May 18, 2024

లోపలి ఖాళీ – భూమిపుండు

రచన: రామా చంద్రమౌళి

సింగిల్‌ పేరెంట్‌ సునంద. గత ఇరవై రెండేళ్ళుగా హైస్కూల్‌ పిల్లలకు ‘ చరిత్ర ’ ను బోధిస్తూ విద్యార్థులందరిలోనూ. సహ ఉపాధ్యాయు లందరిలోనూ ఉత్తమ అధ్యాపకురాలిగా పేరు తెచ్చుకుని గత సంవత్సరమే ప్రభుత్వం నుండి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా కూడా స్వర్ణ పతకాన్నీ, ప్రశంసా పత్రాన్నీ పొందిన సునంద. గత అరగంట నుండి ఆ చెట్టుకింద కూర్చుని తదేకంగా ఆ భూమిపుండు దిక్కు చూస్తూనే ఉంది. అప్పుడామె హృదయం కూడా సరిగ్గా భూమిపుండులా పచ్చి పచ్చిగా, లోపలంతా బుడుగు బుడుగుగా. పైకి మాత్రం అంతా అట్టుకట్టి నివురు కప్పిన నిప్పులా లోలోపల కుతకుతలాడ్తూనే చాలా మామూలుగా, ప్రశాంతంగానే ఉంది.
ఇరవై ఏళ్ళ క్రితం రాజగోపాల్‌ అకస్మాత్తుగా ఒకరోజు తను ఉద్యోగిస్తున్న ఒక ఫార్మాస్యుటికల్‌ కంపనీలోనే పని చేసే తన సహోద్యోగి రేఖ గురించి ప్రస్తావించి ‘‘ నాకీమె కావాలి సునందా. ఇక నా శేష జీవితాన్ని ఈమెతోనే గడపాలనుకుంటున్నాను. మాకిద్దరికీ జర్మనీలోని ఒక గ్లోబల్‌ ఫార్మా కంపనీలో సైంటిస్ట్‌ లుగా ఉద్యోగాలొచ్చాయి. వెళ్ళాలని ’’ అన్నాడు.
కాస్సేపాగి ‘‘ ఆమె కావాలీ అంటే నేనవసరం లేదనే కదా ’’ అంది సునంద.
రాజగోపాల్‌ మాట్లాడలేదు. మౌనంగా. బేలగా. స్థిరమైన వ్యూహాత్మక చూపుతో అమాయకంగా ఉండిపోయి. ఓ క్షణం తర్వాత తలవంచుకుని నిశ్శబ్దంగా
అప్పుడు. ఒక పావుగంట క్రితమే తను తన స్కూల్‌ నుండి ఇంటికొచ్చి అలసిపోయి. వాలుకుర్చీలో కూర్చుంది.
ఐదేళ్ళ ఒక్కగానొక్క కూతురు జాహ్నవి బడికి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు. ఏ క్షణమైనా రావొచ్చు. కూతురుకోసం ఎదురు చూస్తోంది తను నిజానికి. రాజగోపాల్‌ సాధారణంగా ఆరు దాటిన తర్వాతగానీ రాడు. కాని ఆ రోజు. బహుశా తన నెత్తిపై ఈ బాంబ్‌ ను పేల్చేందుకే కావచ్చు తొందరగా. పాప రాకముందే.,
సునంద అనూహ్యంగా వేసవికాలం విశాలమైన మైదానంలో చటుక్కున రూపుదిద్దుకుని చుట్టుకుపోయే సుడిగాలిలా విలవిల్లాడిపోయింది అతను చెప్పింది విని.
ఎందుకో ఆమెకు దేవదాసు సినిమాలో సముద్రాల రాఘవాచార్య రాసిన ‘ కుడి ఎడమైతే.’ పాటలోని ‘ సుడిలో చిక్కీ ఎదురీదకా మునకే సుఖ మనుకోవోయ్‌ ’ అన్న చరణం జ్ఞాపకమొచ్చింది.
‘‘ నిర్ణయం తీసుకున్నావా ’’ అంది నిలకడగానే.
‘‘ ఔను ’’ అన్నాడు రాజగోపాల్‌ స్థిరంగా.
‘‘ మరిక. దీనిపై తర్జనభర్జన లెందుకు. నువ్వు నీ జీవితాన్ని నీ ఇష్టమున్నట్టు బతుకొచ్చు ’’ అంది ఒక్క క్షణంలో తనను తాను సెకనుకు వేయి పేజీల వేగంతో స్కాన్‌ చేసుకుని.
‘‘ పాప బాధ్యతను నేనే స్వీకరిస్తాను ’’ అన్నాడు.
‘‘ అంటే ’’
‘‘ నువ్వు సరే అంటే. పాపను నేనే నా వెంట తీసుకుపోయి జీవితాంతం దాని బాగోగులనూ, ఆర్థికపరమైన ఖర్చులనూ భరిస్తాను ’’
‘‘ కారల్‌ మార్క్స్‌ అన్నట్టు మానవ సంబంధాలన్నీ కేవలం వ్యాపారాత్మక ఆర్థిక సంబంధాలేనా నీ దృష్టిలో ’’
‘‘ నిజానికి అంతే మరి ’’
‘‘ కాని నా దృష్టిలో కాదు. పాప నా దగ్గరే ఉంటుంది. నా పాలనలోనే. నా బాధ్యతగా. ఇక ఎన్నడూ నీ నీడకూడా దానిమీద పడకుండా ’’
‘‘ వ్చ్‌. సరే. నీ ఇష్టం ’’
అంతే. ఆ క్షణమే రాజగోపాల్‌ వెళ్ళిపోయాడు ఇంట్లో నుండి. జీవితంలో నుండి శాశ్వతంగా.
‘ కామాతురాణాం న బిడియం న లజ్జ ’ అని ఆర్యోక్తి. నిజమే అనిపించిందామెకు. అతను బయటికి వెళ్ళిపోయిన ఐదు నిముషాలకు జాహ్నవి భుజానికి స్కూల్‌ బ్యాగ్‌ తో గునగునా అడుగులేసుకుంటూ పరుగెత్తుకొచ్చింది.
ముఖంపై నవ్వును పులుముకుని. చేతులు చాచి.,
లోపల ఎన్ని భీకర సముద్రాలు గర్జిస్తున్నా. పైకి నిర్మలాకాశంలా కనిపిస్తూండడం స్త్రీకి పుట్టుకతో అబ్బే విద్యేమో. అనుకుంది.
మరుక్షణమే. పాపను సిద్ధం చేసి , వెంట తీసుకుని. సరిగ్గా ఇదే చోటికి. తనకిష్టమైన ఈ చెట్టుకిందకే వచ్చి చాలాసేపటిదాకా కూర్చుని. చీకటిపడి. తెలియకుండానే అంతా నిర్మానుష్యమై నిశ్శబ్దంలో మిగిలిపోయే దాకా.,
మనుషుల మధ్య సంబంధాలు ఇంత బలహీనంగా. ఇంత చంచలంగా. ఇంత కృతకంగా ఉంటాయా. అనుకుందామె.
కాని ఎందుకో సునందకారోజు కళ్ళలోనుండి ఒక్క కన్నీటి చుక్కా రాలేదు , రవ్వంత అధైర్యం గానీ కలుగలేదు.
‘ అనుకోని విపత్తులు ఎదురవడమూ, అనూహ్యమైన ఘటనలతో మనిషి విచలితుడు కావడమూ, తుఫానులో గడ్డి పరకలా విలవిల్లాడడమే జీవితమంటే. కాని మనిషి ఏన్ని కష్టాలనైనా చలించకుండా నిబ్బరంతో ఎదుర్కొని తన్ను తాను పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగాలి. ఎన్నడూ ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దు. గడ్డి పరక చూడు. ఎన్నడూ తుఫానుకు వెరచి ధ్వంసం కాదు. నిక్కి నిలబడి మళ్ళీ తలెత్తుకుని జీవిస్తుంది. కెరటంలా పడి మళ్ళీ లేవాలి. అంతే ’ అని ఎన్నోసార్లు పదో తరగతి పిల్లలు ఇక పాఠశాలను విడిచి వెళ్తున్నపుడు చెప్పింది తను.
ఆ బోధన తనకు కూడా వర్తిస్తుందని. ఆ రోజు తెలుసుకుంది తను.
మరుక్షణం. నల్లబల్లపైనుండి చాక్‌ పీస్‌ అక్షరాలను డస్టర్‌ తో తుడిచేసినట్టు మనసులోనుండి రాజగోపాల్‌ తాలూకు సకల జ్ఞాపకాలనూ తుడిచేసి తన హృదయాన్ని ‘ ఫార్మాట్‌ ’ చేసుకుంది. ఇక ఖాళీ కాగితంపై మళ్ళీ కొత్త అక్షరాలను రాయడం నేర్చుకోవాలి. మళ్ళీ అనుకోని కొత్త ప్రయాణం.
కాని. ఇప్పుడు. ఈ ఇరవై ఏళ్ల తర్వాత. మొట్టమొదటిసారిగా. సునంద గాలిలో దీపంలా రెపరెపలాడి వణికిపోయింది.
‘ తీరాన్ని తాకి. తల బాదుకుని పతనమయ్యే సముద్ర కెరటం. ఇసుకలోకి ఇంకిపోవడమే గాని. ఇక పడి లేవడమెక్కడిది. ’ ఆనుకుంటూంటే ఆమెకు అనూహ్యంగా దుఃఖం ముంచుకొచ్చింది ఎందుకో.
‘‘ ట్రణ్‌ ణ్‌ ణ్‌ ణ్‌ ’’ మని మొబైల్‌ ఫోన్‌ మోగింది.
చూస్తే. మళ్ళీ అదే. పోలీస్‌ స్టేషన్‌ నుండి. అప్పుడా క్షణం ఆమె ఒక మిలిటరీ వాడి బలమైన బూటుకింద పడ్డ పండు టమోటో లా చితికిపోయింది.
‘ ఏమి చేయగలదిప్పుడు తను ’
జాహ్నవి పెంపకంలో తన లోపమేమైనా ఉందా ?
‘‘ మేడం మీరు తొందరగా రావాలి. లేకుంటే మేము మా పని చేసుకుపోతాం. ఇన్స్పెక్టర్‌ గారు ఒక గంట టైమిస్తున్నారు మీకు. ఆ పై మీ ఇష్టమిక. విషయం మా చేయిదాటిపోతుంది ’’ అంటున్నాడు అటువైపునుండి హెడ్‌ కానిస్టేబుల్‌.
అంతా అర్థమౌతోందామెకు.
ఇక చీకటిపడ్తూందేమో. అటు పశ్చిమాన. ఎర్రగా సూర్యుడు. ఆకాశం నుదుట రక్తతిలకంలా భాసిస్తూ. లోయల్లోకి జారిపోతున్నాడు.
సరిగా ఆ క్షణమే ఒక తెల్లని లేగ దూడ. ఎక్కడినుండో చెంగు చెంగున గాలిలోకి దూకుతూ. గెంతులేస్తూ. పరుగెత్తుకొచ్చి. పరుగెత్తుకొచ్చి. చటుక్కున భూమిపుండు లోకి బలంగా దూకింది. పాపం దానికి తెలియదు. అది భూమిపుండని. పైకి అంతా మామూలుగానే కనిపిస్తోంది.
దూకుడు దూకుడుతోనే. దాని నాల్గు కాళ్ళూ. బురదలో కూరుకుపోయి. ఒక్కసారిగా గావు కేకలు.’ అంబా. బా. బా ‘ అని అరుస్తూ. గిలగిలా కొట్టుకుంటూ. తన్నుకుంటూ. భీకరంగా శబ్దిస్తూ.,
బీభత్సం.
దూడ వెంట వెంటనే పరుగెత్తుకొచ్చారు ఇద్దరు పశుల కాపరులు. భూమిపుండులో చిక్కిన దూడను చూచి హతాశులైపోయి.‘ ఇప్పుడెలా. ఇప్పుడెలా ’ అని తన్నుకులాడ్తూ,
భూమిపుండులోకి అరుస్తూ. గిలగిలా తన్నుకుంటున్నకొద్దీ ఇంకా ఇంకా లోపలికి కూరుకుపోతూ.దూడ,
రక్షణ. రక్షణ ,
ఏదీ రక్షణ. ఎవరు రక్షిస్తారిప్పుడు దాన్ని. తనూ ఇంకా ఆ ఇద్దరూ ఊర్కే చూస్తూండడం తప్పితే చేయగలిగిందేమైనా ఉందా.
భూమిపుండులో చిక్కుకున్న ఈ లేగదూడలానే. జాహ్నవి కూడా.
భూమిపుండు లాంటివే. ఈ ఆధునిక సాంకేతిక సదుపాయాలూ. చేయి చాపగానే అందే సకల సౌకర్యాలూ. చాపల్యాలకూ. బలహీనతలకూ. క్షణిక సుఖలాలసతలకూ యువతరాన్ని బానిసలను చేసి విచక్షణా రహితమైన చర్యలకు పురికొల్పేవి. ఇంటర్నెట్‌. వల. లాప్‌ టాప్‌. సకల దరిద్రాలనూ కొని తెచ్చి అరచేతిలో కుమ్మరించే స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్లు. వాట్స్‌ అప్‌ లు. గూగుల్‌ మెసేంజర్‌ లు. అంతా వ్యాపారం. అతి స్వేచ్ఛ. విచ్చలవిడితనం. క్షణికానందం కోసం ఏదైనా చేయగల దుస్సాహసాన్ని నూరిపోయగల పబ్‌ లు. ఫార్మ్‌ హౌజ్‌ లు. డ్రగ్స్‌. తల్లిదండ్రులను ‘ చావు ‘ పేరుతో బ్లాక్‌ మెయిల్‌ చేసే పిల్లల దుష్ట సంస్కృతి. అదుపూ అజ్ఞా లేని అతి స్వేచ్ఛ. అన్నీ వెరసి అడుగడుగునా భూమిపుండు. ఆ భూమిపుండులో కూరుకుపోతూ. యువ తరం. చివరికి ‘ కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు ’ గా మిగిలి,
థూఁ.
దూడ అరుస్తూ గిలగిలా తన్నుకుంటూనే ఉంది. తన్నుకున్నకొద్దీ ఇంకా ఇంకా లోపలికి కూరుకుపోతూ,
మొత్తం నాలుగు కాళ్ళూ మునిగిపోయి. కేవలం శరీరం మాత్రమే మిగిలి ఉంది బయట. చూస్తూ చూస్తూండగానే. దూడ భూమిలోపలికి మునిగిపోతూ,
ఇంకొందరు గుమికూడారు. హడావిడి. కకావికలు. తత్తరపాటు.
వాట్‌ టు డు. ఏం చేయాలిప్పుడు. ఎలా రక్షించాలి దూడను.
తెల్లగా ముద్దొస్తూ. భూమి పుండులో కూరుకుపోతూ.దూడ,
అందంగా. అప్పుడే విరిసిన గులాబీలా ముద్దొస్తూ. జాహ్నవి. బలహీనతల్లో. అతి స్వేచ్ఛలో. సినిమాల్లో. స్మార్ట్‌ ఫోన్ల లో. జల్సాలలో. పార్టీలలో. పబ్‌ లలో కూరుకుపోతూ. జాహ్నవి.
వీళ్ళిప్పుడు ఈ దూడను రక్షించగలరా.
తనిప్పుడు పోలీస్‌ స్టేషన్‌ లో. లాకప్‌ లో ఉన్న జాహ్నవిని రక్షించగలదా.
ఒక తల్లి. ఒక స్త్రీ. ఒక విజ్ఞురాలైన ఉపాధ్యాయురాలు. ఒక పౌరురాలుతను. ఏమిటి తన కర్తవ్యం.
ఇద్దరెవరో. కొన్ని తలుగు తాళ్లను తెచ్చి దూడ పైకి. మెడలో తాడు తట్టుకుని. పట్టు చిక్కితే. లాగి పైకి తెద్దామని ఆశ.
ఉహూఁ.
కాని అది సాధ్యం కావట్లేదు. తాడు మెడలో పడదు. దూడ గిలగిలా తన్నుకులాడ్డం ఆపదు. ఇంకా ఇంకా కూరుకుపోవడం ఆగదు.
దూడ. శరీరంకూడా భూమి లోపలికి మునిగిపోతూ,
పరిస్థితి. విషమిస్తోందన్న స్పృహ.
‘ ఔను. జాహ్నవి పరిస్థితి కూడా విషమిస్తోంది. నిర్ణయం తీసుకోవాలిక’
పది నిముషాలు. ఇంకో పది నిముషాలు.,
‘‘ ఫైర్‌ స్టేషన్‌ కు ఫోన్‌ చేయిరా. వాళ్ళొచ్చి ఏదైనా చేస్తారు ’’
‘‘ కాని. అది కదుల్తూ నానా గోల చేస్తోంది కదా. వాళ్ళొచ్చే లోగానే ఇది పూర్తిగా మునిగిపోద్ది లోపలికి ’’ అని ఎవరిదో జవాబు.
తలో మాట అంటూండగానే. దూడ గొంతు వరకూ. ఆ తర్వాత తల వరకూ. అటు తర్వాత. శరీరం మొత్తం. చూస్తూ చూస్తూండగానే భూమి పుండులోకి పూర్తిగా కూరుకుపోయి,
అంతా కళ్లముందే జరిగి. ఒళ్ళు గగుర్పొడిచే ఒక వింత వికారానుభూతి. నిస్సహాయ నిస్సత్తువ.
అంతా ఒక రకమైన విషాద గంభీర నిశ్శబ్దం గాలి నిండా.
సునంద లేచింది అప్పటిదాకా కూర్చున్న రాతి చప్టాపైనుండి.
‘ జాహ్నవి కూడా పూర్తిగా కూరుకుపోతుందా బురదలోకి.’
సరిగ్గా అప్పుడే మళ్ళీ మొబైల్‌ మోగింది.
చూస్తే. ఆమె అనుకున్నట్టుగానే. పోలీస్‌ స్టేషన్‌ నుండే. ఇప్పుడు డైరెక్ట్‌ గా ఇన్స్పెక్టరే.
తప్పదిక. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి తను.
సునంద. ఒక అడుగు వేసింది. ముందుకు. నిర్ణయాత్మకంగా.
జాహ్నవి. జాగ్రత్తగా ఆమెను బి. టెక్‌ చదివించి. తర్వాత ఎం. టెక్‌ చేయించి. ఇక ఓ పది రోజుల్లో పి. జి పూర్తయి. తన జీవితాన్ని తాను నిర్మించుకుంటుందని తను ఆశ పడ్తున్న క్షణం ,
అంతా చిన్నాభిన్నమై ,
అప్పటిదాకా ఎంతో ఆసక్తితో గీసిన అందమైన పెయింటింగ్‌ పై ఇంక్‌ బుడ్డి ఒలికి పడి అంతా ఖరాబైన వికారమైన అనుభూతి కలుగుతూండగా. సునంద రోడ్డుపైకొచ్చి ఆటో ఎక్కింది.
‘‘ మేడం. మీరు టీచర్‌ సునంద గారేనా. ’’ అని దాదాపు నాలుగున్నర ప్రాంతంలో వచ్చిన టెలిఫోన్‌ తాలూకు స్వరం జ్ఞాపకమొచ్చింది. ఆ గొంతు చాలా కరుకుగా, నిర్దయగా, అసహ్యంగా ఉంది.
‘‘ చెప్పండి ’’ అంది తను.
‘‘ జాహ్నవి మీ కూతురే కదా ’’
‘‘ ఔను ’’
‘‘ ఆమె ఇప్పుడు మా దగ్గరుంది. నేను.. పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ మీనన్‌ ను మాట్లాడుతున్నా ’’
‘‘.. ’’ అవాక్కయి తేరుకోలేకపోతున్నంతలోనే ,
అతనన్నాడు. ‘‘ ఉదయం మాకందిన సమాచారం మేరకు స్వర్గ హెరిటేజ్‌ హోటల్‌ పై మేము దాడి చేస్తే. ఒక గదిలో మీ అమ్మాయి జాహ్నవి, మరో యువకుడు రాజేశ్‌ సెక్స్‌ కలాపాలు జరుపుతూ పట్టుబడ్డారు. వ్యభిచారం జరుపుతూందేమో. అని ’’
‘‘ విల్‌ యూ కైండ్లీ స్టాప్‌ ’’ అని అరిచింది సునంద తుపాకీ గుండు తాకగానే గాయపడ్తున్నప్పటిలా.
ఒక్క క్షణం నిశ్శబ్దం విస్తరించిన తర్వాత ,
ఇన్స్పెక్టర్‌ అన్నాడు. ‘‘ ఒక తల్లిగా మీరు ఈ వార్త విని షాక్‌ కావడం సహజమే , కాని ఇదే నిజం మరి. పట్టుబడ్డ తర్వాత. ఆమెనూ వాన్నీ మెడికల్‌ పరీక్షలకు ప్రభుత్వ దవాఖానకు పంపి పరీక్షలు కూడా చేయించాం. దె ఆర్‌ ఇండల్‌ జ్డ్‌ ఇన్‌సెక్స్‌ ’’
కింద భూమి కుంగిపోతున్నట్టు. పైన ఆకాశం కూలిపోతున్నట్టు. చుట్టూ ప్రళయ రaంరa చుట్టుముట్టి ఎటో తన్నుకుపోతున్నట్టు. అనిపిస్తూ,
జాహ్నవి. ఇలా చేసిందా. నిజమా ఇది. ఎందుకిలా. ఈ రకమైన ప్రవర్తన ప్రతినిత్యం దాన్ని అంటిపెట్టుకునుండే తల్లయిన తనకే ఆశ్చర్యకరంగా. వింతగా. షాకింగ్‌ గా ఉంది. ఏ ఒక్కనాడూ కూతురు ప్రవర్తన ఇంత నీచంగా. బరితెగించినట్టు ఉంటుందని అస్సలే ఊహించలేదు తను. అకస్మాత్తుగా. ఇలా,
‘‘ నిన్న రాత్రి హోటెల్‌ లో తాము భార్యా భర్తలమని చెప్పి చేరారిద్దరూ. ఆధార్‌ కార్డ్స్‌. ఐడెంటిటీ ప్రూఫ్‌ లతో.’’ చెబుతున్నాడిరకా ఇన్స్పెక్టర్‌.
పైన నిప్పుల వాన కురుస్తూనే ఉన్నట్టు. తుపాకీ గుళ్ళు సర్‌ ర్‌ ర్‌ ర్‌ న చొచ్చుకొస్తూ గుండెల్లోకి దిగుతూనే ఉన్నట్టు,
‘‘ ఎవడు వాడు., ’’ అరిచింది.
‘‘ వాడు పీటర్స్‌ ఇంజనీరింగ్‌ కాలీజ్‌ లో. బి. టెక్‌ పాసై రోడ్డుమీద తిరుగు తున్న వట్టి జులాయి వెధవ. లంబాడా. సంగెం మండలం. రాం తండా ’’
అసలా పేరే ఎప్పుడూ వినలేదు తను. కనీసం జాహ్నవిలో ఇటువంటి చిల్లరమల్లర వికృతమైన ఆలోచనల్తో కూడిన తత్వం ఉందనికూడా ఏ ఒక్కనాడూ ఊహించలేదు. తనతో. మొన్న రాత్రి హైదరాబాద్‌ కు ఏదో యూనివర్సిటీ పనిమీద వెళ్ళిరావాలని చెప్పి మరునాడు ఉదయమే. అంటే నిన్న వెళ్ళింది. అంతా అబద్దం. మోసం. జాహ్నవి ఇలా కూడా చేయగలుగుతుందా. అసలు అతి విక ృతమైన ఈ తెగింపేమిటి. ఈ రకమైన దుశ్చర్య తర్వాత ఏం జరుగుతుందో తెలియదా తనకు. తనను తాను ఈ అత్యంత కలుషిత సామాజిక వాతావరణంలో. ఒకవైపు సెక్స్‌ పరంగా పెట్రేగిపోతున్న సినిమాలు, పైన నిప్పుల వానలా కురుస్తున్న సోషియల్‌ మీడియా దాడి, ఇంటర్నెట్‌ లో ఒక్క క్లిక్‌ తో సకల నగ్న నీలి చేష్టలూ ప్రత్యక్షమౌతున్న సుళువు అందుబాట్లు. అర్థరాత్రి దాటితే. టి వి చానళ్లన్నీ ‘ మిడ్‌ నైట్‌ మసాలా ’ లతో నిండి. అంతా పోర్నో. శరీరమంతా భగభగా యవ్వన కాంక్షతో రెచ్చిపోతూ. ఒక ఉద్దీప్తత,
యువతరం అదృశ్యంగా తనపై జరుగుతున్న ఈ అప్రత్యక్ష దాడి నుండి ఎవరిని వారు కాపాడుకోవాలి. లేకుంటే. కలుషిత గంగా ప్రవాహంలో సగం కాలిన శవంలా కొట్టుకుపోవాల్సిందే పత్తా లేకుండా. ఎప్పుడైనా మనిషి ఏ క్షణమైనా ప్రాప్తించే మరణం నుండి ఎవరికివారు కాపాడుకోవాల్సిందే. లేకుంటే. చావు తప్పదు.
ఇప్పుడు జాహ్నవి తనకు తాను నిప్పుల చెరువులో దూకింది. కాలి బూడిదై నశించిపోక తప్పదా.
వ్చ్‌. ఏమో. ఒక తల్లిగా ఇప్పుడు తన పాత్ర ఏమిటి.? కర్తవ్యమేమిటి.?
అందుకే. రెండు గంటలనుండి. తన శాంతి స్థావరమైన ఆ ఊరిబయటి మైదానంలో. రావి చెట్టుకింద కూర్చుని. అలోచించీ. ఆలోచించీ,
భూమిపుండూ. లేగ దూడ గెంతుతూ వచ్చి బురదలో కూరుకు పోయి. చూస్తూ చూస్తూండగానే. అద ృశ్యమై. ఒక పచ్చి జ్ఞాపకం.
జాహ్నవి కూడా తనకు తెలిసో తెలియకో భూమిపుండులోకి కూరుకుపోయి. స్వయంకృతాపరాధం.
తప్పు చేసింది. శిక్ష అనుభవించాలిగదా మరి.
పైన ఆకాశం ఫెళఫెళా గర్జించి. ఎక్కడో పిడుగు పడ్డట్టు ధ్వనిస్తే. ఉలిక్కిపడి,
టపటపా వర్షం. చినుకులు పెద్ద పెద్దగా,
మట్టి వాసన. భూమిలోనుండి పొగలు పొగలు.
గమనించలేదు తను. ఎప్పుడో చీకటి పడిరది.
ఒక ఐదు నిముషాల్లో ఆటో పోలీస్‌ స్టేషన్‌ ముందాగింది. వర్షంలో తడుస్తూనే దిగి. లోపలికి పాము పుట్టలోకి పావురంలా నడిచి,
సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ మీనన్‌. దేవుని బిడ్దలా ప్రశాంతంగా. ముఖం నిండా ఉట్టిపడే చిర్నవ్వుతో. నిర్మలంగా ఉన్నాడు. అన్నాడు ‘‘ మేడం. మీరు మా తమ్ముడికి చరిత్ర పాఠం చెప్పారు. నేను మీకు తెలియదు. కాని మీ గురించి నాకు తెలుసు. నేను సూటిగా విషయానికొస్తాను. నాకు చాలా తక్కువ మాట్లాడ్తూ ఎక్కువ పని చేయడం అలవాటు. ’’ అని ఆగి ,
‘‘ జాహ్నవి అనే ఈ మీ కూతురు ఇలా ఎందుకు చేసిందో తెలియదు. కాని చాలా డేరింగ్‌ గా దుస్సాహసం చేసింది. మేము పోలీస్‌లం కదా. ప్రతిదాన్నీ మీ అందరికంటే భిన్నంగా. విలక్షణంగా నేర దృష్టితోనే చూస్తాం. మనిషికి ద ృష్టిని బట్టి ద ృశ్యం కనబడ్తూంటుందెప్పుడూ. మాది ఆల్సేషియన్‌ కుక్క జాతి. పరిసరాల్ని వాసనతో పసిగట్టడం అలవాటు. ఓ. కె. ఇప్పుడు జరిగిందేమిటంటే. ఈమె. ఒక యువతి ఒక యువకునితో లేచి వచ్చి.’’ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు.
అంతా అర్థమైంది సునందకు. వెంటనే అంది.’’ ఇన్స్పెక్టర్‌ గారూ. కం టు ద పాయింట్‌ ’’ అని.
అతను చాలా నెమ్మదిగా ఒక కాగితాన్ని అందించాడామెకు.
దానిపై. ‘‘ దీన్ని బ్రోతల్‌ కేస్‌ కింద బుక్‌ చేసి. సాక్ష్యాధారాలతో , ప్రభుత్వ దవాఖాన రిపోర్ట్స్‌ తో కేస్‌ వేస్తే.. జరుగబోయే బీభత్సం నుండి బయట పడ్డానికి. రెండు లక్షలు. వాన్నీ, దీన్నీ ప్రతిరోజూ పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిప్పుకుంటూ. మీడియాకు ఎక్స్‌ పోజ్‌ చేసి. నానా పరువు నష్ట చర్యలను చేయగల అకృత్యం నుండి. బయట పడ్డానికి. లక్షా యాభై వేలు. మీ మీద దయతల్చి. ఈ కేస్‌ లో పట్టుబడ్డ ఇద్దరి తల్లిదండ్రులనూ రప్పించి ‘ కౌన్స్‌ లింగ్‌ ’ జరిపి వదిలేసినట్టు సింపుల్‌ గా కేస్‌ షీట్‌ రాసుకుని వదిలేస్తే. ఒక లక్ష. జస్ట్‌ వండే బిజినెస్‌. క్లోజ్‌. తొందరగా నిర్ణయించుకోండి. వితిన్‌ టెన్‌ మినట్స్‌. ’’ అని రాసి ఉంది.
తర్వాత ఓ క్షణమాగి అతను లేచి వ్యూహాత్మకంగా మరో గదిలోకి కావాలనే వెళ్ళాడు.
సునంద లిప్త కాలంలో తన వెనుకనే ఉన్న వుమన్‌ లాకప్‌ గదివైపు చూచింది. గదిలో ఒక మూలకు ఒదిగి కూర్చుని. మోకాళ్ళ నడుమ తలను దాచుకున్న జాహ్నవి కనబడిరది.
ఒట్టి అభావం మనసునిండా. ఏదో తెలియని శూన్యత.
ఎందుకిలా జరింది.? వ్చ్‌. అర్థం కాదు. మనుషులు అర్థంకారా బాహ్యంగా.?. దీని తండ్రి తన సహోద్యోగి రేఖతో కలిసి ఉడాయించిననాడు. రాజగోపాల్‌ కూడా అర్థం కాలేదు.
లేక తనే మనుషులను సరిగా అర్థం చేసుకోలేకపోతోందా. బిహేవియరల్‌ సైన్స్‌ ప్రకారం. ఏదో బోధపడని లోపం ఎక్కడో ఉంది.
ప్రక్కనున్న వెహికిల్స్‌ పార్కింగ్‌ షెడ్‌ రేకులపై పడ్తున్న వర్షం చినుకుల లయాత్మక శబ్దం చిత్రంగా వినబడ్తోంది ఆగకుండా.
‘ ఈ రాజేశ్‌ అనబడే రోగ్‌ ఎక్కడ. చూడాలి వాణ్ణి ’ అనుకుని అడుగబోయింది సునంద ఎవరినైనా. కాని అప్పుడే తిరిగి వచ్చిన ఇన్స్పెక్టర్‌ మీనన్‌ ‘‘ అటు చూడండి. ఆ లాకప్‌ సెల్‌ లో. ఒంటిపై కట్‌ డ్రాయర్‌ తో ఉన్న ఆ ఎర్రని బక్కపలుచని కుర్రాడు. వాడే రాజేశ్‌ ’’ అన్నాడు తన మనసులోని భావాన్ని గ్రహించినట్టు.
మనుషులు తప్పులు చేస్తారు. తెలిసి కొన్నిసార్లు. తెలియక కొన్నిసార్లు. జరిగిన తప్పులను కొన్నిసార్లు సరిదిద్దుకుని మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు జరుగకుండా జాగ్రత్త పడ్తారు కొందరు. ఐతే చాలా సార్లు చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశాలు ఉండవు. జరిగిన తప్పువల్ల జరుగవలసిన నష్టం జరిగే పోతుంది. ఇక సరిదిద్దాల్సిందేమీ మిగలదు. గాయాలు మానినా మరక మిగిలే ఉంటుంది శాశ్వతంగా.
ఐతే. అత్యంత విషాదమేమిటంటే. చాలా మంది మనుషులు చాలా తప్పులను తెలిసే చేస్తూంటారు. తాగడం తప్పని తెలుసు. ఐనా తాగుతారు. లంచాలు తీసుకోవడం తప్పని తెలుసు. ఐనా తీసుకుంటారు. దోపిడీ చేయడం. అవినీతికి పాల్పడ్డం తప్పని తెలుసు. కాని తెలిసే ఆ పనిని ప్రతిరోజూ చేస్తూనే ఉంటారు. పరాయి స్త్రీతో.లేక పరాయి పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకోకూడదని చాలా స్పష్టంగా తెలుసు అందరికీ. కాని. జనం ఎందుకిలా. తెలిసి తెలిసీ పదే పదే తప్పులను చేస్తూ. వ్చ్‌.,
ఐతే ఇప్పుడు జాహ్నవి చేసింది స్పష్టంగా తెలిసి చేసిన తప్పే. కావాలని. బుద్దిపూర్వకంగా. ఇష్టపడి,
తప్పు ఏదైనా. ఎవరు చేసినా. కావాలని చేసినా. అదమరిచి చేసినా. శిక్ష మాత్రం పడాలి. అదే న్యాయం. అంతే.
‘‘ మీనన్‌ గారూ. మీరు నాకొక సహాయం చేయాలి. మీరడిగిన లక్ష రూపాయలను నేనిస్తాను. ఇవిగోండి. ఈ కవర్‌ లో ఉన్నాయి. కాని కౌన్స్‌ లింగ్‌ జరిగినట్టు రాసుకుని నా బిడ్డను వదిలేయనవసరం లేదు. అది చేసిన తప్పుకు ఒక తల్లిగా నేనామెకు శిక్ష వేయాలనుకుంటున్నాను. అదేమిటంటే. వాళ్ళు బహుశా తమ దేహ జ్వలననూ, కోరికలనూ తీర్చుకునేందుకే తాము పెళ్ళాం మగలమని చెప్పి హోటల్‌ లో చేరి ఈ అకృత్యానికి పాల్పడ్డారు. కావాలని ఉద్దేశ్యపూర్వకంగానే చేసిన ఈ తప్పుకు శిక్ష ఏమిటంటే. వీళ్ళను నిజంగానే పెళ్ళాం మగలను చేయడం. క్షణ కాల సుఖం కోసం ప్రాకులాడిన వీళ్ళకు జీవితపు లోతులు తెలిసేలా బందీలను చేసి తమను తాము తెలుసుకునేట్టు చేయడం. బుద్ది తెచ్చుకుని భార్యాభర్తలుగా కొనసాగుతే ఓ. కె. వాళ్ళే సుఖపడ్తారు. లేకుంటే తప్పుడు మనిషిని ఎన్నుకుని తప్పుడు పని చేసినందుకు వాళ్ళే అనుభవిస్తారు. లెట్‌ దెం.’’
మీనన్‌ షాక్‌ అయ్యాడు.
తన మూడు ప్రతిపాదనల్లో. ఈ విషయం లేదు.
ఓ క్షణకాలం. సునందలోని నిర్మలమైన తల్లి దిక్కు చూస్తూ ఉండిపోయాడు మీనన్‌ చకితుడై.
అతను తేరుకునేలోగా. ఆమె కుర్చీలోనుండి లేచి. బయటికి నడుస్తూ వెళ్ళిపోవడం మొదలెట్టింది.
ఇన్స్పెక్టర్‌ ముందు. టేబుల్‌ పై సునంద పెట్టిన తెల్లని డబ్బు కవర్‌. వెక్కిరిస్తున్నట్టు.,
రెండు నిముషాల్లో. భీకరంగా కురుస్తున్న జడివానలో. తడుస్తూ వెళ్తున్న సునంద కనబడ్తూ. కనుమరుగౌతూ. అంతా పల్చని నీటి తెర –

1 thought on “లోపలి ఖాళీ – భూమిపుండు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *