May 25, 2024

వెంటాడే కథ 19

రచన: … చంద్రప్రతాప్ కంతేటి
విపుల / చతుర పూర్వసంపాదకులు
Ph: 80081 43507


నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో చెప్పుకోవచ్చు. నా దృష్టిలో రచయితంటేనే క్రాంతదర్శి. . ప్రాతఃస్మరణీయ శక్తి!
ఎందరో రచయితలు. . అయితే కొందరే మహానుభావులు! వారికి పాదాభివందనాలు!!

పూజ
ఏడుపదుల దీపా కౌల్ తన గదిలో చాలా దిగులుగా కూర్చుని ఉంది. కొడుకులు, కోడళ్ళు ఎవరూ తన మాట వినిపించుకోవడం లేదు. ఆఖరికి బొడ్డూడని మనవడు, మనవరాలు కూడా! ఎవరి పట్టుదలలో వారు ఉన్నారు.
వాళ్ల తప్పు మాత్రం ఏముందిలే?
అప్పటికే పెద్ద కొడుకు సందీప్ పై అంతస్తులోని తన గదికి వచ్చి చెప్పి వెళ్ళాడు.
“అమ్మా ఈ ఇల్లు అమ్మేశాం. కొనుక్కున్నవాళ్లు ఒక వారంలో వచ్చి ఇందులో చేరతారట. ఈ లోగా మనం దీన్ని ఖాళీ చేయాలి. గురువారం వెళదామని మేము అందరం అనుకుంటున్నాం..”
దీప కళ్ళు తుడుచుకుంటూ అంది.
“ఇల్లు అమ్మడం ఏంటి నాయనా. ఇది మీ నాన్నగారు, నేను చెమటోడ్చి మరీ కట్టుకున్న ఇల్లు! మీ అందరూ ఇక్కడే పుట్టారు.. మీ పెళ్లిళ్లు కూడా ఇక్కడే అయ్యాయి. మీ పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు అలాంటి ఇంటిని అమ్మేశాను అంటావేంటి? ఈ వయసులో అమ్మను బాధ పెట్టడం మీకు భావ్యంగా ఉందా?”
ఎప్పుడొచ్చిందో ఏమో పెద్ద కోడలు వెంటనే అందుకుంది.
“అత్తయ్యగారూ ఇల్లు అమ్మడం మాకు మాత్రం సంతోషమా? పరిస్థితులు అలా తగలడ్డాయి. ఈ ఇల్లు అంటే మీ లాగానే
మా అందరికీ కూడా చాలా ఇష్టం. కానీ ఏం చేయగలం? ఎవ్వరూ ఏం చేయలేని దుస్థితి.. దయచేసి మీ అబ్బాయి
చెప్పినట్టు మీరు శారీరకంగా మానసికంగా సిద్ధపడాలి” దీప నిట్టూర్చింది..
ఆ ఇల్లు కట్టించినప్పుడు తాము పడ్డ ఆర్థిక ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలు కళ్ళ ముందు సినిమా రీలుగా తిరిగాయి. అప్పు ఇవ్వడానికి బ్యాంకు మేనేజర్ ఎంతో సతాయించాడు. బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోయాయి ఇద్దరికీ.
“నానమ్మా! కొత్త ఊరు వెళ్ళిపోతున్నాం.. నీకు హ్యాపీగా ఉందా? మాకైతే చాలా హ్యాపీగా ఉంది” అంటూ మనవడు మనవరాలు వచ్చి సంబరంగా అడుగుతుంటే మనసు మూగగా రోదించింది.
చిన్న కొడుకు కూడా నిన్న “అమ్మా ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. మీరు దిగులు పడకండి. తొందరగా సామాను సర్దుకోవాలి. అన్నయ్య లారీ కూడా మాట్లాడాడు. అన్ని సామాన్లు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా కొత్త ఇంటికి చేరాలి.. అందునా దూర ప్రయాణం” అంటూ హడావుడి పడిపోయాడు.
పెద్ద కోడలు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, చిన్న కోడలు పిల్లలు సామాన్ల ప్యాకింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఇల్లంతా పరచిన రకరకాల ప్యాకింగ్ లు ఇతర సామాన్లతో మార్కెట్ లా ఉంది.
ఇంటి నౌకరు రషీద్ కూడా “పెద్దమ్మగారూ.. మీరు ఇక్కడ ఉంటే కచ్చితంగా ప్రమాదం. దయచేసి తొందరగా అబ్బాయిలు చెప్పినట్టు బయలుదేరండి.. మీ బిడ్డ లాంటి వాడిని చెబుతున్నాను” అన్నాడు ప్రేమగా.
నిజమే బాల్యం నుంచి తమ ఇంట్లోనే పని చేస్తున్నాడు రషీద్. తను వాడిని కూడా సొంత బిడ్డలా చూసుకునేది. ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. తన ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడు.
పరిస్థితులు కూడా ఆమెకు చూచాయగా తెలుసు.
ఎందుకంటే అప్పటికే చాలామంది దాడులలో చనిపోయారు. మరికొందరు తిరగబడి గాయాల పాలయ్యారు.. ఈ పరిస్థితుల్లో కాశ్మీర్లో ఉండటం మంచిది కాదని ఢిల్లీ, పంజాబ్, బొంబాయిలో ఉన్న తమ బంధుమిత్రులు పదేపదే ఉత్తరాలు రాస్తున్నారు.
ఇంట్లో ఉన్న వారందరికీ అదే ఆలోచన.. ఎప్పుడెప్పుడు ఇల్లు, ఊరు వదిలి పోదామా అని.
“దేవుడి దయవల్ల మన ఇంటికి మంచి రేట్ వచ్చిందమ్మా” అని కొడుకులు చెప్పారు.
‘రెండంతస్తుల ఇల్లు కదా రాకుండా ఎలా ఉంటుంది?’
అది విని ఆమెకు సంతోషించాలో బాధపడాలో అర్థం కాలేదు. ఇల్లు విడిచి వెళ్లడం అంటే తన ప్రాణం పోవడమే అన్నట్టుగా ఉంది ఆమెకు ఆ ఇంటితో ఆమెకు అలా అనుబంధం పెనవేసుకుని పోయింది.
“కానీ ఇక్కడే ఉంటే అందరి ప్రాణాలు పోతాయి” అంటారు పిల్లలు.
ఎట్టకేలకు దీప అంగీకరించింది.
అయితే ఒక కండిషన్ పెట్టింది “గురువారమైతే నేను ఈ ఇల్లు వదలటం అసాధ్యం.. ఎల్లుండి పౌర్ణమి! అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ రోజు బయలుదేరుతాను. అప్పటివరకు ఉంటే మీరు ఉండండి.. లేదంటే నన్ను ఇక్కడ వదిలి వెళ్ళండి. ఆ పూజా పునస్కారం చూసుకుని నేను వస్తాను” అని.
కుటుంబ సభ్యులంతా తల కొట్టుకున్నారు.
“అమ్మా ఇదేమి చాదస్తం? మనం వాళ్ళకి ఇల్లు స్వాధీనం చేస్తామని మాట ఇచ్చాo.. మళ్లీ ఇప్పుడు ఇంకో రెండు రోజులు
వాయిదా అడిగితే ఏం బాగుంటుంది?” అన్నాడు పెద్ద కొడుకు.
“అంతే కాదమ్మా అందరం ప్రమాదం అంచున ఊపిరి తీసుకుంటున్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్! నువ్వు ఇప్పుడు ఇలా అంటే ఎలాగమ్మా?” అన్నాడు చిన్న కొడుకు కినుకగా.
కోడళ్ళు, మనవడు మనవరాలు కూడా రుస రుసలాడారు.
‘ముసలావిడకి ఛాదస్తం పెరిగింది. మంకుపట్టు పడుతోంది. పెద్దావిడ కదా అని మర్యాద ఇస్తుంటే దాన్ని నిలబెట్టు కునేలాగా ప్రవర్తించడం లేదు’ అని గొణిగారు.
ఎవరేమనుకున్నా పట్టించుకోలేదు దీపమ్మ.
రషీద్ ని పిలిచి “నువ్వు నదికి వెళ్లి ఎలాగైనా….. చేపను తీసుకురావాలి. దాన్ని వండి అమ్మవారికి నైవేద్యం పెడతాను. ఆ చేప లేనిదే పూజ పూర్తయినట్టు కాదు.. నీకు తెలుసు కదా? ఏటా ఈ వానాకాలంలో ఆ చేపలు నదిలో కొట్టుకొస్తాయి ” అని ఆదేశించింది.
నమ్మిన బంటు కావడంతో రషీద్ “అలాగేనమ్మా” అని మర్నాడు ఉదయమే జోరువానలో చేపల వేట కోసం నది మీదకి పడవ వేసుకుని వెళ్ళాడు. వెళ్లిన వాడు ఎంతకీ రాలేదు. సాయంత్రం గడిచినా జాడలేదు.. ముసలమ్మ భోజనం, నీళ్లు లేకుండా ఉపవాసం ఉంది.
“రషీద్ రావాలి.. చేప తేవాలి. వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. తర్వాత తిండి తిప్పలు” అంది.
కుటుంబ సభ్యులందరూ ఆవిడ మూర్ఖత్వాన్ని మనసులో తిట్టుకుంటూ మౌనంగా ఉన్నారు.
అందరికీ ఒక పక్క అమ్మ మీద ప్రేమ. ఇంకోపక్క ప్రాణభయం.
అయితే రెండు భయాలని అమ్మ మీద ప్రేమే జయించింది..
పిల్లలు తప్ప అందరూ ఉపవాసమే ఉన్నారు.
దైవభక్తి విషయంలో వాళ్లు తమ తల్లికి ఏమీ తక్కువ కాదు.
రాత్రి తొమ్మిది గంటలకి కాబోలు రషీద్ తడిసి ముద్దవుతూ ఇంటికి వచ్చాడు.
“క్షమించండమ్మా. ఒకే ఒక్క చిన్న చేప దొరికింది మీరు అడిగింది. నది కూడా పరవళ్ళు తొక్కుతోంది మీకోసం ప్రాణాలకు తెగించి చాలా దూరం పడవలో వెళ్లాను..” అని ఆ చిన్న చేపను వరండాలో కూర్చున్న దీపమ్మ గారికి అందించి ఇంటికి వెళ్ళాడు రషీద్.
దీపమ్మగారిలో కొత్త జవసత్వాలు వచ్చాయి ‘మరో గంటలో తిధి వెళ్లిపోతుంది.. పుణ్య ఘడియలు వెళ్ళిపోతాయి’ అని
ఆదుర్దా పడుతూ గబగబా చేపను వండి, పైఅంతస్తులోని పూజగదికి తీసుకుని వెళ్ళింది.
అప్పటికే పూజకు అంతా సిద్ధంగా ఉండడంతో నైవేద్యం పూర్తయింది.
ఇంటిల్లపాది సంతోషపడ్డారు.
అమ్మ సంతోషమే తమ సంతోషం అనుకునే బిడ్డలు వారు. వాళ్ళని అలా పెంచింది దీప.
“అత్తయ్యగారు భోజనానికి రండి వడ్డించాను” అని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కేక పెట్టింది పెద్ద కోడలు.
అందరూ వచ్చి కూర్చున్నారు.
“నానమ్మ నానమ్మ తొందరగా రా” పిలిచారు మనవడు మనవరాలు.
“వస్తున్నారా ఎందుకు ఆ గావుకేకలు. వస్తున్నా” అంటూ రైలింగ్ పట్టుకుని కిందకి దిగుతున్న దీపమ్మ కాలుకు అక్కడ ఉన్న ఏదో పెట్టె తగిలి పడిపోయింది. సుమారు పాతిక మెట్లు దొర్లుకుంటూ వచ్చి ఫ్లోర్ పై పడిపోయిన తల్లిని చూసి షాక్ అయ్యారు కుటుంబ సభ్యులు.
డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి అందరూ పరుగు పరుగున ఏడుస్తూనే ఆవిడ దగ్గరకు వెళ్లారు..
నుదురు చిట్లి గాయమైంది. తలకు వెనుకవైపున కూడా బలంగా దెబ్బ తగిలినట్లుంది. మెల్లగా ఎర్రని ఫ్లోరంతా పరచుకోవడం ప్రారంభించింది.
అమ్మని ఆ స్థితిలో చూసి బిడ్డలు తట్టుకోలేకపోయారు. అందరూ గట్టిగా ఏడ్చేశారు. ఆ ఏడ్పులు విని పక్కింట్లో ఉండే రషీద్ ఏమైందంటూ పరుగున వచ్చాడు. రక్తపు మడుగులో ఉన్న పెద్దావిడను చూసి ఘొల్లుమన్నాడు.
”ఇల్లు ఖాళీ చేయడం ఇష్టం లేని అమ్మగారు ఈ రకంగా ఈ ఇంట్లోనే ప్రాణాలు విడిచినట్టుంది” అన్నాడు డగ్గుత్తికతో.
”అవును. అమ్మకు ఈ ఇల్ల0టే పంచ ప్రాణాలు. ఎప్పుడూ ఈ ఇంటిని వదిలి వెళ్లాలని అనుకునేది కాదు. బంధుమిత్రుల ఇండ్లకు వెళ్లినా రాత్రి కల్లా ఇంటికి వచ్చేయాల్సిందే! బయట ఇళ్లలో ఆవిడ ఒక్క నిద్ర కూడా చేసింది లేదు.. నాన్న పోయిన ఈ ఇంట్లోనే తనూ తనువు చాలించాలన్నదే కడసారి కోరికగా పదేపదే చెప్పేది” అన్నాడు దేహం మీద పడి ఏడుస్తూ సందీప్.
”అవునన్నయ్య చెప్పింది నిజం.. అమ్మకి ఈ ఇంటికి ఏదో అవినాభావ సంబంధం! తను నాన్న ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న ఇల్లు కాబట్టి దీన్ని దేవాలయంలా చూసుకునేది. మనందరి బలవంతంతో ఖాళీ చేయడానికి సిద్ధపడింది.. భగవంతుడికి ఆమె మనసు తెలుసు కనుక ఆమె కోరికను నెరవేర్చినట్టున్నాడు” అంటూ బోరుమన్నాడు చిన్నకొడుకు సుదీప్.
నెత్తురు మడుగులో ఉన్న పెద్దావిడ మొహంలో చిరునవ్వు అలాగే వెలుగుతూ ఉండటం అందరూ గమనించారు.

నా విశ్లేషణ:
ఈ కథ చాలా మంచి కథ! ఒక తరం ప్రజలకి – మనుషులు, ఇల్లు వాకిళ్లు, అంటే పిచ్చి ప్రేమ ఉండేది. సొంత ఊరు, బంధుత్వాలన్నా కూడా వాళ్లకి అలాంటి సెంటిమెంటే! బహుశా ఎలాంటి సెంటిమెంట్లు లేని లోకం ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతోంది. ఇది కాశ్మీరీ కథ అని గుర్తు. అక్కడి పరిస్థితులు మనకు తెలియనివికావు. రెండు వర్గాల మధ్య పోరాటం కొందరు మనుషుల్లోని మానవత్వాన్ని చంపేసింది. దాని ఫలితమే కొన్నివర్గాల వారు అక్కడ నుంచి బలవంతంగా వెళ్లి పోవాల్సి వచ్చింది. వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేకంటే తరిమి వేయబడ్డారు అనడం సబబు కావచ్చు.
ఆ సంగతి అలా ఉంచితే ఇంటి మీద ప్రాణం పెట్టుకున్న ఆ వృద్ధురాలు అక్కడే చివరి శ్వాస తీసుకోవడం యాదృచ్ఛికమైనా వాస్తవం. ఈ కథలో ఎవరిదీ తప్పులేదు. దాడులకు భయపడి ప్రాణాలు కాపాడుకోవాలని పిల్లలు భావిస్తే తమ సంప్రదాయాన్ని వదలకూడదని చివరిపూజ చేసి వెళ్లి పోదామని ఆ వృద్ధుల వృద్ధురాలు కోరుకోవడం అసహజం కాదనిపిస్తుంది. బహుశా ఈ కారణంగానే ఈ కథ నన్ను తరచూ వెంటాడుతూ ఉంటుంది కాబోలు. ఈ కథలో ఆ చేప పేరు ఆ పండుగ పేరు నేను మర్చిపోయాను. అందుకే రాయలేకపోయాను. క్షమించండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *