May 25, 2024

ప్రాయశ్చితం – 3

రచన: గిరిజా రాణి కలవల

ఇండియా నుంచి వచ్చిన ఫోన్ కాబోలు, ఆ విశ్వం అనే వ్యక్తితో … ఈయన మాట్లాడే మాటలు సురేంద్ర చెవిన పడుతున్నాయి.
ఆ మాటలలో ఏదో తెలియని వ్యధ, ఆ గొంతులో బాధ తొణికిసలాడడంతో… పక్కవారి సంభాషణ వినడం తప్పు అనిపించినా కూడా, ఆసక్తితో వినసాగాడు.
అటువైపు ఆ విశ్వం ఏమని అన్నారో ఏంటో కానీ,
“ఏం చెప్పమంటావురా విస్సూ? చెపితే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్లేగా? ఇది అందరికీ తెలిసిన రహస్యమే. పిల్లల దగ్గర వుందామని అమెరికా వచ్చిన తల్లిదండ్రుల్లో ఎక్కువమంది చెప్పేదే నేనూ చెపుతున్నాను. ఇక్కడ వాతావరణంతోనే కాదు ఇక్కడ పిల్లలతో కూడా అడ్జస్ట్ అవడం కష్టమేరా! నీకేం… నువ్వు ఆ గోల లేకుండా హాయిగా ఓల్డ్ ఏజ్ హోంలో గడిపేస్తున్నావు. ఇక్కడ మా ఇద్దరికీ వయసు మీద పడిపోయింది. కొడుకు, కోడలు ఉద్యోగాలతో రోజంతా బిజీయే. పిల్లల చదువులు, ఆటలు వాళ్ళ హడావుడి వాళ్ళది. రోజంతా మేమిద్దరం ఒకరినొకరం చూసుకుంటూ కూర్చోవాలి. మనూళ్ళోలా ఎక్కడకి పడితే అక్కడకి స్వయంగా వెళ్ళలేము. ఏ శనాదివారాల్లో వాళ్ళకి కుదిరితే ఇదిగో ఇలా తీసుకువస్తారు. ఓపికుంటే ఏ వంట పనో, తోటపనో చేసుకుంటాము. సరే..చేసేది ఎవరికో కాదు నా మనవలకే కదా అని తృప్తి పడుతున్నాము. ఒక్కగానొక్క కొడుku, వాడి చేతుల మీదుగా వెళ్ళిపోవాలనే కోరిక మిగతావాటిని కప్పి పుచ్చుతోంది.”
అటువైపు నుంచి ఆ విశ్వం ఏమన్నాడో కానీ, దానికి జవాబుగా,
“ఔనురా! పిల్లల్ని కనడం, తర్వాత మనకోసం ఏదీ మిగుల్చుకోకుండా మొత్తం వాళ్ళకే ధారపోసి, చివరకి ముది వయసులో వాళ్ళ మీద ఆధారపడడం కన్నా మరోటి బాధాకరం అనేది వుండదు. మనిద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాము. నీ కొడుకు నిన్ను చూసుకుందికి తీరిక లేక, ఓల్డ్ ఏజ్ హోంలో చేర్పించినా, అప్పుడప్పుడు వచ్చి కుశలం కనుక్కుని వెడుతూ వుంటాడు. మనం కూడా అంతకన్నా ఆశించకూడదురా! వాళ్ళని తప్పు పట్టడం కూడా కూడదు. ఈ మాత్రం కూడా చూడని కొడుకులు కూడా వున్నారు. తండ్రి భుజాల నిచ్చెన మీదుగా పైకి ఎగబాకి వాళ్ళ పబ్బం గడిచి పోయాక,ఆ నిచ్చెనని తోసేసే కృతఘ్నులు వున్నారు. తర్వాత ఆ తండ్రినే తలుచుకోని ప్రబుద్ధులు వున్నారు. వాళ్ళ కంటే మన కొడుకులు నయమే అనుకోవాలి మనం. సరే ఇక వుంటానురా విస్సూ!
ఆరోగ్యం జాగ్రత్త. వేళకి మందులు వేసుకుంటూ వుండు.” అంటూ మాట్లాడిన మాటలు సురేంద్రకి చెళ్ళున తగిలాయి.
ఇంతలో, ముసలాయన కొడుకు కాబోలు, “నాన్నా! ఇక ఇంటికి వెడదాం పద.” అంటూ వచ్చి, తండ్రికి చేయి అందించాడు. ఆ చేయూత పట్టుకుని వెడుతున్న ఆయనని చూస్తోంటే, గట్టిగా, ‘నాన్నా!’ అని పిలవాలనిపించింది సురేంద్రకి.
ఆయన వెళ్ళిపోయినా ఆయన మాటలే తన చెవులలో గింగిరాలు తిరగసాగాయి.
ఆయన మాటల్లో సత్యం లేకపోలేదు. తల్లి తండ్రులను పట్టించుకోనటువంటి కృతఘ్నుడు, ప్రబుద్ధుడు తనేగా! తనని మించిన విశ్వాస ఘాతకుడు వేరే వుండడు అనుకున్నాడు సురేంద్ర.
జవసత్వాలుడిగిపోయి, తన కోసం కళ్ళలో వత్తులు వేసుకునే నాన్న గుర్తుకు వచ్చాడు. తల్లి లేని లోటు తెలియకుండా తనని పెంచాడు. తన కడుపు నింపడం కోసం, నాన్న ఆకలితో గడిపిన రోజులు గుర్తొచ్చాయి.
తండ్రి వున్న పొలం, ఇల్లు అమ్మేసి, తనకంటూ ఏదీ లేకుండా చేసుకువి, ఆ డబ్బుతో తనని అమెరికా పంపాడు.
‘ఈ చివరి వయసులో నాకు నీతో పాటు వుండాలని వుందిరా’ అని అడిగితే, భార్య సలహాతో తాను ఏం సమాధానం చెప్పిందీ గుర్తు వచ్చింది సురేంద్రకి.
“నాన్నా! ఇక్కడ నేనింకా సరైన ఉద్యోగంలో నిలదొక్కుకోలేదు. నిన్ను ఇక్కడకి తీసుకువస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొన్నాళ్ళు పోయాక వీలుని బట్టి వద్దువుగానిలే” అంటూ ఫోను పెట్టేసాడు. అంతేకాకుండా…తన ఫోన్ నెంబర్ మార్చేసి…తన ఆచూకీ తండ్రికి తెలీకుండా రహస్యంగా వుంచాడు. తన కోసం కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూసే తండ్రి కోరిక తీర్చనేలేదు.
కోరి చేసుకున్న భార్య మోజులో పడిపోయి, ఆర్ధికంగా స్ధిరపడ్డ సురేంద్ర తన ఉన్నతికి దోహదపడిన తండ్రికి తన ఉనికిని తెలియనీకుండా రహస్యంగా దాచేసాడు.
సురేంద్ర కళ్ళలో పల్చని నీటిపొర. లోలోపల సంఘర్షణకి లోనవుతున్న భావోద్వేగాలు. సరిదిద్దుకోలేని తప్పు చేసాననుకున్నాడు.
ఈ ఆలోచనల పరంపరల నుంచి బయటకి వచ్చి చుట్టూ పరికించాడు.

సశేషం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *