December 3, 2023

దానశీలత

రచన: సి. హెచ్. ప్రతాప్

దానంలో కర్ణుడి ఖ్యాతి జగద్విఖ్యాతం. నభూతో నభవిష్యతి అన్న చందాన అతని దాన ప్రస్థానం సాగింది. జన్మత: సహజ కవచకుండాలతో జన్మించిన కర్ణుడి వల్ల తన కుమారుడు అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించిన ఇంద్రుడు ఒక కపట ఉపాయం ఆలోచించి పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా కోరాడు. ఇలాంటి మోసమేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన సూర్యుడు. . దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇవ్వమని అడుగుతాడు… వాటిని మాత్రం ఇవ్వకని తన కుమారుణ్ని ముందుగానే హెచ్చరించాడు. కానీ సహజ దానశీల కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసినా వాటిని కోసి దానంగా ఇచ్చాడు. అందుకే కర్ణుడి మరణం సాధ్యమయ్యింది.
మహాభారతం 17 వరోజు యుద్ధం ముగిసింది. అర్జునుడు వేసిన దివ్యాస్తాల కారణంగా కర్ణుడు రక్తసిక్తమై యుద్ధభూమిలో అచేతనంగా పడి వున్నాడు. పాండవులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే కర్ణుడి స్థితి చూసిన శ్రీకృష్ణుడు మాత్రం చింతామనస్కుడై వున్నాడు. కారణమేమిటని అడిగాడు అర్జునుడు.
కర్ణుడు అంతటి మహా దానశీలి, వితరనయోగి ఈ భూమండలంలోనే ఇప్పటివరకు రాలేదు, ఇక రాబోడు కూడా అని అతని గుణగణాలను శ్లాఘించాడు కృష్ణుడు.
ఆ మాటలు అర్జునుడికేమాత్రం రుచించలేదు. తన శత్రువును అమితంగా పొగుడుతున్న కృష్ణుడివైపు చికాకుగా చూసాడు.
అర్జునుడి అంతరంగం కృష్ణుడికి అర్ధమయ్యింది. నాతో రా అని తాను ఒక విప్రుని వేషం ధరించి యుద్ధ భూమికి అర్జునుడితో వెళ్ళాడు శ్రీకృష్ణుడు.
అర్జునుడిని దూరంగా నిల్చోమని చెప్పి తాను కర్ణుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి” అపర దానశీలి అయిన మీకు నమస్సుమాంజలులూ” అని పలకరించాడు.
ప్రాణాలు పోయే బాధలో విలవిల్లాడుతున్నాడు కర్ణుడు. అయినా లేని ఓపిక తెచ్చుకొని” ఎవరు మహాత్మా మీరు, ఏం కావాలి?” అని అడిగాడు.
” నేను కటిక దారిద్ర్యంలో వున్నాను. ఈ స్థితి నుండి బయటపడేందుకు కొంచెం బంగారం దానం కావాలి” అని కన్నాడు శ్రీకృష్ణుడు.
ఆ కోరికకు కొంచెం సేపు ఆలోచించాడు కర్ణుడు. చివరకు తన నోట్లో ఒక బంగారపు పన్ను వుందన్న సంగతి గుర్తుకొచ్చి ” విప్ర మహాశయా, నా నోట్లో వున్న బంగారపు పన్నును మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు” అని నోరు తెరిచారు.
విప్రులకు ఒకరి నోట్లో చేయి పెట్టడం నిషిధం
కావున ఆ పని చెయ్యలేనని జవాబిచ్చాడు కృష్ణుడు.
కాస్త సందిగ్ధంలో పడిన కర్ణుడు పక్కనే వున్న ఒక రాయిని తీసి పన్నును పగులకొట్టి బయటకు తీసి కృష్ణుడుకి అందివ్వబోయాడు.
రక్తసిక్తమైన వస్తువులను దానంగా స్వీకరించడం విప్రులకు తగదు అని తిరిగి తిరస్కరించాడు కృష్ణుడు. పైగా దానం ఇవ్వలేకపోతే ఆ మాటే చెప్పు , నేను వెళ్ళిపోతాను అని తొందర పెట్టాడు.
“అమ్మమ్మ ఎంతమాట! ఈ బొందిలో ప్రాణం వుండగా నేను దానం ఇవ్వలేనన్న మాట నా నుండి వెలువడదు” అని కర్ణుడు తన అమ్ములపొది నుండి ఒక బాణం తీసి వింటికి సంధించి నేలలోకి కొట్టాడు.
మరుక్షణం నేల నుండి జలధార పైకి చివ్వున చిమ్మింది. ఆ నీటిలో పన్నును శుభ్రం చేసి, దానిని తన కుడి చేతితో అందుకొని శ్రీకృష్ణుడికి అందించి నమస్కరించాడు కర్ణుడు.
కర్ణుడి పరాక్రమానికి, శూరత్వానికి, దానశీలతకు ఎంతో సంతోషించిన కృష్ణుడు విప్ర రూపం త్యజించి తన అసలు రూపాన్ని ప్రదర్శించాడు. ” నీకేం వరం కావాలో కోరుకో” అని కర్ణుడిని అడిగాడు.
” మహాత్మా, ప్రాణాలు వదిలే ఈ ఆఖరి క్షణంలో భగవానుడు నా చెంత ఉండడం నా జన్మజన్మల అదృష్టం. ఇంతకంటే నాకు ఇంకేమీ వరం వద్దు.” అని శ్రీకృష్ణుడికి చేతులు జోడించగా అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
కర్ణుడి దానశీలతకు అర్జునుడు జోహార్లు అర్పించక తప్పలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

August 2023
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031