May 25, 2024

సుందరము – సుమధురము – 3

రచన: నండూరి సుందరీ నాగమణి

సుందరము సుమధురము ఈ గీతం:
‘వాగ్దానం’ చిత్రంలోని ‘నా కంటి పాపలో నిలిచిపోరా…’ అనే గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను.
కవితాచిత్ర వారి పతాకంపై, 1961 అక్టోబరు 5న విడుదలైన ఈ చిత్రానికి, ఆచార్య ఆత్రేయ గారు దర్శకత్వం వహించారు. శ్రీ కె. సత్యనారాయణ మరియు శ్రీ డి. శ్రీరామమూర్తి గారాలు చిత్రనిర్మాతలు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి గారలు నాయికానాయకులుగా నటించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు చాలా బాగుంటాయి.
చిత్రంలోని ఈ పాటతోనే కవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారు సినీరంగ ప్రవేశం చేసారు. ఆ తరువాత ఎన్నో హృద్యమైన ప్రేమగీతాలను మనకు అందించారు. నిజానికి దాశరథి గారు వ్రాసిన మొదటి పాట ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలోని ‘ఖుషీ ఖుషీగా’ అయినప్పటికీ, వాగ్దానం చిత్రం మొదట విడుదల అయిన కారణంగా ఇదే వారి మొదటి పాటగా పరిగణింపబడుతున్నది. దాశరథి గారి కలం ఊట లోంచి రూపు దిద్దుకున్న ఈ తేనె పాటకు పెండ్యాల గారు చక్కని బాణీతో పాటను వేరే స్థాయికి తీసుకుని వెళ్ళారు. ఎంతో మధురంగా ఆలపించిన ఘంటసాల మాస్టారికి, సుశీల గారికి మన అభివందనాలు చెప్పుకోవాల్సిందే మరి…
మరి ఆ పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించుదాం రండి…

పల్లవి:
ఆమె: మ్… మ్… మ్… నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలువనీరా…
నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా
నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా
(కథానాయిక చెబుతున్నది, నాయకుడితో – నా కంటిపాపలో అలాగే నిలిచిపో… నీ వెంట నడిచి లోకాలను గెలిచినంత సంతోషం పొందనీ నన్ను… ఆహా, ప్రేమ ప్రకటించటానికి ఇంతకన్నా మంచి పదాలు ఉంటాయా?)
అతడు: ఆ..ఆ..ఆ..ఆ…
చరణం 1:
ఆమె: ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో జాబిలి వెలిగేను మనకోసమే…
(ఈనాటి ఈ పున్నమి వెన్నెలను మనిద్దరం కలిసి ఆస్వాదించే అదృష్టం కలగటానికి ఏనాడు మనం పుణ్యం చేసుకున్నామో
కదా… ఈ జాబిలి మనకోసమే వెలుగుతోంది…)
అతడు: ఆహా… ఆహాహహా…
ఆమె: ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో జాబిలి వెలిగేను మనకోసమే…
అతడు: నెయ్యాలలో తలపుటుయ్యాలలో… నెయ్యాలలో తలపుటుయ్యాలలో
అందుకొందాము అందని ఆకాశమే…
(మన స్నేహంలో, ప్రణయంలో… ఊహల ఊయలలో ఓగుతూ, అందని ఆ ఆకాశాన్ని అందుకుందాం ఓ చెలీ!)
ఆమె: నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా…
చరణం 2:
అతడు: ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
(ఆ చందమామలోకి వెళ్ళిపోయి, ఆ ఆనంద సీమలో మనం వెన్నెల స్నానాలు చేద్దామా? ఆ వెన్నెల వానలో తడిసి
తరించిపోదామా?)
ఆమె: అహ..హా..ఆ..
అతడు: ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా
ఆమె: మేఘాలలో వలపు రాగాలలో… మేఘాలలో వలపు రాగాలలో….
దూర దూరాల స్వర్గాల చేరుదమా….
(ఆ మేఘాలలో, ప్రేమ రాగాలలో ఆ దూరదూరాలనున్న స్వర్గాలను ఇట్టే చేరిపోగలం కదా, మరి చేరిపోదామా?)
నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా…
చరణం 3:
ఆమె: ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
(ఈ పూలతో వేసిన బాటలు, ఆ నీలి నీలి తారలు మనల్ని తీయని కలల్లో తెలియాడిస్తున్నాయి కదా!)
అతడు: అహ..హా..ఆ..
ఆమె: ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా
అతడు: అందాలనూ తీపి బంధాలను… అందాలనూ తీపి బంధాలను…
అల్లుకుందాము డెందాలు పాలించగా…
(ఈ వెన్నెల అందాలను, మన తీయని బంధాలను… కలిపి అల్లెసుకున్దాము, మన మనసులు ఆ ఆనంద సామ్రాజ్యాన్ని పాలించగా…)
ఆమె: నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా…
ఇద్దరు: ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ
ఆమె: నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా…
ఈ గీతంలో దాశరథిగారు మనముందు ఒక వెన్నెల ప్రపంచాన్ని పరచి అందులోకి ప్రేక్షక శ్రోతలందరినీ ఆహ్వానిస్తారు. విన్నకొద్దీ మధురంగా అనిపిస్తుంది ఈ గీతం. దానికి తోడు మధ్యలో వచ్చే ఆలాపనలు మనల్ని గాలిలో తేలింపజేస్తాయి అంటే అది అతిశయోక్తి కానే కాదు.
మనసును మరో లోకానికి తీసుకుపోయే ఈ గీతాన్ని చూద్దాం రండి…
(యూ ట్యూబ్ లింక్)
***

1 thought on “సుందరము – సుమధురము – 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *