస్త అలజడులకూ అతీతమైపోతూ ఆమె అభౌతిక వ్యక్తిగత ఆత్మ. ఇండివిజ్యువల్‌ కాన్షియస్‌ నెస్‌. విశ్వాత్మగా. యూనివర్సల్‌ కాన్షియస్‌నెస్‌ గా పరివర్తిస్తూ. అంతా అమరమైన అమృతతుల్య పరమ నిశ్శబ్దం. అక్కడ. ఆ క్షణం.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *