May 25, 2024

ఊయల వంతెన

రచన: బి.భవానీ కుమారి

సమయం ఒంటిగంట దాటుతుండగా, పొలం నుంచి వచ్చిన రాఘవ భోజనానికి కూర్చున్నాడు. జానకి ఇద్దరికీ కంచాలు పెట్టి, వడ్డించటానికి సిద్దమౌతుండగా , బెడ్ రూమ్ కిటికీ అద్దాలు భళ్ళున పగిలిన శబ్దం వచ్చింది. ఆ వెనువెంటనే, వరండాలో వరుసగా రాళ్లు పడుతున్న శబ్దం విని ఇద్దరూ గబాగబా వరండాలోకి వచ్చారు.
“నువ్వు బయటకు రాకు” అంటూ ముందుకెళ్ళి చుట్టూ చూసాడు. మరొక గులకరాయి వచ్చి పడింది , ఆశ్చర్యపోతూ ఈసారి తమ్ముడు, తన ఇంటిమధ్య వున్న గోడవైపు చూసాడు. ఎర్రటి ఎండలో, ఆ ఎత్తు తక్కువ గోడమీద కూర్చున్నాడు ఏడేళ్ల శశిధర్. పైన ఎండమాడుతోంది. ఆ గోడ కూడా బాగా కాలుతుండొచ్చు. అయినా వాడలాగే గోడమీద కూర్చొని మరో రాయి రాఘవ మీదికి విసిరాడు. ఒడుపుగా తప్పించుకొని రాఘవ వాడివైపు వెళ్ళబోయాడు.
“దగ్గరికి రావొద్దు నాన్నా, నువ్వు జానకి గుడ్డు పులుసు వేసుకొని బాగా తిన్నారా? నేను చూడు, లంచ్ బాక్స్ ఎలా విసిరేసానో ! నేను ఇప్పటిదాకా ఏమి తినలేదు, మీరిద్దరూ బాగా తిన్నారు కాదూ” , వాడి గొంతునిండా దుఃఖం,, ఉక్రోషం కలగలిపి వున్నాయి.
జానకి బయటకు వచ్చి ఏడుస్తూ అన్నది ” ముందు వాడిని ఆ గోడమీదనుంచి దింపండి, ఎండకు మాడిపోతున్నాడు “.
రాఘవ వాడివైపు వెళ్ళ బోయాడు.
“దగ్గరికి రావొద్దు నాన్నా, రాయేసి కొట్టేస్తాను”
వాడు విసిరిన రాయిని ఒడుపుగా తప్పించుకొని, గిజగిజా గింజుకొంటున్నవాడిని గోడమీద నుంచి దింపాడు. పంపు దగ్గరకు తీసుకెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడిగి లోపలికి తీసుకెళ్లాడు. జానకి కన్నీళ్ళతో వచ్చి, వాడిని చేతుల్లోకి తీసుకోబోయింది. వాడు విదిలించికొట్టి పెద్దగా ఏడవసాగాడు.
“వాడికి అన్నం తినిపించు ముందు ” అన్నాడు రాఘవ.
వాడి వెండి కంచంలో అన్నం, ముద్దపప్పు చింతకాయ పచ్చడి, నెయ్యి వేసి తినిపించబోయింది. వాడికా రెండూ చాలా ఇష్టం. వాడు ఆమె చేతిని గట్టిగా పట్టుకొని “నేను రాకున్నా, నాకిష్టమైనవన్నీ చేసుకొని నువ్వూ, నాన్నా తింటున్నారు కదూ “, దుఃఖం ఆపుకోలేక బావురుమంది ఆమె.
రాఘవ వాణ్ణి దగ్గరకు తీసుకొని, “ముందు అన్నం తిను నాన్నా” అంటూ లాలించాడు. వాడికిష్టమైన కోడిగుడ్డు పులుసు కలిపింది ఈసారి. వాడు జానకి చేతిమీద కొట్టి ” నా కిష్టమైనవన్నీ చేసుకొని తింటున్నారా మీరిద్దరూ?”
“తప్పు నాన్నా, కోపంతో అన్నం తినకూడదు నాన్నా” అంటూ బుజ్జగించాడు రాఘవ. ఆఖరికి మీగడ పెరుగేసి పెట్టింది. వాళ్లిద్దరూ అన్నం తింటుంటే ప్రక్కనే కూర్చుని కబుర్లు చెప్పసాగాడు
భోజనాలు అయ్యాక రాఘవ వాడిని ప్రక్కన కూర్చోబెట్టుకొని “అమ్మ నీకిష్టమైనవన్నీ చేసి, రోజూ నువ్వు వస్తావని ఎదురుచూస్తోంది కన్నా” అనునయంగా అన్నాడు.
“నేనెలా వస్తాను నాన్నా? మధ్య గేట్ కి తాళం వేశారు కదా”అంటుంటే ఇద్దరికీ చాలా కష్టమనిపించింది
ముద్దుగా “కన్నయ్యా” అని పిలుస్తారు వాళ్లిద్దరూ. రాఘవ, జానకి పెళ్ళై పదేళ్లయినా పిల్లలు లేరు. తమ్ముడు కేశవ, మాధవి కొడుకు శశిధర్. రాఘవను, జానకిని అమ్మా, నాన్న అని పిలుస్తాడు. అసలు తల్లి తండ్రులను మమ్మీ, డాడీ అని పిలుస్తాడు.
కలుక్కుమంది రాఘవకు. పెద్దవాళ్ళ ఆవేశ, కావేశాల మధ్య ఆ పసివాడు నలిగిపోతున్నాడు.
“నువ్వెందుకు చెప్పవు నాన్నా, మమ్మీ, డాడీకి గేట్ కి తాళం వెయ్యద్దని? నన్ను రానివ్వటం లేదు , నువ్వేమో నన్ను రమ్మని పిలవటం మానేశావు, ఎందుకు నాన్నా, నా మీద కోపం వచ్చిందా?”జానకి దుఃఖం ఆపుకోలేకపోయింది. వాడిమీద తమకే అధికారం లేదా? చిన్నప్పట్నుంచీ పెంచిన మమకారం , పదిరోజుల నుంచి చంపుకొని బ్రతుకుతోంది.
సీతారామయ్యకు రాఘవ, కేశవ ఇద్దరు కొడుకులు. రాఘవ ఇంటర్ తో చదువాపేసి,, వ్యవసాయాన్ని ఇష్టపడ్డాడు. కేశవ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి జూనియర్ లెక్చరరుగా స్థిరపడ్డాడు. ఇల్లు మరీ పెద్దది కాకపోవటంతో దగ్గరలోనే రెంటికి ఇల్లు తీసుకొని వుంటున్నారు. భార్య పోయిన దగ్గరినించీ, సీతారామయ్య, మళ్ళీ పెళ్లిమాట ఎత్తకుండా రాఘవకి, జానకితో ఇరవరెండేళ్లకే పెళ్ళిచేసాడు. జానకి మంచితనం, కుటుంబ బాధ్యతలని చిన్నవయసులోనే నిభాయించుకొన్న కోడలి నీడలో ఆయన ఎటువంటి దిగులు లేకుండా జీవితం గడిపాడు.
కేశవకి డిగ్రీ చదివిన మాధవితో పెళ్లి జరిపించాడు. ఉన్నవాళ్ళ అమ్మాయి. మాటలో తొందరపాటు వున్నా, జానకి సర్దుకు పోవటంతో . కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు లేవు. సీతారామయ్యకు, పెద్దకొడుకుకి పిల్లలు లేరన్న దిగులు ఉండేది. మాధవికి పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ రావటంతో కంగారుపడింది , తన తల్లి సలహా మీద అబార్షన్ చేయించుకొందామనుకొన్నది. పిల్లలు లేని జానకి మాధవికి నచ్చచెప్పి, ఆమె పి .జి చదువుకి అడ్డురాకుండా, పసివాడి బాధ్యత పూర్తిగా తన మీద వేసుకొంది మాధవి హాయిగా చదువు పూర్తి చేసి, బి. ఎడ్ లో చేరింది. నాలుగేళ్లు వాడు పూర్తిగా రాఘవ ఇంట్లోనే అల్లారుముద్దుగా పెరిగాడు. ఇంటి ప్రక్కనే వున్న నాలుగు వందల గజాల ప్లాటు కేశవ పేరున రాసాడు తండ్రి. దాంట్లో లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొన్నారు. ఇల్లు కట్టేటప్పుడు కూడా డబ్బు బాగానే ఇచ్చారాయన చిన్న కొడుకుకి.
మాధవికి లైఫ్ ఎంజాయ్ చేసేది. టూర్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్లినా కొడుకుని తోడికోడలు దగ్గిరే వదిలేసేది. జానకి వాడి బాధ్యతని ఎంతో సంతోషంగా స్వీకరించింది. అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో , సీతారామయ్య గుండెపోటుతో హఠాన్మరణం చెందటం, ఆ కుటుంబాన్ని కుదిపేసింది. జానకి చాలా దిగులుపడింది. తనని కోడలుగా కాక, కూతురిలా చూసుకొన్న మామగారి మరణం ఆమెని ఎంతో బాధపెట్టింది
కొడుకులకు మాగాణి సమానంగా పంచాడు. తాను కట్టించిన ఇల్లు రాఘవ పేరున పెట్టాడు. మెట్ట పొలం రాఘవకి రెండెకరాలు ఎక్కువ ఇచ్చాడు. తండ్రి ఆ విధంగా ఎందుకు చేసాడో రాఘవకు అర్ధం కాలేదు. కానీ మాధవికి, ఆమె తరపు వాళ్లకి ఇది నచ్చలేదు. ఆస్తి అంతా సీతారామయ్య స్వార్జితం కాబట్టి ఎవరూ మాట్లాడటానికి లేకపోయింది. మాధవికి కూడా సంతానం వున్న తమకు తక్కువ ఇచ్చి, బావగారికి ఎక్కువ ఇవ్వటంతో నిగ్రహించుకోలేక పోయింది.
కేశవ ఎంత నచ్చచెప్పినా, మాధవి ఊరుకోలేక పోయింది. ఆమెకు తల్లితండ్రుల వత్తాసుతో జానకిని నానామాటలు అన్నది. ఆమె జానకి మీద చాలా నిందలు వేసింది. మావగారిని ఇంట్లో పెట్టుకొని, తమకు అనుకూలంగా రాయించుకొన్నారని తూలనాడింది. కేశవకి ఇదంతా చాలా భాద కలిగించింది. తండ్రి ఆ విధంగా ఎందుకు రాశాడో అతనికి తెలుసు. అసలు ఆ మెట్ట భూమి ఎందుకూ పనికిరాని నేల . దాన్ని చాలా కష్టపడి సేద్యయోగంగా రాఘవే మార్చాడు. పొలమంతా అన్నే చూసుకొని, తమ్ముడికి తన పొలంపైన వచ్చే ఆదాయాన్ని కరెక్టుగా ఇచ్చేసేవాడు. కేశవ ఏ రోజూ పొలం వైపు చూసి ఎరగడు. అన్నీ రాఘవే చూసుకునేవాడు. కేశవకి అన్నా, వదినల పట్ల ఎంతో ఇష్టం, ప్రేమా వున్నాయి. కానీ ఆ సమయంలో భార్యను నిలువరించలేకపోయాడు. రాఘవ కానీ, జానకి గానీ నోరు విప్పలేదు.
రాఘవ తర్వాత తమ్ముడితో అన్నాడు,” కేశవా, కన్నయ్యకి ఆ రెండెకరాలు రాసిచ్చేస్తాను , అమ్మాయిని కోపం పెట్టుకోవద్దన్నానని చెప్పు”
ఆ స్పర్ధ ఫలితమే పసివాడిని జానకి దగ్గరకు రానివ్వకపోవటం. పెంచిన ప్రేమ, జానకి మనసుని బాధపెడుతున్నది. ఏమి చెయ్యలేక,
వాడంతట వాడు వస్తాడేమోనని ఎదురు చూస్తోంది. నాలుగవుతుండగా కంగారుగా వచ్చారు కేశవ, మాధవిలు. గుమ్మంలో స్కూల్ బాగ్ అన్నమంతా చిందరవందరగా పడి ఉండటం చూసి, ఇద్దరూ రాఘవ దగ్గరికి వచ్చారు. లోపలి రాకుండా గుమ్మంలోనే నిలుచుని కొడుకుని పిలిచింది మాధవి.
జానకి ఆ వెనుక శశిధర్ వచ్చారు. మాధవి “రారా , ఇంటికి వెళదాం”
వాడేమాత్రం జంకుగొంకు లేకుండా, “నేను రాను, అమ్మ దగ్గిరే ఉంటా, నువ్వు గేట్ తాళం ఎందుకేశావ్? తాళం తీస్తేనే వస్తా డాడీ! నువ్వు మమ్మీకి చెప్పు, డాడీ”
ఆవేశంతో ముందుకి వెళ్లబోయిన మాధవిని వెనక్కి లాగి ఇంటికి తీసుకెళ్లాడు కేశవ .”ఏమైనా డబ్బు పిచ్చి పట్టిందా నీకు? నాకు మంచి చదువుంది, ఉద్యోగం వుంది , అన్నయ్యకి ఉద్యోగం లేదు, ఎంత కాలమని కష్టపడగలడు? నేను ఏ రోజైనా పొలం వైపు వెళ్ళానా? నాన్న వున్నప్పటినుంచీ అన్నయ్యే కదా , అన్నీ పండించి , మనకు పంపుతున్నాడు, చేసినందుకు ఆయన ఏమైనా కౌలు తీసుకొంటున్నాడా? పసివాడిని నీ అవసరం కోసం వాళ్లకి అప్పగించావు, నీ చదువు ఆమె సాయం లేకుండానే అయ్యిందా? చదువుకొన్నావు ఎందుకు? ఆ పసివాడికున్న ఇంగితం నీకు లేకపోయింది. వాడు రాళ్ళువేసి అద్దాలు పగలగొట్టాడని చెప్పాడు అన్నయ్య, మన మూర్ఖత్వం వాడ్ని అలా చేయించింది. నీ పంతం మధ్య వాడు నలిగిపోయాడు. అద్దాలు పగలగొట్టి వాడి పరిష్కారం వాడు చూసుకున్నాడు. ఆ రెండెకరాల కోసం నేను నా అన్నా వదినలతో వైరం పెట్టుకోను. నువ్విలా ప్రవర్తిస్తే వాడి మనసుపై తీవ్ర ప్రభావము పడుతుంది. అందరి ప్రేమానురాగాల మధ్య పెరుగుతున్న వాడి మనసు ఎందుకు బాధపెడతావు? ఒక్కసారి వాళ్ళు మనకు ఎన్ని విషయాల్లో ఎంత సాయం చేశారో గుర్తుకు తెచ్చుకో , వెళ్లి వాళ్ళను క్షమాపణ అడుగు, ముందా గేట్ తాళం తీయి” తీవ్రమైన అతని మాటలు తలవంచుకొని వినేలా చేశాయి. నిర్మలమైన మనసుతో రెండిళ్ళమధ్య వున్న గేట్ తాళం తీయటానికి వెళ్ళింది మాధవి.

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *