June 25, 2024

రాగమాలికలు – 1

రచన: రామలక్ష్మి కొంపెల్ల

కర్నాటక సంగీతంలో ఉన్న రాగాలు ఎంతో మధురంగా ఉంటాయి. సరిగమపదని ఏడు స్వరాలే అయినా వాటిల్లోంచి మన సంగీత కర్తలు ఎన్నో మధురమైన రాగాలు కనిపెట్టి, వాటిల్లో ఎన్నో భక్తి గీతాలను, కీర్తనలను సమకూర్చారు.
రాగమాలిక అంటే? రాగాలతో అల్లిన ఒక దండ. రెండు లేక అంతకన్నా ఎక్కువ రాగాలు ఉపయోగించి చేసే రచనను రాగమాలిక అంటారు. ఒకే రకం పువ్వులతో కట్టే మాల కంటే, రకరకాల పువ్వులతో కట్టే కదంబమాల ఎలా అయితే చాలా ఆకర్షణీయంగా ఉంటుందో, సంగీతంలో రాగమాలికా రచనలు కూడా ప్రత్యేక శోభతో అలరారుతాయి. శ్రోతలకు కర్ణపేయంగా ఉంటాయి.
కర్ణాటక సంగీతంలో, ఈ రాగమాలికలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు మొదలైన సంగీత రచనా రూపాలు అనేకం ఉన్నాయి కర్ణాటక సంగీతంలో. రాగమాలికలను అన్ని రచనా రూపాలలో చేసిన వాగ్గేయకారులు మనకు ఎందరో ఉన్నారు. రామస్వామి దీక్షితులు, ముత్తుస్వామి దీక్షితులు, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, మహా వైద్యనాథ అయ్యర్, స్వాతి తిరునాళ్ వంటి వారు వీరిలో ప్రముఖులు.
ఇప్పుడు మనం వివిధ సంగీత రచనల్లో, రాగ మాలికలు చేసిన వైనం చూద్దాం.
గీతం:
గీతం లోని అంగాలను ఖండికలు అంటారు. ఉదాహరణకు మొట్టమొదట మనం నేర్చుకునే పిళ్ళారి గీతం ‘శ్రీ గణనాథ, సిందూర వర్ణ’ తీసుకుంటే, ఇది మూడు ఖండికలుగా చేయబడిన రచన.
మూడు ఖండికల ధాతు రచన (స్వరం) ఒకటే. మాతు (సాహిత్యం) రచన మాత్రమే మారుతుంది.
గీతాలలో అనేక రకాలు ఉన్నాయి.
1. పిళ్ళారి గీతాలు
2. ఘనరాగ గీతాలు
3. లక్షణ గీతాలు
ఇవి రచించిన వారిలో ప్రముఖులు – శ్రీ పురందర దాసు, పైడాల గురుమూర్తి శాస్త్రి మొదలైనవారు.
అయితే, గీతాలకు తలమానికమైన ఒక రాగమాలికా గీతాన్ని రచించిన శ్రీ మహా వైద్యనాథ అయ్యర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రాగమాలికా గీతం 72 మేళకర్త రాగాలతో చేయబడ్డ అతి పెద్ద గీతం. వివరాలలోకి వెళ్తే, ఈ గీతం రచించిన మహా వైద్యనాథ అయ్యర్, జీవించిన కాలం క్రీ. శ. 1844-1892. చిన్నవయసు లోనే, సంగీతంలో గొప్ప ప్రతిభను ప్రదర్శించిన గొప్ప వాగ్గేయకారులు. పల్లవి గానం అత్యంత క్లిష్టమైన ‘సింహనందన’ వంటి తాళాలలో చేసిన విద్వాంసులు మహా వైద్యనాథ అయ్యర్.
వీరు రచించిన గీతాన్ని ‘72 మేళ రాగమాలిక’ అంటారు. ఈ రచన గురించిన కొన్ని ముఖ్యమైన, ఆసక్తికరమైన అంశాలు –
1. ఇది పూర్తిగా సంస్కృత రచన.
2. తిరువారూర్ లోని ప్రణతార్తిహరుడిగా పిలువబడే, పరమేశ్వరుడిని స్తుతిస్తూ చేయబడ్డ రచన.
3. ముందుగా పల్లవి శ్రీరాగంలో ‘ప్రణతార్తి హరా ప్రభో పురారే’, అంటూ మొదలై, ఒక చిట్ట స్వరం, మరియు కొన్ని అందమైన జతి స్వరాలతో పల్లవి పూర్తి అవుతుంది.
4. తర్వాత మొదటి మేళకర్త కనకాంగి రాగంతో మొదటి చరణం ప్రారంభం అవుతుంది.
5. 72 మేళకర్త రాగాలకు సంబంధించిన 72 చరణాలు ఈ రచనలో ఉంటాయి.
6. ఏ రాగానికి సంబంధించిన చరణం అదే రాగంలో ఉంటుంది.
7. వీరు ఉపయోగించిన రాగాల పేర్లు గోవిందాచార్యుల మేళకర్త పట్టికలోనివి. (వెంకటమఖిగారి అసంపూర్ణ మేళకర్త పట్టికలో పేర్లు కనకాంబరి ఫేనద్యుతి ఆదిగా వేరే ఉంది).
8. ప్రతీ చరణంలో ఆయా రాగానికి సంబంధించిన రాగముద్రను అందంగా ఇమడ్చడం అన్నది, మహా వైద్యనాథ అయ్యర్ గారి ప్రతిభకు గీటురాయి.
9. ప్రతీ చరణం చివర చిట్టస్వరం కూడా రచింపబడ్డ వైనం అసాధారణం. ఈ చిట్టస్వరం రెండు ఆ వృతాలలో ఉంటుంది. ఒకటిన్నర ఆవృతం ఏ రాగ చరణం పాడుతున్నామో అందులో ఉండి, అర ఆవృతం తర్వాతి చరణానికి సంబంధించిన రాగంలో ఉంటుంది. ఇది మనం తర్వాతి రాగం సులభంగా అందుకోవడంలో ఉపకరిస్తుంది.
10. రచన మొత్తం ఆదితాళంలో ఉంటుంది.
11. మేళకర్త రాగాలు 12 చక్రాలుగా విభజించబడి ఉండడం వల్ల, ప్రతీ చక్రం పూర్తి కాగానే ఒకసారి పల్లవి పాడి, తర్వాతి చక్రం మొదలు పెట్టడం జరుగుతుంది.
12. అతి పెద్దదైన ఈ రచనను సాధారణంగా, సభాగానంగా చెయ్యడం అరుదు. ఒకవేళ చేసినా, ఒక చక్రం లోని 6 రాగాలు మాత్రమే పాడడం జరుగుతుంది.
కొందరు విద్వాంసులు ఈ రచనను, తమ విద్యార్థులకు నేర్పించే విధంగా చేసిన వీడియోలు యూట్యూబ్ వంటి సాంఘిక మాధ్యమాల్లో మనకు లభ్యం అవుతున్నాయి. ఇందులో ప్రముఖంగా మనం, విదుషి Dr. R. వేదవల్లి గారు చేసిన వీడియోలు చెప్పుకోవచ్చు.
అలాగే మొత్తం రాగమాలికను రెండు భాగాలుగా విభజించి పాడి యూట్యూబ్ వీడియోలుగా అందించిన యువ విదుషి వారిజశ్రీ వేణుగోపాల్ నిజంగా అభినందనీయురాలు.

ఇంకొన్ని రచనా రూపాలలో రాగమాలికల గురించి వచ్చే సంచికలో తెలుసుకుందాం.

***

1 thought on “రాగమాలికలు – 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *