February 23, 2024

వెంటాడే కథ – 18 పేదవాడు మనసు

రచన: … చంద్రప్రతాప్ కంతేటి

విపుల / చతుర పూర్వసంపాదకులు

Ph: 80081 43507

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!

ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

జోరున వాన!
నగరం మొత్తం తడిసి ముద్దయింది..
రహదారులు గోదారులయ్యాయి. లోతట్టు ప్రాంతాలు దాదాపు మునిగిపోయాయి. ఒకటే ఈదురుగాలి! పెద్ద పెద్ద చెట్లు కూలి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి.. కొన్ని కరెంటు తీగల మీద పడడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.
ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్!
వాహనాల హారన్ లు చెవులు దిబ్బిళ్ళెక్కిస్తున్నాయి..
రామదాసు కుటుంబం మొత్తం తడిసిపోయింది.
పిల్లలు చలికి గజగజ వణుకుతున్నారు.
ఒక పెద్ద బిల్డింగ్ కట్టుబడి పనుల్లో ఉన్న అతని కుటుంబం బిల్డింగ్ పాత ప్రహరీ గోడ వారగా ఒక టార్పాలిన్ ను డేరా లాగా దించుని అందులో జీవిస్తోంది. కట్టుబడి పనులు ఇంకా పునాదుల దశ దాటలేదు.. పునాదులకోసం తీసిన గోతుల నిండా నీరు చేరింది..
అంత గాలి వానకు డేరా ఏమి ఆగుతుంది?
రామదాసు జీవితంలాగే అది కూడా గాలికి రెపరెపలాడుతోంది.
రామదాసు నగరానికి వచ్చి మూడు నెలలే అయింది. తన మిత్రుడు, తన ఊరి వాడైన తోటి కూలి రంగయ్య ఈ పనికి కుదిరించాడు.
రంగయ్య గూడా అదే బిల్డింగు ప్రహరీ గోడ ఆధారంగా నాలుగైదు ఇనుప రేకులు పరుచుకుని వాటిని పుచ్చిన దుంగలతో సాయంతో ఒక ఆవాసంగా మార్చుకున్నాడు.
అది కాక రంగయ్యకు గంపెడు సంతానం.. ఏడుగురు పిల్లలు!
అందరూ షెడ్డులా కనపడే ఆవాసంలో ముసుగు తన్ని పడుకున్నారు.
రామదాసుకు కూడా నలుగురు పిల్లలు..
టార్పాలిన్ సందుల్లో నుంచి వర్షం డేరాలో కురుస్తుండటంతో పిల్లలు చలికి గజగజ వణుకుతున్నారు. అతని భార్య తడిసిపోయిన దుప్పట్లు పిండి వాటినే వాళ్ల మీద కప్పుతోంది.. తమ దరిద్రానికి చింతిస్తున్నాడు రామదాసు.
‘పోనీ రంగయ్య షెడ్డులోకి వెళ్దామా అంటే అది చాలా ఇరుకు! అప్పటికే వాళ్ళ పిల్లలు భార్య భర్త కలిపి తొమ్మిదిమంది.
రంగయ్య కూడా రామదాసు కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. ఏదో రకంగా ఈ వర్షాలు తగ్గాక రామదాసు కూడా ఒక రేకుల షెడ్డు దించితే హాయిగా ఉంటాడు అనుకున్నాడతను.
రెండు గంటలు దాటాక వాన కాస్త తెరిపినిచ్చింది. కరెంటు కూడా వచ్చింది.
అంతలో ఉన్నట్టుండి ధడేల్ ధడేల్ మని శబ్దాలు.. ”అమ్మో అయ్యో” అని ఏడుపులు. పిల్లల రోదనలు!
అప్పుడే కునుకు పట్టిన రామదాసు ఉలిక్కిపడి లేచాడు. ఆ కేకలన్నీ తన పక్కింటి రంగయ్య కుటుంబానిదే అని గ్రహించడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒక్క ఉదుటున డేరా నుంచి బయటికి పరిగెత్తుకొచ్చాడు.
ప్రహరీ గోడ కొంత మేరకు కూలటంతో ఇనుప రేకులు కూలి ఇంట్లో వాళ్ల మీద పడిపోయాయి. వాటికి ఆధారం పుచ్చిపోయిన స్తంభాలు కావడం… రేకులు గాలికి ఎగరకుండా పెద్దపెద్ద సిమెంట్ రాళ్లు పెట్టి ఉండటం వల్ల రేకుల కింద ఇరుక్కుపోయిన వాళ్లంతా బాధతో మూలుగుతున్నారు..
ఆ దుర్ఘటన చూడగానే కొన్ని క్షణాలు అచేతనుడయ్యాడు రామదాసు.
గబగబా తన డేరా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి భార్య కాంతాన్ని పిలిచాడు. ఆమె అప్పటికే లేచి బయటకు వస్తోంది..
”రంగయ్య ఇల్లు కూలి కూలిపోయింది.” ఆపై మాటలు రామదాసు నోట్లోంచి పెగలడం లేదు. గొంతు దుఃఖంతో పూడుకుపోయింది..
రామదాసు పిల్లలు 10 12 ఏళ్ల వాళ్ళు కావడంతో అందరూ బయటకు వచ్చారు.. ఆ శబ్దాలకు ఇరుగు పొరుగున ఉన్న కూలీలు పరుగున వచ్చారు. అందరూ కలిసి రేకులను, బండలను బలవంతంగా తొలగించి రంగయ్య కుటుంబ సభ్యులను సభ్యులను వెలికి తీశారు.
రంగయ్య దంపతులు తీవ్రంగా గాయపడి ఉన్నాడు. ఐదుగురు పిల్లల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి..
కాసేపటికి తేరుకున్న రామదాసు రంగయ్యను, గాయపడి ఉన్న అతని పిల్లల్ని, భార్యను సర్కార్ దవాఖానాకి అంబులెన్సులో తీసుకుపోయాడు.
దారిలో మరో పిల్లవాడు కన్నుమూశాడు.
ఎంత విషాదం?
నిండు కుటుంబాన్ని మృత్యువు ఒక్కపెట్టున కబళించేసింది అని మౌనంగా రోదించాడు రామదాసు. తనకు ఇంత చేసిన రంగయ్యకు ఇంత కష్టం రావడం అతను భరించలేకపోయాడు.
మరోపక్క అంతా గ్రహచారం కాకపోతే ఏమిటి?
‘ఏ పూర్వజన్మ పాపం రంగయ్యను ఇలాంటి దుస్థితిలోకి నెట్టిందో ? ఏడుగురు పిల్లలలో ఒక్కడు మాత్రం మిగిలాడు భార్యకు కాలు విరిగింది..’ అనుకున్నాడు.
దవాఖానలో డాక్టర్లు రంగయ్య దంపతులకు మిగిలిన పసి ప్రాణానికి ప్రాణాపాయం లేదని తేల్చి చెప్పారు.
గాఢంగా ఒక్క నిటూర్పు విడిచాడు రామదాసు. రంగయ్య భార్యకు స్పృహ వస్తే ఆ కన్నతల్లి గుండె ఎంత తల్లడిల్లు తుందోనని ఆవేదన చెందాడు. ఆ గుండెకోతకు ఎవరు సమాధానం చెప్పగలరు ?
ఏదైనా తలరాతను ఎవరు మార్చగలరు కాసేపు వైరాగ్యం వైపు మళ్ళింది అతని మనసు.
అంతలోనే- దేవుడి దయవల్ల తన ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారు.. ”స్వామి నీ చల్లని చూపులతో నా కుటుంబం
ప్రాణాలతో బయట పడింది” అని కనిపించని దేవుళ్లకు కనిపించేలా రెండు చేతులెత్తి మొక్కుకున్నాడు రామదాసు.

*. *. *

పది రోజులు గడిచాయి.
రంగయ్య అతని భార్య మిగిలిన కొడుకు ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
పడిపోయిన గోడలను తన బిడ్డలను బలి తీసుకున్న రేకులను చూసి గుండెలు బాదుకుంటూ మళ్లీ దుఃఖసాగరంలో మునిగిపోయింది రంగయ్య భార్య. మగాడు కనుక దుఃఖాన్ని పళ్ళబిగువున భరిస్తున్నాడు రంగయ్య.
నగరపాలక సంస్థ, రెవిన్యూ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి ప్రాణ నష్టం జరిగిన వారి వివరాలు నోట్ చేసుకున్నారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాడు ముఖ్యమంత్రి. గాయపడినవారికి యాభై వేలు ఇస్తామన్నారు.
ఏమైతేనేం? రంగయ్య కుటుంబానికి ఎనిమిది లక్షల దాకా డబ్బు అందింది.
దోసిట్లో డబ్బు పట్టుకుని రంగయ్య దంపతులు భోరున ఏడ్చారు.
తమ పిల్లల ‘రక్తపు కూడు’ అని తలబాదుకున్నాడు రంగయ్య.
కరెన్సీ నోట్లు అతని కన్నీటి ధారలతో తడిసిపోయాయి.
“దేవుడు అన్యాయం చేసినా అధికారులు న్యాయమే చేశారు ఊరికే బాధపడకండి” అని రామదాసు కుటుంబం వారిని ఓదార్చారు.
మరో మూడు నెలలు గడిచాయి..
రంగయ్య ఒక రోజున రామదాసు కలిసి “ఇక నేను ఇక్కడ ఉండలేను.. వెళ్ళిపోతారా! ప్రభుత్వం చేసిన సాయంతో ఏదో చోట చిన్న కిరాణా దుకాణం పెట్టుకొని బతుకుతాను. ప్రభుత్వం వారు ఇళ్ల స్థలం కూడా ఇస్తామన్నారు.. ఇక్కడ ఉంటే పిల్లల జ్ఞాపకాలే కళ్ళముందు మెదుల్తుంటాయి.. ఇక వెళ్తాం” అని వీడ్కోలు తీసుకున్నాడు.
రంగయ్య కుటుంబం వెళ్లిపోయింది. రామదాసు కుటుంబం ఒంటరిగా మిగిలింది..
రంగయ్య వెళ్లిపోవడంతో అతనికి ఒక పెద్దతోడు కోల్పోయిన భావన..
అది కాక రంగయ్యకు ఇక భయం లేదు నాలాగా కూలీనాలీ చేసుకొని బతకాల్సిన పరిస్థితి లేదు.. నిలువ నీడ లేకుండా డేరాల్లో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఒళ్లంతా రెక్కలు ముక్కలు చేసుకొని బతకాల్సిన పని లేదు అనుకుంటున్న అతని దృష్టి ఇంటి ముందు ఆడుకుంటున్న తన నలుగురు పిల్లలపై పడింది..
కనీసం వీళ్ళల్లో ఏ ఒక్కడన్నా చనిపోయి ఉంటే లక్ష రూపాయలు వచ్చేది.. కనీసం కాలు విరిగినా యాభై వేలు వచ్చేది..
తను ఎప్పటికైనా జీవితంలో లక్ష రూపాయలు సంపాదించగలడా? అనుకున్నాడు..
అంతలోనే అతని ఆలోచనలకు అతనికి సిగ్గేసింది..
పిల్లల సంపాదించి పెట్టిన రక్తపు కూడు కోసం తన కక్కుర్తి పడుతున్నాడా అనుకున్నాడు.
మరుక్షణమే అనిపించింది..
‘తప్పేముంది ఈ లోకంలో మనిషి బతకాలంటే కావలసింది డబ్బు! అది లేకుండా ఎన్ని అనుకున్నా ఎందరు ఉన్నా ఒరిగేదేముంది?’ అంటూ అతని ఆత్మ నవ్వింది..
‘ఛత్ నోర్ముయ్’ అంటూ ఆత్మను కసిరి చుట్ట వెలిగించుకున్నాడు రామదాసు.
“అయ్యా మాపటేళకు ఇంట్లో నూకలు లేవు” అని అరిచిన సుశీల అరుపుకు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు రామదాసు.

-:0:-

నా విశ్లేషణ:

నాకు గుర్తు ఉన్నంతవరకు ఇది తెలుగు కథ! చాలా బాగా రాశారు. సామాన్యుడు బతకాలంటే ఈ లోకంలో కావలసిన ఇంధనం ధనం! అది లేనప్పుడు ఆలోచనలు ఎన్ని రకాల పెడ దారులైనా పడతాయి. అందులో ముఖ్యంగా తోటి కూలి లక్షలకు పడగెత్తడం తలచుకున్నప్పుడు రామదాసు ఆలోచనలు రకరకాలుగా మారిపోయాయి. నిజం కూడా అంతే ! ఒకప్పుడు అదృష్టం అనుకున్నదే దురదృష్టంగా భావిస్తాం. అది మనసు చేసే గమ్మత్తు! రెక్కాడితే డొక్కాడని కుటుంబంలో ఒక్కడైనా చనిపోయి ఉంటే బాగుంటుంది ఒక తండ్రి అనుకున్నాడు అంటే దానికి మించిన దురదృష్టం ఏముంది? అది మనిషి జీవితంలో డబ్బు పాత్ర! అందుకే ఆ డబ్బు కోసం మనిషి నానా గడ్డి కరుస్తాడు. ఇందులో మరొక కోణం కూడా ఉంది రామదాసు పొట్ట గడవక అలాంటి దురాలోచన చేశాడు తప్ప అన్యం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *