May 25, 2024

తిత్తి కాసులు చెల్లె… తిరుణాలు చెల్లె

రచన: శ్యామదాసి

“తిత్తి కాసులు చెల్లె తిరుణాలు చెల్లె” మా చిన్నతనంలో ఇంట్లో తరచు వినే మాట ఇది. పిల్లా, జెల్లాతో కలిసి చిన్న చిన్న యాత్రలు, సినిమాలు, షికార్లు, సంతలు, సరదాలు, ఇలాంటి వేమైనా ముగించుకుని ఇంటికి చేరగానే, ఇంట్లో వున్న పెద్ద వాళ్ళు వెనుకటి వాళ్ళ యాత్రానుభవాలను, అప్పటి వారి ఆనందాలను, గుర్తు చేసుకుంటూ తిత్తి ఖాళీ అయిందా, సంబరం తీరిందా, అంటూ ఛలోక్తిగా అనేవారు.

తిత్తి నిండా (సంచినిండా) కాసులున్నపుడు, తిరుణాలు సంబరంగా వుంటుంది. వింతలు, విడ్డురాలు, తినడం, తిరగడం జనం సందడి, నా చుట్టూ వున్న నా వాళ్ళు, ఈ ఆనందం శాశ్వతమనిపిస్తుంది. తిత్తి లో కాసులు అయిపోగానే, తిరుణాలు ఉత్సాహం చప్పబడిపోతుంది.

అనుభూతులకర్ధంకాకుండానే బాల్యం గడచిపోయింది. ఎగసిపడే అలలుగా యవ్వన అనుభవాలు కలల సముద్రంలో కలసిపోయాయి క్రమంగా కుటుంబమనే గూటిలోకి చేరిపోయాను. కూతురుగా, భార్యగా, కోడలుగా, వదినగా, అమ్మ, అత్తమ్మ, అమ్మమ్మ, నానమ్మలుగా ఇలా ఎన్నో, ఏ పాత్రకాపాత్ర పోషిస్తూ ” నా కోడి కూయందే పొద్దు పాడవదు (తెల్లవారదు)”అన్నట్లు, “నేను లేకుంటే ఒక్క క్షణం గడవదు ఇంట్లో ” అనుకుంటూ బాధ్యతల వలయాలలో తిరుగుతూ కాలంతో కలిసి సుదీర్ఘ ప్రయాణం సాగించి సేద తీరే తరుణానికి, నాది, నేను అనుకున్న నా శరీరమే క్షణ క్షణం మార్పు చెందుతూ, సహజ మార్పులను పొందుతూ, ఆటు పోటులకు నిలచిన నావలా తీరానికి చెరువవుతున్నది.

ఇన్నిటిలో ఆదమరచి వున్న నేను “ఓటికుండలో నీరులా” తరిగిపోతున్న ఆయుస్సును తలచుకుని ఉలిక్కిపడ్డాను. నా మనసు మోసుకొచ్చుకున్న కర్మఫలాలతో బాటుగా, పరిమితి తెలియని ఆయువు, నా వెన్నంటి వున్న వైనాన్ని మైమరపింపజేసిన మనసే, “తస్మాత్ జాగ్రత్త” అని కూడ హెచ్చరిస్తున్నది.

మానవ జన్మకు, మనుగడకు మూలమయిన మనసు శరీరంలో ఏ భాగానికి చెందినదో గానీ, కనపడని ఆ మనసు చేసే గారడీలే మనిషిని మాయలో పడవేస్తూ, జీవితాన్ని నియంత్రిస్తున్నదికదా.

అహంకార, మమకారాలు, ఆశనిరాశలు, సుఖ దుఃఖాలు, బంధాలు బాంధవ్యాలతో నిండిపోయిన నా చిన్నగూడు, ఇదే సత్యమనే బ్రమలో మైమరచిన నాకు, ఇవన్ని వదిలించు కొమ్మనీ, అంచెలంచెలుగా ఈ పొరలను ఒక్కొక్కటిగా తొలగించు కొమ్మనీ, చేరవలసిన చరమగమ్యాన్ని గుర్తు చేస్తూ “తిత్తిలో కాసులుచెల్లైపోయినట్లు”, మనసు మూలలో ఎక్కడి నుండో తెలియజెప్తున్నా, తిరణాళ్ళ సందోహంలో వినిపించుకోలేదు.

ఏదిఏమైనా, కాసుల సందడి తిరుణాల సంబరం అందరికీ సుపరిచితమే ఎన్నో సుద్దులతో కూడి అలవోకగా మాట్లాడే పెద్దవాళ్ళ మాటలు” మన లోపలి, మనను వెదకి చూపిస్తూ, కొత్త ప్రశ్నలకు, పాత సమాధానాలనందిస్తూ ఎఱుక గలిగి బతకమన్న సత్యాన్ని” చెప్పకనే చెబుతున్నవి.

1 thought on “తిత్తి కాసులు చెల్లె… తిరుణాలు చెల్లె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *